Previous Page Next Page 
యువత నవత పేజి 57

    "నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నరోజుల్లో మా ప్రిన్సిపాల్ గా ఒక లేడీ వుండేది! ఆవిడ పాపిట్లో కుంకుమ లేకుండా కనిపించేదికాదు! శుక్రవారం వచ్చిందంటే కాళ్లకి పసుపు లేకుండా కనిపించేదికాదు. శ్రావణ మాసం రెండో  శుక్రవారం వచ్చిందంటే వ్రతం చేసుకొన్న గుర్తుగా చేతికి తోరంతో, కంఠానికి, చేతులకు గంధపు చారలతో, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో  సాక్షాత్తూ పార్వతీదేవిలా వేంచేసేది!  అంత చదువుకొని, అంత ఉన్నత పదవిలో వున్నావిడకూడా సంప్రదాయాలంటే ఎంత గౌరవం! ఇలాంటి వాళ్లవల్లే యింకా ఈ జాతి గౌరవం నిలబడిందని కామెంట్ చేసే వాళ్లు పెద్దవాళ్లు."

    "అయితే నన్ను అలా తయారవమంటావా?"

    "నేను ఏదీ అనను. ఏదయినా నీ యిష్టం"

    "థాంక్యూ!నిజంగా మీ ప్రిన్సిపాల్ జాతిగౌరవం నిలబెట్టడంకాదు! పోగొడుతూంది" ఆవేశంగా అంది శాలిని.

    "అదేమిటి?"

    "నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ల వూరు వెళ్లే వాళ్లం! ఆ వూరు బాగా పల్లెటూరు. మా అమ్మమ్మ వాళ్లింట్లో లక్ష్మి అనే పనిమనిషి వుండేది. దానియిల్లు మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి దగ్గరే! మేం పిల్లలం ఆడుకొంటూ అటు వెళ్లేవాళ్లం.

    "లక్ష్మి ఇంటిముందు గడపకు ఓ గూడు వుండేది. అందులో ఓ మట్టిముద్ద వుండేది. లక్ష్మి ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఉపవాసంతో వుండి ఆ గూటిని ఎర్రమట్టితో అలికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించేది.

     "అదేం దేవుడు?" అని అడిగానోరోజు.

    "మసెమ్మ" అని చెప్పింది. గూట్లో దీపం వెలిగించినప్పుడు ఎవరినీ అక్కడికి రానిచ్చేదికాదు! ఆ దీపం చూసిన  వాళ్లవెంట ఆ గూటి దావరపడుతుందని  చెప్పి బెదిరించేది. రాముడు, కృష్ముడు ఎంతో అందమైన దేవుళ్లుగా! మట్టిముద్దకు పూజచేస్తావెందుకు? అని అడిగాను "మా యింటి  దేవత ఈయమ్మ! ఈయమ్మని పూజచేస్తే నా పిల్లా పాపలు, ఇల్లు సల్లగుంటరు" అని చెప్పింది. ఇప్పుడు చెప్పు కృష్ణా! దానిది వట్టి అజ్ఞానమా కాదా?"

    "అజ్ఞానమే! లేకపోతే దావర్లు, దెయ్యాలు యేమిటి?వట్టి నాన్సెన్స్!"

    "దానిది అజ్ఞానమని ఈసడించుకొన్నప్పుడు మీ ప్రిన్సిపాల్ ది అజ్ఞానం కాదా? లక్ష్మి  గూటి దావనుకొలిస్తే మీ ప్రిన్సిపాల్ వరలక్ష్మిని కొలుస్తూంది. అది కోడిని కోస్తే, ఈమె టెంకాయ కొడుతూంది లక్ష్మిని కొలిచి సంపదను పొందాలనుకోవడం! చాలామంది చదువుకొంటారుకాని శాస్త్రీయమైన ఆలోచనకు ఎందుకు చోటిస్తున్నారు? ఈ ఆచారం ఎందుకు వచ్చింది? ఈ వ్రతం ఎందుకు చేయాలి? ఈ పూజలు ఎందుకు చేయాలి? ఈ విగ్రహాలకు, రాళ్లకు నైవేద్యాలు ఎందుకు పెట్టాలి? అని ఎందుకాలోచించరు?"

    "మనిషి సెంటిమెంట్ ని ఇష్టపడ్డట్టుగా శాస్త్రీయమైన ఆలోచనను ఇష్టపడడు!"

    "అందుకే మన బ్రతుకులింకా యీ చీకట్లో వుండిపోయాయి. పాశ్చాత్యులు ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్లంత అభ్యుదయం సాధించారు. మనకు స్వంత ఆలోచనంటూ లేక వాళ్లేంచేస్తే అది గొర్రెల్లా చేయడం నేర్చుకొన్నాం."

    "ఒకడు ఒకపిండి బొమ్మచేసి పసుపు కుంకుమలు చల్లి హాం హ్రీం అని ఎవరిమీదో ప్రయోగిస్తుంటే ఓ సంస్కారపరుడు చూశాడనుకో! వీడి మొహం. చేతబడీ, మంత్రాలు ఏమిటి? అంతా మూఢత్వం అంటాడు. అదే ఓ అమ్మవారికి పూజచేయడం చూశాడనుకోండి. భక్తితో చేతులు జోడిస్తాడు. వాడిది మూఢత్వం అనుకొన్నవాడు ఇది మూఢత్వం అని ఎందుకు అనుకోడో నాకు అర్దంకాదు."

    "రాకెట్లలో దూసుకువెళ్లి గ్రహాంతరయానం చేస్తున్నారుకదా, ఇంకా విగ్రహాలకి నైవేద్యాలు పెడుతున్నామంటే ఎంత ఫన్నీ విషయం. పాముల్ని, పుట్టల్ని, నదుల్ని, చెట్లని పూజచేసే ఆటవిక దశలోంచి  మనం ఇంకా బయట పడడంలేదంటే నాకు సిగ్గుగా, భాధగా వుంది."

    "చెప్పాకదా? మనిషి సెంటిమెంట్ ని ఎక్కువ ఇష్టపడతాడని. ఎవరి నమ్మకాలు వాళ్లవని మనం ఊరుకోక చేసేదిలేదు."

    "వాళ్ల నమ్మకాల్లో అజ్ఞానం వున్నప్పుడు, వాళ్ల  అజ్ఞానం వాళ్లనే బలి తీసుకొంటున్నప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్లవని, మనం కొంచెం అజ్ఞానం ఉన్నవాళ్లం ఊరుకోవచ్చా?ఉదాహరణకి మసూచినే తీసికోండి, పోలేరమ్మ అమ్మ పోసిందని, ఆమె కడుపు చల్లనచేస్తే పిల్లలకి చల్లనౌతుందని  ఆ దావరగుళ్లో కల్లు పోయించడం చేస్తుంటారు ఇప్పటికీ పల్లెలో  జనం! అలాంటప్పుడు దేవతకి ముడుపులు కట్టి దండాలు  పెట్టటంకాదు, మసూచి సోకకుండా టీకామందు వేయించుకొమ్మని చెప్పడం విద్యావంతులమైన మనవంతు బాధ్యతకదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS