Previous Page Next Page 
యువత నవత పేజి 56

       

     "మగడు పోయాక ఆడది బ్రతికి  చేసేందుకు  ఏమీ ఉండదా? అదేమిటత్తయ్యా! తనకోసమే బ్రతకొచ్చు. అసలు పిల్లలకి తండ్రిపోతే, తండ్రి ప్రేమకూడా  ఇచ్చి తల్లీ తండ్రీ తానై పెంచగలదు స్త్రీ. తండ్రి మాత్రం తల్లిపోయిన పిల్లలకు తల్లి ప్రేమనుమాత్రం అందివ్వలేడు. ఎందుకో తెలుసా? భార్యపోయిన మరుక్షణంనుండి మరో స్త్రీ కోసం తహతహ మొదలవుతుంది కాబట్టి"

    "ఎంత దారుణంగా మగవాళ్లని  చిత్రిస్తున్నావమ్మా! భార్యపోయిన వాళ్లు పిల్లల కోసం అలాగే వుండిపోయిన సంఘటనలు లేవనే అనుకొంటున్నావా?"

    "ఎక్కడో లక్షల్లో ఒక కేసు. కొంతమంది వయసు పైబడీ, ఈ వయసుకి మళ్లీ పెళ్లికొడుకయితే పిల్ల లేమంటారో, ప్రపంచం ఏం నవ్విపోతుందో అని మడికట్టుకొంటారు వయసులోనే భార్యపోతే యెవరూ భార్యలేకుండానో, మరోవిధంగా స్త్రీ తోడులేకుండానో వుండలేరనే నా నమ్మకం ఆడదిమాత్రం తన పిల్లలమీదే మనస్సంతా నిలుపుకొని బ్రతికేస్తుంది."

    "పెళ్ళాంచస్తే మగాడు మళ్లీ పెళ్లికొడుకు కావడంలేదా? ఆడది మాత్రం ఎందుకు పెళ్లిచేసుకోకూడదు? ఆడదానికోనీతి, మగాడికోనీతి ఎందుకని? నీబోటి  ఆధునిక యువతులు వాళ్ల తరపున పోరాడుతున్నారుగా? మగడ చచ్చిన ప్రతి ఆడదీ మళ్లీ పెళ్లి కూతురయ్యేరోజు తప్పకుండా వస్తుందిలే! ఏం బెంగపడకమ్మా" అన్నారాయన బాధనూ, నవ్వునూ మిళితంచేసి.

   
                                 10


    "ఎటువంటిదాన్ని కోడలిగా తెచ్చావురా ఇంటికి? పాషాండమతం నుండి ఇప్పుడే దిగబడినట్టుంది ఒక దేవుడులేడు, దైవంలేదు, నోములు వ్రతాలులేవు. ముత్తయిదుతనం అంటేనే ఆవిడకు అవహేళన ఇంటిపద్దతులు, ఆచారాలు ఇంటి పెదద్కోడలిద్వారా ముందుతరాలకి అందాలికదా! ఆమెను ఆచారం అంటేనే అరికాలిమంట....." నిన్నటినుండి కోడలి మాటలు తమవాదం అన్నీ చెప్పింది.

    ఏం  కామెంట్ చేయలేదు శర్మ.

    "ఏం మాట్లాడవు? ఆమెకు కాస్త నచ్చచెప్పలేవూ?"

    "ఏం నచ్చచెప్పాలి?"

    "ఇంటి పడికట్లు  తప్పడానికి వీల్లేదని, చదువుకొన్న తెలివి ఇలాంటి ఆచార వ్యవహారాలలో ఒలకబోసే  అవసరంలేదని!"

    "ఎవరి నమ్మకాలు వాళ్లవి ఇలాంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోలేను"

    "ఇది నమ్మకాలకి సంబందించింది కాదు. ఇంట్లో దేవతావిగ్రహాలు సాలగ్రామాలు వున్నాయి. నిత్యనైవేద్యం లేకపోతే ఇంటికి అరిష్టకం చుట్టుకోదూ?"

    "తీసికెళ్లి ఆసాలిగ్రామాల్ని, విగ్రహాల్ని గంగలోపారేస్తాను మీరు పోయాక."

    "నీకు నీ పెళ్లాం నాస్తికమతం బుర్ర కెక్కినట్టుంది. అదేం మాటరా?"

    శర్మ ఇంకేం మాట్లాడలేదు.

    ఆ రాత్రి భార్యతో అన్నాడు "వచ్చే శనివారం నేను బ్రహ్మా విష్ణు మహేశ్వరులి వ్రతం చేయబోతున్నాను."

    "అదేం వ్రతం? క్రొత్తగా వింటున్నాను" శాలిని ఆశ్చర్యం వెలిబుచ్చింది.

    "క్రొత్తగా కనిపెట్టాను.

    "కనిపెట్టారా?"

    "స్త్రీల ముత్తయిదుతనం చల్లగా వుండేందుకు ఒకనాడు మంగళ గౌరీ నోమును స్త్రీలకోసం కనిపెట్టారా? ఈ ఆధునికయుగం అవసరాన్ని అనుసరించి, సతి ఆయువును పెంచే నోములు లేకపోతే ఏం బాగని నేను భార్యల ఆయువును పెంచేందుకు త్రిమూర్తుల వ్రతం కనిపెట్టాను. వచ్చే శనివారం నీ ఆయువునూ, వృద్దినీ కోరుతూ వ్రతం చేయబోతున్నాను."

    "నేను మంగళగౌరీ నోము నోచుకోలేదనా ఈ ఎగతాళి?" శాలిని ఎర్రబడిన ముఖంతో అడిగింది.
 
     "ఎగతాళి కాదోయ్! నిజం"

    "నోములు, వ్రతాలవల్ల సంపద, ఆయువు పెరిగేమాట నిజమే అయితే మనిషి యింతవరకు కుబేరుడై పోయేవాడు. ప్రతిమనిషి మృత్యుంజయుడయేవాడు."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS