ఆ క్షణం ఆమె ఆ ఉద్యోగం కోసం ఎందుకు డెస్పరేట్ గా వుందో అతడికి అర్థం కాలేదు. అంత జ్ఞానం కూడా ఆ కుర్రవాడికి లేదు. తనకి ఉద్యోగం రాకపోవటానికి కారణం ఈ వ్యవస్థే అని ఆత్మవంచన చేసుకునే అజ్ఞానం నుంచి అతడింకా బయటపడలేదు.
అతడేదో అనబోయే లోపులో ఆమె చెయ్యెత్తటం, రెండు మూడు కార్లు ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది. అంతలో ఒక కారు వచ్చి ఆగింది. ఉత్పల తలవంచి, "చాలా అర్జెంటుపని. ప్లీజ్. స్టేషన్ వైపు వెళ్ళాలి" అంది. కారు డోరు తెరుచుకోవడం, ఆమె లోపలికి ఎక్కగానే కారు కదలడం క్షణాల్లో జరిగిపోయింది.
బాణంలా వెళ్తున్న కారువైపు చూస్తూ రామబ్రహ్మం తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. కార్లో ఒకరే ఉండడం, అదీ స్త్రీ అవడం సంతోషాన్నిచ్చింది.
......
"క్షమించండి. చాలా అర్జెంట్ పని. ఎంతసేపటికి బస్సు దొరకలేదు" అంది ఉత్పల.
"స్టేషన్ కి ఎవరైనా వస్తున్నారా?"
"కాదు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను".
"ఇంటర్వ్యూనా?"
"ఏం అలా అడుగుతున్నారు"
"భలేగావుందే! నేనూ ఇప్పుడొక ఇంటర్వ్యూ నుంచే వస్తున్నారు. బైదిబై నా పేరు అనూష..... మీరు?"
"ఉత్పల. ఇంటర్వ్యూ ఎలా చేశారు?"
"ఉద్యోగం వచ్చేసినట్టే"
"అదృష్టవంతులు, జీతమెంత?"
అనూష చప్పున ఉత్పలవైపు చూసింది. తన పక్కన కూర్చున్న అమ్మాయి ప్రపంచం స్వచ్ఛమైన చిన్నదనీ, అమాయకంగా ఆ ప్రశ్న అడిగిందనీ, ఆమె చురుకైన కళ్ళు క్షణంలో గ్రహించాయి. నవ్వి "మొగవాడి జీతమూ ఆడదాని వయసూ అడక్కూడదనేది పాత సామెత. ఇప్పడది తారుమారైంది. ఈ కాలం కుర్రాళ్ళు 'అసలు వయసు' చెప్పటానికి చాలా తటపటాయిస్తారు".
ఉత్పల అప్పటికే తనడిగిన సిల్లీ ప్రశ్నకు సిగ్గుతో కుదించుకు పోయింది. లేకపోతే కార్లో ఇంటర్వ్యూకి వెళ్ళగలిగే స్థితిలో వున్నా ఆమెని జీతమెంత అని అడగడం ఏమిటి?
"మీకిది మొదటి ఇంటర్వ్యూ కదూ"
ఉత్పల ఆశ్చర్యంగా "మీకెలా తెలుసు?" అని అడిగింది.
అనూష మళ్ళీ నవ్వి "సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం నేనూ నా మొదటి ఇంటర్వ్యూకి ఇలాగే టెన్షన్ అనుభవించాను కాబట్టి" అంది. ఉత్పల ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. పన్నెండు సంవత్సరాల క్రితంఅంటే...... తన పక్కన నాజూగ్గా డ్రైవ్ చేస్తున్న ఈ అమ్మాయి వయసెంత?
అదే సమయానికి అనూష కూడా గతం తాలూకు ఆలోచనల్లో వుంది. పన్నెండేళ్ళ వయసులో తల్లీ తండ్రీ ఆక్సిడెంట్ లో చనిపోవడం..... తనూ అన్నయ్య అనాధలుగా మిగలడం...... మొదటి సంవత్సరం కామర్సు చదువుతూ తను పార్ట్ టైం ఉద్యోగం మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళడం....... యూనివర్సిటీ గతం తాలూకూ అన్ని రికార్డులూ బ్రద్దలు కొడుతూ డిగ్రీ పాసవడం..... అక్కణ్ణుంచి అంచెలంచెలుగా పైకి ఎదగటం అన్నీ గుర్తొచ్చాయి.
"మీకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చేసిందా?"
అనూష ఆలోచనల్లోనుంచి తేరుకుని "వచ్చింది" అంది.
అంతలో "ఇక్కడ దిగిపోతాను. ఆ కనపడే ఆస్పత్రే" అంది ఉత్పల.
అనూష కారు నెమ్మది చేసి ఓ పక్కగా ఆపుతూ, "మీకీ ఉద్యోగం వస్తే నాకు పార్టీ ఇవ్వాలి. సరిగా టైమ్ కి తీసుకొచ్చి దింపినందుకు" అంది నవ్వుతూ.
"తప్పకుండా! ఎక్కడ దొరుకుతారు మీరు నాకు?"
"స్టాక్ హొం-" అనూష మాటలు గాలిలో కలిసిపోయినాయ్. ఉత్పల ఆ కారు వెళ్ళిన వైపే చూస్తూ ఒక క్షణం నిలబడింది. ఆ అమ్మాయి మనసెందుకో అదో లాంటి అనుభూతికి లోనయింది. ఆమె పక్కన కూర్చున్న ఆ కొద్ది సమయంలో- ఆ నిశితమైన కళ్ళు - స్టీరింగ్ ని పట్టుకున్న వేళ్ళు- ఆ హుందాతనం- వ్యక్తిత్వాన్ని సూచించే భంగిమ- జీవితం పట్ల దేన్నైనా ఎదుర్కోగలననే ధీమా......
.....అంతలో ఆమెకి సమయం గుర్తొచ్చి హడావుడిగా ఆస్పత్రి వైపు అడుగులు వేసింది. నర్సు ఆమెని చూసి, "నువ్వేనా ఉత్పల అంటే? ఇంత ఆలస్యమైందేం? డాక్టర్ గారు మిగతా వాళ్ళందర్ని ఇంటర్వ్యూ చేసి పంపేసారు. ఇక రావేమో అనుకుంటూంటే వచ్చావు. వెళ్ళు వెళ్ళు" అంటూ హడావుడి చేసింది.
ఉత్పల బిక్కు బిక్కు మంటూ డాక్టర్ హరనాధరావు గదివైపు అడుగులు వేసింది.
లోపలికి వెళ్ళబోతూ వుండగా ఆమె కుడి కన్ను అదిరింది- అశుభ సూచకంగా.
4
టొబాకో కింగ్ రామసుబ్బారావు కారు గుంటూరు వెళుతూంది. పొగాకుతో పరిచయం వున్నా ఎవరికైనా గుంటూరుతో తప్పక సంబంధ బాంధవ్యాలు వుంటాయి. పొగాకుకు సంబంధించినంత వరకూ అంధ్రదేశానికి సుబ్బారావు రాజు అయితే, గుంటూర్లో సామంత రాజులు చాలా మంది వున్నారు.
ప్రస్తుతం సుబ్బారావు వెళ్తున్నది మరో రాజైన గంగరాజు కూతురి పెళ్ళికి. మిట్ట మధ్యాహ్నమైనా ఎయిర్ కండిషన్డ్ కారు అవడం వల్ల చల్లగా వుంది. అతడు గుంటూరు చేరుకునేసరికి సాయంత్రం అయిదయింది. గంగరాజు అతడిని సాదరంగా ఆహ్వానించాడు.
ఇద్దరూ చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు.
మిగతా పెద్ద వ్యాపారస్థుల్లాగే సుబ్బారావు తాగడు. కేవలం అవసరమైన ఆఫీసర్లకు తాగిస్తాడు. అటువంటి సమయాల్లో ఆ గ్లాసు చేత్తో పట్టుకుని నడుపుతాడు అంతే! గంగరాజు కూడా అటువంటి వాడే!
భోజనానికి ముందు మిగతా ఛోటా వ్యాపారస్థులందరూ రోజూ తాము అనుభవించే మానసిక టెన్షన్ లకి యధా ప్రకారం, సాయంత్రంపూట ఆ మాత్రం మందు పడాలన్న ఆత్మ వంచనతో మూడోరౌండ్ లో వుండగా, "నిజమైన" ఈ వ్యాపారస్థులిర్దరూ చాలా మామూలు స్థితిలో మాట్లాడుకుంటున్నారు.
"ఇక ముందు ముందు మన పొగాకు వ్యాపారం లాభంలేదు సుబ్బారావుగారూ. మరొకటేదైనా చూసుకోవలసిందే" అన్నాడు గంగరాజు.
"ఎందుకు?"
"ధరలు పెరిగితేనేకదా మనకి లాభం. ఈటొబాకో బోర్డు వైఖరి చూస్తూంటే అది పెరిగే సూచన్లు ఏమీ కనబడటం లేదు. అదీగాక టంగుటూరు ప్రాంతాల్లో ఈ సంవత్సరం విపరీతమైన పంటలు వుండబోతున్నాయంటున్నారు".
సుబ్బారావుకి మెరుపు మెరిసినట్టయింది.
గంగారాజుకి-ప్రభుత్వం పెంచబోయే ధర విషయం ఇంకా తెలీదు. తను అదృష్టవంతుడు. తనకి తెలిసింది.
"అదేమిటి గంగరాజు గారూ. మా ఫ్యాక్టరీలకి సరుకు లేక మేము ఇబ్బంది పడుతూవుంటే మీరు స్టాకు. ఎక్కువైపోతూ వుందని గోల పెడతారేమిటి" అన్నాడు లౌక్యంగా.
"మీకు ఎంత సరుకు కావాలేమిటి? చెప్పండి నేను పంపిస్తాను".
"నెల రోజుల తరువాత ఓ డెబ్బైలక్షల సరుకు, ప్రస్తుతం వున్న ధరమీద పంపగలరా"
"తప్పకుండా"
.....
ఆ మరుసటి రోజు కార్లో తిరిగి వెళ్ళిపోతూ సుబ్బారావు - పెదాల మీద చిరునవ్వు కదలాడుతూ వుండగా, తన వళ్ళో వున్న "ఫార్వర్డు కాంట్రాక్టు" కాగితాల వంక ఆప్యాయంగా చూసుకున్నాడు.
దాదాపు ఇరవై లక్షలు తనకి లాభం అన్న సంతృప్తి కన్నా, తన ప్రత్యర్థిని ఇఅరవై లక్షలకి దెబ్బ కొట్టనన్న ఆలోచన అతడికి ఎక్కువ సంతోషాన్నిస్తూంది.
ఒక చిన్న అమ్మాయి సరదాగా ఆడిన నాటకంలో ఒక పాత్రధారి అయిన వంటవాడు- అవసరమైన దానికన్నా కాస్త ఎక్కువ నటించటం వల్ల అయిన దాని ఖరీదు ఆ ఇరవై లక్షలు అని తెలిసిన క్షణం అతిడ్ మనఃస్థితి ఎలా వుంటుందో కాలమే చెప్పాలి.
వారం రోజులు గడిచినయ్. రెండు వారాలు అయ్యాయి!
పొగాకు ధరలో మార్పు లేదు. కనీసం ధర పెరుగుతున్న సూచన్లు కూడా కనపడలేదు. రామసుబ్బారావు కంగారుపడి వెంకట్రామన్ కి ఫోన్ చేశాడు. కేంద్ర ఆర్ధిక మంత్రి పి.ఏ. లైన్లోకి వచ్చి విష్ చేశాడు. సుబ్బారావుకి మంత్రిత్వశాఖతో మంచి సంబంధ బంధవ్యాలున్నాయి. పొగాకు ధర పెరిగే విషయం అడిగాడు.
"ధర పెంచటమా? లేదే......" పి....ఏ. కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అతడు ఫోన్ సెక్రటరీకిచ్చి ఏదో చెప్పటం వినిపించింది. అంతలో సెక్రటరీ కంఠం ఫోన్ లో వినిపించింది. "నమస్తే సుబ్బారావ్ జీ. మీకో శుభవార్త. ప్రధానమంత్రి జెనీవా నుంచి రాగానే పొగాకు ప్రోక్యుర్ మెంట్ ధర కాస్త తగ్గించే విషయం పరిశీలిస్తున్నాము-"
సుబ్బారావు చేతిలో ఫోన్ వణికింది.
"ఈ వార్త బయటకు పోక్కిందా?" అని అడిగాడు కంగారుగా.
"ఏది?"
"ధర తగ్గించే వుద్దేశ్యం మీకున్నట్టు-"
"ఈ రోజే ప్రకటించాము. బహుశా రేపు పేపర్లో రావొచ్చు".
........సరిగ్గా రెండు గంటల తరువాత రామసుబ్బారావు ఢిల్లీ వెళ్ళే విమానంలో వున్నాడు. తనకి ఇరవై లక్షలు నష్టం వచ్చేలా చేసిన సహాయమంత్రిని ఆ క్షణం ఎదురుపడితే కాల్చేసేటంతగా అతడి రక్తం వుడికిపోతూంది. పొగాకు ధర తగ్గించినా తగ్గించకపోయినా, ప్రభుత్వానికి ఆ వుద్దేశ్యం వున్నట్టు వార్త బయటకి రాగానే పొగాకు ధర తప్పకుండా పడిపోతుంది! చాలు. తనకి ఇరవై లక్షలు నష్టం తెప్పించటానికి.....
దీనంతటికీ కారణం సహాయమంత్రి ముఖర్జీ.
విమానం దిగగానే అతడు ముఖర్జీ దగ్గిరకి వెళ్ళలేదు.
వసంత దాదా దగ్గిరకి వెళ్ళాడు.
5
హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్ ల తరం అయిపోయిన తరువాత చీకటి ప్రపంచాన్ని ఏలే మకుటంలేని మహారాజు 'వసంత దాదా'. ఢిల్లీ సర్కిల్ 3 లో చిన్న ఫ్లాట్ లో వుండే ఆ యాభై అయిదేళ్ళ బ్రహ్మచారి, భారత ప్రభుత్వపు యంత్రాంగానికి సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని నడుపుతున్నా డంటే ఎవరికీ చూడగానే నమ్మకం కుదరదు. అండర్ వరల్డ్ ప్రపంచపు అట్టడుగు పొరల్లో జరిగే ప్రతీ చిన్న కదలికనీ పట్టుకోగలిగే తీక్షణమైన చూపు అతడిది! కోటి రూపాయల విలువచేసే మత్తు పదార్థాల్ని తీసుకోబోతున్నప్పుడు, ఓడని జెట్టీసన్ (సముద్రంలోకి బలవంతంగా సరుకుని తోసెయ్యటాన్ని జెట్టిసన్ అంటారు. ప్రమాదం నుంచి రక్షించటం కోసం ఓడని ఈ విధంగా తేలిక చేస్తారు. కానీ అండర్ వరల్డ్ ప్రపంచంలో జెట్టీసన్ అర్థం వేరు) చేసి లక్షల రూపాయిల నష్టంతో పోలీసుల్నించి తప్పించుకోవలసి వచ్చిందన్న వార్త విన్నప్పుడు కూడా అతడి కళ్ళలో మార్పు వుండదు. తమ రహస్యం పోలీసులకి చేరవేసిన అనుచరుణ్ణి అతడి కళ్ళ ముందే అతడి మనుష్యులు ఒక్కొక్క అంగమే కోసి బాధ పెడుతున్నా అతడు మామూలుగా ఫోన్లో తన పని తాను సాగించుకుపోతాడు.
