Previous Page Next Page 
యువత నవత పేజి 55

   
     "అసలు, నూతన వధువులు మంగళగౌరీ నోములు ఎందుకు నోస్తారో తెలుసా?"

    "అంతబాగా తెలియదు చెప్పండి' అంది శాలిని.

    "తన పతికి ఆయురారోగ్యం ప్రసాదించి తన పలుపుకుంకుమలు చల్లగా చూడమని, నువ్వు మా అన్నయ్యని  ప్రేమించడంలేదా? అతడు ఆయురారోగ్యాలతో జీవించాలని, నీ పసుపు కుంకుమ చెరగకుండా వుండాలని నువ్వు కోరుకోవడంలేదా?"

    "ఎందుకు కోరుకోను? కోరుకుంటాను!"

    "మరి గౌరీనోము ఎందుకు నోచుకోవు?"

    "మంగళగౌరీ నోము నోచినవాళ్లంతా గ్యారంటీగా ముత్తయిదువులుగా చావడంలేదుగనుక. పాతికేళ్లకే భర్తచచ్చిగుండు కొట్టించుకున్న మీ మేనత్త, ఇంకా చాలామంది  వితంతువులతో విదిగా, తప్పనిసరిగా వాళ్లమ్మలూ, అత్తలూ ఈ మంగళగౌరీ నోములు నోయించి వుంటారు. వాళ్ళ పసుపు కుంకుమలు రాలిపోతుంటే ఏం చేసింది మీ మంగళగౌరి."

    జవాబు చెప్పలేనట్టుగా చూసింది బృంద!

    "విదేశాలలోని వనితలెవ్వరూ ఈ మంగళగౌరీ నోములు నోయరు. వాళ్లంతా  ముండమోయడం లేదా విదేశాలవరకూ ఎందుకూ? మన దేశం లోనే చాలా రాష్ట్రాలలో ఈ మంగళగౌరీ నోములేదు. వాళ్లు మగళ్లని తెల్లారేసరికి కోల్పోవడంలేదా."

    ఈ విషయం ఆడవాళ్లమధ్యే ఆగలేదు. ఇంటి యజమాని దాకా వెళ్లింది. శర్మ తండ్రి అన్నాడు. "విదేశీవనితలు నోములు, వ్రతాలు చేయకపోతే వాళ్లు మగళ్లు చావడంలేదుకదా అంటే, నోములు, వ్రతాలు ఆ జాతి సంస్కృతికాదు!ప్రతి దేశానికీ ఒక జాతి, జాతికొక సంస్కృతీ వుంది. ఈ నోములు, వ్రతాలు, పూజలు, జపాలు మనజాతి సంస్కృతిలో ఓ భాగం, సంస్కృతి రక్షించుకోవడం అనేది ప్రతి భారతీయుడి కర్తవ్యం కదా!"

    "మన గ్రామప్రాంతాల్లో, గిరిజనప్రాంతాల్లో మైసమ్మలూ, పోలేరమ్మలూ అనే గ్రామదేవతలను కొలిచి  జంతువులను బలిఇవ్వడం, ఒక్కో చోట నరబలి ఇవ్వడంకూడా జరుగుతూంది. ఇది మన సంస్కృతిలో భాగమేకదా? సంస్కృతి కాపాడబడాలంటే ఆ జంతుబలిని, నరబలిని  అలాగే కొనసాగనివ్వాలికదా? నాగరిక సమాజం ఎందుకు గర్హిస్తుంది ఆ చర్యని?"

    "నేను గర్హించను!"

    "అంటే సమర్థిస్తారా మామగారూ!" శాలిని ఆశ్చర్యానికి అంతులేదు.

     "అవును! ఎవరి ఆలోచనలు వాళ్లవి. ఎవరి నమ్మకాలు వాళ్లవి.  వాళ్ల జోలికి వెళ్లకూడదంటాను!"

    " వాళ్లుచేసే జీవహింస? నిల్చున్న పాటున గొర్రెలనీ, కోళ్లనీ నరికి వేస్తారే! సభ్య మానవుడు ఎవడూ హర్షించని చర్యకదా?"

    "మాంస భక్షకులకోసం కటికవాడు రోజుకు ఎన్ని గొర్రెలను, ఎన్ని కోళ్లను వాడి దుకాణంముందు నరకడంలేదు. జీవహింస, అని, కిరాతక చర్య అని వాడి చర్యను ఖండించడంలేదేం!" సూటిగా అడిగాడు.
 
     "కటికవాడు చేసేపనీ, క్షుద్రదేవతలకుఇచ్చే జంతుబలీ ఒక్కటే ఎలా అవుతాయండీ?"

    కాని నాగరిక సమాజం జంతుబలినీ, నరబలినీ ఆటవికచర్య అని ఖండిస్తుంది. చాలాచోట్ల జంతుబలులు ఆగిపోయాయి! ప్రభుత్వం జోక్యంతో సంఘసంస్కర్తల జోక్యంతో.

     "ఇహ వున్నత వర్గాలలో ఈ నోములు, వ్రతాలు, పూజలు ఒకనాడు అనాగరిక దశకు చెందినవి. ఒకనాడు స్త్రీమీద ఆధిపత్యం సంపాదించి, ఆమెను తనకు బానిసను చేసుకొని, తనకు అణిగి మణిగి అణుకువగా  వుంచుకోవడం కోసం పతివ్రతా ధర్మాలు, శాస్త్రాలు రచించాడే  పురుషుడు:ఆనాటి అవశేషాలివి భర్త క్షేమంకోసం భార్య నోములు, వ్రతాలు, పూజలు చేయాలి భార్యక్షేమం కోసం భర్త ఏ నోములు వ్రతాలు చేయడేం?"

    "తలమీద నీడపోయాక  ఆడది బ్రతికి చేసేది ఏమిటి? పట్టెడు పసుపు కుంకుమలతో మగడి కళ్లముందు పోవాలనుకొంటుంది ప్రతి ఆడదీ!" అంది రామలక్ష్మి.

     "అతడి కళ్లముందే పట్టెడు పసుపుకుంకుమలతో కన్ను మూయాలన్న సెంటిమెంట్ ఎందుకు తగిలించాడనుకొన్నారు? అది చావగానే కొత్త పెళ్లికొడుకై పీటలమీదికెక్కొచ్చని" శాలిని కసి వెళ్ళబోసినట్టుగా అంటూంటే శ్రోతలు ఫక్కుమన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS