"మా నాన్నని నువ్వు తొందరగా కలుసుకోవాలి" అంది.
"ప్రతిరోజూ కలుసుకొంటున్నాగా."
"ఈసారి అలాక్కాదు, కాబోయే అల్లుడి హొదాలో."
"తొందరేం వచ్చింది?"
"మరి తొందర కాకపోతే-? ఆయన్ని తాతని చేసి అప్పుడు కలుసుకొంటావా ఏమిటి?"
అప్పుడు నేను లేచి ఆనందంగా పెట్టిన కేక, కొండల్లోనూ, లోయల్లోనూ ప్రతిధ్వనించింది. చేతుల మధ్య ఆమెని ఎత్తుకొని గిర్రున తిప్పేను. పెదవులమీదా, బుగ్గలమీదా ముద్దు పెట్టుకొన్నాను.
"పార్వతీ- దీనికి బదులుగా నీకు నేనేం యివ్వగలను? ఆనందమైన విషయం చెప్పేవు? నీకేం కావాలి పార్వతీ!"
"మనం తొందరగా పెళ్ళి చేసుకోవటం-"
"చాలా చిన్న కోర్కె అది" నవ్వేను. "నా కెవ్వరూ లేరు- మీ నాన్నకి నేను అల్లుడుగా రావటం అభ్యంతరం లేదు."
"అయినా ఆ మూడు ముళ్ళూ పడితే" అంది
స్త్రీ ఎంత చిత్రమైంది. మొన్నటివరకూ నాతో అల్లరిగా తిరిగిన అమ్మాయి ఇప్పుడు గాంభీర్యతను సంతరించుకొంటోంది. కొండల్లోనూ, కోనల్లోనూ దూకుడుగా పారే సెలయేరు, చిన్న మలుపుతో జీవనదై ఒడుదుడుకుల్నీ, గాంభీర్యాన్ని తనతో నింపుకొంటుంది.
"ఈరోజే చెప్తాను- సరేనా?" అన్నాను. "కానీ ఈ పెళ్ళి నాకు బహుమతి? నీకు కాదు. నీకు ఇంకేదన్నా ఇవ్వాలి. ఏం ఇవ్వను?" అని చప్పున మెడలో లాకెట్ తీసి ఆమె మెడలో వేశాను. "నాదంటూ ఏదయినా వుంటే ఇదొక్కటే, పార్వతీ! నన్ను కన్న తల్లిదండ్రులు నాకిచ్చింది ఇదొక్కటే, తీసుకో" అన్నాను. అది చాలా విలువైన హారం అని ఊర్లో అందరూ అనుకునేవారు.
నవ్వింది. "నాకు ఒకందుకు ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళూ ఈ గొలుసు వుంటే ఏ రాజో వచ్చి నిన్ను కొడుకుగా గుర్తించి తీసుకెళ్ళి పోతాడేమోనని భయంగా వుండేది. ఇంక వున్న ఆ ఒక్క గుర్తూ నాకిచ్చేసేవుగా........."
నవ్వి వూరుకున్నాను. ఇద్దరం పల్లెవైపు నడక సాగించేం.
నడుస్తూ వుంటే "ప్రొద్దున్న లక్ష్మీనారాయణ మా ఇంటికి వచ్చేడు" అంది.
మొహం చిట్లించి "ఎందుకు?" అడిగాను.
"తెలీదు" అని ఆగింది ఏదో చెప్పబోయి.
"బహుశా నా గురించి హెచ్చరించి వుంటారు మీ నాన్నకి" అని నవ్వి "ఇంక ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? రెండు నెలలుపోతే ఇక....." అనబోతూ వుంటే చప్పున చేత్తో నా నోటిని మూసింది సిగ్గుతో.
అంతకు ముందు పదిహేను రోజులక్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. రావిచెట్టు పక్క నుంచి వెళ్తూవుంటే లక్ష్మీనారాయణ మరి నలుగురికి కూర్చుని మాట్లాడుతున్నాడు. పార్వతి పేరు వినిపించింది.
"చాలా చురుకయిన పిల్లరోయ్. ఇంకా యెవరూ పుణ్యం కట్టుకోలే దనుకొంటా-"
ఆగి దగ్గరికి వెళ్ళి "నారాయణగారూ- దాదాపు నలభై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. అలా మాట్లాడటం తగ్గించుకోండి" అన్నాను.
ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయేడు క్షణంసేపు. అంతలోనే తేరుకొని వెకిలిగా నవ్వుతూ "చాల్లేవోయ్ పెద్ద చెప్పోచ్చావ్, నీ సంగతి నాకు తెలుసులే అన్నాడు.
"ఏం తెలుసు మీకు? కుంచెడు బియ్యం తిని కూర్చుని రోజూ దారినపోయే అమ్మాయిల గురించి మాటలు విసరటం తప్ప ఇంకేవీ చేత కాదు" అన్న నా మాటలు విని చుట్టూ వున్న నలుగురూ నవ్వేరు. పెద్ద పొట్ట, నల్లటి శరీరంతో నారాయణ వికృతంగా వుంటాడు. నా మాటలతో అతడి మొహం మరింత నల్లబడింది.
లేచి, చేతులు తిప్పుకుంటూ గట్టిగా అరిచేడు- "ఒరే వెధవా- గాలికి పుట్టిన వాడివి ఎంత పోగర్రా నీకు? చూద్దాంరా- పార్వతి నీ దగ్గిర ముందు పడుకొంటుందో నా దగ్గిర పడుకొంటుందో-"
సంస్కార రహితమైన ఆ మాటలకు నా పిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకున్నాయి.
"ఏమన్నావ్? మళ్ళీ అను."
"వందసార్లు అంటాను. పార్వతిని నీకన్నా ముందు నేనే పడుకోబెట్టుకుంటాను. పార్వతిని నీ కన్నా....."
అతడికి పిత్రార్జితమైన ఆస్థి బాగా వుంది. పాలు, పెరుగూ త్రాగటం వలన అడ్డంగా క్రొవ్వుతో బలిసిన శరీరం వుంది. తనంతట తను నడవటానికే ఆయాసపడిపోతాడు. అంతటి శరీరం అతడిది. అంత శరీరమూ నేను కొట్టిన దెబ్బకి గాలిలోకి లేచింది. అది భూమ్మీదికి పడేలోపుగానే కాలు విసురుగా లేపి తన్నటంవాళ్ళ మళ్ళీ పైకి ఎగిరింది. మొదటిసారి రావిచెట్టు చెప్టాక్రిందుగా రెండోసారి రోడ్డుమధ్య, మూడవసారి మళ్ళీ లేచి పక్కగావున్న కాలువలో పడి ఇకముందు వెళ్ళటానికి వీలులేక అక్కడే వుండిపోయింది.
ఇదంతా ఎంత రెప్పపాటులో జరిగిందంటే, అతడి చుట్టూవున్న వాళ్లు కేవలం అతడి శరీరాన్ని ఆ మురికిగుంటలోంచి లేపటానికి పనికొచ్చేరు.
ఆయాసపడి లేస్తూ "దీనికి ఫలితం అనుభవిస్తావ్ కృష్ణా, అతి తొందరలోనే' అన్నాడు నెమ్మదిగా.
"నీ మొహం" అన్నాను.
అదంతా తల్చుకొని నవ్వు వచ్చింది.
"ఎందుకు నీలో నువ్వే నవ్వుకొంటున్నావ్" అంది పార్వతి.
"ఏం లేదు. లక్ష్మీనారాయణ జ్ఞాపకం వచ్చేడు" అన్నాను. నా చేతిని మరింత బిగించి పట్టుకొని- "ఆ సంగతి జ్ఞాపకం చెయ్యకు" అంది మాట మారుస్తూ. "మీ నాన్నతో ఈ విషయం చెప్పించనా" అడిగాను. తల్లి తరువాత నన్ను అంతగా ప్రేమించే మనిషి బాబాయి. అతడిది కలప వర్తకం. ఒక విధంగా నాకు జీవనోపాధి కల్పించింది అతడే.
"నీ ఇష్టం" అంది పార్వతి తలని నా భుజంమీద ఆనుస్తూ.
* * *
"నా కూతుర్ని చేసుకోవటానికి నీకున్న అర్హతలేమిటో ఒక్కసారి ఆలోచించేవా?"
"ఏం? నాకేం తక్కువ?"
"ఏం వుందని నీకిచ్చి చేయాలి నా కూతుర్ని......"
"కానీ మేం ప్రేమించుకున్నాం."
"ఈ ప్రేమపట్ల నాకు నమ్మకం లేదు."
"కానీ....."
"నన్ను విసిగించకు, ఇక వెళ్ళు-"
"మీరు అవునంటేగాని వెళ్ళలేను."
"ఏం బెదిరిస్తున్నావా" కోపంగా అడిగేడు.
"లేదు మిమ్మల్ని అర్థం చేసుకొమ్మని ప్రాధేయపడ్తున్నాను" బ్రతిమాలుతున్నట్టు అన్నాను.
"ఆ ఆగత్యం నాకు లేదు. నువ్వు వెంటనే బయటకు వెళితే సంతోషిస్తాను' దాదాపు అరిచేడు ఆయన. "ప్రతి అడ్డమైన వెధవకీ ప్రేమ - ప్రేమట - ప్రేమ."
"నోటిని కొంచెం అదుపులో వుంచుకొని మాట్లాడండి."
"లేకపోతే__లేకపోతే ఏం చేస్తావోయ్?"
"మీ కూతుర్ని ఏ గుళ్ళోనో చేసుకుంటాను. పెళ్ళి మాత్రం ఆగదు...."
"నా కంఠంలో ప్రాణం వుండగా అది జరగదు."
"అయితే మీ ప్రాణమే తీయాల్సి వస్తుంది."
"ఏమన్నావు? ఏమన్నావు - మళ్ళీ అను-"
"నాకేం భయం లేదు. మళ్ళీ మళ్ళీ అంటాను. ఈ పెళ్ళి చేసుకోవటం కోసం నీ రక్తమే చూడాల్సివస్తే డానికి నిన్ను చంపడానికి కూడా వెనుదీయను నేను."
"బావుంది" చప్పట్లు కొట్టాడు బాబాయి.
"మొట్ట మొదటిసారి నేను వ్రాసింది మీ నోటి వెంబడి వింటూ వుంటే నాకే ఆశ్చర్యంగా వుంది."
"బాగానే వ్రాసేవు" అన్నాడు పార్వతి తండ్రి. "కానీ సాంఘికాలు ప్రజల్లోకి ఎక్కవు. పౌరాణికాలయితే బావుంటుంది."
"ఏదో నా తృప్తికోసం" బాబాయి లేస్తూ - అన్నాడు.
"మొదటిరోజు యింతకన్నా ఎక్కువ అనవసరం" అని నావైపుచూస్తూ "నీకు మొదటిసారైనా బాగా చేస్తున్నావు. వాచికం బావుంది" అన్నాడు.
వాచికం అంటే నాకు తెలీదు, అసలు ఈ నాటకాలంటేనే నా కిష్టం లేదు. బాబాయి బలవంతం మీదే ఒప్పుకున్నాను. మొహమాటం కోసం నవ్వి నేనూ లేచేను.
బయటకి వచ్చాక, చుట్టూ చూసి "మనం చాలా గట్టిగా అరిచినట్టున్నాం పక్కవాళ్ళు చూడు, ఎలా చూస్తున్నారో" అన్నాడు. తల తిప్పి చూసేను. కిటికీల్లోంచి, గుమ్మాల్లోనూ నిలబడి పిల్లలూ, పెద్దలూ మమ్మల్నే విచిత్రంగా చూస్తూ వున్నారు.
నవ్వి "రేపట్నుంచి మా అడితిలోనే చేద్దాం ప్రాక్టీసు" చెప్పాడు. తలూపేను.
* * *
ఇంటికొచ్చి పడుకొన్నాను. రాత్రి పదయివుంటుంది. అప్పటికి వెన్నెల విరగకాస్తోంది. నక్షత్రాలవైపే చూస్తూ తలక్రింద చేతులు పెట్టుకున్నాను. పార్వతి ఆలోచనలు నన్ను చుట్టుముట్టినయ్. వాటితోనే మాగన్నుగా నిద్రపట్టింది.
"కృష్ణా, కృష్ణా" బాబాయి తట్టి లేపటంతో మెలకువ వచ్చింది.
"ఏమైంది బాబాయ్?" లేస్తూ అడిగాను.
"పార్వతిని పాము కరిచిందట్రా - తొందరగా- బయలుదేరు-" కంగారుగా చెప్పాడు.
సన్నటి కేక నా నోటిలోనుంచి బయటకు రాబోయి, గుండెల్లోనే ఆగిపోయింది. ఒక్క గెంతులో లేచి చెప్పు లేసుకొని వెనుక బాబాయి వస్తున్నాడా లేదా అనైనా చూసుకోకుండా పరుగెత్తాను.
పార్వతి ఇల్లు మూడు నిమిషాల్లో చేరుకొన్నాను. నా నుదుటిమీద స్వేదబిందువులు, ఆయాసంతో రొప్పుతూ తలుపులు తట్టాను. నెమ్మదిగా వాటంతట అవే తెరుచుకున్నాయి తెరుచుకొంటున్నప్పుడు తలుపుకు ఆనుకొన్న గునపం క్రింద పడింది. తీసి పక్కన పెట్టాను.
ఇల్లంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా వుంది.
నా మనసు కీడును శంకించింది.
ఆలస్యంగా వచ్చేనా?
ఈ ఆలోచన వచ్చేసరికి వణికిపోయేను. ఏదీ పార్వతీ? ఎక్కడికి తీసుకెళ్ళేరు?
నాలో ఆందోళన ఎక్కువ కాసాగింది. ఆలోచన్లతోనే పక్కగదిలో అడుగుపెట్టాను అంతే.
వెయ్యి ఓల్టుల విద్యుద్ఘాతం తగిలినట్టు విశ్చేష్టుడి నయ్యేను. నోటి వెంట మాట రాలేదు.
ఎదురుగా కుర్చీలో పార్వతి తండ్రి ముందుకు వాలిపోయి వున్నాడు. తల వెనుకభాగం పగిలి నుజ్జు అయిపోయి వుంది. చటుక్కున వెనక్కి తిరిగేను. క్షణం ఆలస్యం అయింది. అప్పటికే తలుపులు మూసుకున్నాయి. బలంగా పట్టుకొని లాగేను.
కిటికీలోంచి లక్ష్మీనారాయణ మొహం కనిపించింది. నా దవడ కండరాలు ఆవేశంతో బిగుసుకున్నాయి. "నారాయణా" అరిచేను. పక్కకి తప్పుకొన్నాడు.
బైట్నుంచి బాబాయి కంఠం రహస్యం చెపుతున్నట్టు వినిపించింది.
"గుమ్మం పక్కనే గునపం వుంది. తలుపులు పగలగొట్టుకొని వచ్చెయ్యి" చాలా నెమ్మదిగా నా ఒక్కడికే వినిపించేలా అన్నాడు. నాలో విచక్షణాజ్ఞానం పూర్తిగా నశించింది. గునపాన్ని రెండు చేతులతో పట్టుకొని విసురుగా తలుపులమీదకి ఎత్తేను. అంతలో అవే నెమ్మదిగా తెరుచుకొన్నాయి.
బైట పోలీసు ఇనస్పెక్టరు నిల్చొని వున్నాడు. అతడిని చూస్తూనే నా ఆవేశం చప్పున జారిపోయింది. గునపం చప్పున జారిపోయింది. గునపం క్రింద పడిపోయింది. చేతులకు అంటిన జిగటలాటి రక్తం మాత్రం మిగిలిపోయింది.
