"బాద్యత ఉంటే ఉండొచ్చుకాని, దాన్ని భుజాల మీదికెత్తుకొని ఉద్యమించడానికి మనకి తీరికెక్కడుంటుంది చెప్పు? తినడం, పొట్ట తిప్పలకి పరుగులు పెట్టడం, అలసి సొలసి వచ్చామంటే కమ్మగా ఇష్టమైన వాళ్లతో కబుర్లు చెప్పుకోవాలనీ, హాయిగా అలావెళ్లి ఓ సినిమా చూడాలని అనిపిస్తుంది కాని ఇలాంటి విషయాలలో తల దూర్చాలని అనిపించదు."
"నా చుట్టూ ఇంత చీకటి ఉన్నప్పుడు ఈ చీకటిలో ఓ చిన్న దీపం వెలిగించాలని ప్రయత్నిస్తే మీకేమీ అభ్యంతరం వుండదుగా?"
"ఆ పల్లెటూళ్లో, ఆ అజ్ఞానపు మనుషులతో కుస్తీపట్లు పడుతూనే వుందిగా నీ ఫ్రెండు సుధ."
"తను కుస్తీపడితే నావంతు నేను పట్టొద్దా?"
"పట్టు కాని నాకు కాలక్షేపానికి ఓ బుల్లి బాబునో, పాపనో ఇచ్చేస్తే ఇహనీతో నీకు పని వుండదు" శాలినిచుట్టూ చేతులువేసి దగ్గరికి తీసుకొంటూ అన్నాడు శర్మ.
"తన బిడ్డలకు మంచితల్లిగా, ఒక పురుషుడికి మంచి భార్యగా ఒక ఇంటికి మంచి గృహిణిగా జీవించడం మాత్రమే నా ధ్యేయంకాదు. వ్యక్తిత్వమున్న మంచి మనిషిగా బ్రతకాలన్నది నా వాంఛ. నువ్వునాకు సహకరిస్తావనే నా ఆశ."
"తప్పకుండా"
నిజంగా కూడా సుధ ఆరోజు కుస్తీ పట్టినంత పని చేస్తుంది ఒక పల్లెటూళ్లో.
* * * *
హెల్త్ విజిటర్ గా పనిచేస్తున్న సరళతో కలసి ఒక పల్లెటూరికి టూర్ వెడుతూంది సుధ. బస్సుదిగి కబుర్లు చెప్పుకొంటూ నడుస్తున్నారు ఇద్దరూ వూళ్లోకి.
"అబ్బ! ఈ పల్లెటూరి గొఱ్ఱెలతో విసిగపోయానండీ వాళ్లకి తెలియదు!చెబితే వినరు. ఫామిలీ ప్లానింగ్ లో పడడమంత దరిద్రం ఇంకో టుండదని నా నమ్మకం. నెలకిన్ని కేసులని తీసికెళ్లకపోతే ఉద్యోగం ఊడినంత పనవుతుంది. తెద్దామంటే ఆ గొఱ్ఱెలు మన మాట వినవు. పందుల్లా ఏటా పిల్లల్ని కనేయడమంత ఈజీ ఇంకేం లేదన్నట్లుగా కనేస్తుంటారు. పిల్లలు ఎక్కువైతే వాళ్లకి పెద్దగా కష్టంకాదు? చదివించాలన్న బాధలేదు. రెండు మూడేళ్లయితే చేతికి అంది వస్తారని... ఊఁ కనేస్తూ పోతారు."
"చెప్పాల్సిన విధంగా చెబితే వింటారు. సరళా! మనం చెప్పేదాని మీద ఆధారపడి వుంటుంది. నేను మొదట మొదట చెప్పినప్పుడు ఏదో ఈయమ్మ ఆజీతం రాళ్లు తీసుకుంటున్నందుకు చెప్పాలి కాబట్టి చెబుతున్నది అన్నట్టుగా చూసేవాళ్లు! ఇప్పుడిప్పుడు చెవులు వాలుస్తున్నారు. ఆచరణలో పెడుతున్నారు. కొంచెం మంచి ఫలితం కనిపించగానే ప్రక్కవాళ్లకి చెప్పి మరో నలుగురిని ప్రోత్సహిస్తున్నారు" అంది సుధ, ఆశావాదిలా.
"వినండి, బాబూ! ఇవాళనాతోరండి! మీకోకేసు చూపిస్తాను వీళ్లెంత అజ్ఞానంలో వున్నారో, ఎంత గొఱ్రెలో మీరు కళ్లారా చూద్దురు గాని."
సరళ గొల్లవీధికి తీసికెళ్లింది. ఒక పూరింటిముందు ఆగి, లోపలికి వెళ్లి "చూడండి! నేను రెండుకేసులు చూచుకొని వస్తాను"
"ఏమిటో నాకు చూపకుండానే వెడతారా?"
"లోపలికి వెళ్లి చూడండి!మీకే కనిపిస్తుంది"
సుధ గుమ్మం దగ్గరికి వచ్చి తొంగిచూసింది. ముందు గదిలోనే ఒక నడివయసాయన కుక్కి మంచంలో పడుకొనే వున్నాడు. అబ్బా, అమ్మా అని మూలుగుతున్నాడు.
"ఏమైంది తాతా?"
మూలుగుతున్నప్పుడు కళ్లు తెరిచాడు.
"ఎవరమ్మా?"
"నేను వి. డి. వ. ను నీకేమిటి సుస్తీ?"
అతడికి మాట్లాడడానికి ఓపిక లేనట్లుగా లోపలికి వచ్చేశాడు "ఒసే! ఎవరో వచ్చిన్రు సూడు" లోపలినుండి ముప్పైఅయిదేళ్ళ వయసులో వున్న ఒకావిడ వచ్చింది. స్నానంచేసి ఎన్ని రోజులైందో , అంత దూరంలో వుండగానే కంపు కొట్టేస్తూంది. చీరా, జాకెట్ మురికితో, చెమటతో మాసిపోయి, తల, గద్ద గూడులా వుంది.
"ఏందమ్మా సిస్టరమ్మవా?"
నిరంతరం తమలపాకు, పొగాకు నమలడంవల్ల పెదవులు తమ సహజత్వాన్ని కోల్పయాయి. పండ్లు గారపట్టాయి.


