"స్మేల్లర్ ఆ తాళాన్ని తాకావంటే ఒరిగి పక్కనున్న దానిలో పడిపోతావ్! జాగ్రత్త! తాళాన్ని తాకితే నువ్వు నిలబడి ఉన్న నేల పైకి లేచి పోతుంది. నువ్వు పడిపోతావ్! వద్దు."
ఆ మాటలు విని అనుమానంగా చూస్తూ అయిష్టంగానే వెనక్కి వచ్చాడు స్మేల్లర్. అటూ ఇటూ కలియచూసి ఒక పెద్ద రాతిని తీసుకువచ్చాడు.
"ఏమిటి" ఏం చేస్తున్నావ్!" అన్నాడు బ్రహ్మచారి ఆదుర్దాగా .
"ఆ తాళాన్ని తాకితే నిజంగా ఏమవుతుందో మనకి తెలియదు. దాన్ని ఇక్కడ నుంచే ఈ రాయితో కొట్టి చూస్తాడు. దీని బండారం బయట పడుతుంది." అన్నాడు స్మేల్లర్.
అతనామాట అనగానే ఆకాశం పగిలినంత పెద్దగా ఊరుము ఊరిమింది. ఫేళ పెళార్భాటాలతో మెరుపులు మెరిశాయి.
కొద్ది క్షణాల పాటు ఆ రాతికోట, రత్నాలతో తాపడం చేసినట్లు ధగధగ మెరిసిపోయింది.
"తొందరపడకు స్మేల్లర్" అన్నాడు బ్రహ్మచారి హెచ్చరిస్తూ. "కోటలో నిధి ఉందో లేదో మనకి తెలియదు గానీ భైరవుడి కోట ఒకటి అలా ఉందని తేలింది. ఆ కోటకి రాతి దర్వాజా ఉంది. దానికి రాతి తాళం ఉంది. ఇవన్నీ నిజమే అని తెలిపోయాయిగా అదిచాలు. ఇలాంటివే మన సంస్కృతీకి స్మృతి చిహ్నాలు.నిధి కోసం ఆశపడి వీటిని ధ్వంసం చెయ్యడం క్షమించరాని నేరం! వద్దు" అన్నాడు.
అసహనంగా చూశాడు స్మేల్లర్.
"ఈ మార్గంలో మనం వెళ్ళలేకపోతే , కోటలోకి మరేదో మార్గం ఉండకపోదు. చూద్దాం" అని భుజానికి వెళ్ళాడుతున్న సంచిలో నుంచి ఒక కవరు తీశాడు బ్రహ్మచారి.
అందులో ఉంది ఒక కార్డు సైజు రాగి రేకు. రేకు మీద లక్ష్మి బొమ్మ చెక్కి ఉంది. దాని కింద అక్షరాలు కనబడుతున్నాయి.
రేకుని కళ్ళకి దగ్గరగా పెట్టుకుని పెద్దగా చదవడం మొదలెట్టాడు బ్రహ్మచారి.
"పాపాగ్ని తీర ప్రాంతమున ప్రసన్నాంజనేయస్వామి కలడు. ఆయనకు ఉత్తర దిక్కుగా ఐదు అమ్ముల దూరం వెళ్ళిన ప్రాగ్ధిశాగా తిరిగిన ముక్త్యాలేశ్వరుడు కలడు. ఆయనకి ఎదురుగా భైరవుడు కలడు. ఎడమ చేతిని నడుము పైన ఉంచి కుడి చేతిన కత్తి ధరించి నేలచూపులు చూస్తున్న భైరవుని ఎదురుగా పద్మము కలదు. పద్మము బొడ్డును కుడి నుంచి ఎడమకు తిప్పిన భైరవుని శిరమున శృంగము వెలువడును. తదుపరి సాధకుడు భైరవుని సాష్టాంగ పరచవలెను. వెనకనున్న రాతి పలకలు తప్పుకుని మార్గము ఏర్పరుచును. ఇరవై ఒక్క పురుష ప్రమాణములు దిగిన తరుపరి మూడు వందల ఎనభై గజములు సోరంగపు దారి, బహు జాగ్రత్త. ఆ పిమ్మట జలమార్గమేర్పడి సాధకుని ఏమార్చగలదు. అచ్చట ఒక్కొక్కటి అరువది నాలుగు వేల వరహాల ఖరీదు చేయు పచ్చలు కొన్ని కలవు. సాధకుడు సాహసవంతుడు స్వయం నిర్ణయం తీసుకునేది'
అక్కడదాకా చదివి "అదిగో పాపాగ్ని" అన్నాడు బ్రహ్మచారి కొండకి రెండో వైపున చూపిస్తూ.
కొండ కిందగా గాజు పురుగు ఒకటి చుట్ట చుట్టుకు పడుకున్నట్లు అర్ధ చంద్రాకారంలో ఎర్రగా కనబడుతోంది పాపాగ్ని నది.
"ఆ నది దాటి కోట వెనక్కి వెళితే అక్కడ నుంచి ఇంకేదన్నా దారి ఉందేమో తెలుస్తుంది." అన్నాడు బ్రహ్మచారి.
అందరూ మెల్లిగా కొండ రెండో వైపుకి దిగారు.
పాపాగ్ని నది రక్తం లాంటి ఎర్రటి బురద నీళ్ళతో నిండి ప్రవహిస్తోంది వడివడిగా.
దాని లోతు ఎంత ఉందొ తెలియదు. కొద్దిసేపు నదివైపు చూసి "ఇక్కడున్న అందరికీ ఈత వచ్చనుకుంటాను" అన్నాడు బ్రహ్మచారి.
అందరూ తలలు ఊపారు,
"అయితే ఇంకేం పదండి." అన్నాడు బ్రహ్మచారి. అందరూ నదిలోకి దిగారు.
ఎక్కువ లోతు లేదు నది. సగం దూరం నడిచినా ఇంకా మోకాళ్ళు దాటి రాలేదు నీళ్ళు నది ఒడ్డున ఉన్న ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు తాలూకు కొమ్మలు నది మధ్య దాకా వ్యాపించి ఉన్నాయి.
ఆ కొమ్మల మీద ఆడుతోంది ఒక కోతిపిల్ల. బాగా నీళ్ళ మీదకి ఒంగిపోయి ఉన్నాయి కొమ్మలు. ఆ కొమ్మల మీద నుంచి నీళ్ళలోకి చేతులు పెట్టి తపతపా కొడుతుంది కోతిపిల్ల.
దాని చేష్టలను చూసి నవ్వుకుంటూ ముందుకు నడిచారు.
అప్పుడు జరిగింది అది!
హటాత్తుగా కీచుమని అరిచింది కోతిపిల్ల. మరుక్షణంలో పెద్ద దుంగలాంటి ఆకారం నీళ్ళలో నుంచి వేగంగా పైకి లేచింది. మరుక్షణంలో ఆ ఆకారం, కోతిపిల్లా, రెండు మాయమైపోయాయి నీళ్ళలో.
"అమ్మో మొసలి" అన్నాడు దుర్గయ్య భయంతో నీలుక్కుపోయి.
ఆ మాట వినగానే అందరూ మంత్రం వేసినట్లు అక్కడే ఆగిపోయారు.
"మొసలె! అయితే వెనక్కి వెళ్లిపోదాం" అన్నాడు స్మెల్లర్ వణికిపోతూ.
