Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 54

 

    ఫాదర్ ఆఫ్ అంజిబాబు ఇంజనీరు శ్రీశైలం, ఐ యాదగిరి.

    ఫాదర్ ఆఫ్ కాళిదాసు డాక్టరు.... విశాఖపట్నం, ఐ యాదగిరి.

    ఫాదర్ ఆఫ్ స్పందన.... టి.వి. ఆర్టిస్టు..."

    "ఓరి నీ చాదస్తం పాడుగాను. ఇంజనీరు కొడుకుని, డాక్టరు కొడుకునీ పెట్టుకుని ఇదేం పనయ్యా నీకు!" అంది రాణి.

    "ఐ యాదగిరి.

    ఇండిపెండెంట్ నేను ఎలచ్చన్లో నెగ్గి తీరాల! గెలిస్తే అందరికీ ఫ్రీగా రిక్షాలిప్పించేస్తా!" యాదగిరి గంభీరంగా నవ్వుతున్నాడు.

    "నించుంటే నించున్నావు గానీ.... ఇండిపెండెంట్ గా మాత్రం పోటీ చేయకు. ఎలక్షన్ జరక్కుండా ఆపాలంటే చంపేస్తారు" చెప్పాడు పరుశురాం.

    యాదగిరి నవ్వాడు.

    "మనదీ ముదురుకేసే బాబూ! అట్టాటాటికి భయపడను. ఎనక కాస్త బనీను పైకెత్తి చూడు. బాంబు దెబ్బలు తిన్న ఒళ్ళే! నువ్వు నీ మొగుడు మాత్రం నాకే ఓటెయ్యాల తల్లీ!"

    "నా మొగుడా!"

    నోరు తెరిచింది రాణి.

    "నీ పక్కన కూచుని నీ నడుం చుట్టూ చేతులేసినోడు నీ మొగుడు కాకపోతే ఎవరమ్మా!"

    "నేను చెప్పనా నీకు?"

    పరుశురాం నవ్వుతుంటే అతని చెంపమీద గిల్లింది రాణి.

    "త్వరగా పోనీ సినిమా టైము అయిపోతుంది" అన్నాడు పరుశురామ్.

    యాదగిరి రిక్షా ఎక్కి తొక్కడం మొదలుపెట్టాడు.

    "ఏయ్!"

    "ఏమిటి?" అడిగాడు.

    "ఎవరన్నా చూస్తే....  మనని..... అలా అనుకుంటారా?" సిగ్గుగా అడిగింది రాణి.
   
    "ఎలా.....?"

    "అదే....అలా.... మొగుడూ పెళ్లాలని....."

    "అలాని ఏమీ భ్రమపడకు. ఎక్కడో కొట్టుకొచ్చిన సరుకనుకుంటారు" చెప్పాడు పరుశురాం.

    "నిన్ను రిక్షాలోంచి దొర్లించేస్తాను" అంది రోషంతో.

    "పెళ్ళయ్యాక కొత్తలో నేనూ. మా ఆవిడ కూడా యిలాగే కీచులాడుకొనే వాళ్లం" అన్నాడు యాదగిరి.

     "నువ్వు నోరుమూసుకుని రిక్షా తొక్కు" అరిచింది రాణి. దాంతో రిక్షా కాస్త స్పీడెక్కింది.

    పరుశురాం చేతిని ఆమె మొత్తపైన వేసి నిమురుతూ "బాగుంది" అన్నాడు.

     మూతి తిప్పి ఊరుకుంది రాణి.

     సినిమా హాలు దగ్గర రిక్షా ఆగింది.

    రిక్షాకి డబ్బులిచ్చి పరుశురాం చేతిని పట్టుకుని ముందుకు నడవబోయిందల్లా ఎవరో చేయిపట్టి లాగితే ఆగిపోయింది రాణి.

     మస్తాన్. నోట్లో  చీటీని వివరంగా అటూ యిటూ తిప్పుతున్నాడు.

    "ఏంట్రా! ఏం కావాలి?" అంది.

     "ఏయ్! నిన్న కాక మొన్న బస్తీలో అడుగుపెట్టిన ఈ నా  కొడుకుతో రిక్షా ఎక్కి మరీ సినిమాకొచ్చావన్న మాట!"

     "నా యిష్టం!" ఈసడింపుగా అంది రాణి.

    "నీ యిష్టమే.  కాదనడంలా లేకపోతే నన్నెక్కనిస్తావా.... వాడి మోజులో పడిపోయి బిజినెస్ మీద చిన్న చూపైపోయింది నీకు.

     సినిమా రేపు చూడొచ్చు. పద ఊరికి కొత్తలా వున్నారు కొడుకులు... ఓ పట్టుపడితే అంతా సొమ్మే" అన్నాడు మస్తాన్.

     "నేను రాను" అంది రాణి కోపంతో.

     "ఏయ్! చెపుతుంటే చెవికెక్కడంలేదా!

    ఈడ్ని చూసుకొని ధీమా పోతున్నావేమో!

    తిప్పికొడితే బస్తీ సెంటర్ లో పడతాడు నా కొడుకు" అంటూ రాణి చేయిపట్టుకుని లాకెళ్ళబోయాడు.

    "చెయ్యొదులు" విదిలించింది రాణి!

     "విడిచిపెట్టకపోతే!" అన్నాడు మస్తాన్.

     ఆ మాట పూర్తికాలేదు. పరుశురాం కాలు మెరుపువేగంతో కదిలింది.

     "విరిగిపోతుంది.... అంతే!" అన్నాడు పరుశురాం.

    "అమ్మో!" అరిచాడు మస్తాన్.    

    "ఇంకో దెబ్బ తగిలిస్తే గోల్కొండలో పడతావు.

    రాణిని ఇంకెప్పుడూ బిజినెస్ కి పిలవకు. ఇక రాణి రోడ్డుపైన నీ కోసం నీ లాభంకోసం ఆట ఆడదు. పిచ్చివేషాలు వేయడానికి ప్రయత్నిస్తే మక్కెలూడదీస్తానీసారి" అని రాణి చేతిని పట్టుకుని సినిమా హాలులోకి నడిచాడు పరుశురాం.

                                                                      22

    అమ్మవారి జాతర కోసం ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు  బస్తీ జనం.

     గుడికి రంగులు వేశారు.

     రంగు దీపాలను రోడ్ కిరువేపులా తోరణాలుగా కట్టారు.

     బస్తీలో చిన్నా, పెద్దా, ఆడ, మగా, అందరూ ఆనందడోలికల్లో తేలిపోతున్న సమయంలో పెద్దగా మోతచేస్తూ ఓ జీపు, దాని వెనకే ఓ వ్యానూ వచ్చి ఆగినాయి.

     ఆ వాహనాలని చూడగానే బస్తీ జనంలో కలకలం... భయం.... ఆందోళన కలిగాయి.

     "మీనన్ మనుషులొచ్చార్రోయ్!" అరిచారెవరో.

     అంతే!

     జనం అటూ ఇటూ పరిగెత్తసాగారు.

    వ్యాన్ లోంచి పదిహేనుమంది రౌడీలు మారణాయుధాలతో క్రిందికి దుమికి ఇళ్ళపై బడ్డారు.

    దొరికినవాళ్లని చేతుల్లో వున్న ఆయుధాలతో కొడుతున్నారు. ఇళ్ళ ల్లోంచి సామాను బయటికి  విసిరేస్తున్నారు.

    జీపులో కూర్చుని సిగరెట్ కాలుస్తూ చిరునవ్వుతో చూస్తున్నాడు ఓ సూట్ వాలా!

     యాదమ్మని జుట్టుపట్టుకుని బయటకి ఈడ్చుకొచ్చి ఒక్క తోపు తోశాడు ఓ రౌడీ. ఆ విసురుకి  నడిరోడ్ మీద పడింది యాదమ్మ.

     "ఆగండి!"

    ఉరుము ఉరిమినట్లు -

     పిడుగు పడినట్లు - -

    భూమి దద్దరిల్లినట్లు ... వినబడిన గర్జనకి దుండగులు.... ఆ సూట్ వాలాకూడా క్షణంపాటు నివ్వెరపోయాడు.

     రోడ్ మద్యలో పడివున్న గుడ్డిదాన్ని లేవనెత్తి కూర్చోబెట్టి నడుం మీద  రెండు చేతులూ పెట్టుకుని నిలబడ్డ అతనికేసి తీవ్రంగా చూసారు దుండగులు.

    "ఎవరు వారు?" తీవ్రంగా వచ్చిన ప్రశ్నకి మొహమొహాలు చూసుకున్నారు వాళ్లు.
 
    "మేమెవరమో తెలీదా భే నీకు?" మీనన్ గారి మనుషులం!" అన్నాడు సూట్ వాలా విలాసంగా ముందుకొస్తూ.
   

    "ఎవడా మీనన్?" కంచులా మోగింది పరుశురాం కంఠం.

    "ఆయ్! మా బాస్ ని  ఎడవడంటావా? వీడ్ని లేపేయండ్రా!" ఆజ్ఞాపించాడు సూట్ వాలా!

    బస్తీ జనం చోద్యం చూస్తున్నారే తప్ ఎవరూ ముందుకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. మీనన్ మనుషులు ఎలాంటి కిరాతకానికయినా పాల్పడతారని జనానికి తెలుసు.
 
    రౌడీలు పరుశురాం చుట్టుముట్టారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS