Previous Page Next Page 
యువత నవత పేజి 54

   
    "తన మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించడానికి చాలా ఆత్మ స్థయిర్యంకావాలి! ధైర్యంకావాలి. అవి సుధలో పుష్కలంగా వున్నాయి!" అనుకొంది శాలిని.

        *    *    *    *
   
    నరహరి కూతురి ట్రాన్స ఫర్ కోసం ఎన్ని రోజులనుండో చేస్తున్న ప్రయత్నం ఫలించి శాలినికి సిటీకి ట్రాన్సఫర్ అయ్యింది. శాలిని కాన్సిల్ చేసుకొందా మనుకుందిగాని శర్మ  పి. హెచ్. డి. కోసం శెలవుపెట్టి తనూ వచ్చేశానని చెప్పాడు.

     మొదట మొదట మడిపేరుతో కోడల్ని వంటదగ్గరికి రానివ్వని రామ లక్ష్మి మెల్ల మెల్లగా  రాత్రిపూట వంట దగ్గరికి  పంపుతూంది. చేసినన్నాళ్లు చేశాను! ఇంకా ఎంతకాలం చేయను? కోడలొచ్చాక కూడా రెస్ట్ దొరకకపోతే ఎలా?" అని.

    ఆడపడుచు కౌలు డబ్బుకోసం  ఊరెళ్లడంతో శాలిని చేతివంట తినడానికి పెద్దగా అభ్యంతరం లేకపోయింది ఎవరికి.

     ఆదివారంరోజు పూర్తిగా సెలవు అత్తగారికి.

     శ్రావణమాసం ఇంకో వారంరోజులుండగా రామలక్ష్మి అంది. "మంగళగౌరీ నోములు,  వరలక్ష్మి వ్రతం ఇద్దరు కలిసి చేసుకోవచ్చని బృందని రమ్మని రాయించాను."

    "నోములా? నాకలాంటి నమ్మకాలులేవు అత్తయ్యా! అసలు ఇన్ని రోజులయింది నేను దేవుడికి పూజచేయగా చూశారా" అంది శాలిని.

    "దీపారాధన ఏదో నేనే మడికట్టుకు చేస్తుంటాకదా? నువ్వు వేరుగా పూజ చేస్తావో చేయవో నాకెలా తెలుసు? అయితే నాస్తికురాలివన్నమాట"  ఏదో చేదునిజం తెలిసినట్టుగా ఆమె ముఖం పెట్టింది.

    "ఏ పూజలు, భజనలు చేస్తే దేవుడున్నాడని మీరు విశ్వసించినట్టో ఆ పూజలు, భజనలు నేను చేయను కాబట్టి నాస్తికురాలినే!"

    "పూజలు, భజనలు చేయకపోతే పీడాపోయే! ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు చెక్కభజన ఎవరు చేస్తారని? కనీసం దేవుడున్నాడనైనా ఒప్పుకోవా?"

    "ఒప్పుకోను నాకు నమ్మకం లేదుకాబట్టి!"

    "అదే ఎందుకని అడుగుతున్నాను"

    "నాకు ఎందుకు నమ్మకంలేదో నేను తరువాత చెబుతాను, మీకెందుకు నమ్మకం వుందో ముందు చెప్పండి."

    "ఉన్నాడు కాబట్టి!"

    "మీరు చూశారా?"

    "అదేం ప్రశ్న? అంత సులభంగా కనిపించేవాడయితే దేవుడెలా అవుతాడు?"

    "మీరు చూడలేదుకదా? ఎలా నమ్ముతున్నారు."

    "లేకపోతే  ఇంత ప్రపంచం, ఈ జీవసృష్టి....."

    "దీనివెనుక ఏముందో మీరు సైన్సు చదువుకోలేదుకదా అత్తయ్యా అందుకని, మీరు దేవుడని పేరు పెట్టుకొన్నారు. కాని, మాకు సైన్స్  తెలుసుకదా? ఈ ప్రపంచం  ఎలా పుట్టింది? ఈ భూమ్మీద జీవరాశి ఎలా ఏర్పడింది? మాకు సైన్స్ చరిత్ర చెబుతాయి. కాబట్టి ఈ సృష్టి రహస్యం మీద ఊహాగానాలుచేసి, దీనికంతా మూలం ఒకటుండాలికదా అనుకొని,  ఆ ఒకడిని దేవుడని పేరుపెట్టి, అతడికి అపారమైన మహిమలు ఆపాదించి, మూఢభక్తితో మురిసిపోయే స్థితిలోలేడు ఆధునిక  మానవుడు ఈ దేవుడు పుట్టిన రోజుల్లో  తెలియని చాలా విషయాలు ఆధునిక మానవుడు తెలుసుకొన్నాడు కేవలం మీ దేవుడుమాత్రమే పుట్టిస్తాడనుకొన్న పిల్లల్ని ఇవాళ సైంటిస్టులు టెస్ట్ ట్యూబుల్లో పుట్టిస్తున్నారు."

    "పుట్టుకని కనిపెట్టారేమోగాని చావుని కనిపెట్టలేదుగా?"

    "ఇది కనిపెట్టగలిగినవాళ్లు, అది కనిపెట్టలేరా? ఆ రోజు చేరువ లోనే వుందని మా విశ్వాసం!"

        *    *    *    *    *   

    నోములకు రమ్మని పుట్టింటివాళ్లు రాయడంవల్ల, అక్కడ నోచుకోడానికి పెద్దదిక్కు  లేకపోవడంవల్ల మంగళగౌరీ నోములు నోచుకోడానికి వచ్చింది బృందావని. వదినగారు నోచుకొన్నదని తెలిసి ఆమె ఆశ్చర్యానికి అంతూ పంతూ లేకుండా పోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS