Previous Page Next Page 
మారణహోమం పేజి 56

 

    మనిషి బాగా దగ్గరగా వచ్చి నిఖిల్ కి తగిలిన గాయాలను చూసి "చ్చో చ్చో చ్చో" అని చప్పరించాడు. "లే దొరా! కిందికి వెళదాం! తాడు పట్టుకుని దిగగలవా?" అన్నాడు జాలిగా.
    ప్రయత్న పూర్వకంగా తాడుని అందుకున్నాడు నిఖిల్.
    తాడుని పట్టుకుని, పల్లెటూరి మనిషి కిందకు దిగడం మొదలెట్టాడు . మధ్య మధ్య అతని భుజం మీద ఆసరా కోసం చెయ్యి వేస్తూ వెనకగా దిగుతున్నాడు నిఖిల్. అతని వెనకనే రాధ.
    దిగే మార్గం కష్టంగా ఉన్నా, కొండ ఎక్కువ ఎత్తు లేకపోవడంవల్ల త్వరలోనే కిందికి వచ్చేశారు.
    "థాంక్స్!" అని చెప్పడానికి నోరు తెరిచాడు నిఖిల్.
    ఆ తెరిచినా నోరు తెరిచినట్లే ఉండిపోయింది.
    ఆ పల్లెటూరి మనిషి తన చేతిలో ఉన్న తాడుని మెరుపు వేగంతో నిఖిల్ శరీరం చుట్టూ నాలుగుసార్లు తిప్పి గట్టిగా కట్టేశాడు.
    ఈలోగా రివ్వుమని కిందకు దిగివచ్చేసింది ఉడుము.
    అప్పటిదాకా , ఒక పెద్ద బండ చాటున నిలబడిన ట్రెయిలర్ వాన్ ఒకటి చటుక్కున స్టార్ట్ అయి, వాళ్ళ ముందు ఆగింది. ముందు ఒక ట్రక్కు ఆ ట్రక్కు వెనుక తగిలించిన ట్రెయిలర్. చిన్న రైలులాగా ఉంది అది. ట్రెయిలర్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఉడుము ఒక్కక్షణంలో ట్రెయిలర్ లోకి ఎక్కేసింది. దానితో బాటే నిఖిల్ కూడా విసురుగా ట్రెయిలర్ మీద పడ్డాడు. ఆ పల్లెటూరి మనిషి సునాయాసంగా అతన్ని లోపలికి తోసేశాడు. తర్వాత రాధను కూడా లోపలికి నెట్టేసి, తను కూడా ఎక్కి తలుపులు భద్రంగా వేసేశాడు. ట్రక్కు స్టార్ట్ అయి కదిలింది. దానితో బాటే ట్రెయిలర్ కూడా.
    ఇదంతా జరిగిపోవడానికి సరిగ్గా అరవై సెకండ్లు పట్టింది! ఏం జరిగిందో గ్రహించేలోగా బందీ అయి, గమ్యస్థానం ఎక్కడో తెలియకుండా ఆ ట్రెయిలర్ లో వెళ్ళిపోతున్నాడు నిఖిల్.
    కొద్దిగా తేరుకున్న తర్వాత, తనచుట్టూ పరిశీలనగా చూశాడు అతను.    
    తను ఎక్కిన ట్రెయిలర్ ఒక చిన్న ఇల్లులా ఉంది. అద్దాల కిటికీలు ఉన్నాయి. ఒకవైపుగా చిన్నటేబులూ, కుర్చీ ఉన్నాయి. అవసరం లేకపోతే కుర్చీనీ ఫోల్డు చేసేస్తే అది గోడకి అతుక్కుపోతుంది. అలాగే టేబుల్ ని నొక్కేస్తే అది నేలకి అతుక్కుపోతుంది. ఒక మంచం ఉంది! ఒక మూలగా వాష్ బేసిన్ కూడా ఉంది.
    అలాంటి ట్రెయిలర్ లను కారవాన్ అంటారని నిఖిల్ కి తెలుసు. వెస్టర్న్ కంట్రీస్ లో అవి చాలా పాపులర్. కార్లకి కార్లవాన్లను తగిలించుకుని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. హోటళ్ళ ఖర్చు ఉండదు. వెళ్ళిన చోట హోటల్స్ ఉంటాయో ఉండవో అన్న భయం కూడా ఉండదు. ఇండియాకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అవి.
    కారవాన్ లో ప్రవేశించగానే ఆ పల్లెటూరి మనిషి మాటలూ చేతలూ ఒక్కసారిగా మారిపోయాయి. చాలా నాగరికుడిగా మాట్లాడటం మొదలెట్టాడు అతను.
    "మిస్టర్ నిఖిల్! మీకు కొద్దిగా అసౌఖర్యం. అంతే! శ్రమ ఇస్తున్నందుకు క్షమించాలి. కానీ మిస్టర్ హాధీ ఒకసారి మిమ్మల్ని అర్జెంటుగా మీటవదలుచుకున్నారు."
    "హాధీ?" అన్నాడు నిఖిల్ ఆశ్చర్యంగా. హాధీ ఎవరో అతనికి తెలుసు. హాజీ మస్తాన్ లాగా సుకూర్ నారాయణ్ భకియాలాగా ఇప్పుడు బాంబేలో వరదరాజ మొదలియార్ లాగా అక్రమమయిన మార్గాలలో పైకివచ్చి అందరినీ గడగడలాడిస్తూ గవర్నమెంట్ కి పోటీగా దాదాపు పారలెల్ గవర్నమెంటూ , మన అర్ధక వ్యవస్థకు పోటీగా బ్లాక్ మనీతో కూడిన మరొక అర్ధక వ్యవస్థ నడిపిస్తున్న మనిషి!
     అతనికి తనతో ఏం పని? ఆలోచిస్తూ ఉండిపోయాడు నిఖిల్.
    చాలాదూరం ప్రయాణం చేశాక కారవాన్ మహారాష్ట్ర సరిహద్దు దగ్గర ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. బంగళా చుట్టూ పదెకరాల తోట ఉంది. గేటు నుంచి పోర్టికో దాకా అరకిలోమీటరు పొడుగున తారురోడ్డు వేసి ఉంది. బాగా ఎత్తుమీద ఉంది బంగళా. దానికి పురాతన రోమన్ భవంతులకు వున్నట్లు పాలరాతి మెట్లు ఉన్నాయి.
    వాటిపైన వరండాలో నిల్చుని ఉన్నాడు జీవరాజ్ హాధీ. హాధీ అనేది వాళ్ళ ఇంటిపేరు. కానీ హాధీ అంటే హిందీ లో "ఏనుగు" అనే అర్ధం కూడా వుంది.
    జీవరాజ్ కి  ఏనుగు అనే పేరు చాలా కరెక్టుగా సరిపోతుంది. అతని పేరు వినడమే గానీ అతన్ని ఎప్పుడూ కలుసుకోలేదు నిఖిల్. అంతటి లావాటి మనిషిని కూడా ఎప్పుడూ చూసి వుండలేదు అతను. హాధీ ఒకసారి ఒక కుర్చీలో ఇరుక్కుపోతే విడదియ్యడం కుదరక వడ్రంగిని పిలిపించవలసి వచ్చిందని చెప్పుకుంటారు జనం.
    దాన్లో అబద్దమేమీ లేదనిపించింది నిఖిల్ కి, అతన్ని చూశాక. అతని చేతిలో మృదువైన స్విస్ చాకొలేట్ బార్ వుంది. మధ్యమధ్యలో దాన్ని కొరుకుతున్నాడు హాధీ.
    "రా! నిఖిల్! రా!" అన్నాడతను. కరస్పర్శకై ఎడమ చెయ్యి ముందుకు జాపుతూ. అతని కుడిచేతిలో చాకొలేట్ బారు వుంది.
    ఆ ఒక్క చర్యలోనే అతని అహంకారం , నిర్లక్ష్యం అర్ధమైపోయాయి నిఖిల్ కి. తనేం చేసినా చెల్లిపోతుందనే మానసిక స్థితిలో ఉన్నాడు హాధీ.
    ఆ చేతిని అందుకోకుండా ఊరికీ తలపంకించాడు నిఖిల్.
    హాధీ మోహంలో ప్రసన్నత తగ్గింది.
    "రా! ముక్తసరిగా అని లోపలికి దారితీశాడు .  అతను నడుస్తుంటే మదగజం ఒకటి నడుస్తున్నట్లే వుంది.
    ఎందుకు రప్పించుకున్నాడు హాదీ తనని ఇక్కడికి! ఏం పని?
    ఎవరో ఒక స్త్రీ వచ్చి రాధను తనతో రమ్మన్నట్లు సైగ చేసింది. నిఖిల్ వైపు ఆందోళనగా చూసింది రాధ.
    "ఈ అమ్మాయి నాతోనే ఉంటుంది" అన్నాడు నిఖిల్ స్థిరంగా.
    "ఇక్కడ పనులు నేను చెప్పినట్లు జరుగుతాయ్!" అన్నాడు హాధీ ఖచ్చితంగా. "ఆ అమ్మయికీమీ ప్రమాదం లేదు, నువ్వు వెర్రిమొర్రి వేషాలు వెయ్యినంతవరకూ!"
    భుజాలు ఎగరేసి ఊరుకున్నాడు నిఖిల్. ఆ పరిస్థితిలో తను చెయ్యగలిగింది ఏమీ లేదని అతనికి తెలుసు.
    "చెప్పండి? నేను ఎందుకున్నాను ఇక్కడ?"
    పోట్టంతా కదిలేటట్టు పెద్దగా నవ్వాడు హాధీ. "నువ్విక్కడ గెస్టుగా చాలా రోజులు ఉండబోతున్నావ్ నిఖిల్! రేపు చెబుతాను. ఇవ్వాళ్టికి రెస్టు తీసుకో. ఏలా ఉంది నీ గాయం!"
    చాలాసేపటి తర్వాత అప్పుడు మొదటిసారిగా తన గాయం గుర్తు వచ్చింది నిఖిల్ కి. చేత్తో తల తడుముకుని , "బాధ చాలా తీవ్రంగానే వుంది. వెంటనే మందు వెయ్యకపోతే సెప్టిక్ కావచ్చు. గేంగరిన్ కూడా డెవలప్ కావచ్చు" అన్నాడు.
    మళ్ళీ నవ్వాడు హాదీ!
    "గేంగరిన్ డెవలప్ అయితే ఏం చేస్తారు. తల తీసేయ్యాలి! వేరే మార్గం ఉందా నిఖిల్?" మళ్ళీ నవ్వాడు. "నీకు తల ఉందని ముందు రుజువు చేసుకో నిఖిల్! తెలివిగా ప్రవర్తించు, ఆ తర్వాత తలకు వైద్యం సంగతి ఆలోచిద్దాం!"
    కోపాన్ని కష్టం మీద ఆపుకున్నాడు నిఖిల్.
    హాదీ సైగను అర్ధం చేసుకుని పల్లెటూరి మనిషిలా కనబడుతున్న అతను నిఖిల్ ని పక్క రూంలోకి తీసుకెళ్ళాడు.
    చాలా విచిత్రంగా ఉంది ఆ రూము నిర్మాణం.
    బొంబాయిలో కొంతమంది స్మగ్లర్లు ఇళ్ళు ఎలా ఉంటాయో తెలిసినవాళ్ళకి తప్పితే మిగతావారికి ఆరూము వర్ణన అతిశయోక్తిగా తోచినా తోచవచ్చు.
    నిఖిల్ ఆ గదిలో అడుగు పెట్టగానే మొట్టమొదటగా గమనించిన విషయం -
    ఆ గదికి పైన కాంక్రీటు కప్పులేదు! దానికి బదులుగా మందమైన గాజుఫలకాలు బిగించి వున్నాయి. ఆ పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ లో అందమైన ఆడపిల్లలు జలకాలాడుతున్నారు.
    నగ్నంగా!
    అక్కడ సౌఖ్యంగా ఉన్న ఒక సోఫా వేసి వుంది. దాన్లో జరిగిలబడి పైకి చూస్తే స్విమ్మింగ్ పూల్ గాజుపలకలలో నుంచి పారదర్శకంగా కనబడుతుంది. దానిలో అందమైన జలపుష్పాలలాగా ఆడపిల్లలు కనబడతారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS