అలా రెంటికీ చెడ్డరేవడినై నాను నేను" అన్నాడు సదానంద్ దిగులుగా.
"అలా ఎందుకు చేశాడు ప్రేమ్ కుమార్?" అన్నాడు ఉదయార్కర్ సాలోచనగా.
వెంటనే సదానంద్ అన్నాడు. "ఈ కధ తెలుసా సార్ మీకు! ఒక కప్పు ఒక నదిని దాటబోతొందిట. అప్పుడు ఒక తేలు తోక తిప్పుకుంటూ వచ్చి "కప్పా! కప్పా! నన్ను కూడా నీ వీపు మీద ఎక్కించుకుని నది దాటించావా?" అని బతిమలాడిందట.
"నిన్నా! అమ్మోవ్! మధ్యలో నన్ను కుడితే. నేను చచ్చూరుకుంటాను" అంది కప్ప.
"అయ్యో! నేను అలా ఎందుకు చేస్తాను కప్పా! నువ్వు మునిగిపొతే నీతో బాటు నేనూ మునిగిపోతాను కదా?" అంది తేలు తెలివిగా.
అవుననిపించింది కప్పకు. తేలుని తన వీపు మీద ఎక్కించుకుని నది ఈదడం మొదలెట్టింది.
సరిగ్గా సగంలోకి వచ్చాక టక్కుమని కప్పని కుట్టింది తేలు.....
కప్పు గిలగిల్లాడి మునిగిపోతూ "ఎంత పనిచేశావ్ తేలా! ఇప్పుడు నాతొ బాటు నువ్వూ చచ్చిపోతావ్ కదా!" అంది బాధగా.
"అవుననుకో? కానీ మరేం చెయ్యను. నేను తేలుని కదా! అందుకని కుట్టేశాను" అని తను కూడా బుడింగున మునుగి చచ్చిపోయింది తేలు.
కుట్టడం తేలుకి సహజం. అలాగే అశాంతి రేకెత్తించడం ప్రేంకుమార్ నైజం! అతనికొక చిత్రమైన మనస్తత్వం ! ఎక్కడైనా ఏదైనా సజావుగా జరిగిపోతుంటే అతను చూస్తూ ఊరుకోలేడు. జోక్యం చేసుకుని అడ్డుపుల్లలు వేస్తాడు." అన్నాడు సదానంద్.
ఏమీ మాట్లాడకుండా వింటున్నాడు ఉదయార్కర్, బ్రహ్మచారి.
"ఇంకొకటి కూడా అయి ఉండవచ్చునండీ!" అన్నాడు సదానంద్.
"ఈగో చాలా ఎక్కువ ప్రేంకుమార్ కి. తన ప్రమేయం లేకుండా ఎవరూ ఏమీ చెయ్యకూడదని ఆతని ఉద్దేశ్యం అనుకుంటాను. అందుకే ఇలాంటి పనులు చేస్తుంటాడు."
"పోన్లే ఎవరి ఖర్మాన వాళ్ళే పోతారు." అన్నాడు బ్రహ్మచారి.
"గురూజీ! నన్ను క్షమించి, నన్ను మళ్ళీ మీలో ఒకడిగా కలిపేసుకోండి! లేకపోతే ఇప్పుడే ఇక్కడే తలపగలగొట్టుకు చచ్చిపోతాను నేను" అన్నాడు సదానంద్ సిన్సియర్ గా.
"నేను నిన్ను ఎప్పుడూ రమ్మని అనలేదు. పోమ్మనీ ఎప్పుడూ అనలేదు. ఎవరి గమ్యం వారు వెతుక్కుంటూ వెళ్ళే సాధువులం మనం అంతా! ఒక్కోసారి మనదారులు కలుస్తాయి. ఒక్కోసారి విడిపోతాయి. దానికి విచారించవలసిన పనిలేదు." అన్నాడు బ్రహ్మచారి చాలా మాములుగా.
అతనికి సజల నయనాలతో నమస్కరించాడు సదానంద్.
మళ్ళీ అందరూ కలిసి నడవడం మొదలెట్టారు.
సాయంత్రం దాకా నడిచిన తర్వాత నీరెండలో వారికి కనబడింది ఒక కొండ.
దాని మీద రేఖా మాత్రంగా కనబడుతోంది ------
రహస్యాలెన్నో తనలో దాచుకున్న ప్రచండ భైరవుడి కోట!
అప్పుడు చెట్ల వెనక అలికిడి ఏదో వినబడింది.
చెట్ల చాటునుంచి అలా అలికిడి వినబడగానే ఉలిక్కిపడి తలలు తిప్పి చూశారు అందరూ.
ఎవరిది? ఎవరు ఉన్నారు అక్కడ!
మనుషులని తినే ఆ గొత్తే జాతి మనిషా!
అలర్టు" అయిపోయారు అందరూ.
అనుమానంగా పొదల చాటుకి వెళ్ళి చూశాడు ఉదయార్కర్. అక్కడ ఎవరూ కనబడలేదు. ఆ అలికిడి మళ్ళీ వినబడలేదు కూడా.
కాసేపు వెదికి వెనక్కి తిరిగి వచ్చేశాడు ఉదయార్కర్.
మళ్ళీ నడవడం మొదలెట్టారు అందరూ. దాదాపు అరగంట నడిచాక చేరుకున్నారు ప్రచండ భైరవుడి కోట ఉన్న ఆ కొండని.
పిచ్చి మొక్కలు విచ్చల విడిగా పెరిగి ఉన్నాయి అక్కడ. లతలు కాళ్ళకి చుట్టుకుంటూ నడకవేగాన్ని చాలా తగ్గించి వేస్తున్నారు. ఎత్తు ఎక్కుతూ ఉండటం వల్ల అందరికీ ఆయాసం వస్తోంది.
కొండ శిఖరం మీద ఉంది కోట. ఆ కోట చుట్టూ పెద్ద రాతి గోడ ఉంది. నాలుగు ఏనుగులు కలిసి ఒకేసారి లోపలికి వేల్లగాలిగినంత పెద్ద రాతి దర్వాజా ఉంది. మెట్టతాబేలు సైజులో ఉన్న రాతి తాళం వెళ్ళాడుతోంది దానికి.
రాతి తాళం! ఎందుకు?
పరీశీలనగా దాని వైపు చూశాడు ఉదయార్కర్.
సో ప్రచండభైరవుడి కోటా, దానికి రాతి దర్వాజా ఆ దర్వాజాకి రాతి తాళం ---ఇవన్నీ నిజమేనన్నమాట! ఇవన్నీ నిజమయినపుడు కోట లోపల నిధి కూడా.........?
ఏమో?
అతని మనసు ఉద్వేగంతో నిండిపోయింది.
నిజానికి దగ్గరగా వచ్చేస్తున్నారు తాము.
ఆపుకోలేని ఉత్సాహంతో దర్వాజా దగ్గరికి వెళ్ళబోయాడు స్మేల్లర్.
అది గమనించి "అగు" అన్నాడు బ్రహ్మచారి పెద్దగా.
వెంటనే ఆగిపోయి తిరిగి చూశాడు స్మేల్లర్.
"ఏం?" అన్నాడు సందేహంగా.
