అందునించి మీరు ఈ చోటు నించి దూరంగా తప్పుకు పొతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జ్యోతి జయకృష్ణల విముక్తికై సాగిస్తున్న ఈ సంఘర్షణ లోంచి ప్రాణాలతో బయటపడగలిగితే రేపటి ప్రొద్దు మిమ్మల్ని చూచేందుకు వస్తాను. అదిగో ! కారు మరింత దగ్గర అవుతోంది. తప్పుకు పొండి " అని హెచ్చరించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
శ్రద్దాపూర్వకంగా ఆమె మాటలను ఆలకించిన శ్రీ బృందావన్ గోయెల్ చిరునవ్వు నవ్వారు.
"మేడమ్ ! జ్యోతి చెప్పినా, జయకృష్ణ చెప్పినా మీ గురించి పూర్తిగా అంచనా వేయలేకపోయాను. ఇప్పుడు చూస్తున్నాను. బ్రతుకుదారిలో వెనుకంజ అనేది లేకుండా , ఎదురయిన సమస్య అది ఎటువంటిది అయినా ఎదురొడ్డి నిలవటమే ధీరుల లక్షణం.
మీ వంటి ధీశక్తి కలిగిన స్త్రీలు ఆదర్శమూర్తులు. అదుగో కారు మరింత దగ్గర అవుతోంది. నేను వెనుదిరిగి వెళ్ళిపోతానని మీరు అశించకండి. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని కత్తులిపడే పిరికిపందను కాను నేను. అదిగో కారు వచ్చేసింది. చేయవలసిన దాని గురించి ఆలోచించండి." అంటూ బదులు చెప్పారు శ్రీ బృందావన్ గోయెల్. శ్రద్దాదేవి తిరిగి కారులో కూర్చుంది.
కారు దగ్గరగా వచ్చేసింది. హారన్ కొడుతున్నా ఎదుటి వ్యక్తీ పట్టించుకోనందుకు మండిపడ్డాడు పొడగరి. కార్లు రెండింటికి లైట్స్ వెలుగుతున్నాయి. అందు నించి అతనికి యివతల కార్లో కూర్చుని ఉన్న వారెవరో కన్పించలేదు.
రాకాసి గుహలలో దొరికే నిధుల తాలుకూ వివరాలు తన చేతిలో పడితే కాని అతనికి మనశ్శాంతి లభించదు. ఈలోగా ఎదురు అయిన ఈ అవరోధంతో అతడు రుసరుసలాడిపోయినాడు.
డోరు తెరచుకుని కారు దిగాడు . ప్రొఫెసర్ శ్రద్దాదేవి కూడా డోరు తెరచుకుని దీపాల వెలుగులోకి వచ్చి నిలిచింది. ఒక వనిత అలా నిర్భయంగా తనకు ఎదురు నిలిచి ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ శారీరక బల సంపన్నతలేని వనిత తనను ఎదిరించి నిలువగలదని , తన అరాచకమయిన కార్యక్రమాలకు చరమాంసం రచించగలదని అతడు రవంత అయినా ఊహించలేదు.
ఆమె కారుని అడ్డు పెట్టినందుకు జులుం సాగించాలని పెద్ద పెద్ద అంగలతో ముందుకు బాణంలా దూసుకు వచ్చాడు.
అడుగు కదపకుండా అలాగే నిలబడింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె వాలకాన్ని అల్లంత దూరం నించే గమనించిన పొడగరి ఎదుటి వ్యక్తీ భయపడేందుకు ఒక మారణాయుధాన్ని బయటకు తీశాడు. దాని వంక నిర్లక్ష్యంగా చూచి అలాగే నిలుచుందామే.
అతడు దగ్గర అవుతున్న కొలదీ ఆమెకు అనుమానం పెరిగింది.
ఇంత పూర్వమే ఆ వ్యక్తీ తనకు ఎక్కడో కన్పించాడు . బహుశా చాలా కాలం క్రిందట ఎక్కడో కన్పించాడు.
ఇప్పుడు వయసు పైబడటం నించి రవంత మారిపొయినాడు కాని ఎక్కడో ఎప్పుడో చూచినట్లే అన్పిస్తోంది. ఆమె మనసు తిరిగిపోయిన మనసు కాలచక్రం తాలుకూ పొరల అడుగుకు వెళ్ళిపోయింది. జ్ఞాపకాలను త్రవ్వి పోస్తోంది.
ఆ పొడగరి దృడకాయుడు అయిన వ్యక్తీ మరింత దగ్గర అయినాడు. ముఖం క్రూరంగా అన్పిస్తోంది. ఒకటి కాక మరిన్ని హత్యలయినా చేయగలిగిన వాడల్లే కన్పించాడు.
బాగా దగ్గర అయిపోయి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూచాడు. అంతకు క్రిందటి క్షణంలో అతడిలో మెదిలిన క్రూరాతి క్రూరమయిన ఆలోచనలు ఆసాంతమయినాయి.
నిర్నిన్నుడయి అలాగే నిలిచిపోయినాడు.
మనసు పొరల మాటున ఎక్కడో మారుమూల ఒదిగిపోయి కాలమనే యవనిక మాటున దాగి వున్న జ్ఞాపకమనే వెలుగు పెటిల్లున మనసు పొరల్ని త్రెంచుకుని బయటకు ఉరికినట్లు అయింది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి దిగ్భ్రాంత అయిపొయింది. ఆమె ముఖం గొప్ప ప్రశ్నార్ధకంగా అయిపొయింది.
"నువ్వా మాధవా?" అన్నదామె. ఆ ఎదుట వ్యక్తిని క్షణాల మీద నిరాశా నిస్పృహలు అవరించినాయి. అతడు ఎంతకయినా తెగించాలని చేత పట్టిన మారణాయుధం క్రిందికి జారిపోయింది. దాన్ని అక్కడే వొదిలేసి క్షణాల మీద చీకటిలో కలిసి పొయినాడతడు. చూపులు మరల్చుకోలేక అలాగే నిలిచి పోయిందామే.
గతకాలపు జ్ఞాపకాలు తుఫానులా ఆమెను తాకినాయి. భాధాతరంగాలు వరదలా ఉప్పొంగి ఉరికినాయి. కాని అదంతా మహోన్నతమయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి వ్యక్తిగతమనే చెలియలికట్టకు అవలనే ఒదిగిపోయినాయి.
కాని అలల తాకిడికి లేచిన చిన్ని తుంపరలు గట్టు మీదికి వచ్చినాయా అన్నట్టు కనులు అశ్రుతప్తాలయినాయి. చెంపలు చిత్తడి అయినాయి. ఆమెకు తానేక్కడ వున్నదీ మరిచే స్థితి అయిపొయింది. ఇదంతా గమనించాడు అటునుంచి జయకృష్ణ. తనకు అవకాశం ఎప్పుడోస్తుందా అని ఎదురు చూస్తున్న అతనికి ఎ సంఘటన ఒక కలలా అన్పించింది. శ్రీ బృందావన్ గోయెల్ త్రవ్వకాలలో బయటపడిన రాతి బొమ్మలా అయిపొయినారు.
ఒక్క పరుగున వచ్చి ప్రొఫెసర్ శ్రద్దాదేవి పాదాల మీద నుదురు తాకించి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు జయకృష్ణ.
"డియర్ యంగ్ స్కాలర్! నా జ్యోతి ఎక్కడ? ఆమె కేమయింది? అని ప్రశ్నించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. పరధ్యానం నించి మనసుని సమీకరించుకుని.
జయకృష్ణ సాయంతో దారి తెలుసుకుని జ్యోతిని, లచ్చిమిని వెంట బెట్టుకుని అయిదు గంటలు కూడా కాని సుప్రభాత సుమధుర ఘడియలలో దక్షిణ విజయపురికి చేరుకుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
ఈ జరుగుతున్న అనూహ్య పరిణామాలన్నింటికీ అర్ధాలను తెలుసుకోవాలని ఉబలాటపడిపోయినారు. శ్రీ బృందావన్ గోయెల్. అందు నించి వారందరినీ విజయపురిలో వున్నంతకాలం తన అతిధులుగా వుండి పోవలసిందని అభ్యర్ధించాడు.
తాను బ్రహ్మచారి. ఈ ఆడవారికి చేయవలసిన సౌకర్యాలు చేసేందుకు, ఇవ్వవలసిన మర్యదలు ఇచ్చుకునేందుకు తన బ్రహ్మచారి సదనం అనువయినది కాదని భావించిన జయకృష్ణ అందుకేమీ అభ్యంతరం చెప్పలేదు.
పోగా తాను కూడా వారితోనే వుండి పోయినాడు. లచ్చిమిని ఉత్తర విజయపురి కమలా నెహ్రూ హాస్పిటల్ లో చేర్పించారు.
"అమ్మా జ్యోతి! నీవు అనుకున్నది సాధించావు. రాక్షసి గుడుల గురించి నీవు ప్రారంభించిన అన్వేషణ యింత త్వరితంగా పూర్తీ అవుతుందని నేను అనుకోలేదు. కంగ్రాచ్యులేషన్స్ " అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. " యూ ఆర్ గ్రేట్" అంటూ భుజం తట్టింది. సిగ్గుతో తల దింపుకుంది జ్యోతి.
చివాలున వొంగి తనకు తల్లి మ గురువు, దైవం, బ్రతుకు మార్గాన్ని నిర్దేశించిన మహామనిషి అయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి పచ్చని పాదాల మీద అరచేతులు ఆనించి కళ్ళకు అద్దుకుంది.
"అమ్మా! అన్వేషణ అనేది నిరంతరమయినది. అది ముగియటం అనేది ఉండనే ఉండదు. పవిత్రమయిన మీ పాదాలు తాకిన పుణ్యం వల్లనో , మీ గురించిన జ్ఞాపకాలు నాకిచ్చే స్ఫూర్తి వల్లనో కొంత సాధించగలిగాను.
"కాని ఈ అన్వేషణ యింతటితో పూర్తి అయిందని నాకు అన్పించట లేదు. రాకాసి గుహలలో నిధులు కూడా వున్నాయట. అంతే కాదు, ఒక్క క్రేనియంను, మరికొన్ని వస్తువులనూ సాధించినంత మాత్రాన శ్వేతకి ఆత్మ విముక్తయిందని నాకు అన్పించటల్లేదు. ప్రస్తుతం నేనున్నా మన్హాష్టితిలో అదేమిటో విడమరచి చెప్పలేను. కాని ఏదో కొంత భాగం మిగిలిపోయింది. శ్వేతకి దాని గురించిన ప్రేరణ నాకు యివ్వ గలదనే అనిపిస్తోంది. మీ ఆశీస్సులు నాకున్నంతవరకూ , మీ గురించిన జ్ఞాపకాలు నాకు స్పూర్తిని యిచ్చినంత వరకూ , మీ దయాబుద్ది నా అదృష్టాన్ని పాలించినంతవరకూ ఈ ప్రయత్నంలో మిగిలిపోయినదంటూ వుండటానికి వీలులేదు.
