"చిట్టీ తల్లీ! నీవు పరాయివి అని నేనెన్నడూ అనుకోలేదు . దైవం కరుణించి యిచ్చిన తనయవే అనుకున్నాను. నీ బాగోగులు చూడవలసిన బాధ్యత తండ్రిగా నాకుంది.
"మాధవ ధనసంపన్నుల యింటి బిడ్డ. నీవు కేవలం విద్యాసంపన్నుల యింటి అడపడుచువు . అతని నడవడిక తృప్తి కరంగా లేక పోవటం గురించి నేను కొంత విన్నాను.
నీ మనసు మార్చుకోవటం మంచిది తల్లీ" అని పితృహృదయంతో శకుంతలకు సలహా యిచ్చినారు తండ్రి.
నా తల్లి ఎంతగానో బ్రతిమాలి చెప్పింది. ఇద్దరూ నూరిపోశారు. అయినా శంకుంతల యిచ్చిన సమాధానం ఒక్కటే!
"ఏనాడో రాబందుల విందు కావలసిన ఈ అనాధ పిండాన్ని ప్రాణం పోసి నిలిపినారు మీరు. కావలిస్తే ఈ శరీరాన్ని మీకోసం త్యాగం చేయగలను. కాని మనసు మాత్రం మాధవకే యిచ్చి వేశాను. దాన్ని మరలించుకోవటం ఈ శరీరంలో చైతన్యముండగా ఆయె పని కాదు. నాకేదో చెప్పాలని ప్రయత్నించకండి. నాదారిన నన్ను పోనివ్వండి." అన్నది శకుంతల. నా తండ్రి ఆలోచనామగ్నులయినారు.
తరువాత కొద్ది రోజులకే శకుంతల, మాధవ ఇద్దరూ అదృశ్యమయి పోయారు. శకుంతలను మరచిపోయేందుకు ప్రయత్నించాను.
సరిగా సంవత్సరం దాటి పోయాక పలాస నుంచి నాకొక ఉత్తరం వచ్చింది. అప్పటికే నా శకుంతల దురదృష్టవంతురాలయిన తల్లి అయింది. అప్పుడు నేను ఫైనల్ లో ఉన్నాను.
పోస్టుమాన్ తెచ్చి యిచ్చిన ఉత్తరం చదివాను. నా శకుంతల హస్తాక్షారాలవి. జీవితాంతం మరువలేని జ్ఞాపదీపికలు!! "డియర్ శ్రద్దా! దురదృష్టవంతురాలయిన నీ సోదరి నీకింకా జ్ఞాపకం ఉన్నదో, లేదో!! నీవయినా బాగున్నావా! బాగా చదువుకో! నేను చేసింది మబ్బు తునకల మీద సవారీ! నాకు మిగిలింది సప్తకట్ల సవారీ! అర్ధమైందా శ్రద్దా! మరణమే ఈ విషాద కధకు ముగింపు. వంచితురాలనయినాను. ఆయన తన సంపదలనూ, తన బంధువులనూ అందరినీ వోదులుకుని ఉంటారని ఎంతగానో ఆశించాను. ఎంత దురాశ నాది! బిడ్డ పుట్టాక నాతొ బంధాలన్నీ త్రెంచుకున్నారు. అన్ని బంధాలు తెగిపోయిన తరువాత మిగిలి వుండే మాతృ బంధాన్ని కూడా త్రెంపేశారు. ఈ బ్రతుకు ప్రేతభూమిగా మిగిలిపోయింది. మా మమతా బంధానికి చిహ్నంగా మిగిలిన నెత్తుటి గుడ్డు అయిన నా బిడ్డ్డను తీసుకుని అయన మద్రాసు వెళ్ళే రైలు ఎక్కేశారు. ఆడపిల్ల . దాన్ని ఏం చేశారో! ఇప్పుడెక్కడ వుందో? ఉన్నదో ? లేదో?? ఆశలుడిగిన నా కళ్ళకు అదే జ్యోతి అవుతుందనుకున్నాను. బ్రతుకులో ఆశల దీపాలు వెలిగిస్తుందనుకున్నాను. కాని నా ఆశా జ్యోతి కూడా నాకిప్పుడు దక్కలేదు. నేనేవరికోసం బ్రతకాలి? తల్లి దండ్రులెవరో తెలియని నేను నిన్ను సోదరిగా పొంది అదృష్టశాలినిగా అయినాను. తుది క్షణాలు సమీపించినాయి సోదరీ! నా బ్రతుకులో వెలుగు చీకటిగా మారింది. కన్నబిడ్డను నాకు దక్కకుండా చేశాడు. అతడు వ్యసనపరుడు. స్వార్ధం కోసమే నన్ను లేవదీసుకొచ్చాడు. నాకు మిగిలింది ఎడారి. నా కంటి వెలుగు దూరమాయక నేనెందుకు బ్రతకాలి నా బిడ్డను ఏం చేస్తాడో తెలియదు. ప్రాణాలు తీసి మా ప్రేమకు సాక్ష్యాదారాలు లేకుండా మటుమాయం చేయవచ్చు.
ఏ మాత్రమయినా మానవత్వం మిగిలివుంటే ఎవరయినా పుణ్యాత్ములకు యిచ్చేయవచ్చు. ఒక వేళఅలా జరిగితే నా బిడ్డను వెదికి ఆమెకు ఆధారం కావలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అదే నాకు ఆత్మ శాంతి. సోదరీ! తూర్పు సముద్రం తరంగహస్తాలెత్తి నన్ను ఆహ్వానిస్తోంది. సముద్ర తీరానికి రవంత ఎడంగా ఉన్న నావల్ రేవు నౌపాడా కోట బొమ్మాలి గ్రామాల మధ్య తిరుగుతూ ఎప్పుడో ఎక్కడో రాలిపోతాను. లేదా వంశదారలో మునిగిపోతాను. ఏది ఏమయినా తనువూ చాలిస్తాననేది తేలిపోయిన యదార్ధం. నాకోసం ప్రయత్నించకు. నా మీద నీకేదయినా సానుభూతి వుంటే నా బిడ్డ కోసం ప్రయత్నించు -- అనుక్షణం మృత్యువుకై ఎదురు చూసే నీ సోదరి -- శకుంతల " అని వుందా వుత్తరంలో ! ఆ వుత్తరాన్ని నా తండ్రికి చూపాను. శకుంతలను వెదికించమని ఏడ్చాను.
"అమ్మా! కాలం దురతిక్రమమైనది. మానవ ప్రాణులంతా ఎప్పుడో ఒకప్పుడు వచ్చినవారే! మరికప్పుడు పోయేవారే! కాని అగంతకంగా వచ్చి అగంతకంగా పోతారు కొందరు. వారే కొన్ని జ్ఞాపకాలను , కొంత బాధను మిగుల్చుతారు.
శకుంతల గురించి దిగులు పెట్టుకుని నీవు చదువు అవరోధం కల్పించుకోకు. ఇంక ఆమె మన మనిషి కాదని మనసుని నిలువరించుకో!" అని సలహా యిచ్చినారు నా తండ్రి.
మాధవ తిరిగొస్తే కొంత సమాచారం తెలుస్తుందనీ అతడు తెచ్చిన పాప గురించిన వివరాలు తెలుస్తాయని ఆశించాను. ఎదురు చూచాను. నాకు నిరాశే మిగిలింది.
"క్యూరేటర్ సర్! ఆ క్షణం నుంచి పెళ్ళి ఆలోచన మానివేసి ఉపాధ్యాయునిగా బ్రతుకుని తీర్చుకోవాలని నా కనిపించింది. కావాలనే పలాసలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించాను.
నా తండ్రికి తెలియకుండానే ఆ ప్రాంతాలన్నీ శంకుతల కోసం అన్వేషించాను. నా ప్రయాస వృధా అయిపొయింది. పి.హెచ్. డి చేసేందుకు యూనివర్శిటీ అవకాశమిచ్చేదాకా అక్కడ వున్నాను. ఆ తరువాత శకుంతల గురించిన నిరాశా పూర్ణమయిన ఆలోచనలతో పలాసను వొదిలి వచ్చేశాను.
పి.హెచ్.డి అయ్యాక వుద్యోగంలో మెట్లు ఎక్కి ప్రొఫెసర్ అయాను. కాని శకుంతల జ్ఞాపకం వచ్చినప్పుడు మనసు కల్లోలిత మవుతుంది. ఆ మాధవుడే మళ్ళీ నిన్న కన్పించాడు.
రాత్రి మీరు చూచారు కదా!
శకుంతలతో కలిసి వెళ్ళిపోయాక మాధవ తిరిగి ఈ ష్టితిలో రాత్రి నాకు కన్పించాడు.
ఎన్నో సంవత్సరాల తరువాత కన్పించటం అతడు నిశ్చేష్టుడయినాడు. త్వరగా ఒక నిర్ణయానికి రాలేని స్థితిలో నా మీద ఆయుధాన్ని ప్రయోగించలేక పోయినాడు.
అయినా ఈ విషయాన్ని ఇంతటితో విడిచి పెడతాడన్న ఆశ నాకు లేదు. రాకాసి గుహల నిధుల అన్వేషణలో అతడు ఎప్పుడో ఎదురవుతాడు. నిధులతో పాటు నా శకుంతల కంటి వెలుగు, ఆమె బ్రతుకు చీకటిని తొలగించే జ్యోతి అయిన ఆ పాప గురించి చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తీ అతడు.
అందునించి ఈ అన్వేషణను మనం కొనసాగించాలి. శ్వేతకి గురించి తెలుసుకునేందుకు జ్యోతి -- మాధవ గురించి తెలుసుకునేందుకు నేనూ తిరిగి రాకాసి గుహలకు వెళ్ళక తప్పదు.
క్యూరేటర్ సర్! ఈసారి పరిశోధనలో కూడా మీరు ఉదారబుద్దితో మాకు సహకరిస్తారనే ఆశిస్తాను." అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ముఖం త్రిప్పుకుని కన్నీరు దాచుకుంది.
కరుణ రసాత్మకమయిన శకుంతల కధ విన్న క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్ కరిగిపోయాడు. ఈ రాక్షస గుళ్ళు అన్వేషణ ఎందరి జీవితాలతో ఎంత గాడంగా పెనవేసుకుని వున్న సమస్య అనేది వారికి అర్ధమయింది.
