సోఫాలో సాధ్యమైనంత సౌఖ్యంగా కూర్చుని రెండుచేతులూ ఒళ్ళో పెట్టుకున్నాడు.
ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేముందే ముందు జాగ్రత్తగా తనకి తాను చెప్పుకున్నాడు. "నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి నుంచి అయిదు వరకు లేక్కపెట్టగానే ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చేయ్యగలను" అని -
తర్వాత తను కంటి లేవెలుకి కొంచెం పైగా కనబడుతున్న ఒక ప్లవర్ వెజ్ వైపు దీక్షగా చూడడం మొదలెట్టాడు. దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఊపిరి బిగపట్టి మొత్తం శరీరాన్ని అందులోనూ మరీ ముఖ్యంగా చేతులను బిర్ర బిగించేటట్లు చేశాడు. తర్వాత మెల్లగా ఊపిరి వదులుతూ కండరాలను రిలాక్స్ చేశాడు.
ఈ పద్దతి అంతా మరోసారి రిపీట్ చేశాడు.
మూడు వందల సంఖ్య దగ్గర మొదలెట్టి చాలా నిదానంగా వెనక్కి లెక్కపెట్టడం మొదలెట్టాడు. లెక్క పెడుతున్నప్పుడే తనకు తాను చెప్పుకోవడం మొదలెట్టాడు . పాదాలను రిలాక్స్ చెయ్యి. అవి మొద్దుబారిపోతున్నట్లుగా ఊహించుకో. తర్వాత మడమ, పిక్కలు, తొడలు, పిరుదులు, కడుపు, ఛాతీ , చేతులు, భుజాలు, మెడ మొహం.
అక్కడిదాకా వచ్చేసరికి అతని కనురెప్పలు బరువుగా అయిపోయాయి. తల కొంచెం ముందుకు వాలిపోయింది.
అక్కడ లెక్కపెట్టడం ఆపి, తనకు తాను మళ్ళీ చెప్పుకున్నాడు. "నేనిప్పుడు పూర్తిగా రిలాక్స్ అయ్యాను. ట్రాన్స్ లో వున్నాను. ముందుకి పోవడానికి ఇంక సిద్దంగా ఉన్నాను."
తర్వాత రెండో స్టేజి.
తను ఒక లిప్ట్ లో ప్రవేశించి ఒక్కొక్క అంతస్థు దిగిపోతున్నాడు. అక్కడ పోనూ పోనూ చిక్కటి చీకటి. ఏకాంతం. పూర్తీ నిశ్శబ్దం. ఇంకా లోతుకి వెల్వెట్ లాంటి మృదువైన చీకట్లోకి జారిపోయాడు.
పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు నిఖిల్.
ఆ స్థితికి చేరుకున్నాక తనకు తాను మళ్ళీ చెప్పుకున్నాడు.
"నేను ఈ బాధని సహింపగలను. సహిస్తాను. ఇది నాకు చాలెంజ్.
బాధని భరించగలను నేను. నిజంగానే! అవును!"
పదేపదే రిపీట్ చేసుకున్నాడు ఆ పదాలని.
అవి అతని మనస్సులో , సబ్ కాన్షస్ లో గాడంగా నాటుకుపోయాయి.
ఇప్పుడిక ట్రాన్స్ లో నుంచి నెమ్మదిగా బయటకు రావాలి.
మళ్ళీ అనుకోవడం మొదలుపెట్టాడు.
"నేను ఒకటినుంచి ఐదువరకు లెక్క పెట్టేలోగా నేను ట్రాన్స్ లో నుంచి బయటికి వస్తాను. నేను అనుకున్నది అనుకున్నట్లు చెయ్యగలుగుతాను.
ఒకటి. నా శరీరానికి మళ్ళీ పటుత్వం తిరిగివస్తోంది.
రెండు . నా చుట్టూ జనిస్తున్న శబ్ద్గాలు నాకు వినబడుతున్నాయి.
మూడు. నా తల పైకి లేస్తోంది.
నాలుగు. క్రమక్రమంగా జాగ్రదావస్థలోకి వచ్చేస్తున్నాయి నేను.
అయిదు. నేను కళ్ళు తెరుస్తున్నాను చాలా హాయిగా వుంది నాకు."
పూర్తిగా మెలకువలోకి వచ్చేశాడు నిఖిల్.
అతని బాధ తగ్గలేదు. కొలిమిలో ఎర్రగా కాల్చిన గద్దపారను వంచి అతని తలచుట్టు చుట్టినట్లు భగ్గున మండుతోంది గాయం.
కానీ ఆ బాధ ఇప్పుడతనికి పిచ్చెత్తించడం లేదు.
భరించగలుగుతున్నాడు అంత బాధని కూడా.
ఈ సెల్ఫ్ హిప్నోసిస్ ని చాలా నెలలు కష్టపడి ప్రాక్టీస్ చేశాడు అతను ఇదివరకు. అయితే ఇది అటకాదనీ, సరైన గైడెన్స్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెయ్యకూడదని చేస్తే వికటించవచ్చుననీ అతనికి తెలుసు.
మనసు కొద్దిగా కంట్రోలు లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించడం మొదలెట్టాడు.
హధీ తనని ఎందుకు ఎత్తుకొచ్చాడు?
ఏం పని తనతో?
ఆ ఆలోచనల్లోనే ఆరోజు పగలూ, రాత్రి కూడా గడిచిపోయాయి.
మర్నాడు పొద్దున తన భారీ కాయాన్ని మోసుకుంటూ వచ్చాడు హధీ.
"ఎలా వుంది నీ గాయం?" అన్నాడు వ్యంగ్యంగా.
నిఖిల్ మాట్లాడలేదు.
అతని ముందు ఉన్న సోఫాలో కూర్చున్నాడు హాధీ.
"నేనింకా బ్రేక్ ఫాస్ట్ చెయ్యలేదు" అన్నాడు జనాంతికంగా.
వెంటనే అతని సోఫా ముందుకు ఒక ట్రాలీ వచ్చింది. దానిమీద ఒక ట్రే . ట్రే మీద లేసుగుడ్డ.
అది తియ్యగానే బ్రెడ్ రోస్ట్, బాయిల్డ్ ఎగ్స్, కాఫీ , నారింజ రసం ఉన్నాయి.
అమెరికన్ టైపు బ్రేక్ ఫాస్టు.
దానిమీదకి దాడి చేసి క్షణాల్లో దాన్ని మాయం చేశాడు హాదీ.
ఆ తర్వాత ఒక బేసిన్లో ఇడ్లీలు, కారప్పొడీ, దొంతర్లుగా పేర్చిన పెసరట్టు ఉప్మా వచ్చాయి.
సునాయాసంగా అవన్నీ కూడా లాగించేశాడు హధీ.
తర్వాత హటాత్తుగా మొదలెట్టి చెప్పడం మొదలెట్టాడు.
నిఖిల్! కలైమణిని చంపటానికి నువ్వు ఉపయోగించిన ప్లాన్ అద్భుతం! కానీ దాన్లో అందం ఎక్కడ వచ్చిందంటే ఆ ప్లాను చాలా సింపుల్ కూడా! నువ్వు పైకి వస్తావ్ నిఖిల్! పైకి వస్తావు! నాకు బాగా తెలుసు. ఈ ఒక్క సంఘటనతో ఇంటర్నేషనల్ క్రైమ్ వరల్డ్ మొత్తంలో నీ పేరు పాకిపోయింది."
అతన్ని చులకనగా చూస్తున్నాడు నిఖిల్.
