Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 54

 

    అ మిగిలిపోయిందేదో తెలుసుకుందుకు కొంతకాలం పట్టవచ్చు. దాన్ని సాధించేందుకు మరికొంతకాలం పట్టవచ్చు. ఒకవేళ తప్పి జారితే ఆ ప్రయత్నంలో మీ పేరు స్మరిస్తూ నేను ప్రాణాలు కోల్పోవచ్చు.
    కాని తుదిదాకా ఈ అన్వేషణ లో కొనసాగుతాను. మీ ఆశీస్సులే నాకు కావాలి" అంటూ ప్రొఫెసర్ శ్రద్దాదేవి పాదాలను అల్లుకు పోయింది జ్యోతి.
    వారి సంభాషణ వింటూ ఆ మమతా బంధువు పారమ్యాలను దర్శించిన శ్రీ బృందావన్ గోయెల్ కనులు చమరించినాయి. ఈ శతాబ్దంలో అరాటాల వెంట, ఆర్ధిక సమస్యల వెంట పిచ్చి పరుగులు తీస్తున్న ప్రపంచంలో ఇంత నిష్కల్మషమయిన మమతాబంధాలుండటం అద్భుతమే!
    పురుషాధిక్య సమాజంలో అడ పుట్టుకలోని అశక్తతను ఆవలకు నెట్టి పురోగమించే వీరి వ్యక్తిత్వాలు అపురూపమే కాదు ఆదర్శప్రాయమయినవి అని సంభావించారు శ్రీ బృందావన్ గోయెల్. ప్రొఫెసర్ శ్రద్దాదేవి అంటే హిమగిరి శిఖరాగ్రం మీద రవి కిరణాలు తరళించే తుహిన తుషారం అనిపించింది.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి వ్యక్రిగతమంటే ఆకాశం అంచుల్నించి అమిత వేగంతో దూసుకు వచ్చే ఉల్కాపాతం అనిపించింది.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి మేధాసంపన్నత అంటే జల సాంద్రమయిన శ్రావణ మేఘాలు డీ కొన్నప్పుడు కనులు మిరుమిట్లు గొలిపేలా ఉప్పతిల్లె కాంతి లత అనిపించింది! అంతటి గంభీరమయిన ధోరణికి అలవాటు పడి వున్న శ్రీ బృందావన్ గోయెల్ ఆమెతో ఏకాంతంగా సంభాషించాలనీ చిన్న పిల్లాడిలా తొందరపడిపోవటం ప్రారంభించారు.
    క్రేనియం వగైరా లన్నింటినీ బాగ్ లోకి పదిలపరచి ఐలాండ్ మ్యూజియంకు పంపేశారు. బండ పూసలు, రాక్షసి గుడిలో సేకరించి తెచ్చిన కుండ పెంకులూ పదిలపరిచెందుకూ ఏర్పాట్లూ జరిగినాయి. అవి రక్షిత స్థావరంలోకి వెళ్ళాయి.
    డాం చూపించెందుకు జ్యోతిని వెంట తీసుకుని వెళ్ళిపొయినాడు జయకృష్ణ. శ్రీ బృందావన్ గోయెల్ కు కావాల్సిన అవకాశం దొరికింది.
    ఎక్కడో త్రవ్వకం పనులు కొనసాగిస్తే చరిత్రకు సంబంధించిన కొన్ని వస్తువులేవో దొరుకుతాయి. కాని ప్రొఫెసర్ శ్రద్దాదేవి లాంటి జ్ఞాన సంపన్నులు , మేధా మూర్తులు అయినవారిని కదప గలిగితే ఆణి ముత్యాల వంటి అంతకు మించిన రత్నరాసుల వంటి బ్రతుకు అర్దాలెన్నో బయట పడతాయి.
    విజ్ఞాన ప్రపంచంలో శ్రమించి సేకరించి తెచ్చుకున్న అనుభవాలనే రత్నాలకూ ఎవరూ వెలకట్టలేరు. అవి అమూల్యమయినవి, దుర్లభమయినవి. వాటిని పొందే అవకాశం అందరికీ రాదు. అటువంటి అవకాశం తనకిప్పుడు వచ్చింది, కాబట్టి దాన్ని పదిలంగా దక్కించుకోవాలని బావించారు గోయెల్.
    "ప్రొఫెసర్ ! లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నించి రమణీయమయిన ప్రకృతి సాక్షాత్కారిస్తుంది. మీరు రాదలిస్తే నాతొ రావచ్చు. మీరు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే నాకేమీ అభ్యంతరముండదు" అన్నాడు శ్రీ బృందావన్  గోయెల్.
    వారి సభ్యతా పూర్ణమయిన ధోరణికి చకితురాలయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. రెండు క్షణాల ఆలోచన తరువాత. "రమణీయమయిన ప్రకృతి దృశ్యాలను చూడటం కూడ విశ్రాంతి అనే అనుకోవాలని కధ సర్! పదండి మీతో పాటే నేనూ వస్తాను"అంటూ అప్పటి కప్పుడు బయలు దేరింది ఆమె.
    ఈసారి డ్రైవింగ్ తానే తీసుకున్నారు శ్రీ బృందావన్ గోయెల్. కారులో పొతే లేక్ వ్యూ గెస్ట్ హౌసుకు కొద్ది నిముషాలే ప్రయాణం వృక్షాల మధ్య ఒదిగివున్న భవనం.
    క్యూరేటర్ సర్ వచ్చారనగానే అటెండర్ పరుగున వచ్చాడు. లాన్ లో దట్టమయిన నీడ ఉన్నచోట రెండు కుర్చీలు వేశాడు, అక్కడ నించి చూస్తే అనంత జలరాశి కన్పిస్తోంది.
    నీలినీలి జలధారలపై ఎత్తయిన తరంగాలు. గిరిశిఖరాల మధ్య అయినింటి పడుచులా ఒదిగి పోయిన కృష్ణమ్మ తల్లి. పల్లెకారులు పుట్ట్టీల మీద తల్లి ఒడిలో కేరింతలు కొట్టే పాపల్లా కన్పిస్తున్నారు. కట్టనురాన్ లు కొండ చిలువల్లా అలలపై తేలుతున్నాయి. అనంత జలరాశిని నిరోధిస్తూ పొడవయిన డాం!
    ఎటు చూచినా అందమే! ఏ మేరకూ ఆనందమే, యుగయుగాలుగా తెలుగువారి బ్రతుకుల్ని తీర్చి దిద్దే కృష్ణమ్మ అంద చందాలను అక్కడే చూడాలి. ఆనంద రాసధారాలు పొంగి పొరలే అనుభవ సాగరమే కదా నాగార్జునసాగరం.
    అక్కడ కూర్చుని ఆ అందచందాలను చూస్తూ , బ్రతుకు అనబడే ఈ వెతుకులాటలో ఇంతకు మించిన మధుర క్షణాలేముంటాయి అని ఆలోచిస్తోంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "ప్రొఫెసర్! మీ మౌనాన్ని భంగపరుచుతున్నందుకు నన్ను మన్నించండి. విజ్ఞాన మూర్తులయిన మీవంటి వారి పరిచయమే ఒక అరుదయిన అవకాశం. మీ నించి కొన్ని సంగతులు తెలుసుకోవాలను కుంటున్నాను." అన్నారు శ్రీ బృందావన్ గోయెల్ చిరునవ్వుతో.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి వారి వంక సాదరంగా చూచింది.
    "క్యూరేటర్ సర్! మీరు వయసులో , ఉద్యోగ రీత్యా , అనుభవం లోనూ నా కన్నా పెద్దవారు. నన్ను మీరు అంతగా మన్నించటం నా అదృష్టమో మీ మంచితన,మో అయి వుండాలి. మీకు నేనేదయినా చెప్పగలిగితే నాకు దొరికిన ఒక చక్కని అవకాశంగా భావిస్తాను. సంశయించకండి" అన్నదామె.
    శ్రీ బృందావన్ గోయెల్ పైపు వెలిగించటం కూడా మర్చిపోయారు.
    "ప్రొఫెసర్! సాహసోపేతమైన మార్గంలో మీరు జ్యోతిని తీర్చిదిద్దుతున్నారు. కాని శ్వేతకి కన్పించటమనేది కేవలం ఒక మనో జనితమయిన భ్రాంతి అని నాకు అనిపిస్తోంది.
    అత్మరూపాలు అనేవి వుండటం ఒకవేళ సంభవమే అయినప్పటికీ అవి భౌతిక రూపాలయిన మనుషుల జీవితాలలోకి ప్రత్యక్ష సంబంధానికి రాగాలగటం అసంభమనుకుంటున్నాను. ఈ విషయంలో బహుశా నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించరనుకుంటాను.
    "పూర్తిగా అవగాహనకు రాని విషయాల గురించి ఒక దృడభిప్రాయాన్ని కలిగించు కోవటం పొరపాటు. తెలుసుకోవాలన్న ఆసక్తి కాని మీతో వాదించేటంత అవగాహన కాని నాకు లేదు. మీరెందుకు శ్వేతకిని మనో భ్రాంతిగా కాక ఆత్మ రూపంగా సంభావించినారో చెప్పండి " అని అడిగాడు క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్. సుదూర తీరాలలో కన్పించే జలసాగరపు అంచుల వంక చూస్తూ కొద్ది క్షణాలు మౌనంగా గడిపింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆమె మాటల కోసం అభ్యంత ఆసక్తితో ఎదురు చూచినాడు శ్రీ బృందావన్ గోయెల్.
    నెమ్మది అయిన స్వరంతో ప్రారంభించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆనాడు జ్యోతికి చెప్పిన తన అనుభవాన్ని వీరితో చెప్పింది." "క్యూరేటర్ సర్! ప్రకృతి రహస్యాలు అగాధమయినవి. విజ్ఞాన శాస్త్రం ఇంకా విశ్లేషించలేని అంశాలు చాలా మిగిలివున్నాయి. అవన్నీ అసత్యాలనుకోవటం భ్రమ.
    శాస్త్ర విజ్ఞానం విశ్లేషించలేకపోయినా కొన్ని అరుదయిన అంశాలు సంభవాలయినప్పుడు అవి మనుషుల ప్రత్యేక్ష అనుభవంలోకి వస్తాయి.  అటువంటి ప్రత్యక్ష అనుభవాలను కాదని కొట్టి పారేయటం వాస్తవాన్ని విస్మరించటమే అవుతుంది.
    ఆనాడు జూనియర్ లెక్చరర్ గా పలాస కు పోతూ శ్రీకాకుళం విడిచి కళింగ పట్నం దాటి వంశధారను దాటి నరసన్న పేట మీదుగా కోటబొమ్మాలిని చేరుకున్నాను. అక్కడ నించి బండిలో నౌపాడాకు ప్రయాణం చేస్తున్నాను. నౌపాడా నించి నావల్ రేవు మీదుగా పలాసకు చేరుకోవాలి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS