Previous Page Next Page 
మారణహోమం పేజి 54

 

    "ఈ కొండ ఎక్కి అవతలవైపు దిగిపోయామంటే అక్కడ మన మనుషులు కొంతమంది ఉన్నారు, మనకు ఇంకేం ప్రమాదం ఉండదు" అన్నాడు నిఖిల్.
    కొండ ఎక్కడం ప్రయసగానే ఉంది. ఎక్కడం మొదలెట్టినప్పుడే నిఖిల్ బూట్లు విప్పి పడేసి, రాదని కూడా చెప్పులు వదిలేయ్యమన్నాడు.
    కొద్దిసేపటి తర్వాత కొండ ఎక్కగాలిగారు ఇద్దరూ. అక్కడ నిలబడి , అవతలి వైపు కనబడుతున్న దృశ్యాన్ని చూశారు.
    ఎక్కువ ఎత్తయిన కొండకాదది. కానీ దుర్భేధమైన కోటగోడలా నిట్టనిలువుగా ఉంది.
    వాళ్ళు ఎక్కి వచ్చిన వైపు కొండ అంతా ముప్పాతిక మూడొంతుల మేర సిమెంటు చేసినట్లు ఒకే రాయిలా ఉంది. దిగడానికి అనువుగా లేదు.
    ఆలోచిస్తూ కొద్దిసేపు ఆగాడు నిఖిల్.
    మళ్ళీ ప్రత్యక్షమయింది మేక. అది రోజూ ఆ కొండల మీద తిరిగే దానిలాగే ఉంది. చిరపరిచితమైన మార్గంలో వెళ్ళిపోతున్నట్లు రెండుకిలోమీటర్ల మేర కిందికి దిగి తర్వాత కొద్ది క్షణాల పాటు అదృశ్యమయిపోయింది.
    తొంగి చూశాడు నిఖిల్. ఏమయింది ఇది? జారి కిందపడిపోయిందా?
    మేక జారిపడిపోలేదు. నిటారుగా అ బండమీదే నడిచి కిందికి వెళ్ళి పోతోంది!
    కళ్ళు చిట్లించి చూశాడు నిఖిల్.
    నిలువుగోడలా ఉన్న ఆ బండలో అక్కడక్కడ పగుళ్ళు ఉన్నాయి. బండ రెండు అడుగుల మేర బయటకు పొడుచుకొచ్చినట్లు ఉంది ఆ పగుళ్ళ దగ్గర. నిఖిల్ నిలుచున్న చోట నుండి కనబడడం లేదు ఆ పగులు. దాని మీద నిర్భయంగా నడిచి వెళ్ళిపోతోంది మేక.    
    "కమ్ " అన్నాడు రాధతో నిఖిల్.
    అతికష్టం మీద రెండు కిలోమీటర్లు కిందికి దిగారు. అక్కడ నుంచి మొదలయింది బయటకు పొడుచుకువచ్చి, ఘాట్ రోడ్డులా కనబడుతున్న ఆ సన్నటి దారి.
    ముందు నిఖిల్ నడుస్తున్నాడు.
    అతని భుజాలను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా నడుస్తోంది రాధ.
    "జాగ్రత్త!" అని హెచ్చరిస్తున్నాడు అతను ప్రతి నాలుగడుగులకి.
    దూరం నుంచి చూసేవాళ్ళకి, వాళ్ళిద్దరూ గోడ మీద పాకుతున్న సాలీళ్ళలా కనబడుతున్నారు.
    ఇంకో మూడు మీటర్లు కిందికి దిగాక, మరికొంచెం ఇరుకయింది దారి.
    కళ్ళు తిరిగితున్నట్లు అనిపించింది రాధకు. తనకు తెలియకుండానే, గోడలా ఉన్న కొండవైపు ఇంకాస్త ఒరిగిపోయి నడవడం మొదలెట్టింది భద్రతకోసం.
    అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు!
    కొండలు ఎక్కడానికి, దిగడానికి పర్వతారోహకులు చెప్పే ప్రాధమిక సూత్రం ఒకటి ఉంది. శరీరం బరువును రెండు కాళ్ళమీద సమంగా ఆనించి ఉంచాలని! లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది!
    ఆ ప్రాధమిక సూత్రం రాధకు తెలియదు.
    గోడలాగా ఉన్న కొండవైపు ఒరిగిపోయి నడుస్తూ కిందికి చూసింది రాధ.
    మూడంతస్తులు మేడ పిట్టగోడ మీద బాలన్సు చేస్తూ నడుస్తున్నట్లు ఉంది తను! బయలు ప్రదేశం కావడం వాళ్ళ గాలి నిరాటంకంగా రివ్వున వీస్తోంది . రాధ పమిట తెరచాపలా ఎగురుతూ నిఖిల్ మొహాన్ని కప్పేస్తోంది మాటిమాటికీ.
    అప్పుడు జరిగింది అది.
    ఉన్నట్లుండి రాధ ఎడమ కాలు జారింది. కెవ్వున కేకపెట్టి ముందుకు తూలిపడిపోయింది ఆమె.
    ఆ తాకిడికి జర్రున కిందికి జారిపడ్డాడు నిఖిల్. అతని వెనకే ఆపుకోలేని వేగంతో రాధ కూడా వచ్చేస్తోంది. పారాచూట్ సాయం లేకుండా విమానంలో నుంచి దూకేసున్నట్లు ఉంది వాళ్ళ స్థితి.
    క్షణంలో సగంలోనే మెరుపువేగంతో నిఖిల్ మెదడు పరిస్థితిని ఆకళింపు చేసుకుంది.
    ఎడమచేత్తో రాదని గట్టిగా పట్టేసుకుని, గాలిలోనే పోర్లిగింత పెట్టినట్లు పక్కకి తిరిగాడు నిఖిల్.
    అక్కడ కోసుగా, పొడుగ్గా ఉన్న ఒక పెద్దరాయి వాళ్ళని ఎదుర్కోవడానికి అత్యంత వేగంతో పైకి వస్తున్నట్లు కనబడుతోంది.
    దాన్ని తాకితే తీవ్రమైన గాయాలవుతాయని తెలుసు నిఖిల్ కి.
    కానీ అది తమ వేగాన్ని ఆపి ప్రాణాలను కాపాడుతుందని కూడా తెలుసు.
    సరిగ్గా అయిదు సెకెండ్ల తర్వాత కోసుగా ఉన్న రాయికి తగిలింది నిఖిల్ శరీరం.
    మరుక్షణంలో అతని మీద రాధ బరువు కూడా అనింది.
    వెంటనే స్పృహ తప్పింది నిఖిల్ కి.


                                                              * * *


    కొద్ది నిమిషాల తర్వాత అతనికి తెలివిరాగానే మొదటగా తెలిసింది దుర్భరమైన బాధ!
    అతను కళ్ళు తెరవగానే మొదటగా కనబడింది రాధ మోహంలో కనబడుతున్న రెట్టింపు బాధ.
    ఆ బాధ ఆమె కోసం కాదు. అతని కోసం!
    "రాదా!" అన్నాడు అతికష్టం మీద.
    "నిఖిల్! నిఖిల్! ఎలా వుంది?" అంది రాధ దుఃఖాన్ని ఆపుకుంటూ.
    అనుమానంగా నుదుటి మీద చెయ్యి పెట్టి చూసుకున్నాడు నిఖిల్.
    నుదుటి దగ్గర నుంచి చెవి దాగా లోతుగా గాయం అయింది. అక్కడి చర్మమంతా రిబ్బనులా చీల్చేసినట్లు చెవి దగ్గర నుంచి కిందికి వేలాడుతోంది.
    పర్రుమని తన పమిట కొంగుని చింపేసింది రాధ. "ఒక్కసారి తల ఎత్తండి! కట్టుకదతాను" అంది కంపిస్తున్న గొంతుతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS