ఠాకూర్ నెమ్మదిగా మోచేతుల మధ్య లేచాడు. అతడి వైపే చూస్తూన్న నా ఆతృత గమనించి చిరునవ్వుతో అన్నాడు.
"దురదృష్టం, ఖైదీల కిచ్చే చొక్కా పొడవుగా వుండటం చాలా దురదృష్టం. తీగకు కట్టిన ఇనుప కమ్మీలు పైకి పొడుచుకుని వుండటం ఇంకో దురదృష్టం. వాటిని నేను చూసుకాకపోవటం మరీ దురదృష్టం....." నవ్వేడు. "ఎనిమిదీ అయిదు నుంచి పదిహేను వరకూ ఆ గోడమీద...... తుఫానులో...... గాలిలో వేలాడుతూ....చొక్కాని కమ్మీనించి విడిపించటానికి శుష్క ప్రయత్నం చేస్తూ" మెడ బెణికినట్టుంది. సవరించుకుంటూ అన్నాడు. "చేతులూ కాళ్ళూ కొట్టుకుంటూ గాలిలో ఈదటం అంటే ఏమిటో తెలిసిందిరా. భలే అనుభవం అది."
అవును. మంచి అనుభవం అది.
తుపాకి మడమల్తోను, లాఠీల్తోనూ ఎడా పెడా దెబ్బలు తినటం - బూట్ల నాడాలు చర్మం మీద గీసుకుపోతూ వుంటే భరించలేక నేల మీద ఇటూ అటూ పోర్లటం - మంచి అనుభవం.
4
ఈ సంఘటన ఇలా జరక్కుండా, ఠాకూర్ తప్పించుకొని వెళ్ళిపోయివుంటే ఈ కథ యింకోలా సాగి వుండేదేమో! ఇది జరిగేక మా చుట్టూ కాపలా ఎక్కువయింది. కొన్ని జతల కళ్ళు యెప్పుడూ మమ్మల్ని గమనిస్తూ వుండేవి. ఆ విషయం ఠాకూర్ ఒప్పుకున్నాడు.
"ఇంకొంత కాలం- కనీసం రెండు సంవత్సరాల వరకయినా ఆగాల్రా అబ్బీ" అన్నాడు గదిలో ఇటూ అటూ పచార్లు చేస్తూ.
తలూపేను.
ఆగి, నా వైపు చూస్తూ "చూసేవా - ఒక్క తప్పటడుగు ఆలోచనా రహితంగా వేస్తే ఫలితం ఎంత ఘోరంగా వుంటుందో" అన్నాడు.
"ఆలోచనా రహితంగా వేసే తప్పటడుగు ఘోరంగా వుంటుందనటానికి ఉదాహరణ ఇదికాదు - నా జీవితం" అన్నాను. అణగిపోయిన నా పాతజీవితపు స్మృతులు మళ్ళీ పైకివచ్చి నన్ను వేధించసాగేయి - "నేను కొద్దిగా జాగ్రత్తగా వుండి వుంటే ఇలా పన్నెండేళ్ళ యవ్వనాన్నీ, కలల్నీ వృధాపరచుకునేవాణ్ని కాను."
"అవును. ఎప్పట్నుంచో అడుగుదామనుకొంటున్నాను. నీ కథ ఏమిటి?' కథ చెపుతారు, హత్యో - చోరియో" శుష్కంగా నవ్వేను.
"నువ్వు హత్య చేసేవంటే నేను నమ్మలేన్రా అబ్బీ".
"వద్దు తాతా, యింకా చర్చవద్దు. ఈ జైలు గోడలు నన్ను మార్చేస్తున్నాయి. కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా మారిపోతున్నాను నేను. ఇంకొంత కాలంపోతే - 'నేనుబహుశా హత్యచేసే వుండవచ్చు. లేకపోతే ఈ న్యాయస్థానం నాకు శిక్ష ఎందుకు వేస్తుంది? అని అనుకొనే స్థితికి వచ్చినా వచ్చేస్తాను" అన్నాను ఆవేదనగా.
ఠాకూర్ నావైపు క్షణంసేపు జాలిగా చూసేడు. అంతలోనే అతడి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.
"నువ్వు జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన భాగాన్ని ఈ నాలుగు గోడల మధ్య వృధా చేసుకొంటున్నావనే భావనే కదా ఈ వ్యధకు కారణం...." అడిగేడు.
తలూపేను. "అంతేకాదు......." ఏదో చెప్పబోయేను.
"అవును - అంతేకాదు" అని అతడే అందుకొన్నాడు. "ఒక భాగస్వామితో జీవితం పంచుకోవాలనీ, జీవితానికో అస్తిత్వం ఏర్పరచుకావాలనీ కూడా వుంటూంది. ఈ వయసులో-"
"ఉండటం తప్పని అనుకోను."
"నేనూ అనను" గంభీరంగా అన్నాడు. "కానీ, అది దురదృష్టవశాత్తు సాధ్యం కానప్పుడు ఆ వైఫల్యాన్ని ఈ ప్రపంచంమీద నువ్వేమీ కసిగా ఏర్పరచుకో కూడదు."
"నాకు ఎవరిమీదా కసిలేదు."
"పోనీ నిర్లిప్తత."
నేను మాట్లాడలేకపోయేను. అతడే అన్నాడు.
"వేదాంతం నిరాశావాదంలోంచి ఉద్భవించదు బిడ్డా. అలా పుట్టినా - అది అంతమంచిది కాదు."
"నేనేం చెయ్యాలి?"
"అరవై అయిదేళ్ళ వయసులో ఇంతమంది కళ్ళు గప్పి, ఒక వర్షం రాత్రి పది అడుగుల గోడదూకి వెళ్ళిపోయే సాహసాన్ని నాలో కలిగించిన పరిస్థితుల్ని గుర్తించు. నా ఆలోచన్లకి, ఆవేశానికీ ఊపిరి ఎక్కడ్నుంచి వస్తూందో గమనించు. నీకా విషయం అర్థమవుతుంది - 'లక్ష్యం'. అవును లక్ష్యం. ప్రతి మనిషీ ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ సిద్దాంతం కోసం, తను కోరుకున్న లక్ష్యం కోసం అంకితమవ్వాలి. జీవితం అంతా పోరాటంలోనే గడపాలి. ఆ పోరాటం సాంఘికం కావొచ్చు, ఆర్ధికమైనది కావొచ్చు, మానసికంకావొచ్చు. రాజకీయమైనది కావొచ్చు. కానీ సంఘర్షణ ముఖ్యం. ఆ రాపిడిలోంచే మనిషి ప్రభావితం అవుతాడు. నీకు శిక్ష విధించిన ఈ న్యాయస్థానాన్ని గౌరవించి, శిక్ష పూర్తయ్యేవరకూ రానన్నావు. నేను బలవంతం చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నీ సిద్ధంతం నీది! వాదనతో సిద్దాంతాల్ని మార్చలేం బేటా! పోరాటంలో సర్వమానవ సమానత్వాన్ని సాధించగలమనే సిద్ధాంతం నాది. దానికి 'బందిపోటు'. అని పెట్టిన సిద్ధాంతం నాకు శిక్ష విధించిన న్యాయస్థానానిది ఎవర్నీ తప్పు పట్టలేం. ఈ సంఘర్షణ ఇలా జరుగుతూ వుండాల్సిందే! అయితే నేను చెప్పేది ఒకటే. నిర్లప్తతని నీ దగ్గరకు రానివ్వకు. అదో పెద్ద రాక్షసిలాటిది సుమా. ఒక్కసారి దాన్ని నీ దగ్గరికి ఆహ్వానించేవా - ఇక ఆ మత్తు నీ నరనరాల్లోనూ పాకిపోతుంది. నీ లక్ష్యానికి దూరంగా తీసుకుపోతుంది."
"నాకేవీఁ లక్ష్యం లేదు" దాదాపు అరిచెను. "నాకున్న కోర్కె అల్లా ఒకటే- లక్ష్మీనారాయణ అంతం చూడటం, బాబాయిని నా చేతుల్తో స్వయంగా చంపటం అంతే - అదే- అదే నా ఆశయం."
అరుపులకి పరుగెత్తుకొంటూ వచ్చిన సెంట్రీ మొట్టమొదటిసారి నా కంఠం అంత బిగ్గరగా వినిపించటం చూసి ఆశ్చర్యపడి వెనుదిరిగేడు. నా ఆవేశానికి నేనే సిగ్గుపడి "క్షమించు తాతా" అన్నాను.
ఠాకూర్ నవ్వేడు. "నీ జీవితపు ఆశయాన్ని వ్యక్తులకి అన్వయించు కొంటున్నావా?" అన్నాడు.
"ఠాకూర్ సాబ్" తలవంచుకుని నేలవైపు చూస్తూ నెమ్మదిగా అన్నాను. "నేను నీ అంత గొప్పవాడ్ని కాదు. నీలో సహస్రాంశమైన తెలివితేటలన్నా నాకు వున్నాయని నేననుకోను. కానీ నాకు చాలా అన్యాయం జరిగిపోయింది తాతా! నేను కలలో కూవా ఊహించలేనంత అన్యాయం అది. అది జరిగేక నాకు మానవత్వం మీదే నమ్మకం పోయింది. నేనింకా బ్రతికే వున్నానంటే దానిక్కారణం పగా, ద్వేషమే. అలా నన్నో కిరాతకుడిగా జమజట్టకు - పరిస్థితులు నన్ను మార్చే సినయ్."
"నేనో తప్పు చేసేను బిడ్డా" అన్నాడు, నావైపు సూటిగా చూస్తూ. "ఈ ఆర్నెల్లలోనూ నాకీ విషయమే తట్టలేదు సుమా."
"ఏమిటది?"
అతడు క్షణం మౌనంగా వుండి సాలోచనగా అన్నాడు. "నీ పునాది సరిగ్గా చూసుకోకుండా నీతో వాదనలకి దిగేను. నన్ను ప్రభావితం చేద్దామనే ఉద్దేశ్యంతో నీ కర్థంకాని సిద్దాంతాన్ని నూరిపోయటానికి సిద్ధపడ్డాను."
నా మనసు చివ్వుక్కుమంది. రోషంగా "సిద్దాంతాన్ని అర్థం చేసుకోవటం కోసం మనిషి గొప్పవాడు, బాగా చదువుకున్నా వాడూ అయి వుండాలంటే, అంత గొప్ప సిద్దాంతంలోనూ ఎక్కడో ఏదో లొసుగు వుందన్నమాట" అన్నాను. " అందరికీ సులభంగా గ్రాహ్యమయ్యేదో మంచి సిద్ధాంతం కదా తాతా!"
కాని కొన్ని బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ తెలుస్తుండాలి."
భరించలేనంత కోపం వచ్చింది. "అలా మాటిమాటికీ నన్ను ఓ వెధవని చేసి అపహాస్యం చేయకపోతే నీకు తెలిసిందేమిటో నాకూ చెప్పరాదూ?" అరిచేను.
క్షణంసేపు నావైపు తదేకంగా చూసి, "నేర్చుకొంటావా?" అన్నాడు నెమ్మదిగా.
"నువ్వు చెప్పింది నేనెప్పుడు విన్లేదు?"
"నిజవేఁ' నన్నట్టు తలూపేడు. క్షణం తనలో తనే ఆలోచించుకొన్నాడు. సన్నగా గొణిగేడు. "అవును - ఈ సంవత్సరకాలం నేను చేసేది ఏముంది? ఒక వ్యక్తిని తీర్చిదిద్దినట్టూ అవుతుంది- నా సిద్దాంతాన్ని వ్యాప్తం చేసినట్టూ అవుతుంది-" అంటూ నావైపు తిరిగి "ఏ సాధనమూ లేకుండా, గోడల మధ్య సంవత్సరమూ, రెండు సంవత్సరాల కాలములో నాకున్న విజ్ఞానమంతా నీకు నేర్పుతాను బేటా - కానీ చాలా కష్టపడి నేర్చుకోవాలి సుమా. ఒక బాలుడు యువకుడు అయ్యేవరకూ నేర్చుకొనేదంతా నువ్వీ రెండు సంవత్సరాల్లో నేర్చుకోవాలి."
నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేయి. కృతజ్ఞతతో చప్పున అతడి కాళ్ళమీదకు వంగి అన్నాను. "నేర్చుకొంటాను తాతా! ఏ ఆశయమూ లేక గాలికీ, ఎండకూ పెరిగేవాడ్నిజైలుకొచ్చి ఆ పై జీవితం మీదే ఆశ పోగొట్టుకొన్నవాడ్ని. అలాటి వాడికి ఒక ఆధారం చూపించి, వ్యక్తిత్వం వున్న మనిషిగా చేస్తానంటున్నావు. దానికోసం ఎంత కష్టమైనా పడతాను. నువ్వు పడే కష్టంతో పోల్చుకుంటే ఇది ఏపాటిది?"
చాలాసేపటి తర్వాత మళ్ళీ ఠాకూర్ నవ్వేడు. "ఇందులో నా స్వార్థమూ వుంది బిడ్డా. రెండు సంవత్సరాలు నాకూ ఏదో వ్యాపకంతో గడవాలి కదా" అన్నాడు. "అంతేకాదు నీకున్న బలమూ, చురుకూ, చూస్తూంటే నా ఆశయసిద్ధికి నువ్వు బాగా పనికి వస్తావనిపిస్తోంది."
మాట్లాడలేదు నేను. అతడి ఆశయం నాకు తెలుసు. దానికి అతడెన్నుకున్న దారిపట్ల నాకున్న భావం వేరు. కానీ యిద్దరి గమ్యమూ ఆ ఆశయమే అయినప్పుడు దార్లు వేరయితేనేం? ఆ గమ్యం చేరుకోవటానికి నాకు వేరే దారి దొరక్కపోతుందా? వెంటనే ఒప్పుకొన్నాను.
ఆరోజు నుంచీ నా శిష్యరికం ప్రారంభమైంది. అయితే అది చాలా కఠినతరమైంది. చాలాకాలం తరువాత లచుకుంటే.... నేనేనా అంత దీక్షతో పన్జేసింది అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు.
"మన జీవితాల్లో ఆంగ్లం బాగా పెనవేసుకుపోతోంది. దాన్ని నేర్చుకో" అన్నాడు.
గదిలో ఒక మూల ఇసుక కుప్పగా పోసి, చూపుడువేలితో దిద్దించటం ప్రారంభించేడు. వయసు నా మీద బహుశా ఏ ప్రభావమూ చూపలేదనుకుంటా! అక్షరాలూ చాలా తొందరగా వచ్చేసేయి. చిన్న చిన్న పదాలూ వాటికర్థలూ నేర్పేడు. వ్యాక నిర్మాణం నేర్చుకోసాగేను. మాకు పెద్ద పరికరాలు కూడా లేవు. నాలుగు గుప్పెళ్ళ ఇసుక, బొగ్గుముక్కలు చిన్న గుడ్డ దాన్ని నీళ్ళలో తడిపి బొగ్గుతో వ్రాసిన అక్షరాలు చెరిపేసే వాళ్ళం.
రెండు నెలలు గడిచేసరికల్లా అతడితో ఇంగ్లీషులో మాట్లాడటం వచ్చేసింది. వ్రాయటమే కష్టంగా వుండేది. నేను ఊహించిన దానికన్నా తొందరగా నేర్చుకోవటం చూసి అతడు చాలా ఆనందపడిపోయేవాడు. ఠాకూర్ తో నాకు వచ్చిన పెద్ద చిక్కల్లా అతడి కోపం! చిన్న తప్ప చేసినా అతడికి విపరీతమైన కోపం వచ్చేది. ఒకనాడు ఇంగ్లీషులో ఏదో తప్పు వాక్యం నిర్మాణం చేసినందుకు చెంపమీద బలంగా కొట్టేడు. దాంతో వాచిపోయి రెండు రోజులు తిండి తినలేకపోయి బాధపడ్డాను. ఇలాటి సంఘటనే మరొకటి జరిగింది యింకొకసారి.
"నాలుగూ టు ది పవర్ ఆఫ్ ఆరెంత?" అడిగేడు. మనసులోనే లెక్కపెట్టసాగేను నిముషం గడిచింది.
"ఇంతసేపా?" అన్నాడు.
"లెక్క కట్టాలా?" అన్నాను విసుగుతో.
"దానికింతసేపా అని అడుగుతున్నాను" అన్నాడు గట్టిగా.
"అవును" అన్నాను.
అంతే! నా మెడమీద అరచేతితో చరిచేడు విసురుగా. ముందుకి తూలిబడ్డాను. నెమ్మదిగా చేతులమీంచి లేచి పిడికిలి బిగించి గెడ్డం అదిరిపోయేలా కొట్టేను. వెనక్కి వెళ్ళి గోడకి కొట్టుకొని జారేడు. క్షణంలో నా ఆవేశం దిగజారిపోయింది. గెడ్డం సవరించుకొని లేస్తూ, "ఉట్టి బలం వుంటేసరికాదు బేటా - కొట్టడంలో మెలకువ కూడా వుండాలి. రేపటి నుంచీ తొమ్మిదివరకూ ఆ పాఠమూ చెబుతాను. టైం టేబిల్ లో వ్రాసుకో" అన్నాడు.
