Previous Page Next Page 
మారణహోమం పేజి 55

 

    అతి కష్టం మీద తలెత్తాడు నిఖిల్.
    చింపిన పమిట కొంగుతో అతని తల చుట్టూ బ్యాండేజ్ లా కట్టబోయింది రాధ. కానీ గాయంలో నుంచి స్రవిస్తున్న రక్తం ఆ బట్టని క్షణంలో ముద్దగా చేసేసింది.
    మళ్ళీ పమిటని ఇంకొంచెం మేర చింపింది రాధ.
    ఈసారి కట్టుకట్టక రక్తం కారడం తగ్గినట్లయింది.    
    మెల్లిగా తలతిప్పి చూశాడు నిఖిల్. చాలా అసౌకర్యమైన ప్రదేశంలో పడ్డారు తామిద్దరూ. లోతుగా ఎక్కడో కనబడుతోంది నేల.    
    ఎవరైనా చూసి తమని రక్షించాలి! వేరే మార్గం లేదు.
    కొండకు అవతల ఎవరూ ఉన్న అలికిడే లేదు. తీతవుపిట్ట ఒకటి దూరం నుంచి ఉండి ఉండి అరుస్తోంది. కొన్ని వేల అడుగుల ఎత్తున విమానం ఒకటి తెల్లటి చిన్న పిట్ట సైజులో కనబడుతూ ఎగిరివెళ్ళింది.
    అంతే! ఆతర్వాత మరింత శబ్దాలేమీ లేవు.
    మాట్లాడడానికి నోరు తెరిస్తే గాయం రేగి బాధ కలుగుతోంది నిఖిల్ కి. అందుకని మౌనంగా పడుకుని ఉండిపోయాడు. కానీ అతని మనసు మాత్రం తీవ్రంగా ఆలోచిస్తోంది.
    ఇక్కడ నుంచి కిందకి దిగడం ఎలా!
    తన సంగతి అలా ఉంచినా, కనీసం రాధనయినా రక్షించడం ఎలా?
    తన అసమర్ధత మీద తనకే కోపం వస్తోంది నిఖిల్ కి.
    చూస్తూ ఉండగానే ఆకాశం పడమట వైపు నారింజరంగుకి తిరిగింది. ఆ తర్వాత చిక్కటి బూడిదరంగు ఆకాశాన్ని అలముకుంది.
    ఇంకొంచెం సేపటి తర్వాత కటిక చీకటి. నక్షత్రాలు మాత్రం తళతళ మెరుస్తున్నాయి. మొదట్లో చల్లగా వీచిన గాలి ఒక గంట తర్వాత రక్తం గడ్డ కట్టించేటంత చలిగాలిలా మారింది.
    అతనికి చలిగాలి తగలకుండా తన పమిట కప్పాలని తహతహలాడిపోయింది రాధ మనసు.
    కానీ వెచ్చటి దుప్పటిలా మారి అతన్ని కప్పెయ్యాలని తీవ్రమైన కోరిక కలిగింది రాధకు. అతనికి దగ్గరగా జరిగి, మీద చేతులు వేసి హత్తుకుని కూర్చుంది.
    అంత చలిలోనూ నిఖిల్ వళ్ళు జ్వరంతో వెచ్చబడటం తెలుస్తోంది రాధకు. పెదిమలు కొరికిపట్టి దుఃఖాన్ని ఆపుకుంటుంది తను. అతని చాతీ మీద తల ఆనించి అలాగే పడుకుని ఉండిపోయింది.
    తెల్లవారుతుండగా మగతనిద్ర పట్టింది ఆమెకు. నిద్రపట్టిన అరగంటలోనే మళ్ళీ ఉలికిపాటుతో మెలకువ వచ్చేసింది.
    ఎవరో కిందనుంచి అరుస్తున్నారు. గాలిలో తేలి అస్పష్టంగా వస్తున్నాయి మాటలు.
    మెల్లిగా లేచి కూర్చున్నాడు నిఖిల్ కూడా. లేవడంతో అతని గెడ్డం రాధ చెంపలకు రాసుకుంది. ఒక్క రోజులోనే గరుగ్గా పెరిగిపోయి గుచ్చుకుంటుంది అతని గెడ్డం.
    కిందికి చూశాడు నిఖిల్.
    కింద అయిదారు మంది మనుషులు ఏదో వెతుకుతున్నట్లు అటూ ఇటూ తిరుగుతున్నారు. తమ కోసమేనా? తమ మనుషులా? లేకపోతే పోలీసులా?
    తాము ఉన్న ప్రదేశం వాళ్ళకి కనబడలేదని అర్ధమయిపోతోంది. అందుకని కష్టం మీద జేబులో చెయ్యి పెట్టి రివాల్వర్ తీశాడు నిఖిల్. రెండు సార్లు గాల్లోకి కాల్చాడు.
    వెంటనే మంత్రం వేసినట్లు ఆగిపోయాయి కిందనుంచి వినబడుతున్న మాటలు.
    తను చేసిన పని కరెక్టే అనుకున్నాడు నిఖిల్. కింద ఉన్నది తన మనుషులే అయితే రివాల్వర్ శబ్దం విని తాము ఎక్కడ ఉన్నదీ కనిపెట్టగలుగుతారు.
    ఒకవేళ కిందవున్నది పోలీసులే అయితే తను నిరాయుధుడు కాదని గ్రహించి పైకి రావడానికి ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకుంటారు.
    ఆ విధంగా తనకు కొంచెం సమయం కలిసివస్తుంది. ఈలోగా ఏదైనా ఆలోచన తట్టవచ్చు.
    చాలా ప్రయత్నం చేసి, రాధ సాయంతో లేచి నిలబడ్డాడు నిఖిల్.
    వెంటనే ఏదో అలికిడి అయింది నిఖిల్ కి వెనకగా.
    రివాల్వర్ రెడీగా పట్టుకుని వెనక్కి తిరిగాడు నిఖిల్.
    అతని వెనక ఒక మనిషి ఉన్నాడు. అంతా పల్లెటూరి వాలకం. అతని చేతుల్లో ఆయుధాలు ఏమీ లేవు. కుడిచెయ్యి గాలిలో పైకీ కిందకీ ఊపుతూ తనని తానూ బాలెన్స్ చేసుకుంటున్నాడు . కొండ పై నుంచి వేలాడుతున్న ఒక తాడుని ఎడమచేత్తో పట్టుకుని దాని ఆధారంతో తూచి తూచి అడుగులు వేస్తూ నిఖిల్ ని సమీపిస్తున్నాడు.
    తల కొద్దిగా ఎత్తి చూశాడు నిఖిల్. గోడలా నిటారుగా ఉన్న ఆ కొండ మీద అతుక్కుపోయినట్లు ఉంది ఒక వుడుము. మాములు వుడుముల కంటే రెట్టింపు సైజులో, దాదాపు చిన్న మొసలి అంత పెద్దదిగా ఉంది అది. దాని నడుముకి కట్టి వుంది ఒక తాడు. ఆ తాడుని ఆధారంగా చేసుకుని ఈ పల్లెటూరి మనిషి పైకి వచ్చాడన్నమాట.
    అంత బాధలోనూ నిఖిల్ కి ఒక చారిత్రక సత్యం గుర్తువచ్చింది.
    "కొండ ఎలుక" అని శత్రువులచే పిలవబడే చత్రపతీ శివాజీ, తను చేసిన యుద్దాలలో ఉడుములను కూడా ఉపయోగించినట్లు ఆధారాలు కనబడతాయి. దుర్భేద్యంగా ఉన్న కోటలను వశపర్చుకోవడానికి గానూ తర్ఫీదు ఇచ్చిన ఉడుములని నడుముకి తాడుకట్టి అదిలించేవారు.
    ఉడుము తాడుతో సహా చరచర ప్రాకుతూ కోటగోడ పైకి పోయి, అక్కడ ఆగేది. ఆ తాడు పట్టుకుని పైకి ఎగబ్రాకేవారు కొంతమంది సైనికులు. వాళ్ళు కోటలో జొరబడి తలుపులు తెరిచాక మిగతా సైన్యం కోటని అక్రమించుకునేది. తాడు పట్టుకుని సైనికులు పైకి ఎగబ్రాకుతున్నప్పుడు దారుణమైన బాధ కలిగినా, నడుములు జారిపోతున్నా పట్టుమాత్రం వదిలేసేవి కావు ఉడుములు. అందుకనే "ఉడుం పట్టు" అనేది పట్టుదలకు పర్యాయపదంగా మారింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS