Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 53


    ఆమె గొంతులో నిజాయితీ వినబడుతోంది. ఆమె మొహంలో సిన్సియారిటీ కనబడుతోంది. కన్నీళ్ళు కల్మషాన్ని అంతా కడిగేస్తే పరిశుద్దమై పోయిన ఆమె మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది.
    "కైండ్లీ ఎక్స్యుజ్ మీ సర్! ఐ క్రేప్ ఫర్ యువర్ ఇన్ డల్జెన్స్ " అంది హరిణి.
    "ఇటీజ్ టూ లేట్ హరిణీ" అన్నాడు ఎడిటర్ నెమ్మదిగా.
    మళ్ళీ ఒక్కసారిగా దుఃఖం పొంగి వచ్చింది ఆమెకి.
    "అయితే నా సీరియల్ సగంలో ఆపేస్తారా?" అంది భాయోద్వేగంతో. "అలా చేస్తే నాకు భవిష్యత్తే వుండదు సర్. నన్ను మన్నించి......"
    "ఇక ముందు నీ మొహం నాకు కనబడకూడదు. ఇంకెప్పుడూ ఈ ఆఫీసు గుమ్మం తొక్కకు. ప్లీజ్ గో అవే" అన్నాడు ఎడిటర్.
    "సర్"
    "ప్లీజ్ గో అవే"
    "సర్" నా మీద పోలీసు కేసు ఏమన్నా " అంది హరిణి భయంగా.
    "నీ కంప్లయింట్ విత్ డ్రా చేసుకో. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాను నిన్ను" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    టేబుల్ మీద వున్న తన కంప్లయింట్ ని అందుకుని చింపివేసింది హరిణి.
    మళ్ళీ ఎడిటర్ కి గుర్తు వచ్చింది.
    ఈ అమ్మాయి తన దగ్గరికి వచ్చిన మొదట్లో -
    ఒక లాయరు నోటీసు తెచ్చింది.
    తనని బెదిరించాలని చూసింది.
    తర్వాత తన చేతులతో తనే చింపేసింది.
    అదే జరుగుతోంది ఈ పోలీసు కంప్లయింట్ విషయంలో కూడా.
    అతనికి గుర్తు వచ్చింది ఒక సూక్తి.
    "ధర్మో ధర్మతి రక్షితః'
    "నువ్వు ధర్మాన్ని రక్షించు ధర్మం నిన్ను రక్షిస్తుంది.
    అదే జరుగుతోంది ఇక్కడ ఇప్పుడు.
    అతను తలఎత్తి చూసేసరికి తల వంచుకుని గుమ్మం దాటిపోతూ కనబడింది హరిణి.


                                   20

    లక్డి కాపూల్ లో వున్న తన ఆఫీసులో నుంచి బయటికీ వచ్చి టీవీఎస్ ఎక్కాడు అభిషేకన్. రెండు నిమిషాల తర్వాత అతని టీవీఎస్ ఒక బార్ ముందు ఆగింది.
    అప్పటికే బార్ లో కూర్చుని విస్కీ తాగుతున్న ప్రేంకుమార్ లోపలికి వస్తున్నా అభిషేకన్ ని బోర్ గా చూశాడు.
    "ఓరి వీడిదుంపతెగ! గుండు చేయించుకున్న గండు పిల్లిలా ఎట్లా వున్నాడో వీడు" అనుకున్నాడు మత్తుగా.
    "వణక్కం సార్" అని సణుగుతూ దూరంగా నిలబడ్డాడు అభిషేకన్. ప్రేంకుమార్ తాగి వున్నప్పుడూ అతని దగ్గరి కెళ్ళాలంటే అభిషేకన్ కి భయం. తాగి ఉన్నప్పుడూ ప్రేంకుమార్ ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదని అభిషేకన్ కే తెలుసు.
    చిటపటలాడుతున్నాడు ప్రేంకుమార్ హరిణిని బ్రహ్మాస్త్రంగా ఎడిటర్ మీద ప్రయోగించగలిగాలిగానని సంతోషించాడు తను. కానీ తన ప్లాన్ బాక్ ఫైర్ అయింది. తడిసిపోయిన టపాకాయలా తుస్సుమంది తన ప్లాన్. ఇపుడింక తన పేరు చెబితే భగ్గుమంటోంది హరిణి. తను ఫోన్ చేస్తే వెంటనే కట్ చేసేసింది.
    ఆ అవమానం దిగమింగాడానికే తాగుతున్నాడు తను ఇప్పుడు.  
    ఇప్పుడు తన కోపం అంతా ఎవరిమీదన్నా చూపించకపోతే తనకు మనశ్శాంతి వుండేటట్లు లేదు.
    అందుకని ఈ అభిషేకన్ గాణ్ణి పటపట నాలుగు పీకితే!
    అంతపనీ చేసి వుండేవాడే , గానీ అంత మైకం లోనూ అతనికి  కాస్త ఇంగితజ్ఞానం మిగిలింది. ఆలోచనలో పడ్డాడు.
    ఆ ఎడిటర్ చాలా సమర్ధుడు కావడం వల్ల తను పన్నిన ఉచ్చులో ఇరుక్కోకుండా చాల చాకచక్యంగా బయటపడ్డాడు గానీ అందులో ఈ అభిషేకన్  గాడి తప్పేముంది. వీడు ఊరికే దాకా ఊదే జోకర్ గాడు. అంటే నధింగ్ మోర్.
    వీడితో తను పీచీ పెట్టుకోకూడదు.
    పైగా వీడితో ముందు ముందు చాలా పనీ వుంది తనకి. వీడు టెలిఫోన్స్ లో జూనియర్ ఇంజనీరు! అమెరికాకి కూడా అప్పనంగా ఫోన్ చేసి అబద్దాలు ప్రచారం చెయ్యగల నేర్పు వుంది వీడికి.
    వీడ్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదు తను. అందుకని లేని ప్రేమ నటిస్తూ 'దా! అభిషేకన్ దా అన్నాడు ప్రేంకుమార్.
    ప్రేమ్ కుమార్ ఆ మాట అనగానే, అభిషేకన్ షేక్ కావడం కొంచెం తగ్గింది. పల్చగా ఉన్న ప్రేమ్ కుమార్ షర్టు జేబువైపు ఆశగా చూశాడు. ఆ జేబులో నుంచి కనబడుతున్న వందరూపాయల నోట్లు అతని నోట్లో నీళ్ళు ఊరేలా చేశాయి. చెంగున వచ్చి ప్రేమ్ కుమార్ వళ్ళో కూర్చున్నంత ఇదిగా కూర్చున్నాడు.
    "ఏం తింటావ్?" అన్నాడు ప్రేంకుమార్.
    "ఇడ్లీ సాంబార్! అది కాకపోతే వడ సాంబార్" అన్నాడు అభిషేకన్.
    ఇది చైనీస్ రెస్టారెంటు. ఇక్కడ ఇడ్లీ వడా సంబారూ ఉండవు. నూడుల్స్ తిను" అన్నాడు ప్రేంకుమార్.
    తర్వాత పొట్టపగిలేలా తిన్నాడు అభిషేకన్. ఆ తిన్నది అరగాలంటే తెలుగుని తిట్టాలి కదా! అందుకని తెగులు తగిలిన కోడిలా అటూ ఇటూ చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS