Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 6


    అలా వుండేది మా గురుశిష్యుల సంబంధం.

    ఒకరోజు రాళ్ళు కొడుతూ వుండగా నాకో చిన్న మొక్కని చూపించేడు "ఇదిగో - ఇలాటి చెట్లు చాలా ప్రమాదమైనవి. వీటి ఆకుల రసం రెండు గుక్కలు ఎవరితోనయినా తాగించేవంటే - ఎలా చచ్చిందీ తెలియకుండా చస్తాడు" అన్నాడు.

    నాకు లక్ష్మీనారాయణ జ్ఞాపకం వచ్చేడు.

    'ఉహుఁ- అతడు అలా  చావడానికి వీల్లేదు. కుళ్ళి కుళ్ళి చావాలి.'

    నేను ఆలోచనల్లో వుండగానే ఠాకూర్ ఒక వెదురుబొంగును నాకిచ్చేడు "దీన్ని మనతో తీసుకుపోదాం" అన్నాడు.

    "ఎందుకు?" అన్నాను ఆశ్చర్యంగా.

    "చెప్తానుగా?" అన్నాడు. ఆ తరువాత రెండు రోజులకి ఎక్కుణ్నుంచి సంపాదించాడో ఒక సన్నటి కర్రనీ, రబ్బరు ముక్కనీ సంపాదించేడు. పళ్ళతో వెదురుబొంగుకి గాటుపెట్టి రబ్బరు బిగించేడు. నాకేవీ అర్థం కాలేదు.

    జేబులోంచి నాలుగైదు చిన్న రాళ్ళని తీసి, ఒకటి బొంగులో వేసేడు. నా  చేతిలో వున్న బొంగుని తీసికొని పిడికిలి పైభాగాన అటు కొనపెట్టి కుడిచేతితో రబ్బరును సాగదీసి వదిలేసేడు. రాయి విసురుగా వెళ్ళి పదడుగుల దూరంలో వున్న నీటికుండని పగలకొట్టింది.

    "సాధించేం" అని అరచేడు.

    "ఏం సాధించేం? నీళ్ళకుండ బ్రద్దలు కొట్టినందుకు తల వాచేటట్లు చీవాట్లు తప్పవు మనకి" అన్నాను ప్రవాహంగా కదుల్తున్న నీళ్ళవైపు చూస్తూ.

    నా దగ్గరికి వచ్చి భుజం తడుతూ "పర్లేదు బేటా, ఇదే పిస్తోలు షూట్టింగు. ఏ స్కూల్లోనో నేర్చుకోవాలంటే నీకు అయిదారు  వందలు ఖర్చవుతుంది" అన్నాడు.

    అలా నా చదువులో కొత్త అభ్యాసం మొదలయింది.

    "ఈ గురి చూసి కొట్టడం వస్తే చాలు, వందకాదు వెయ్యి గజాల దూరంలో వున్నా కొట్టగలవు" అని  ప్రోత్సహించేవాడు. నెమ్మదిగా గురి కుదరటం ప్రారంభం అయింది. రబ్బర్లో బలం లేక రాయి విసురుగా వెళ్ళేది కాదు, గురికి కింద తగిలేది ఒకసారి.

    "బులెట్ కూడా అంతే బేటా. దూరంగా వున్న టార్గెట్ ని కొట్టాలంటే గాలి వాలుకి వెళ్ళిపోతూ వుంటుంది. గాలి ఎంత వేగంగా  వెళుతుందో చూసుకోవాలి. దూరాన్ని అంచనా వేయాలి. రెంటినీ బేరీజు వేసుకొని దాన్నిబట్టి గురి చేసుకోవాలి" అని పాఠం చెప్పేవాడు. ఈ పాఠం బాగానే  వుండేది కానీ, రాత్రి ఎనిమిదినుంచీ తొమ్మిదివరకూ చెప్పేపాఠమే నా ప్రాణాలు తీసేది. అరచేతిని కత్తిగా మార్చి కొట్టడం.... వేళ్ళ ఎముకల గట్టిపడటం కోసం, పిడికిళ్ళు బిగించి రాతితో గోడలకేసి గుద్డటం..... ఎదుటి వాడి దెబ్బల్ని చురుకుగా కాచుకోవటం- వీటితో నా వళ్ళు హూనమైపోయేది.

    ఒక్కోసారి 'ఎందుకొచ్చిన బాధ యిదంతా' అనే నిస్పృహ కలిగేది. అప్పుడు మళ్ళీ నాలో చురుకు రావటంకోసం హుషారు పర్చేవాడు. తన వయసును గుర్తుకు తెచ్చేవాడు. "నేను నేర్పేవాణ్ణి. ఈ వయసులో నాకు 'ఎందుకు యిదంతా' అనే  అలసట రావటంలేదు. యువకుడివి నువ్వు ఇలా నీరు కారిపోకు" అని ప్రోత్సహించేవాడు. దాంతో మళ్ళీ హుషారు వచ్చేది.

    మా గురుశిష్యుల చదువు సెంట్రీలకి మాత్రం బాగా వినోదాన్ని - ఇచ్చేదనుకొంటా. మొదట్లో ఒక సెంట్రీయే నిలబడి చూసేవాడు. రాను రాను పక్కవాళ్ళు కూడా వచ్చి కాణీ ఖర్చులేని ఈ వినోదాన్ని చూచి ఆనందించి వెళుతూ వుండేవారు. మాకివేఁ పట్టేది కాదు.

    కానీ యిది యింకోలా పరిణమించింది. మేం సెంట్రీల దృష్టిలో బాగా  పడిపోయాం. మాకు తెలియకుండానే మా చుట్టూ గమనింపు ఒక విధంగా ఎక్కువైంది. ఇదే విషయాన్ని ఠాకూర్ తో ఒకసారి అన్నాను.

    "ఔను. నేనూ దీన్ని గమనించేను" అన్నాడు.

    "మరి నువ్వు తప్పించుకోవటం....." ఆగేను.

    చాలాసేపు తనలో తను ఆలోచించుకొంటున్నట్టు ఏవీఁ మాట్లాడకుండా ఆగి, తరువాత నెమ్మదిగా అన్నాడు.

    "నేను బయటకు వెళ్ళి చేసేదాని కన్నా యిక్కడ వుండటంవల్లే ఎక్కువ లాభం కనిపిస్తుంది బిడ్డా" అని తన చేతులవైపు చూసుకొని విశ్వసిస్తూ, "చాలా ముసలివాడ్ని అయిపోయేను. ఇంతకు ముందులా పనిచెయ్యలేకపోవచ్చు. ఈ చేతులు.... ముఖ్యంగా ఆ దట్టమైన అడవిలో" అన్నాడు. ".........కానీ వెళ్ళిపోవాలి. తప్పదు" అని నా వైపు తిరిగి "తొందరగా తయారపు బిడ్డా- ఈ ఠాకూర్ యింకా ఎంతో కాలం బ్రతకడు. ఈ లోపులోనే యింకో బలదేవ్ సింగ్ తయారవ్వాలి" అన్నాడు.

    "నాకేవీఁ అర్థం కావటంలేదు తాతా" అన్నాను అయోమయంగా చూస్తూ.

    "చెప్తాను. ఇప్పుడు కాదు - తరువాత."

    నేనిక ఆ విషయాన్ని రెట్టించలేదు.

    రోజులు నెమ్మదిగా సాగుతున్నాయి. నాలో అభివృద్ధికరమైన మార్పులు వచ్చినయ్.  ఇప్పుడు ఏమాత్రం తడబడకుండా ఇంగ్లీషు మాట్లాడగలుగుతున్నాను. కృషి,పట్టుదలా వుంటే దేన్నయినా సాధించవచ్చనే నిజం నా పట్ల నిరూపణ అయింది. మమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చెయ్యటానికి ఒక ఇంగ్లీషుదొర వచ్చేడు. అనువాదకుని అవసరం లేకుండా అతనితో అతని" యాక్సెంట్" లోనే మాట్లాడటం చూసి జైలర్ ఆశ్చర్యంతో మాటరాక నిశ్చేష్టుడై పోయాడు. ఇంటర్వ్యూ చాలాసేపు జరిగింది.

    దొర వెళుతూ వెళుతూ అడిగేడు, "నిన్ను కలుసుకోవడం చాలా ఆనందమయింది, ఏం చదువుకొన్నావు?"

    "జీవితాన్ని!"

    సెల్ కొచ్చిన తరువాత ఠాకూర్ నన్ను కౌగిలించుకున్నాడు. "చాలు  బిడ్డా, ఇంక నువ్వు నేర్చుకోవలసింది ఏవీఁలేదు" అన్నాడు.

    "అలా అనకు తాతా. ఈ ప్రపంచంలో  నేర్చుకోవలసింది చాలా  వుంది. మనకి తెలిసింది చాలా తక్కువ. ఈ అనంత విశ్వంలో పిపీలిక పరిణామంలో అస్థిత్వం నిలుపుకొనే అల్పజీవులం. మనకో ప్రత్యేకత లేదు." ఒక అద్భుతమైన రహస్యాన్ని కనుక్కున్న వెలుగు బహుశా నా కళ్ళలో ప్రతిబింబించి వుంటుంది. ఠాకూర్ నావైపే చూస్తూ వుండిపోయిచివరికి నెమ్మదిగా "నన్ను వెళ్ళనివ్వవా బిడ్డా" అన్నాడు.

    "వెళ్ళనివ్వను తాతా. నా కోసం కొంతకాలం వుండిపోవాలి నువ్వు  నాకు దాహంగా వుంది, ఎంత తెలుసుకొన్నా  యింకా ఏదో మిగిలిపోతూందనే దాహం....."

    మా మధ్య చాలా సుదీర్ఘమైన సంభాషణలూ, వాదోపవాదాలుజరిగేవి. అతడు చెప్పేవన్నీ శ్రద్ధగా వినేవాడిని. ఆర్థకశాస్త్రం, తత్వం, వేదాంతంఒకటేమిటి -అన్నీ! అంతటి విజ్ఞానవంతుడి అభిప్రాయాల్లో కూడా కొద్దిగా "బయస్డ్" ధోరణి కనబడుతూ వుండేది నాకు. ఆర్కిమెడిస్ గురించి మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానం గురించి టాపిక్ మార్చేసేవాడు. ధరల స్థిరీకరణ, పెర్ ఫెక్ట్ కాంపిటీషన్ గురించి మాట్లాడుతూ ప్యూడల్ వ్యవస్థలోకి వెళ్ళిపోయేవాడు. అది గమనించి నవ్వుతూ "నువ్వు పాఠం చెప్పటంలేదు తాతా. నీ అభిప్రాయాల్ని నా మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నావు" అనేవాడిని.

    "వజ్రాన్ని సానబెట్టడంలో నా ఉద్దేశ్యం అదే" అనేవాడు. "బయట ప్రపంచం గురించి నీకు తెలియదు బిడ్డా. అక్కడ క్రూరమృగాల్ని చాలా తెలివితేటల్తో పట్టిష్టమైన వ్యవస్థని సృష్టించి, ఒక చుక్క రక్తపు బొట్టు నేల చిందకుండా అమాయకమైన సాధు జంతువుల్ని తమ ఆకలికి బలి చేస్తున్నాయో నీకు తెలియదు. ఆ క్రూరమృగాల్ని చంపాలంటే కొంత రక్తం చిందక తప్పదు."

    ఠాకూరు సాహచర్యంలో నన్ను నేను రూపు దిద్దుకోసాగాను.

    మాకు తెలియకుండానే రోజులు తొందర తొందరగా గడవసాగాయి.

    ఒకరోజు రాత్రి.....

    బయట హొరున వర్షం కురుస్తోంది.

    గదిలో మునగదీసి పడుకొన్నాను ఒక మూలగా. రాత్రి రెండున్నర అయివుంటుంది. ఏదో కల వచ్చింది.

    పార్వతి పరుగెడ్తూంది. ఆమె వళ్ళంతా రక్తం, వెనుకే లక్ష్మీనారాయణ పరుగెడ్తున్నాడు. అతడి చేతిలో పెద్ద వల.

    పార్వతి వెళ్ళి వెళ్ళి అఘాతంలో పడిపోయింది. గట్టు మీద నిలబడి లక్ష్మీనారాయణ వికటాట్టహాసం చేస్తున్నాడు.

    కెవ్వున అరచి మేలుకొన్నాను. వళ్ళంతా చెమట పట్టేసింది. గజగజా వణకసాగేను. ఠాకూర్ లేచి చప్పున నా దగ్గరగా వచ్చి "ఏమైంది బిడ్డా" అన్నాడు.

    "కల తాతా ..... చాలా భయంకరమైన కల" అంటూ పక్కకి తిరిగి పడుకొన్నాను. మళ్ళీ ఆలోచన్లు.....

    ఎక్కడ వుంది పార్వది?

    తండ్రి చచ్చిపోయి, వున్న ఒక్క ఆధారముపోయి నిస్సహాయురాలయిన అబల.... ఆ వర్షం రాత్రి ఎక్కడ వుంది? ఎవరి పంచన తల దాచుకొంది. కన్నతల్లి కన్నా ప్రేమగా పెంచిన ఆ అమ్మ - నేను జైలు కొచ్చిన తరువాత ఏమైంది? అసలు వాళ్ళకు నేను గుర్తున్నానా? అక్కడ వాళ్ళు ఎలా జీవనం గడుపుతున్నారు? తినడానికి తిండిలేక, ఆదుకొనేవారు లేక, గాలి తిని బ్రతుకుతూ....దిన దిన గండంగా.....

    ఈ ఆలోచన వచ్చేసరికి వణికిపోయేను. అప్రయత్నంగా నా కళ్ళు వర్షించ సాగాయి. రెండు నిముషాలు గడిచేసరికి, ఠాకూర్ నా దగ్గిరగా వచ్చి, మీద చెయ్యివేస్తూ "ఏడుస్తున్నావా బిడ్డా" అన్నాడు లాలనగా. ఆ ఆప్యాయతలో - అప్పటివరకూ నేను బలవంతంగా  ఆపుకున్న వ్యధ చెలియలికట్ట దాటింది. ఆ వృద్ధుడి కౌగిలిలో, అతడి రొమ్ముమీద తల ఆన్చి, ఎంతసేపు రోదించానో నాకే తెలియదు. ఆ అవ్యక్తమైన అవస్థలో చాలాసేపు వుండిపోయేను. నా హృదయ భారం అంతా తీరేవరకూ నన్ను మాట్లాడించలేదు ఠాకూర్. నెమ్మదిగా నా వెన్ను రాస్తూ వుండిపోయేడు. నేను తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ వుంటే అడిగాడు -

    "ఎప్పటినుంచో అడుగుదామనుకొంటున్నాను బిడ్డా. నీలో ఆవేశం వుందని నాకు తెలుసు. కాని  హత్యచేసేవంటే నమ్మలేను నేను. అసలేం జరిగింది?"

    మాట్లాడలేదు నేను.

    "చెప్పు - చెబుతే సగం బాధ తగ్గుతుంది."

    "ఏం చెప్పను తాతా! ప్రత్యర్థులు ఎంత తెలివిగా నా చుట్టూ వల పన్నేరో చెప్పనా? అది తెలుసుకోలేని నా మూర్ఖత్వాన్ని వివరించనా?"

    "అసలేం జరిగింది బిడ్డా?"

    చెప్పటం మొదలు పెట్టాను. నేను పొదల్లో దొరకటం, పల్లెలో అందరి తలలో నాలుకగా పెరగటం, పార్వతితో ప్రేమా.... అన్నీ చెప్పి, చివరికి ఆ రోజు.......నా జీవితాన్ని యీ విపాదకరమైన మలుపులోకి తిప్పిన ఆ దురదృష్టకరమైన రోజు ఏం జరిగిందో చెప్పసాగాను.


                                                                         5

    "అబ్బా - నేనేవైఁనా నీలా మొగవాడ్ని అనుకొన్నావా? ఇక పరుగెత్తలేను బాబూ" అంది పార్వతి ఆయాసపడుతూ.

    "అదేమిటి, నాకన్నా హుషారుగా పరుగెత్తేదానివి" చింతచెట్టు మొదట్లో కూర్చుంటూ అన్నాను.

    "ఇక కుదర్దు-"

    "ఎందుకో-"

    "చెప్పెయ్యమంటావా?" నవ్వింది.

    అర్థం కాలేదు "చెప్పు" అడిగాను ఆమెవైపు  చూసి.

    చాలా సేపు ఆలోచించి "ఎలా చెప్పను" అంది.

    " ఏవుంది - ఒక్కసారి మొదలు పెట్టు, మాటలు వాటంతట అవే వస్తాయి."

    "ఛీ - నీ కసలు ఏవీ తెలీదు."

    "అవునింకేమీ తెలీదు. తెలిసిందంతా పెళ్ళి కాకుండానే నీకు  చెప్పే సేనుగా-"

    పార్వతి చెక్కిళ్ళు సిగ్గుతో బాగా ఎర్రబడ్డాయి. పై కొంగు వేలికి చుట్టుకొంటూ-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS