మరో మాటరా! అబ్బాయ్, ఇందులో బలవంతం ఏ మాత్రం లేదు. నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సుమా!"
చదువుతున్న ఉత్తరం చేజారిపోయింది. "నచ్చడం ఏమిటి నాన్నగారూ! పిచ్చెక్కిపోతెనూ! అనుకున్నాడు పిచ్చిగా.
లేచి రెండు గ్లాసుల నీళ్ళు తాగి ఫాన్ వేసుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడు. పట్టారానంత ఆనందంగా ఉంది అతనికి ఉద్యోగం కోసం వెళ్ళడం, శ్యామ్ సుందర్ తో పరిచయం, ఆ ఉద్యోగం రావడం, హొటల్ కి వెళ్ళడం, చిట్టిబాబు రావడం ఎంత వేగంగా జరిగిపోయాయి?
ఇక ఆ తరువాత జరిగిన విషయం నిజంగా విచిత్రాతి విచిత్రం. రోడ్ మీద, కనిపించిన అమ్మాయిని పలకరించమని చిట్టిబాబు అనడం అలాగే అని, పందెం కట్టి శ్యామ్ వెళ్తుంటే చిరాకు అనిపించింది తనకి. అతన్ని వారించి చివాట్లు వెయ్యాలనిపించింది.
కానీ చిట్టిబాబుని చూసి నోరు మూసుకుని ఊరుకోవాల్సివచ్చింది. ఆ ఊరుకోవడమే తన పాలిట వరం అయింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, నాన్నగారి పాత ఫ్రెండ్ నారాయణమూర్తి మామయ్య కూతురు. ఇంకా చెప్పాలంటే!........ఛీ పాడు సిగ్గేస్తుంది.
నిజం తెలియగానే తల తిరిగి పోయింది. మరుక్షణం మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తక్షణం దాన్ని అమల్లో పెట్టాడు . తెల్లబోయిన వాళ్ళ మొహాలు చూస్తుంటే నవ్వొచ్చింది. ఖంగు తిన్నారు ఇద్దరూ. వెర్రిమేళాలు నిజం ఏమిటో వాళ్ళకేం తెలుసు? ఇదేదో ఘనకార్యం అని భావించి పెద్ద పందెం కాశాడు చిట్టిబాబు.
అసలు యిదంతా తన అదృష్టం అంతే, అసలు నాన్నగారి ఉత్తరం చదివాక అదంతా చాదస్తంగా అనిపించింది. ముక్కు మొఖం తెలీని వాళ్ళింటికి ఏం వెళ్తాం అనిపించి వెళ్ళలేదు.
ఇక ఆలస్యం చెయ్యకూడదు. రేపే వెళ్ళాలి. దీపిక కూడా తనంటే ఇష్టపడుతుంది. తను అందంగానే ఉంటాడు. నా బిడ్డ దొరబాటు అంటుంది అమ్మ. అంతదాకా ఎందుకూ కాలేజీలో ఓ సారి డ్రామాలో హీరో వేషం వేస్తె సీనియర్ రాధారాణి, మోహన్ యు ఆర్ లుకింగ్ హేండ్ సమ్ అందీ అంటే ఖచ్చితంగా అందగాడి కిందే లెక్క.
తప్పకుండా అంగీకరిస్తుంది దీపిక. దీపిక, అబ్బ ఆ పేరే మధురం, రూపం అతి మధురం, ప్రతికదలికా మధురాతి మధురం. మరి మాట యింకెంత మధురంగా ఉంటుందో!
ఎలాగైతేనేం అతికష్టంమీద తెల్లవారింది. షేవ్ చేసుకుని స్నానం చేసి సూట్ కేస్ ముందేసుకుని కూర్చున్నాడు. బట్టల సెలక్షన్ ఓ పట్టాన తెమల్లేదు.
మంచిడ్రస్ వేసుకుని టిప్ టాప్ గా వెళ్ళి పరామర్శ చెయ్యడం బాగుండదేమో అని సంశయం, మామూలు బట్టలు వేసుకెళ్తే ఏబ్రాసిలా ఉంటానేమో అని అనుమానం. చివరికెలాగైతేనేం అటూ ఇటూ కానీ మధ్యరకంవి ఎంచుకుని తయారైపోయాడు. రూమ్ లాక్ చేసి రోడ్డుమీద పడ్డాడు. వెళ్ళేది కాబోయే మామగారింటికే కాబట్టి కాఫీ ఫలహారాల మాట తలపెట్టాలేదు.
రిక్షా మాట్లాడుకుని అందులో ఎక్కి కూర్చున్నాడు. గమ్యం చేరింది రిక్షా. "ఇల్లెక్కడ?" అడిగాడు రిక్షావాడు, నే వెతుక్కుంటాలే అని చెప్పి డబ్బులిచ్చేసి వెతకడం మొదలు పెట్టాడు మోహన్.
అందర్నీ అడిగి అటూ యిటూ తిరిగి ఎలాగైతేనేం అరగంట తరువాత కనిపెట్టగలిగాడు. గేటు, గేటు మీద నేమ్ ప్లేటు, యిదే, యిదే తన గమ్యం. దడదడలాడే గుండెతో గేటు తీసుకుని తడబడే అడుగులతో లోపలికి వెళ్ళాడు.
చిన్న డాబా యిల్లు అది, శుభ్రంగా ఉంది. ముందు ఖాళీ స్థలం, పూల మొక్కలు, వరండా, వరండాలో పడక్కుర్చీ, దానిలో తెల్లబట్టలు ధరించి ఆసీసులై ఉన్న నారాయణమూర్తిగారు గేటు శబ్దం విని తల ఎత్తి చూశారు. "నమస్కారం మామయ్యా!" వినయంగా చేతులు జోడించాడు మోహన్. ఎగాదిగా చూశారు ఆయన, ఒక్కక్షణం తరువాత పలకరింపుగా నవ్వారు కుర్చీ చూపించారు. అందులో కూర్చున్నాడు ఒక్కక్షణం మౌనంగా కూర్చుని.
"మావయ్యా! అత్తయ్య మరణించడం యెంత దురదృష్టం?" తండ్రి ఆదేశించిన ప్రకారం ముందస్దుగా పరామర్శ మొదలుపెట్టాడు.
కళ్ళజోడు తీసి పక్కన పెట్టి బరువుగా నిట్టూర్చాడు ఆయన. "ఏం చేస్తాం నాయనా జాతస్యహి ధ్రువం మృత్యు పుట్టిన వాళ్ళు గిట్టక మాన్తారా! అందరం ఎదోనాడు వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే" అన్నారు భారంగా.
"ఆ విషయం వినగానే తలమీద పిడుగుపడినట్లు అయిందది మాకు?" అన్నాడు మోహన్ మరింత భారంగా.
"కాదు మరీ, అయినా పోయిందేమో విముక్తి పొందింది. శక్తి ఉన్నన్నాళ్ళు చాకిరీ చేసింది జబ్బు చేసిమంచాన పడి నరకయాతన అనుభవించింది పాపం!" అన్నాడు నారాయణమూర్తి గారు.
ఓర్పు నశించిపోతోంది మోహన్ కి, పరామర్శలు చాలు దీపికని పిల్చి తనకు పరిచయం చేస్తే బాగుండు అనిపించింది. అందుకే సంభాషణ ముగించే ప్రయత్నం చేస్తూ__
"ఏమైనా మీకు జరిగిన నష్టం భరించరానిది మీరు గుండె రాయి చేసుకోవాలి" అన్నాడు.
తెల్లబోయాడు నారాయణమూర్తి "అఘోరించినట్లు ఉంది. నాకు నష్టం జరగడం ఏమిటి మధ్యలో? నేను గుండెరాయి చేసుకోడం యెందుకూ?" అన్నాడు అసహనంగా.
ఈ సారి తెల్లబోవడం మోహన్ వంతు అయింది. "అదేమిటి మామయ్యా అత్తయ్య అలా అర్ధాంతరంగా పోతే మీకు గాక మరెవరికి నష్టం?" సూటిగా ప్రశ్నించాడు.
"అదే నేనూ అడుగుతున్నాను. మీ అత్తయ్యపోతే నాకేం నష్టం?" సూటిగా యెదురు ప్రశ్న వేశాడు ఆయన. "నువ్వు హనుమాయమ్మ మేనల్లుడివి కదూ!" అని కూడా ప్రశ్నించాడు.
మోహన్ కి చిరాకు వేసింది చిరాగ్గా చూశాడు ఆయనక్కూడా చిరాకు వేసింది. యింతలోనే ఏదో ఆలోచన వచ్చింది.
"చూడబ్బాయ్, హనుమాయమ్మా మా యింటికి వస్తూ పోతూ ఉండేది కాబట్టి యిత్తడి బిందే, నీళ్ళకాగూ మా ఇంట్లో పెట్టిపోయింది నువ్వేమైనా నేను దాచుకుంటానని పొరబాటు పడ్డాడేమో మీ నాన్నా, అంత ఖర్మ నాకేం వచ్చిదయ్యా!" అన్నాడు విసురుగా.
మరింత చిరాకువేసింది మోహన్ కి. ఏమిటో ఆయనసోద, అర్ధం పర్ధంలేని వాగుడు. ఏంటో హనుమాయమ్మట. యిత్తడి బిందెట, యిక ఆ సోద ఆపి కూతుర్ని పిలిచిపరిచయం చేస్తే బాగుండు అనిపించింది. అంతలోనే జాలి కూడా వేసింది పాపం అర్ధంతరంగా భార్య కాస్తా పోయే సరికి అస్తవ్యస్తావ పడ్డాడు అనుకున్నాడు. మెల్లిగా నచ్చచెప్ప వూనుకున్నాడు.
"మీరు పొరబాటు పడుతున్నారు మామయ్యా, నేను హనుమాయమ్మ మేనల్లుడిని కాదు కంకిపాడు విశ్వనాధంగారి అబ్బాయిని, యిక్కడే ఉద్యోగం అయింది నాకు. మీ భార్య పోయారని తెలిసి నాన్నగారు చాలా బాధపడ్డారు. ముందు నన్ను వెళ్ళమన్నారు ఆయన తారువాత వస్తారు జరిగింది ఏదో జరిగింది. బాధపడకండి వీలైనంత తొందరగా ముహూర్తం చూసేసి అమ్మాయి పెళ్ళి చేసెయ్యండి. యిక ఆ మీద నిశ్చింతంగా కూర్చోండి" లోపలినుంచి ఏదో అలికిడి అయితే ఆశగా తొంగి చూస్తూ చెప్పుకుపోతున్న మోహన్ నారాయణమూర్తి హఠాత్తుగా లేచి నిలబడటంతో తనూ లేచాడు.
"కర్రేది? నా చేతికర్రేది? ఆవేశంగా వెతుక్కోసాగాడు నారాయణమూర్తి.
అటూ యిటూ చూసి కుర్చీకింద పడున్న చేతికర్ర తీసి వినయంగా అందించాడు మోహన్. విసురుగా కర్ర లాక్కుని____
"ఎవడ్రా? ఎవడ్రా నువ్వు, ఎంతధైర్యం నీకు? ఇంటి మీదికొచ్చి ఆవాకులూ చెవాకులూ వాగుతావా? చూడు నిన్నేం చేస్తానో!" అంటూ కర్రెత్తి యుద్దానికి బయలుదేరాడు నారాయణమూర్తి.
తత్తరపోయాడు మోహన్. "మామయ్యా!" అన్నాడు కంగారుగా. మళ్ళీ అదే కూత, పళ్ళు రాలగోడతాను" అన్నారాయన.
పంచెయెగగట్టి కర్రపుచ్చుకుని మీదికి వస్తున్నా ఆయన్ని చూసి అప్రయత్నంగా పక్కకి తప్పుకుని పరిగెట్టాడు.
"నన్ను తప్పించుకోవడం నీ తరం కాదురోయ్, కాళ్ళు విరిచేస్తా!" వెంటపడ్డాయన. ఆయన్ని తప్పించుకునే ప్రయత్నంలో కాలుజారి వరండాలోంచి కిందపడి నాలుగు మల్లెమొక్కలను విరిచేసి మళ్ళీ లేచి గేటువైపు పరిగెట్టాడు మోహన్.
గేటు దగ్గరకు వెళ్ళేసరికి యెదురుగా వస్తుంది వర్ధనమ్మ . కిందా మీదా చూసుకోకుండా పరిగెట్టుకోస్తూ ఆవిడకి డేష్ యిచ్చాడు.
ఆవిడ చేతిలోని బుట్టకాస్తా కిందపడిపోయింది. "అయ్యో అనుకుంటూ వంగి కొబ్బరిచిప్ప పూలు ఏర సాగింది ఆవిడ.
అరెరె అంటూ ఆవిడకి సాయం చెయ్యబోయిన మోహన్, వెనకాల రేసుగుర్రంలా పరిగెట్టుకుని వస్తున్న నారాయణమూర్తిగారిని చూసి ఆ ప్రయత్నం వింమించుకుని గేటులోంచి బయటికి దూసుకుపోయాడు.
ప్రసాదం ఏరుకుని తలఎత్తిన వర్ధనమ్మకి యెదురుగా పంచె యెగకట్టి కర్రచేతి పుచ్చుకుని ఉగ్రనరసింహావతారం యెత్తి పరిగెత్తుకువస్తున్న భర్త కనిపించేసరికి కంగారు వేసింది.
"అయ్యో! అయ్యో! ఏమిటిది? ఆ పరుగేమిటి? ఏమిటీ అన్యాయం?" పట్టుకుని ఆపేసింది.
ఏదో చెప్పబోయి ఆయానం వల్ల చెప్పలేక రోప్పడం మొదలు పెట్టాడు ఆయన. కంగారుగా లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి వెళ్ళి రోప్పడం మొదలు పెట్టాడు ఆయన ఆయన పక్కనే కూర్చుంది ఆవిడ.
"శ్రీరామ చంద్రప్రభో! చచ్చిపోతున్నాను ఈ మనిషితో రాన్రామా కుర్ర చేష్టలు ఎక్కువై పోతున్నాయి. వారం రోజులుగా తంటాలు పడుతున్నారు ఆ బ్లడ్ ప్రషర్ తో, ఈ వూటే కాస్త తగ్గింది కదా అని ఆనందపడ్డాను. అలా దేవుడి దర్శనం చేసుకొద్దామని వెళ్ళి అరగంట కాలేదు. తిరిగిగొచ్చేసరికి ఇదీ దృశ్యం, మళ్ళీ మొదటికి తెచ్చుకున్నారు" విసుక్కుంది.
మళ్ళీ ఆయాసం వచ్చేసింది ఆయనకి. ఆవేశంగా జరిగింది చెప్పేశాడు. కళ్ళముందు శ్రీమహాలక్ష్మిలా కనబడుతున్న భార్యను చూస్తూ ఉంటే మరింత దుఃఖం కోపం వచ్చింది ఆయనకీ.
"వెధవ పారిపోయాడు. కానీలే. ఏదో నాడు దొరక్కపోడు అప్పుడు చూపిస్తా నా తడాఖా, యెముకలు విరగ్గొట్టి నున్నం వేయిస్తా!" అన్నాడు ఆయన పడిపోతూ, కాసేపు ఆయన దగ్గరే కూర్చుని ఆయనకు నిద్రపట్టాక లేచి లోపలికి వెళ్ళింది.
