ఈ బద్మాష్ నరేందర్ గాడు చేసేదేదో ఎవడూ చూడకుండా చేస్తే సరిపోయేది.
కానీ వెంకటేశం గాడి కళ్ళలో పడింది ఇదంతా!
వెంకటేశంగాడు పొరబాటున కూడా అబద్దం చెప్పడని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు.
అందుకని తను మరీ బరితెగించి ఏకపక్షంగా కనబడే తీర్పు చెప్పలేడు. అందులోను ఎలెక్షను దగ్గరికొస్తున్నాయ్!
ఒక తట్టు వంశగౌరవం!
రెండో వైపు వంశపారపర్యంగా వస్తున్న ఊరి పెత్తనం!
రెండూ పోకూడదు.
జేబులోనుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, అంటించాడు దేవేందర్. ఒకసారి పొగపీల్చి తర్వాత చెప్పడం మొదలెట్టాడు.
చెవులప్పగించి వింటున్నారు ఊరి ప్రజ అంతా.
సీతాఫలం చెట్ల చాటున ఉన్న నిఖిల్ , రాదా కూడా జాగ్రత్తగా వింటున్నారు.
"ఈ రోజుల్లో ఆడోల్లకేం రోగమొచ్చిందో తెలవదు. మొగోడు ఎపుడూ మొగోడే! మొగోడి వల్ల ఏం పొరబాటు జరిగిపోతదో అని ఆడది భయపడి చస్తూ వుండాలి. లక్ష కళ్ళతో కనిపెట్టి ఉండాలి. ప్రతిక్షణం తన జాగ్రత్తలో తనుండాలి!
అంతేగానీ నాకేమవుతది అన్నట్లు ఒంటరిగా అక్కడికీ ఇక్కడికీ పోయి ఎవడో ఏదో చేశాక పంచాయితీ పెట్టించి మొత్తుకుంటే ఏం ఫాయిదా? ఏం లాభం? చెప్పుండ్రి!"
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఉద్విగ్నంతో కూడిన నిశ్శబ్దం.
అందరినీ ఒక్కసారి పరికించి కొంచెం గొంతు మార్చాడు దేవేందర్.
"అట్లని నేను మా పోరాగాడిని సమర్ధిస్తలేదు. పోరగాళ్ళకి ఉడుకు రక్తం ఉంటది! నిజమే! మన జమానాలో మనం మాత్రం ఏం తక్కువ పన్లు చేసి ఉంటిమా? మనం మాత్రం వయసులో ఉన్నప్పుడు ఇంటిమీదకి కొట్లాటలు తేలేదా? నఖరాలు చెయ్యలేదా? మీరూ చేసిండ్రు! నేనూ చేసినా!" అన్నాడు అందరినీ కలిపేస్తూ.
ఇబ్బందిగా నవ్వు మొహాలు పెట్టారు అందరూ.
"అయినా నేరం నేరమే! శిచ్చ శిచ్చే!" అన్నాడు దేవేందర్. "అందుకని ......" అని ఆగి జనసందోహం వైపు చూశాడు.
అందరూ ఆత్రంగా అతని పెదిమల కదలికనే గమనిస్తున్నారు.
"అందుకని ........ఈ పోరగానికి వంద రూపాయల జుర్మానా వేస్తున్నాం!" అన్నాడు పెద్ద మనుషులందరి తరుపునా, పంచాయితీకి వచ్చిన పెద్దలందరి తరపునా ఖండితంగా.
అంత పెద్ద తప్పుకి ఇంత చిన్నా శిక్షా?
అందరి మొహాల్లో అసమ్మతి కనబడింది. కానీ ఎవ్వరూ నోరెత్తలేదు.
క్రితం నెలే జరిగిన నరసింహ హత్య గుర్తొచ్చింది వాళ్ళందరికీ. దేవేందర్ మనుషులు వెనుకనుంచి గునపంతో పొడిస్తే రక్తం చింది, దగ్గరలోనే ఉన్న తెల్ల ఆవు క్షణంలో ఎర్ర మచ్చల ఆవులా మారిపోవడం గుర్తొచ్చింది.
"నరేందర్! ఈ నూర్రుపాయలు నిర్మల కివ్వు!" అన్నాడు దేవేందర్, లాల్చీ జేబులో నుంచి వందరూపాయల నోటు ఒకటి తీసి అందిస్తూ.
నిర్మల కళ్ళు రక్తపుష్పాలలా మారాయి. నరేందర్ ఆమె దగ్గరికి నడిచాడు.
"తీసుకో!"
"అగరా పిల్లగా!" అన్నాడు దేవేందర్.
నరేందర్ ఆగాడు.
"ఏం పొగరే నీకు! దొరల పిల్లగాడు పైసలిస్తుంటే దొరసానిలాగా చేత్తో తీసుకుంటావా ఏమి? ఒడిపట్టు! ఊ!"
అవామానంతో వణికిపోయింది నిర్మల.
చుట్టూ చేరిన జనంలో నుంచి సానుభూతిగా సన్నటి శబ్దాలు.
"ఒడి పట్టు" అన్నాడు దేవేందర్ కర్కశంగా.
ఒక నిశ్చయానికోచ్చినదానిలా బొడ్లో దోపుకున్న చీరె కొంగుని ఒదులు చేసి తలవంచుకుని ఒడి పట్టింది నిర్మల.
చూస్తున్న వాళ్ళ గుండెలు దహించుకుపోతుంటే , కడుపులు మండిపోతుంటే ఊరి పెద్ద దేవేందర్ గారి తమ్ముడు కొడుకు నరేందర్, తను నిర్మలని పాడుచేసినందుకు గాను జుర్మానా నూరు రూపాయలు (అక్షరాల నూరు రూపాయలు) జోలేలా పట్టిన ఆమె పైతకొంగులో వేశాడు.
వెంటనే మెరుపు వేగంతో ఒడికిందనుంచి బయటకు వచ్చింది నిర్మల చెయ్యి. అదే వేగంతో ఆమె చేతిలో ఉన్న కొడవలి అతని మెడని తాకింది. ఆ చెయ్యి ఆ వేగంతోనే అర్ధచంద్రాకార మార్గంలో తిరిగివచ్చి తన మెడను తాను నరికేసుకొబోతుండగా -
బలంగా దృడంగా ఉన్న మరో చెయ్యి వచ్చి దాన్ని పట్టుకుని కదలకుండా ఆపేసింది.
పెనుగులాడుతూనే తల ఎత్తి చూసింది నిర్మల. ఒక కంటిలో నిప్పులూ, రెండో కంటిలో నీళ్ళూ ఉన్నాయి ఆమెకు.
నిఖిల్ ని చూడగానే కింద వదిలేసింది ఆమె.
"నిఖిల్ బాబూ!" అంది అతని పాదాలమీదికి జారిపోతూ.
అతని పాదాల దగ్గర అప్పటికే కుప్పకూలిపోయి ఉన్నాడు నరేందర్. అతని మెడ సగం తెగిపోయి ఉంది నిర్మల వేసిన దెబ్బతో. హైదరాబాద్ ప్రాంతంలో కొంతమంది కోడిని కోసేటప్పుడు మెడ పూర్తిగా ఒక్కసారే కోయ్యరు. సగం కోసి వదిలేస్తారు. అది మరణ యాతన పడుతూ కాసేపు ఎగిరి తర్వాత చనిపోతుంది.
అలా సగం మెడ కొయ్యబారిన కోడిలా గిజగిజలాడుతున్నాడు నరేందర్. దిగ్భ్రాంతి చెంది చూస్తున్నారు చుట్టూ ఉన్న జనం.
అందరి కన్నా ముందు తేరుకుంది దేవేందర్! పచ్చి బూతులు తిడుతూ లేచి దగ్గర ఉన్న ఒక కూలి చేతిలోని పలుగు అందుకున్నాడు. "నిన్ను ఇక్కడే ఇప్పుడే ఇంతమందీ చూస్తుండగానే చంపి పాతేస్తానే ఎవరడ్డమోస్తారో చూస్తా!" అంటూ శివమెత్తినవాడిలా నిర్మల వైపు పరిగెత్తడం మొదలెట్టాడు.
అతను రెండడుగులు కూడా వెయ్యలేదు. "ఫట్ " మని శబ్దం వచ్చింది.
ఎనుబోతులా ఉన్న దేవేందర్ బరువుగా కిందికి ఒరిగిపోయాడు.
సన్నటి పొగలు కక్కుతున్న తన బెరేట్టా రివాల్వర్ వైపు చూసుకున్నాడు నిఖిల్. దాన్ని జనం వైపే గురిపెట్టి ఉంచి కొద్దిగా ఒంగి కుడిచేత్తో నిర్మల భుజం పట్టుకుని లేవదీశాడు.
అప్పుడు వినబడింది పోలీసువాన్ల సైరన్లు!
తలఎత్తి చూశాడు. ఇంత తొందరగా పోలీసులు ఇక్కడికి ఎలా చేరుకోగలిగారు?
అంటే స్పెషల్ బ్రాంచి ఏజెంట్ వినాయకరావు తను ఇక్కడికి వచ్చే ముందే పోలీసులకు అలర్ట్ చేసి ఉండాలి.
"పరిగెత్తండి" అని రాదనీ, నిర్మలనూ, వెంకటేశాన్ని హెచ్చరించి కొండలబారు వైపు పరిగెట్టడం మొదలెట్టాడు నిఖిల్.
కారు వున్న వైపు వెళ్ళడం కుదరలేదు. సరిగ్గా కారు వున్న వైపే వస్తోంది పోలీసు వ్యాను.
అటు వెళితే చావు తప్పదు.
ఏనుగులంత సైజు బండలతో నిండి ఉన్న గుట్టలు కొంచెం దూరంలో కనబడుతున్నాయి.
వాటిని సమీపించి, గబగబ పైకి ఎక్కడం మొదలెట్టారు నిఖిల్ రాధ. అప్పటికే కొండ ఎక్కుతున్న మేక ఒకటి సురక్షితమైన మార్గాన్ని వెదుక్కుంటూ పైకి వెళ్ళిపోతోంది.
దాన్ని అనుసరించి వెళుతున్నాడు నిఖిల్. అతని చెయ్యి పట్టుకుని వెనుకనే వస్తోంది రాధ.
