అప్పుడు అతని చూపులు ప్రేంకుమార్ ముందు వున్న తెలుగు మేగజైన్స్ మీద పడ్డాయి.
వెంటనే మురుక్కాలవకి వరదొచ్చినంత ఉత్సాహం కలిగింది అభిషేకాన్ కి. ఇంక బంకలా లంకించుకున్నాడు.
"మా ఇంట్లో తెలుగు మేగజైన్లు తెప్పించడం మానేశానండీ" అన్నాడు విజయగర్వంతో విర్రవీగుతూ.
"ఎందుకు?" అన్నాడు ప్రేంకుమార్.
"ఆ! మా తమిళం మేగజైనులు చదివేసరికే మా టైమంతా గడిచిపోతుంది. ఇంక వెధవ తెలుగు మేగజైనులు చదివే టైమెక్కడుంది! తెలుగు మేగజైనులంటే గుర్తొచింది మొన్న మా మామయ్య మెద్రాసు నుంచీ ఈ ఊరొచ్చాడండీ. కంపెనీ పనిమీద. అబ్బ! అయన ఎంత పెద్ద అఫీసరో! అబ్బ! అయన ఎక్కడికెళ్ళినా ప్లేయిట్ లోనే వేళతాదండీ! ఏ సేటికీ వెళ్ళినా స్టార్ హోటల్స్ లోనే దిగుతాడు. ఇక్కడ కూడా స్టార్ హోటల్లోనే దిగాడు మామయ్య! దిగీ దిగగానే అర్జెంటుగా టాయిలెట్ లోకి వెళితే అక్కడ టాయిలెట్ పేపర్ కనబడలేదుట! అందుకు ఏం చేశాడో తెలుసా?" అన్నాడు నవ్వాపుకుంటూ.
"ఏం చేశాడేమిటి?" అన్నాడు ప్రేంకుమార్.
"మావయ్య పరిగెత్తి టాయిలెట్ లో నుంచి బయటకొచ్చి రూమ్ లో ఉన్న ఒక తెలుగు మేగజైను పేజీలు రెండు చించుకుని, మళ్ళీ టాయిలెట్ లోకి దూరిపోయాడు. ఎందుకో తెలుసా? అందుకే? అందుకేనండీ అందుకే పనికివస్తాయి తెలుగు మెగాజైనులు" అన్నాడు కిచ కిచ నవ్వి.
"ఇప్పుడు నేను భోజనం చెయ్యాలి. భోజనం ముందు అలాంటి మాటలు చెప్పకు" అన్నాడు ప్రేంకుమార్ వెగటుగా మొహంపెట్టి.
"అబ్బే! తెలుగు లాభం లేదండీ! అబ్బ! టామిల్ ఎంత బాగుంటుందో! మా టామిల్ మేగజైను ఉందండీ, కల్కి అని, దాన్లో ఒకే సీరియల్ ముప్పయ్యేళ్ళు వచ్చిందండీ! ఒకే మేగజైనులో ఒకే సీరియల్ మూడు సార్లు పబ్లిష్ చేశారండీ! ఏవండీ! ఎక్కడన్నా ఇలా జరిగిందా చెప్పండి! ఇంకా మా కుముదమ్ మేగజైన్ ఉందండీ! అబ్బ! హైయ్యెస్ట్ సర్క్యులేషన్ అండీ! అరులక్షలో, ఏడు లక్షలో కాపీలు అమ్ముడుపోతాయ్! అసలు తెలుగు వాళ్ళలో ఎవరికీ మేగజైను కొని చదివే అలవాటు లేదండీ! అందుకనే ఎంత గొప్ప మేగజైన్ అయినా లక్ష కాపీలు అమ్ముడుపోతే గొప్ప" అన్నాడు అభిషేకన్ కులుకుతూ.
"భారతీయ భాషలలో హైయ్యెస్ట్ సర్కులేషన్ ఉన్న మేగజైన్ మలయాళంలో వచ్చే 'మంగళం' మేగజైన్. పద్నాలుగు లక్షలకు పైనే సేల్స్ ఉంటాయి." అన్నాడు ప్రేంకుమార్ ఆలోచిస్తూ.
ఆ మాటతో అభిషేకన్ ఉత్సాహం దెబ్బతో తగ్గిపోయింది. హిట్ కొట్టిన బొద్దింకలా నీరసంగా చూశాడు.
కొద్దిక్షణాల తర్వాత హటాత్తుగా ఏదో గుర్తొచ్చి ఉత్సాహం పుంజుకున్నాడు మళ్ళీ.
"సార్! సార్! టెన్నిస్ లో రమేష్ కృష్ణన్ డేవిస్ కప్ ఫైనల్సు కి వచ్చినాడు చూసినారా సార్!" అన్నాడు హుషారుగా.
"అవును. ఇండియాకు పేరు తెచ్చాడు రమేష్ కృష్ణన్! హీ ఈజ్ ఏ గ్రేట్ ఇండియన్!" అన్నాడు ప్రేమకుమార్.
వెంటనే అసహనంగా అన్నాడు అభిషేకన్.
"రమేష్ కృష్ణన్ గ్రేట్ ఇండియన్ కాదు సార్! గ్రేట్ తమిళ్యన్! గ్రేట్ తమిళ్ యన్!" అన్నాడు రెట్టిస్తూ ఉత్సాహంతో ఉబ్బిపోతూ.
"అవునవును" అన్నాడు ప్రేమకుమార్.
"రిలయన్స్ కప్ క్రికెట్ లో కూడా మా టమిలయన్స్ ఒకరు ఉన్నారు సార్. శ్రీకాంత్ తెలుగువాడు ఒక్కరూ లేడు సార్" అన్నాడు అభిషేకన్ ఆనందంగా. "అజహరుద్దీన్ ఉన్నాడు కానీ,
అజహారుద్దీన్ తెలుగువాడు కాడు సార్ ఏమంటారు సార్?"
"వీడు ఇంకాసేపు నా పక్కన కూర్చుంటే నా మెదడు మొద్దు బారిపోయి గోలీకాయంత చిన్నదైపోతుంది." అనుకొన్నాడు ప్రేంకుమార్ విసుగ్గా. అందుకని త్వరత్వరగా జేబులోంచి రెండు వందల రూపాయల నోట్లు బయటికి తీశాడు. అవి అతనికి ఇచ్చి "అభిషేకన్ ఆ హరిణి ఎడిటర్ మాటలకి బెదిరిపోయి వెనక్కి తగ్గింది. కానీ మనం తగ్గకూడదు. అవునా! నీ ఊపు తగ్గించకు! ఉదృతం చెయ్ నీ ప్రచారం జరిగినదానికి చిలువలు కల్పించి కధలు అల్లేయ్ వెళ్ళు! అన్నాడు.
"నాకిదంతా మళ్ళీ చెప్పాల్నా సార్" అని నోట్లోని జాగ్రత్తగా చిటికే వేసినట్లు లేక్కపెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు అతను. "నా వరై సార్" అని శెలవు తీసుకుని బయటికి వచ్చాడు.
అప్పుడు కనబడింది అతనికి కాలభైరవుడి లాంటి కుక్క.
ఆ రెస్టారెంట్ దగ్గర బొమికలు దొరుకుతాయని తెలుసు దానికి. వాటికోసం రోజూ అది అక్కడికి ఒక ట్రిప్పు కొడుతుంది.
అభిషేకన్ దాన్ని చూశాడు.
అది అతన్ని చూసింది.
ప్రాణభయంతో టీవీఎస్ స్టార్ట్ చేశాడు అభిషేకన్.
కుక్క వెంటబడింది.
రయ్యిమని టీవీఎస్ మీద దూసుకు వెళ్ళిపోయాడు అతను.
పళ్ళు బయటపెట్టి పరిగెడుతూ అతన్ని తరుముతోంది కుక్క.
ఆ గాభారాతో ఎటు వెళుతున్నాడో చూసుకోకుండా గుడ్డిగా ముందుకి వెళ్ళిపోయాడు అభిషేకన్. ధన్ మని దేనికో గుద్దేశాడు. మాడు చిట్లినంత బాధ కలిగింది. కుక్క ఆ చప్పుడికి బెదిరి పారిపోయింది.
తలఎత్తి చూశాడతాను.
అది సేక్రేటేరియల్ దగ్గర వున్నా తెలుగుతల్లి విగ్రహం.
టప్పున ఒక నీటి చుక్క రాలిపడింది పైనుంచి.
