కోటబొమ్మాలి -- నౌపాడా ల మధ్య నాకు వర్షపు రాత్రి సవర గూడెం దొళబెహార సమక్షంలో ప్రేతాత్మల ప్రత్యక్ష సంబంధాల గురించి అనుభవం ఎదురు అయింది.
విజ్ఞాన శాస్త్రం విశ్లేషించలేదు కాబట్టి ప్రత్యేక్షంగా ఎదురు అయిన అనుభవాన్ని నేను కాదనగలనా? మీరే చెప్పండి" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
చాలాసేపు మౌనం తరువాత క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్ గారి పెదవుల మీదికి చిరునవ్వు ఉరికి వచ్చింది. ముఖం కాంతివంతమై పోయింది.
"ప్రొఫెసర్! అది మీ ప్రత్యేక్ష జీవితానుభవం! కాదనటానికి వీలుకానిది. ఇంక ఆ విషయమై నాకు ఎటువంటి సందేహాలు లేవు. కాని రెండు అనుమానాలు మిగిలిపొయినాయి.
నేను కలకత్తా కు పోతూ అనేక మార్లు చూచాను. శ్రీకాకుళం నించి పలాసకు దగ్గర దారి వుంది. పైగా అది బహుకాలంగా వున్న రైలు దారి. దాన్ని వదలి ప్రక్కదారిన కళింగపట్నం , కోట బొమ్మాలీ , నావల్ రేవుల మీదుగా పలాసకు పోవలసిన అవుసరం ఏమిటి? మీరు దారి తప్పలేదు కదా!" అన్నారాయన నవ్వుతూ.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి పెదవుల మీద రవంత చిరునవ్వు మెరిసింది. ఆమె ఎర్రని పెదవుల మీదుగా జారిన చిరునవ్వు తెల్లదనాలు ప్రభాత వేళ విచ్చిన ,మందారాల మీది నించి జారుతున్న మంచు బిందువుల్లా అనిపించినాయి. ఆ వెను వెంటనే జ్ఞాపకాల పొరల అడుగున కదలికలు ప్రారంభమయినాయి. మరుక్షణమే శ్రీ బృందావన్ గోయెల్ ఊహించలేనంత గంభీరంగా మారిపోయిందామె.
ఇప్పుడామె ఒక కాంతి తుషారంతో నిండిన హిమగిరి శిఖరాలు వెన్నెల కిరణాల సోకినప్పటి ధావళ్యా'న్ని సంతరించుకుంది. బ్రతుకు అర్ధాలు పల్లవించేలా పలుకసాగిందామే.
"క్యూరేటర్ సర్! ఊహాజనితమయిన కదా ప్రపంచంలోనే కాదు చేరు నిజాలతో నిండిన వాస్తవ మానవ జీవితాల్లోనూ ఆడది దారి తప్పటానికి మించిన కధా వస్తువు లేదు! అయితే దారి తప్పినది నేను కాదు . నా తనువులో తనువూ, నా ప్రాణంలో ప్రాణమూ , నా అంతరింగిక లోకమంతా తానే అయి నిండిపోయిన నా బాల్య స్నేహితురాలు శకుంతల! ప్రేమించే హృదయం కలిగిన స్త్రీ మూర్తి.
ఆమె దారి తప్పింది క్యూరేటర్ సర్! అందుకే నేనూ దారి తప్పి పోయినాను. దారి తప్పినా దక్కించుకోలేక పోయినాను" అంటూ గంభీరమయిన కంఠస్వరాన వివరిస్తూ జ్ఞాపకాల పొరల మధ్యకు పోతోంది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
రాను రాను జ్ఞాపకాల బరువుతో కంఠం రుద్దమాయి పోతోంది. ముఖం దుఃఖభారం వల్ల విచ్చిన మందారంలా అయింది. విషాద పూర్ణమయిన జ్ఞాపకాలు పైకి తేలటం నించి అంతర్యం పేలిపోతున్న మందు పాతరలా అయిపొయింది. కనులు అశ్రుజన పూర్ణకుంభాలవలె తరళించ సాగానాయి. అది గమనించిన క్యూరేటర్ సార్ కదలిపోయినారు.
"మేడమ్! నన్ను క్షమించండి. కదపరాని మీ జ్ఞాపకాలను కదిపి మీకు బాధ కలిగించాను" అన్నారాయన బరువుగా!
ప్రొఫెసర్ శ్రద్దాదేవి దీర్ఘంగా నిట్టూర్చింది.
"లేదు క్యూరేటర్ సర్! అందమయిన ప్రకృతి , ప్రశాంతత ఈ రెండు అంతరిక లోకపు వాకిళ్ళను తెరుస్తాయి. మనసు పొరలు తెగిపోయి ఆలోచనలు కరిగిపోయిన కాలంలోకి పరుగెడతాయి.
అటువంటి సమయంలో నా బాల్య స్నేహితురాలు, ప్రేమించి మోసగించబడిన ఒక పవిత్రమూర్తి జ్ఞాపకాలను కదిపి నాకు మేలు చేసినారు. ఇంత ప్రశాంత సుందరమయిన ప్రకృతి సదనంలో కూర్చుని ఆమెను స్మరించడం కన్నా కోరదగినది ఏమున్నది?" అన్నదామె గాడంగా నిట్టుర్చుతూ.
"ప్రొఫెసర్! వైజ్ఞానిక ప్రపంచానికి వెలుగురాశి. వ్యక్తిత్వం వల్ల వీరమూర్తి అయిన మీ అంతర్యంలో అంతటి స్థానాన్ని సంపాదించిన పవిత్రమూర్తి శకుంతల గురించి స్మరించటం మీకు అంత అనందమయితే నాకు ఆమె గురించి చెప్పండి" అన్నారు శ్రీ బృందావన్ గోయెల్ అత్యంత ఆసక్తిగా.
గతించిన కాలపు జ్ఞాపకాల కౌగిలి లో పరసక్త అయిపోయిన శ్రద్దాదేవి కల కంటున్న వ్యక్తీ పలవరించే ధోరణిలో చెప్పసాగింది.
శకుంతల మూర్తిత్వం ఆమె కనుల ముందు కదలాడసాగింది! వ్యధాపూర్నమయిన ఆ కధ వింటూ తల్లీనులయినారు శ్రీ బృందావన్ గోయెల్!!
18
"క్యూరేటర్ సర్! అమలాపురం కోనసీమలోని అందాలను ప్రతి ఫలించే చోటు, కోనసీమ అంటే ప్రకృతి సౌందర్యానికే కాదు, వేదవిద్యలకు కూడా నిలయమయిన చోటు.
అమలాపురానికి అతి చేరువలో వున్న ఓ చిన్ని కుగ్రామంలో నివసించేవారు నా తండ్రి. అయన వేదవిద్యలో దిట్ట. గొప్ప పండితులని ఎంతో పేరుండేది. ఎందరో శిష్యులుండేవారు.
నా తండ్రి అరుగు మీద కూర్చుని శిష్యుల చేత సంతలు చెప్పిస్తూ వున్నప్పుడు వేద నినాదాలతో ఆ కుగ్రామం ప్రతిధ్వనించేది. గ్రామంలోని అందరికీ నా తండ్రి దైవసముడు. వారాయనను ఎంతో గౌరవించేవారు ఆదరించేవారు.
ఎర్రమట్టితో అలికి సున్నంతో రంగవల్లికలు తీర్చిన అరుగు మీద నా తండ్రి కూర్చుని వున్నప్పుడు ఆ వీదీన పోయేందుకు ఎవరూ సాహసించేవారు కారు. అయన ఎంతో సౌజన్యమూర్తి!
ఒకప్పుడు ఒక మధ్యాహ్నవేళ నా తండ్రి పొలంలో చెరకు రసాన్ని బెల్లంగా వొండించెందుకు గాడి పొయ్యి త్రవ్వించి తిరిగి వస్తూ వుండగా ఒక పాప ఏడుపు వినిపించిందట.
అనాధ అయిన ఆ పాపకు శకుంతల అని పేరు పెట్టి నాతొ సమంగా చూచుకుని సాకారు. దానికి పాఠశాలల్లో చదువు రుచించలేదు. కాని చాలా త్వరగానే బ్రతుకు అర్ధాలను చదివింది.
క్యూరేటర్ సర్, మీకు తెలియనిదేముంది. పాలపుంతలలో కూడా దర్శనమివ్వని లోకాలు ఆడదాని అంతర్యంలో దర్శనమిస్తాయి. ఈ ప్రపంచంలోని ఏ గ్రందాలయమూ నిర్వచించలేని అద్భుత రహస్యాలను ఒక స్త్రీ నిర్వచించగలుగుతుంది.
అంత అనాధ తత్త్వంలో సముద్రానికి , ఔచిత్యంలో హిమగిరి శృంగాలకూ పోలిన మహనీయత ఒక్క ఆడదానికే చెల్లింది. అందుకు కారణమేమిటో తెలుసా క్యూరేటర్ సర్!
ఆడది ప్రేమకు త్యాగభావంతో అంకితమైపోగలదు. ప్రేమ అనే రెండక్షరాల మధురానుభూతికి తన సర్వశక్తులనూ త్యాగభావంతో సమర్పించుకోగలదు.
అంతటి ప్రేమమయిగా అపురూపమయిన అందచందాలతో ఎదిగి వచ్చింది శకుంతల. ఎందరెందరో ఆమెను ఆశించారు. ఆమె ఒక యువకునికి మనసిచ్చుకుంది.
ఆ యువకుని పేరు మాధవ.
మాధవ కూడా చిన్నతనంలో నా తండ్రి దగ్గర చదువుకున్నవాడే . కాలేజి చదువు ప్రారంభమయాక నా తండ్రి దగ్గరకు రాకుండా మానేశాడు. అయిదారు సంవత్సరాల తరువాత అనుకోకుండా ఒకసారి మా ఇంటికి వచ్చాడు. నా తండ్రిని చూసి పలకరించిపోవాలని వచ్చిన అతడు ఎదిగి పోయిన శకుంతలను చూశాడు.
