"ఆ మీనన్ గాడికి బోల్డు డబ్బుంది బాబూ! ఆ డబ్బుతో మనుషుల్ని కొంటాడు వాడు. పెద్ద పెద్ద నాయకులు వాడి మాట వింటారు. పోలీసులు కూడా వాడి మాటే వింటారు బాబూ! ఆ రౌడీలిలా మామీద విరుచుకుపడే సమయంలో పోలీసులు కనీసం స్టేషన్లో కూడా వుండరు" చెప్పిందామె.
"వాడి మనుషులు ఇక్కడికొచ్చి మమ్మల్ని కొట్టి భయపెట్టి ఇళ్లల్లో సామాను బయటపడేసి పోతుంటారు బాబూ" అన్నాడు చలమయ్య.
"అలా చేస్తే వాళ్ళకేం లాభం?" అడిగాడు పరుశురాం.
"ఇక్కడ జనాన్ని భయభ్రాంతుల్ని చేస్తే కొన్నాళ్ళకి ఇళ్లు వదిలేసి అమ్ముకుపోతామని బాబూ."
"అంటే మీరిక్కడ వుండడం మీనన్ కి ఇష్టంలేదా."
"అదికాదన్నా! ఇక్కడ ఏవో ఆకాశం మేడలు కట్టాలని వాడి ప్రయత్నం" చెప్పాడు షామ్ రావు అనే కుర్రాడు.
"పోలీసులకు చెబితే ఏం చేశారు" అడిగాడు పరుశురాం.
చలమయ్య బాధగా నవ్వాడు.
"అంతా అయిపోయాక వచ్చి చూసిపోతారు. కంటి తుడుపు కోసం ఆ రౌడీ నాయాళ్లని గుర్తుపట్టమంటారు. మీనన్ గాడి చేతుల్లో తొత్తులు బాబూ! వాడిచ్చే పైసల్ని చూసుకుంటారేగానీ ఈ పేద జనం ఏమయిపోతే ఎవరిక్కావాలి?ఓట్ల సమయం వస్తే నాయకులొస్తారు. కబుర్లు చెపుతారు. బుజ్జగిస్తారు. కౌగలించుకుంటారు. సారా పోయిస్తారు. మా ఓట్లే బాబూ ఈ నాయకులకి కూడు పెట్టేది, పదవిని కట్టబెట్టేది! మా బతుకుల్ని బలిపెడితేనే బాబూ ఓ నాయకుడ్ని దింపి మరో నాయకుడు పదవిలోకి వెళ్లేది ఏదో సామెత చెప్పినట్టు పేదవాడి నవ్వు పెదవికి చేటని! ఎవడిక్కోపమొచ్చినా బలైపోయేది ఈ పేదోళ్ళే బాబూ" చలమయ్య చమరుస్తున్న కళ్లతో చూస్తున్నాడు.
"ఈ స్థలాలకి పట్టాల్లేవా తాతా?" పరుశురాం తీవ్రంగా ఆలోచిస్తూ అడిగాడు.
"చాలా మందికి వున్నాయి బాబూ" కాస్తో కూస్తో డబ్బు మా మొహాన పడేసి మమ్మల్ని గెంటివేయాలని మీనన్ గాడి యోచన."
"అంటే పోలీసులు, నాయకులు కూడా మనకి సాయపడరు? అంతేనా?"
"అంతే బాబూ!" అంది మరియమ్మ.
పరుశురాం సిగరెట్ పొగని గుండెల్లోకి పీల్చి వదిలాడు.
"ఇప్పుడేం చేయాలో నువ్వే ఆలోచించు బాబూ సదుకున్నోడివి" అంది గోవిందమ్మ అనే వృద్దురాలు.
"అన్న వున్నాడు మనకేం భయంలేదు....." అన్నాడు ధీమాగా కన్నయ్య.
"అన్న దెబ్బ రుచిచూసినోడ్ని. నేను చెపుతున్నా అన్న దెబ్బంటే గోల్కొండ అబ్బ అనాలి. మనకి పికర్ లేదు" అన్నాడు మస్తాన్.
"పోరా తాగుబోతు నాయాలా! నీ మాటల్నెవరు నమ్ముతారు" అంది రాణి.
"అన్న నీ గుప్పిట్లో వున్నాడని ఎగరమాకు. అన్నకి చెప్పి నీ పొగరు దించేస్తాను" మస్తాన్ పక్కనే వున్న గవీజ్ ఖాన్ అన్నాడు.
"పోయి పూలమ్ముకోక నీకు రాజకీయాలెందుకురా పో పో' అంది రాణి గవీఖాన్ ని.
"రాజకీయాలు నాకు కొత్తకాదే జిల్ జిల్. అన్న నా ముందు నుంచుంటే ఆనాకొడుకుల్ని కైమా కొట్టి పారేస్తాన్."
రాణి కోపంగా చూసింది.
"ఒరే సన్నాసీ ఎవడ్రా నీకు అన్న యాబై ఏళ్ళు కిందెట్టుకుని పట్టుమని పాతికేళ్లు లేని హీరోని అన్నంటున్నావు" అంది.
చలమయ్య నవ్వాడు రాణి మాటలకు.
"అదికాదే పిచ్చి మొహమా. మనకి అడంగా నిలబడి చేయూతనిచ్చే వాడు చిన్నవాడయినా అన్న అనడం పద్దతే" వివరించాడు చలమయ్య.
పరుశురాం అందరికేసి చూసాడు.
"మీరెవరికీ భయపడనవసరంలేదు తాతా! ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ శక్తిని మీరు గ్రహించండి. ప్రతిఘటన వుందని తెలిస్తే శత్రువు వెనుకంజ వేస్తాడు. బస్తీ మాట ఒకే మాట గా వుండాలి. ఈ బస్తీ విసిరే సవాల్ ని ఎదుర్కోడానికి జేజదిగిరావాలని వాళ్లు తెలుసుకోవాలి"ఆవేశంతో అన్నాడు పరుశురాం.
గోవిందమ్మ అడుగు ముందుకేసి అంది.
"మాకిన్ని మాటలు చెప్పావు బాబూ! కానీ నీ అండ లేకపోతే మాకు ధైర్యం చాలదు. నువ్వు ఈ బస్తీలోనే వుండిపోతావా బాబూ!"
పరుశురాం గుండెని ఆ మాటలు చాలా సున్నితంగా తాకాయి.
నిజమే. వాళ్ళకి తనో ఆరిందలా, నాయకుడిలా పెద్ద హీరోలా ఇన్ని మాటలు చెప్పాడు.
తనీ బస్తీలో ఎన్నాళ్లుంటాడు. బస్తీలో జనాన్ని ఓ తాటిపైకి తేగలిగాడు. దైర్యసాహసాలు నూరిపోయగలిగాడు. వాళ్ళలో ఉత్సాహాన్ని కలిగించాడు. తను వెళ్ళిపోతే తిరిగి వీళ్ల పరిస్థితి ఏమిటి?అసలు తనుండి మాత్రం ఏమన్నా చేయగలడా? మొండి ధైర్యం, సాహసం అదే అతని ఆస్తిపాస్తులు. వాళ్లకి తను కావాలి.
యాదమ్మ కర్ర పట్టుకుని తడుముకుంటూ ముందుకొచ్చింది.
"నా బిడ్డ ఇంకెక్కడికి వెళతాడే గోవిందమ్మా. ఏదో పని చూసుకుని మా దగ్గరే వుండిపోతాడు."
"అవును అన్న ఇక్కడే వుండాలి" అరిచాడు కన్నయ్య.
పరుశురాం కళ్లల్లో నీరు తిరిగింది
వాళ్లెవరు?
తానెవరు?
చాలా కాకతాళీయంగా అక్కడికి చేరాడు తను.
ఈనాడు వాళ్ల అభిమానం, ప్రేమ, వాత్సల్యం అతన్ని కట్టి పడేస్తున్నాయి.
"ఏ రామయ్య తండ్ర మా దగ్గిర వుంటావా బాబూ" ఓ పెద్ద అడిగాడు.
"ఏయ్ నేనున్నాగా! ఇక్కడే వుంటానని చెప్పు" మోచేత్తో పొడుస్తూ అతనికే వినబడేలా అంది.
పరుశురాం అందరికేసి చూశాడు.
