"బాబూ.... రామయ్యా... జాగ్రత్త తండ్రీ! ఆ రౌడీలతో వద్దు బిడ్డ! వచ్చేయ్!" యాదమ్మ రోదిస్తోంది.
పరుశురాం నిటారుగా నిలబడ్డాడు. శరీరంలోని శక్తిని కళ్ళల్లోకి, చేతుల్లోకి తెచ్చుకున్నాడు.
సూట్ వాలా కెవ్వున అరిచి కిందపడిపోయాడు. రెండో పాదం ఓ రౌడీ మెడను తాకింది. చెట్టు కూలినట్టు కూలిపోయాడు వాడు.
రెండు అరచేతులతో ఒక స్ట్రోక్ తో అరడజను మందిని మొహాలు అప్పడాలయ్యేలా కొట్టాడు.
"బాప్ రే!" అరిచాడో రౌడీ.
పరుశురాం విజృంభణ చూసి బస్తీ జనం కూడా కర్రలు పట్టుకొచ్చి రౌడీలను కొట్టడం మొదలుపెట్టారు.
దాంతో రౌడీలకీ పరిస్థితి పూర్తిగా అర్దమైంది.
ఇంకా అక్కడే వుంటే ఎంత రొంపిలోకి దిగిపోవాల్సి వస్తుందో తెలుసుకుని పలాయనం చిత్తగించసాగారు.
సూట్ వాలా కూడా వాళ్ళతోపాటు పరిగెత్తాడు.
జనం అక్కడే వున్న వ్యాన్ కి నిప్పుపెట్టారు.
అందరూ పరుశురాంని ఎత్తుకొని ఈలలు, అరుపులు, కేకలతో ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
"ఈ ఏలనుంచి నేను నీ శిష్యుడ్ని" అన్నాడు మస్తాన్.
"నేను కూడా....."
నేను.... నేను... జనంలో ఉత్సాహం యాదమ్మ తడుముకుంటూ వచ్చింది.
"బిడ్డా!"
"అమ్మా!"
పరుశురాంని దగ్గరకు తీసుకొని ముద్దాడింది.
"బిడ్డా! వాళ్లు కిరాతకులురా! వాళ్లతో ఎందుకురా గొడవ నీకు?"
"అన్యాయాన్ని చూస్తూ ఊరుకోమంటావా అమ్మా!"
"ఆ మీనన్ గాడి మనుషులు ఈ బస్తీమీద మెరుపు దాడి చేస్తూనే వుంటారు బిడ్డా! ఇవన్నీ ఖాళీ చేయించి భూమి ఆక్రమించాలని సంవత్సరం నుంచీ వాడి ప్రయత్నం. నువ్వు వాడి ఆగడాలపైన దెబ్బ కొట్టావు. దెబ్బ తిన్న పాము కాటేయడానికి చూస్తుంది బిడ్డా! జాగ్రత్త!" అంది ఆవేదనతో.
పరుశురాం నవ్వాడు.
"ఎలాంటి పాము కోరల్ని ఎలా పీకాలో బాగా తెలుసమ్మా!బస్తీ జనం కలిసికట్టుగా వుంటే ఆ మీనన్ గాడి బాబు కూడా ఏం చేయలేడు.
నేను వాడి ఆగడాలని సహించను" అన్నాడు పరుశురాం.
"ఏమో! ప్రాణభయంతో చచ్చిపోతున్నాం!" అందో వృద్దురాలు.
"పరుసురాముడి దెబ్బ రుచి చూసేనా వాళ్లు బస్తీలోకి రావడానికి కలేజా వుండక్కర్లేదా అత్తా! అంది రాణి మెచ్చుకోలుగా.
రాణి మొత్తమీద దెబ్బ వేసాడు పరుశురాం.
"దరువేయడం కూడారాదు!" అంటూ పరుగుదీయబోయింది రాణి. గభాల్న పట్టుకుని రాణి చెవిలో చెప్పాడు.
"రాత్రికి నీ..... ('ఎడిట్')"
"ఛీ...." చేతుల్లో మొహాన్ని కప్పేసుకుంది రాణి.
పరుశురాం రచ్చబండ దగ్గర సిగరెట్ వెలిగించాడు.
బస్తీలోని ఆడ, మగా, చిన్న, పెద్దా అందరూ అక్కడ చేరారు.
"బాబూ నువ్వే అడ్డుపడకపోతే ఆనాకొడుకులు ఇళ్ళన్నీ కూలగొట్టేవాళ్లే" అన్నాడు బస్తీ లీడరు చలమయ్య ఆవేదనతో.
పరుశురాం అతనికేసి నిశితంగా చూసాడు.
"తాతా! నువ్వీ బస్తీకి ఈ చెట్టులాంటివాడివి. లీడర్ వి. నీ మనుషులకి కష్టసుఖాల్లో ఆసరాగా నిలబడాల్సిన వాడివి. ఇలాంటి రౌడీమూకలొచ్చి పడినప్పుడు ఎదిరించలేకపోతే కనీసం పోలీసులకైనా రిపోర్టు ఇవ్వచ్చు కదా?" అడిగాడు.
చమలయ్య ఏదో చెప్పబోయేంతలో ఓ స్త్రీ ముందుకొచ్చింది.
