Previous Page Next Page 
యువత నవత పేజి 53

   
    "ఓడిపోయాడు మీ ఆయన!" తేల్చేశారు.

    "సుగుణ పుట్టి పెరిగింది అంతా ఆంధ్రాలోనే! పెళ్లయ్యాక నాతో హైదరాబాద్ వచ్చి మూడు నెలలే అయింది. హైదరాబాద్  తెలుగు ఆమె అప్పుడప్పుడే నేర్చుకొంటూంది. జన అన్నం పెట్టుకోండి అనబోయి "జెరి" అని,  నా పందెం పోగొట్టేసింది.

    సుధ ఒకటే నవ్వడం మొదలు పెట్టింది.

    అసలు విషయంకంటే అతను చెబుతున్న తీరు నవ్వుపుట్టించేట్టుగా మాట్లాడుతున్నాడు.

    గోడ ఆసరాతో అతి ప్రయాసతో నడిచివచ్చి  సుగుణ గుమ్మం వారగా నిలబడింది.

    "ఆయన ముఖంలో అంత ఉత్సాహం, సంతోషం చూసి ఎన్ని రోజులైంది?"

    "గడ్డం మాసి ఎంత అసహ్యంగా అయిందో! రోజూ షేవింగ్ చేసుకోకపోతే నాకసలు బాగుండదు."

    "కాని గడ్డం మీ ముఖానికి ఓ నిండుదనం ఇస్తూంది. అసలుగొప్ప వాళ్ల గొప్పదనం వాళ్ల గడ్డాల్లోనే వుంటుంది. రవీంద్రనాధ్ టాగోర్ అరవింద......"

    "నిజమా? నేనలా గడ్డం, జులపాలు పెంచేస్తే నా ముఖం చాలా తమాషాగా వుంటుందికదూ?" చంద్రకాంత్ నవ్వసాగాడు.

     సుగుణ నిశ్శబ్దంగా వెనుదిరిగి వెళ్లిపోయింది.

        *    *    *    *    *
   
    ఆరోజు సుధ చాలాసార్లు తనలోతను నవ్వుకోవడం, ఒకసారి పైకే తెరలు తెరలుగా నవ్వేయడం చూసి ఆశ్చర్యపోయింది శాలిని.

    "ఏమిటే? పిచ్చిదానిలా ఆ నవ్వు?"

    "మా బి. డి. వో. గారికి జులుపాలు, గడ్డం తగిలించి ఎలా వున్నారో చూస్తున్నాను"

    "గడ్డం జులపాలేమిటి?"

    "ఉదయం తమ సంభాషణ గురించి చెప్పి, మళ్లీ నవ్వసాగింది.

    "సుధా! నువ్వేమీ అనుకోనంటే నేనోమాట చెప్పనా?" కొంచెం సీరియస్ గా అంది శాలిని.


    "ఏమిటి?"

    "నువ్వు బి. డి. వో. ఇంటికి వెళ్లడం తగ్గించు."

    "ఎందుకు?"

    "చుట్టుపక్కలవాళ్లు దీన్ని గురించి అప్పుడే చెడ్డగా అనుకుంటున్నారు! భార్యతో పొందులేనివాడు కదా ఈ అమ్మాయిని ఊరికే వదులుతున్నాడా అని."

     "మైగాడ్! ఇంత అసహ్యంగా ఆలోచిస్తున్నారా మన ఇరుగు పొరుగులు. ఆవిడ సుస్తీమనిషికాదా? ఆఫీసరు భార్యకదాని పలకరించడానికి వెడుతుంటాను. ఆవిడకు స్నేహితులు లేరుకదా! నన్నుచూస్తే  ఆవిడ ప్రాణం లేచివచ్చినట్టుగా చూస్తుంది. ఆయనకి చేతికి బాండేజీ ఉందికదా! చేసుకోలేక ఏం ఇబ్బంది పడుతున్నారో అని వెడుతున్నాను. మన పొరుగున ఒకరు కష్టంలోవుంటే పట్టనట్టుగా ఎలావుంటాం?" అదీ ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం పైగా ఆయన మా  బాస్"

    "నీ ఉద్దేశ్యం మంచిదేనమ్మా కాని, ప్రపంచం అలా అనుకోనప్పుడు దానికోసం మనం మన నడతను మార్చుకోవద్దూ?"

    "మనకోసం ఒకరకంగా, ప్రపంచంకోసం ఒకరకంగా ఎలా నడుస్తాం శాలినీ? నాకలా నటించడం చాతకాదు! నా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే నాకిష్టం. ప్రపంచంకోసం మరోవిధంగా వుండలేను. తప్పు ప్రపంచం  ఆలోచనలో వుంది. నా నడతలోకాదు. దిద్దుకోవాల్సింది ప్రపంచంకాని, నేనుకాదు."

    "ప్రపంచం నీ గురించి చెడ్డగా అనుకొంటే నువ్వుబాధపడవా?"

    "నా మనసులో, ప్రవర్తనలో చెడ్డతనం లేనంతవరకు నేను బాధపడను." ఖచ్చితంగా నిబ్బరంగా చెప్పేసింది సుధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS