Previous Page Next Page 
మారణహోమం పేజి 57

 

    గదికి ఒకవైపు అంతా గోడకి బదులు అద్దమే వుంది. ఆ అద్దంలో నుంచి కనబడుతోంది అందమైన తోట.
    మరోవైపు కూడా అద్దమే వుంది. అటునుంచి కూడా తోట కనబడుతోంది . ఆ తోటలో గార్డెన్ చేయిర్స్ వేసి వున్నాయి. అక్కడే బార్ బి క్యూ పద్దతిలో నిప్పులమీద ఫిష్ కబాబ్ లు కలుస్తున్నాడు తెల్లటి బట్టలతో ఉన్న బట్లరు. అప్పుడప్పుడు ఎవరెవరో వస్తున్నారు. కావలసినవన్నీ కబాబ్ లు తిని ఎస్ ప్రేస్సో కాఫీ తాగి వెళ్ళిపోతున్నారు.
    అది చిన్నగా నవ్వుకున్నాడు నిఖిల్.
    ఇది సైకలాజికల్ వార్! మనసుమీద మారణాయుధాలు ప్రయోగించడం లాంటిదన్నమాట!
    తనతో ఏదో పెద్దపనే ఉంది హాదీకి. బహుశా ఆ పని చెయ్యడానికి తను ఒప్పుకోకపోవచ్చని కూడా ముందే గ్రహించినట్లున్నాడు హధీ! అందుకే ఇంత పకడ్భందీగా ఏర్పాట్లు చేశాడు.
    తను గాయం తగిలి బాధపడుతున్నాడు. దానికి వైద్యం చేయించారు వీళ్ళు. తనని అలానే నరకయాతన పడనిస్తారు. వీళ్ళు చెప్పినట్లు చెయ్యడానికి తయారుగా వుంటే అప్పుడు డాక్టర్ ని పిలిపిస్తారు. రాధకి ఏమైపోతుందోనని తనకు మనసులో ముల్లులా గుచ్చుకుంటూ ఉండడానికి గానూ ఆమెని తనకు దూరంగా ఉంచారు. దానితోడు ప్రత్యెక ఆకర్షణలాగా పైకి చూస్తే స్విమ్మింగ్ పూలూ, అందమైన అమ్మాయిలూ, ఇటు చూస్తే బార్ బిక్యూ ఫిష్ కబాబ్ లు, అటు చూస్తే ఉద్యానవనం స్వేచ్చగా గానం చేస్తూ ఎగిరే పక్షులూ.
    మనుషులకి మాములుగా వుండే బలహీనతలని అన్నింటినీ ఎక్స్ ప్లాయిట్ చేయడలుచుకున్నాడన్నమాట హాధీ!
    శారీరక బాధల నుండి విముక్తి, ఆకలి దప్పికలు తీర్చుకోవాలనే తాపత్రయం, సుఖాల కోసం , స్వేచ్చ కోసం ఆరాటం.
    తలలో మొదలైన బాధ, జవజవమంటూ పాదాలాదాకా పాకుతున్నట్లు అనిపిస్తోంది. క్షణక్షణానికి ఎక్కువవుతోంది భరింపశక్యం కాని బాధ!    
    ఆ బాధ నుంచి మనసు మరల్చుకోవడానికి తోట వైపు చూశాడు నిఖిల్.
    తోటలో ఒకచోట గ్లాస్ హవుస్ లాంటిది వుంది. అందులో కనబడుతున్నాయి చాలా రకాల మొక్కలు.    
    నిజానికవి మొక్కలు కాదు. మహా వృక్షాలు! కానీ మొక్కలకంటే చిన్న సైజులో ఉన్నాయి!
    మర్రి చెట్లు, మోదుగ చెట్లు, టేకు చెట్లు.
    మాములుగా పెరగవలసిన ఆ మహా వృక్షాలనీ మరుగుజ్జుల్లా చిన్న చిన్న పూలకుండీలలో పెరుగుతున్నాయి!
    బోన్ సాయ్!
    మళ్ళీ అతన్ని ఆపాదమస్తకం బాధ వణికింఛివేసింది. గాయం ఆపకుండా సలుపుతోంది.
    ఆ బాధను మర్చిపోవడానికి గానూ, వేరే విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలి.
    అది తన మనసుకి ఇచ్చిన శిక్షణ!
    గ్లాస్ హవుస్ వైపు చూశాడు మళ్ళీ.
    పెద్ద వృక్షాలన్నీ పూలకుండీలలో, బాస్కెట్లలో, పింగాణి పాత్రలలో పెరుగుతున్నాయి.
    ఎవరో మాంత్రికుడి శాపానికి గురయిన మరుగుజ్జులలా మారిన దురదృష్టవంతులలా చిన్నవిగా, పొట్టిగా వున్నాయి అవి. జపనీస్ బోన్ సాయ్ గురించి నిఖిల్ కి బాగా తెలుసు. జపనీయులకి ప్రతిదాన్ని సూక్ష్మరూపంలోకి మార్చడం సరదా! కాదు, హాబీ! కాదు, అది వారి జీవితంలో ఒక భాగం. ఎవరు ఎక్కడ ఏది కనిపెట్టినా వెంటనే దాన్ని మినియేచర్ రూపంలోకి మార్చడానికి ఉబలాటపడతారు జపనీయులు. కెమెరాలు రాగానే అగ్గిపెట్టె సైజులో వుండే కెమెరాలు చేశారు వాళ్ళు. ట్రాన్సిస్టర్స్ రాగానే అతి సూక్మమైన ట్రాన్సిస్టర్ రేడియోలు చేశారు. అలాగే స్టీరియోలు , కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు. ప్రతిదీ చిన్నదిగా ఉంటె తప్ప వాళ్ళకి  తోచదు. ఇప్పుడు లేటెస్టుగా టోక్యోలో కట్టబోతున్న హోటళ్ళలో కూడా ఫుల్ సైజు రూములు ఉండవు. "కాప్యుల్స్" ఉంటాయి. మనిషి పట్టేంత ఒక పెద్ద పెట్టెలాంటిది వుంటుంది. అదే గది! దాన్లోనే ఎయిర్ కండిషనరు , చిన్న టీవి. అంతే సూక్ష్మంలో మోక్షం కావాలి వాళ్ళకి.
    ఆ అలవాటే , జపనీయులు మహా వృక్షాలనీ కూడా మరుగుజ్జుల్లా మార్చడానికి ప్రేరేపించింది.
    బోన్ సాయ్ అనేది ఒక అద్భుతమైన కళ. అది ఒక యజ్ఞం లాంటిది. ప్రేమా, జాగ్రత్తా రెండూ సమపాళ్ళలో రంగరిస్తే బతుకుతాయి ఆ చిన్నసైజు చెట్లు.
    గాయం తాలూకు బాధ తెర ఒకటి మళ్ళీ ఒకసారి శరీరాన్ని కంపింపజేసింది.  
    బాధను మరచిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్. అందుకోసం మళ్ళీ బలవంతంగా ఆలోచనలు మొదలెట్టాడు.
    కిక్కిరిసిపోయి ఉండే జపాన్ లో ఎప్పుడూ దేనికి తగినంత స్థలం ఉండదు. స్థలం కోసం నిరంతరం పడే ఆరాటం వాళ్ళ మనసుల్లోకి ఇంకిపోయి, చివరికి "అందమైనది" అంటే "చిన్నది" అనే అర్ధం చెప్పే స్థితికి వచ్చేశారు వాళ్ళు. వాళ్ళ ఇల్లు చిన్నవిగా ఉంటాయి. వాళ్ళకి ప్రాణప్రదమైన కవిత్వం "హైకూ" లో కేవలం పదిహేడు అక్షరాలూ మాత్రమే ఉన్నాయి.
    మళ్ళీ నొప్పితెర!
    పళ్ళు గిట్టకరిచి పట్టుకున్నాడు నిఖిల్. బాధని తను యింక భరించలేనేమోనని అనిపించింది. శారీరక హింసకు గురి అవడం తనకు యిది మొదటిసారి కాదు బాధను సహించడానికి ఈ శరీరం అలవాటు పడింది. కానీ ఈసారి మాత్రం ఎందుకో ఓర్చుకోలేకపోతున్నాడు. తను మాములుగా ఉపయోగించే మనసు మళ్ళించే మార్గం' ఇప్పుడు పనిచెయ్యడం లేదు.
    ఇంకొక్కటే దారి వుంది.
    సెల్ఫ్ హిప్నిసిస్!
    అందుకని ముందు ట్రాన్స్ లోకి వెళ్ళిపోవాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS