"సర్! మా ఫ్రెండ్ నిశాంత నా బదులుగా అటెండెన్స్ పలికింది. సర్! అన్నీ కాలేజీలలో కామనే. సర్......"అంటోంది హరిణి.
"దటీజ్ ఇమ్మెటిరియల్ యూ లిటిల్ స్పాయిల్ద్ బ్రాట్" అన్నాడు ఇన్స్ పెక్టర్ తీవ్రంగా చూస్తూ.
గిర్రున కళ్ళ నీళ్ళు తిరిగాయ్ హరిణికి. కంపించడం మొదలు పెట్టింది ఆమె శరీరం.
ఆమె స్థితి గమనించాడు ఎడిటర్.
"టీ తాగుతావా?" అడిగాడు నెమ్మదిగా.
"ఐ నీడిట్ సర్" అంది హరిణి.
బజరు నొక్కాడు ఎడిటర్.
వెంటనే హాజరయ్యాడు ఒక మనిషి.
అతని చేతిలో ఒక ట్రే ఉంది.
దానిలో కప్పులు ఉన్నాయి. అందులో సెగలు వస్తున్నా టీ అతన్ని చూడగానే అదిరిపడింది హరిణి!
అతను ఆఫీసు బోయ్ కాడు.
అతనొక పెద్ద స్టార్ హోటల్ లో పనిచేసే వెయిటర్.
ఆ స్టార్ హోటల్ లోనే తను నిన్నంతా.........
అతనేందుకున్నాడు ఇక్కడ!
అతి కష్టం మీద ఒక గుటక మింగింది హరిణి.
"టీ తాగు" అన్నాడు ఇన్స్ పెక్టర్ నిర్ధయంగా.
"నిన్న నువ్వూ, ప్రేమ్ కుమార్ ఇద్దరూ పొద్దున్నుంచి రాత్రి దాకా గడిపారే ఆ స్టార్ హోటల్లో టీనే యిది! తాగు మిస్ హరిణి.
కప్పు అందుకుంది హరిణి. ఆమె చేతులు గజగజ వణుకుతుండం వల్ల కప్పు సాసరుకి తగులుతూ శబ్దం చేస్తోంది.
"నౌ" అన్నాడు ఇన్ స్పెక్టర్. "నిజంగా జరిగింది ఏమిటో నువ్వు చెప్పేటట్లు లేవు. అందుకని నేనే చెబుతాను.
నిన్నరాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి ఎడిటర్ గారిని బ్లాక్ మెయిల్ చేయ్యబోయావు. అదే టైం లో కాలేజీలో క్లాసుకి అటెండ్ అయినట్లు మీ ఫ్రెండ్స్ ఎవరో అటేడెంన్స్ పలికారు. ఇది చాలదన్నట్లు నువ్వు నిన్నంతా ప్రేంకుమార్ తో హోటల్లో గడిపావు. గడిపినట్లు సాక్ష్యం వుంది.
నువ్వు గొప్ప కిలాడినే కావచ్చు. కానీ ఒకే మనిషి ఒకే సమయంలో మూడు ప్రదేశాలలో ఉండటం కుదరదు.
నువ్వు కాలేజీలో నన్నా ఉండి వుండాలి. ఎడిటర్స్ కేబిన్ లో నన్నా వుండి వుండాలి. అవునా?
నువ్వు కాలేజ్ లో వున్నానని అటెండేన్స్ రిజిస్టర్ సాక్ష్యం. మేగజైను ఆఫీసులో ఉన్నానని అభిషేకన్ సాక్ష్యం.
హోటల్ రూంలో వున్నావని ఈ వెయిటర్ సాక్ష్యం.
అందుకని నువ్వు ఎక్కడ ఉన్నావని ఒప్పుకున్నా నీ మాటలనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యంగా ప్రవేశపెడతాం. యువర్ గేమ్ ఈజ్ ఆఫ్! వాట్ డూ యూ సే" అన్నాడు ఇన్ స్పెక్టర్ కఠినంగా.
వెంటనే టీ కప్పు కింద పెట్టేసి టేబులు మీద తల ఆనించి వల వల ఏడవడం మొదలెట్టింది హరిణి.
ఎడిటర్ ఇన్ స్పెక్టర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తర్వాత హరిణి వైపు చూశారు. హరిణి వీపు వెక్కిళ్ళతో ఎగిరెగిరిపడుతోంది.
వద్దనుకున్నా ఎడిటర్ కి జాలి వేసింది. చిన్నపిల్ల. మిస్ గైడెడ్ యూత్! ఆమె ఎవరి ప్రోద్భలంతో ఇలా చేసిందో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది తనకి.
హటాత్తుగా తల ఎత్తింది హరిణి. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి.
"సర్" అంది వెక్కుతూ "నాకేం తెలియదు సర్. ఇదంతా ప్రేంకుమార్ చేయించాడు. నిజంగా నేను కావాలని ఏమీ చెయ్యలేదు సర్! నన్ను మొదట మీ దగ్గరికీ వెళ్ళమని ప్రోత్సహించింది కూడా ప్రేంకుమారే! వెళ్ళి తన ఏజెంటుగా ఇక్కడ ఉండి ఇక్కడి సంగతులన్నీ ఎప్పటికప్పుడు తనకి చెప్పాలని చెప్పాడు సర్! అంతే తప్ప నా అంత నేను ఏమీ చెయ్యలేదు సర్. మిమ్మల్ని ఇలా బ్లాక్ మెయిల్ చెయ్యాలని సలహా ఇచ్చింది కూడా ప్రేంకుమారే సర్" అని మళ్ళీ టేబుల్ మీద తల పెట్టి పెద్దగా ఏడవడం మొదలెట్టింది హరిణి.
ఆమె దుఃఖం కొద్దిగా తగ్గేదాకా వేచి ఉన్నాడు ఇన్ స్పెక్టర్. తర్వాత అన్నాడు.
"న్యాయంగా చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నిన్ను పోలీసు స్టేషనుకి పిలిపించి అక్కడ అందరి ముందూ అడిగి ఉండవలసింది. కానీ ఎడిటర్ గారు ట్రూ జెంటిల్మాన్ కావడం వల్ల నువ్వు అల్లరి అయిపోకుండా ఇక్కడకు పిలిపించి అడగమని చెప్పారు నాతొ."
"నాకు తెలుసు అయన దేవుడిలాంటి మనిషి" అంది హరిణి కళ్ళు తుడుచుకుంటూ.
ఒక్కసారిగా గుర్తువచ్చాయి ఎడిటర్ కి ఆమె ఇదివరకు చెప్పిన మాటలు.
"దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు సర్ నాకు తెలిసిన దేవుడు మాత్రం మీరే"
విరక్తిగా అయిపొయింది అతని మనసు.
"సర్! నన్ను క్షమించండి సర్.
ఇక ముందు ఇలా ఎప్పుడూ చెయ్యను. నా తప్పు నేను గ్రహించాను సర్. ఐ రిపెంట్ అనేస్ట్ లీ" అంది హరిణి గబగబ.
