"ఊరికే అంటే సరిపోదు" అన్నదామె. ఎంతో కాలంగా ఎదురు చూచిన అవకాశం వచ్చినందుకు పొంగిపోయినాడు జయకృష్ణ. ఒకనాడు బూరుగుచెట్టు కొమ్మమీద అనుకోని విధంగా తన పెదవులతో చెంపలు తాకి అదేమంటే ఆడవాళ్ళ గురించి, వాళ్ళ చొరవ, తెలివి వగైరాల గురించి గొప్ప గంభీరమయిన ఉపన్యాసం ఇచ్చింది జ్యోతి.
ఈ పూట అటువంటి అవకాశం తనకు వచ్చింది.
వెంటనే జయకృష్ణ ఆమె చేయి పుచ్చుకుని తన బలాన్ని రవంత సున్నితంగానే ప్రయోగించాడు. ఉత్తర క్షణంలో జ్యోతి అతని ఒడిలో వాలిపోయింది.
అతడు చివాలున వొంగి ఆమె చెంపల్ని పెదవులతో స్పృశించాడు. ఆ ప్రయత్నంలో అతడు మరికొంత పురోగామించాడు. దాంతో ఉక్కిరిబిక్కిరి అయిపొయింది జ్యోతి.
ఆ గుడ్డి వెన్నెలలో జయకృష్ణకు కన్పించలేదు కాని, ఆమె చెంపలు అరుణాంచితమయినాయి. పెదవులు అదిరాయి. కళ్ళు సిగ్గు బరువుతో క్రిందికి వాలాయి.
విశాలమయిన నుదురు మీద రవంత చిరుచెమట క్రమ్మింది.
అపూర్వమయిన అందచందాలను , అరుదైన కంఠ మాధుర్యాన్ని జన్మత వరాలుగా పొందిన జ్యోతి అలా తన వొడిలో వివశురాలై పడి వున్న క్షణాలు జయకృష్ణకు ఎంతో స్పూర్తినిచ్చాయి.
యౌవనమనేది రంగుల వలలాంటిది! అది ఎంత నిగ్రహం కలిగిన వారినయినా ఎప్పుడో ఒకప్పుడు తనవైపు లాగుతుంది. ఆ క్షణంలో వారి వ్యక్తిత్వాలు మరుగున పడి కాంక్ష ఒక్కటే మిగులుతుంది.
అలాగే అయిపోయినాడు జయకృష్ణ.
ఏకాంత ప్రశాంత సుందరమయిన చోటు అది, నెమ్మదిగా నడచి పోతున్న క్షణాలు. అతని మనసంతా కాంకాపూర్ణమయింది. కోరికలు హృదయస్పందనలను శాసిస్తున్నాయి.
ఎదలో మధుర మృదంగాలు రవళించాయి.
ఊర్పులు దీర్ఘతరాలయినాయి. ఆమె చెంపల మీద పెదవులు తాకించడంతో తృప్తి పడలేకపోయినాడు జయకృష్ణ. ఇంకా ఏదో కావాలన్న ఆరాటంతో అతడు వివశుడయినాడు.
ఆ స్థితిని గమనించి చివాలున లేచి వెళ్ళి దూరంగా నిలబడింది జ్యోతి.
"డియర్ జయకృష్ణా! ఎంటీ తొందరపాటు?" అని అడిగింది. మండుతున్న కొలిమిలో చన్నీరు దిమ్మరించినట్లు అయింది.
వెనుకటి పాఠం ఒకటి ఆమెకే అప్పగించాలని ప్రయత్నించి తానే తొందరపడిపోవటం అతనికి ఎంతో సిగ్గనిపించింది. తన తొందరపాటుని కప్పి పుచ్చుకోవటానికి పురుషాహంకారాన్ని ప్రదర్శించటం తప్ప వేరే మార్గాంతరం అతనికి దొరకలేదు.
"తొందరపడవలసిన అగత్యం నాకేమిటి? ఎప్పుడో ఒకప్పుడు నీవే నా దగ్గరకు పరుగెత్తుకొస్తావు, నన్ను బ్రతిమాలు కుంటావు. వరమీయవలసింది నీవే అయినా అర్ధించకుండానే అది నేను పొందగలను. ప్రయాస పడి నీవే యిచ్చుకోవలసిన మధుర క్షణాలు మరెంతో దూరంలో లేవు" అన్నాడు బింకంగా.
జ్యోతి అతని బుకాయింపు విని పకాలున నవ్వింది.
"మగావాడివయినా మంచివాడ వనిపించుకున్నావు. నిన్ను నమ్మి దగ్గరగా కూర్చునెందుకు నాకిప్పుడటు వంటి అభ్యంతరాలు లేవు. పురుషాధిక్యతను నిరూపించుకోవాలన్న ఉబలాటం వున్నా విశ్వాసపాత్రుడుగా ఉండగలందుకు నీవు చెప్పుకున్న విన్నపాలు నా మనస్సుకి నచ్చాయి. నీవు అర్కేలాజికల్ త్రవ్వకం పనుల కోసం అడవుల్లో, కొండల్లో, భయంకరమయిన ప్రదేశాలలో తిరగగల ధైర్యశాలివి అయితే కావచ్చునేమో కాని, నీకు నచ్చిన నావంటి ఆడదాన్ని మోసగించగల ధైర్యసాహసాలు నీకు లేవు. అడగకుండానే ఆశలు తీర్చుకోవాలనీ అర్ధించకుండానే వరాలుపొందాలనీ, ఆశించావు. కాబట్టి నీ అంతర్యం యెంత నిర్మలమయినదో నా కిప్పుడు అర్ధమయింది. నీకేమిచ్చినా అది నీ మంచితనానికి బహుకృతి కాలేదు" అంటూ అతని దగ్గరగా వచ్చి కూర్చుంది జ్యోతి. మరుక్షణంలో ఆమె బాహువులు పెనవేసుకున్నాయి. ఆమె పెదవులు అతని చెంపల్ని మృదువుగా స్పృశించినాయి.
ఆకాశంలో చందమామతో చుక్కలు దోబూచులడుకుంటున్నాయి. తేలి వచ్చే తెలతెల్లని మేఘశకలాలు అప్పుడప్పుడు అందాల జాబిల్లిని అడ్డుకుంటున్నాయి. వెన్నెల తరంగాలు నేల నాలుగు చెరగులా పరుచుకుపోతున్నాయి.
గాడ నిద్రలో ప్రాచీన స్మృతుల ఉలికిపాటుతో ఆదరిపడి నిద్రలేచిన కోయిల ఎక్కడో కలగా కుహూ అంటోంది. గూటి చిలుకలు నిద్రలోనే ముక్కులు రాచుకుంటున్నాయి.
ఆత్మలు మేల్కొనేటంతా ప్రశాంతమయిన ఆ ప్రకృతి ఒడిలో ఎంత పారవశ్యమో!
స్త్రీ పుంసయోగోద్భవమయిన సృష్టి చైతన్యానికి ఆహ్వానిస్తూఅందాల ప్రకృతి వైతాళిక గీతం ఆలపించి మనసుల్ని మేల్కొల్పు తోంది.
గాలి తరగలు అలలు అలలుగా శరీరాన్ని తాకుతున్నాయి.
ఒకనాటి భయంకర ప్రేత భూమి అయిన రాకసి గుడులు నిక్షిప్తమయివున్న రాతి వలయాల మధ్య కూర్చుని వున్న సంగతి వారువురూ మరచిపోయినారు.
వారి శరీరాలు పెన వేసుకున్నాయి.
మనసులు ముద్దాడుకున్నాయి!!
ఐక్యతా స్పూర్తితో చైతన్యంతో వారి ఆత్మలు అనుసంధానమై రమించినాయి.
పవిత్ర ప్రేమ స్పందనలు ఇచ్చే పారవశ్యంతో తల్లీనులయి ప్రకృతి ఒడిలో పసిపాపల్లా అయినారు వారు.
హృదయ స్పందనలనే కాక మనోభావాలనే కాక, ఆత్మ లోకాలను సైతం ప్రభావితం చేస్తున్న ఆ ప్రేమ పారవశ్యంలో వున్న జ్యోతి ఒక్క ఉదుటున అదరిపడి లేచింది.
విభ్రాంతుడయినాడు జయకృష్ణ.
ఆమె లేచిన అదరుపాటుకు దబ్బున నేలమీద ఏదో పడిన శబ్దమయింది. వెంటనే ఉఫ్ ...... ఊఫఫ్..... మన్న వూత్కారం వినిపించింది.
ఆ వంకకు చూచినాడు జయకృష్ణ. అతని రక్తం గడ్డకట్టినట్లుగా అయింది. జ్యోతి అతని బాహువుల్లో ఒదిగిపోయి భయవిభ్రాంత అయి పోయి చూస్తోంది.
వారు ఊహించ వీలులేనంత పొడవున్న మహాసర్పం ఒకటి నిలువెత్తున లేచి కోపంతో ఊగిపోతోంది. పద్మంలా పడగ విప్పి పగడాల కన్నులతో తరవళ్ళుగా చూస్తోందది.
నాలుకల చీలికలను భయంకరంగా బయటకు లాగి ఈ ప్రకృతి రాగద్వేషాలతో నిండిన ద్వంద్వ ప్రకృతి అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్న దానిలా కన్పించింది.
వారిరువురూ అలాగే బొమ్మలుగా నిలిచిపోవటంతో అది మరియేమీ చేయగలిగింది లేక కోపాన్ని తగ్గించుకుని పడగదింపి తన దారిన పోసాగింది.
జయకృష్ణ కనులముందు సర్పాకృతులతో ఉన్న అమృతాక్షరాలు ప్రత్యక్షమయినాయి. మనసులో మెరుపు మెరిసింది.
