ప్రొఫెసర్! ఈ రాక్షస గుహల అన్వేషణలో ఇంకా అద్భుతమయిన రహస్యాలు వెలుగులోకి రానున్నాయి. వ్యక్తిగతమయిన విషయాల కోసం కాకపోయినా అందు కోసమయినా నేను మీతో సహకరించాలి. అది నా భాద్యత. ఒక కర్తవ్యంగా భావించి మీతో పాటుగా ఈ యజ్ఞంలో పాల్గొంటాను " ఆన్నడాయన.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి మనసు ఆనంద తరంగిణి అయింది.
క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్ జాప్యం లేకుండా ఏర్పాట్లన్నీ చేయించారు. ఈ విడత తాము వెళ్ళవలసిన చోటు ఎక్కడో వారికి తెలుసు.
అందు నించి సునాయాసంగా అక్కడకు చేరిపోయినారు. జయకృష్ణ, జ్యోతి ప్రొఫెసర్ శ్రద్దాదేవి వెంట ఉన్నారు.
* * *
రాతి వలయాల మధ్య కొన్ని సమాధి గుహలు నేల మాళిగలలో నిక్షిప్తమై వున్నాయి. ఇంత పూర్వమే త్రవ్వకం పనులు కొనసాగించిన శ్వేతకి తాలుకూ రాకాసి గుహ చీకటి గుయ్యారంలా అవుపిస్తోంది. రాతి వలయాలకృతుల మధ్యలో ఒక చదును అయిన చోట చూచి డేరాదింపాడు జయకృష్ణ.
ఈసారి వెంట వచ్చినవారు ఆదిమజనులు కారు. అర్కిలాజికల్ త్రవ్వకాలలో ఇంతకూ మునుపే కొంత అనుభవం కలిగిన వారు. అందరూ అక్కడకు చేరేవేళకు చీకటి పడింది.
ఇంక ఈ రాత్రికి చేయగలిగిన పనులేమీ లేవు. ఆ రాత్రి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనని తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు జయకృష్ణ.
జ్యోతి ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాడు. శ్వేతకి గురించి కాని, త్రవ్వకం గురించి కాని అసలు ప్రస్తావించనేలేదు. చిలుము తిని వేయగా మిగిలిపోయిన ఒకే ఒక తామ్రపత్రాన్ని ఎవరూ చదవలేకపోయినారు. దాని తాలుకూ పోటోస్టాట్ ను అనేక మార్లు అనేక కోణాల నించి ప్రయత్నించాడు జయకృష్ణ. బహుశా దానిలోనే శ్వేతకి దాచిన నిధుల గురించిన సమాచారం వుండి వుండాలి. అది చిలుము తినివేయటం నించి ముందుగా తాను తెలుసుకోలేకపోయినాడు.
జ్యోతి తండ్రి సాధారణమయిన వ్యక్తీ. కాని తాతగారు అసాధారణ మయిన వ్యక్తీ. ఆత్మల గురించి సమాచారం అతనికి తెలుసు. ఆ నిధిని సంపాయించేందుకు అతనికి ఏవో అవరోధాలు ఏర్పడినాయి. వాటిని అతడు అధికమించలేకపోయినాడు.
తనవల్ల కానీ పని తన కుటుంబంలోని ముందు తరాల వారి వల్ల అవుతుందని అతడు ముందుగానే ఊహించాడు. బహుశా అది భవితవ్యం మీది ఆశ కావచ్చు.
కాని ఈ ఫోటో స్టాట్ చదవనిదే అతని ఆశలు తీరవు. ఆ నిధి లభించదు. అందు నించి తామ్రపత్రానికి తీసిన ప్రతిని చదవాలి. అది డేరాలో వుండగా సాధ్యపడదు.
జ్యోతికి ఏవో ప్రేరణలు అందుతున్నాయి. అవి అందినప్పుడు ఆమె వివశురాలవుతోంది. అలాంటి స్థితిలో ఎవరైనా చూచి ఆమెను రక్షించాలి లేదా జ్యోతి మరి దక్కకుండా పోతుంది.
అందునించి ఈ సమయంలో శ్వేతకి గురించిన సంభాషణ డేరాలో రాకూడదు. ఆ జాగ్రత్త తీసుకునేందుకే బ్యాటరీ లైట్ తీసుకుని పోటో స్టాట్స్ తో సహా డేరాకు దూరంగా వెళ్ళిపోయినాడు జయకృష్ణ. అది తుదిసారి ప్రయత్నం.
చిలుముతిన్న భాగాల్ని ఈసారయినా చదువలేకపొతే ఆ నిధి గురించిన సమాచారం రహస్యంగానే వుండిపోతుంది. చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి.
డేరాకు దూరంగా, రాకాసి గుడులు కప్పుపడి వున్న చోట అమర్చిన రాతి వలయాల మధ్య కూర్చుని దీక్షగా వాటిని పరిశీలించటం ప్రారంభించాడు జయకృష్ణ.
అది బ్రహ్మలిపి. అమ్రుతాక్షరాలు సర్పాకృతులవలె కన్పిస్తున్నాయి. సర్పాకృతులకూ, ఆ నిధికి ఏదో సంబంధమున్నదని ఊహించడానికి వీలు అవుతోంది.
జ్యోతి వివరించిన సమాచారాన్ని అనుసరించి కూడా సర్పాకృతులకు సంబంధించిన అంశమే బలీయమౌతోంది. ఆమె నడిపిన లాంచిలో కూడా సరంగులు కూర్చునే పెట్టెకు తలుపుల మీద సర్పాకృతులు న్నాయి. చిలుము తిన్న భాగంలో మిగిలి వున్న అర్ధాన్నమయి పోయిన బ్రాహ్మీలిపి ఉన్న చోట సర్పాకృతులున్నాయి. అవి అమృతాక్షరాలయినా విష సర్పాల వలె కన్పిస్తున్నాయి. అందు నించి ఈ సర్పాకృతులకూ ఆ నిధికి ఏదో బలీయమయిన సంబంధం ఉండి తీరాలని ఊహిస్తున్నాడు జయకృష్ణ.
ఫోటోస్టాట్స్ మీద టార్చి లైటు వేసి తల దింపుకుని వాటిని నిశీతంగా పరిశీలించటంలో మునిగిపోయినాడు.
పరిసరాలాలో అలికిడి అయినా తల ఎత్తగల స్థితిలో అతడు లేడు. పూర్తిగా విషయ పరిశోధనలో తల్లీనుడయినాడు'.
ప్రొఫెసర్ శ్రద్దాదేవికి శరీరక పరిశ్రమ చెయ్యటం అంతగా అలవాటు లేకపోవటం నించి నడుము వాల్చగానే నిద్రపట్టేసింది. ఇంక చేసేందుకేమీ తోచక జయకృష్ణ గురించి అన్వేషించటం ప్రారంభించింది జ్యోతి.
అల్లంత దూరంలో మినుకు మినుకు మంటూ వెలుతురూ చిందిపోవటం కన్పించింది. ఆ వైపుగా నడిచింది. జయకృష్ణ ఫోటోస్టాట్ ల మీద బ్యాటరీ లైట్ ఫోకస్ చేసి ఏదో దీర్ఘంగా చదువుతున్నాడు. అది అతనికి అర్ధం కానట్లుంది. ఆలోచనల్లో తల్లీనుడయినాడు.
జ్యోతి వెనుకగా వెళ్ళి జయకృష్ణ కళ్ళ మీద చేతులు అడ్డుంచింది. ఉలికిపడినాడతడు. "ఓహో నీవా?" అన్నాడు.
"ఏం నేను రాకూడదా?" ప్రక్కనే కూర్చుంది. జయకృష్ణ లైటు తీసివేసి పేపర్స్ ప్రక్కన పెట్టేశాడు. ఇంక వాటిని పరిశీలించమనేది ఆ రాత్రికి ఆయె పని కాదని తేలిపోయింది.
"ప్రొఫెసర్ ని విడిచి వచ్చేశావేమిటి?" అని అడిగాడు.
"ఆమె నిద్రపోతున్నారు. నాకు బోర్ కొడుతోంది" అన్నది జ్యోతి.
"నీవు కూడా నిద్రపోయావనుకున్నాను."
"అందరికీ అన్ని వేళలా నిద్ర పట్టదు."
"అందరి సంగతి అలా వుంచు. ఈవేళ నీకెందుకు నిద్రపట్టలేదో నేను తెలుసుకోవాలి" అన్నాడు జయకృష్ణ.
"నిద్రపట్టకపోవటానికి కారణం నీవే" అన్నది జ్యోతి. జయకృష్ణ ముఖంలో రంగులు మారాయి. కనులు ప్రశ్నార్ధకంగా అయినాయి.
"నేనా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"అవును నీవే!" రెట్టించింది జ్యోతి.
"ఆధారాలు లేకుండానే ఆరోపించగలగటం ఆడవాళ్ళ ప్రత్యేకత అనుకుంటాను." అంటూ నవ్వాడు జయకృష్ణ.
"ఆధారం లేకపోయినా ఆడవాళ్లు ఉండగలరేమో గాని ఆరోపణలు లేని మగవాళ్ళు ఉండరు. అది మీ ప్రత్యేకత" జ్యోతి కవ్వించింది.
జయకృష్ణ రవంత సేపు ఆలోచించాడు.
"ఈ దీనుడు చేసిన నేరమేమిటి?" అని అడిగాడు జాలి గొలిపేలాగ.
"దారి పొడవునా ప్రొఫెసర్ శ్రద్దాదేవిని పొడగటమే సరిపోయింది నీకు" అన్నది జ్యోతి అదొక ఆరోపణలా.
"ఓ అదా నీ సంగతి. ఇటువంటి నేరాలకు శిక్ష ఏమిటి?"
"క్షమాపణలు చెప్పుకోవాలి ."
"పోనీ క్షమించు " అర్ధించాడు జయకృష్ణ.
