Previous Page Next Page 
యువత నవత పేజి 52

   
    "అంత సువిశాలమైన మనసు నాకు దేవుడు ఇవ్వలేదు ఏం చేయను?"

     మరునాడుదయం తల్లిని బస్సెక్కించి వచ్చిన చంద్రకాంత్. రిలీఫ్ గా వూపిరి పీల్చుకొన్నాడుగాని, తల్లి సుగుణ మనసులో అగ్ని కణం విసిరిందని, అది రాజుకొంటూందని గుర్తించలేకపోయాడు.

             *    *    *    *

    ఉదయమే వచ్చి చంద్రకాంత్ చేతికున్న గాయాన్ని డెట్టాల్ తో తుడిచి బాండేజీ కట్టి వెళ్లే కాంపౌండరు ఆరోజు రాలేదు.

     కాంపౌండరు కోసం చూసి చూసి ఇక రాడని నిశ్చయించుకొన్నాక చంద్రకాంతే గాయాన్ని తుడిచి,  బాండేజీ కట్టుకోడానికి ప్రయత్నించసాగాడు. డెట్టాల్ తో శుబ్రపరుచుకో గలిగాడుకాని! బాండేజీ కట్టుకోవడం ఒకచేత్తో సాధ్యంకాక అవస్థ పడసాగాడు.

     రోజు ఒకటి రెండుసార్లు పరామర్శించి వెళ్లే సుధ "ఏం చేస్తున్నా" రంటూ వచ్చింది.

     చంద్రకాంత్ అవస్థచూసి. "నేను కట్టనా?" అంది.

    "కట్టండి కాని అయిదు రూపాయల ఫీజు  తీసుకొనేట్టు అయితేనే కట్టాలి!" చిరునవ్వుతో అన్నాడు చంద్రకాంత్.
 
     "ఫీజా!? ఫీజెందుకు?"

    "రోజూవచ్చి కట్టు కట్టడానికి కాంపౌండర్ కి అయిదు  రూపాయలిస్తున్నాగా!"

    "వృత్తిని డబ్బుగా మార్చుకొనేవాడు అతడు. నాకిది వృత్తికాదుగా ఫీజు తీసుకోడానికి? కేవలం ఒక సేవాభావన! అంతపెద్ద పేరుకూడా అవసరంలేదు. కేవలం, మనిషికి మనిషి సాయం!" అంటూనే చంద్రకాంత్ అనుమతికోసం చూడకుండా బాండేజీ  కట్టడానికి ఉపక్రమించింది.

    కాంపౌండరు చకచకా అయిదు నిమిషాల్లో కట్టేసే బాండేజి, సుధకు అలవాటు లేకపోవడంవల్ల  పావుగంట పట్టింది.

    "ఏదో మాడువాసన వస్తూంది. పొయ్యిమీద ఏం పెట్టారు?"

    "పప్పు పెట్టాను! చంద్రకాంత్ లేచి పరుగెత్తాడు. గరిటతో కెలికి చూస్తే పప్పు బాగా అడుగంటిపోయినట్టుగా అనిపించింది. పైపైన పప్పుతీసి మరోగిన్నె లోకివేసి తిరిగి పొయ్యిమీద పెట్టాడు.  గుమ్మం దగ్గర నిలబడి తొంగిచూస్తున్న సుధతో" కాస్త ఈ ఉల్లిపాయలూ, టమాటా తరిగి పెట్టండి. ఒక్కచేత్తో తరగడం కుదరడంలేదు!" అన్నాడు.

     సుధ లోపలికివచ్చి కూరలబుట్టదగ్గర కూర్చుంది. తరిగి వేయడానికి గిన్నె, చాకు ఇచ్చాడు.

    సుగుణగారికి వంట బాగా చేతనయ్యేదా?"

    "అబ్బే! ఆవిడకు పెళ్లయ్యేప్పటికి టీ కూడా సరిగా వచ్చేదికాదు. పెళ్లయ్యాకే అన్నం, పప్పు వండడానికి నేర్చుకుంది. ఆవిడకు మొదటి నుండి కొంచెం నాజూకు ఎక్కువే. పనేమీ చేతకాదని,వట్టి సుకుమారిని కట్టుకొన్నానని నా ఫ్రెండ్స్  వేళాకోళం చేసేవాళ్లు! ఒకసారి నాకు పౌరుషంవచ్చి బెట్టుచేశారు ఒక పెళ్లిలో."

    "ఏంబెట్టు చేసారు?" ఉత్సాహంగా అడిగింది సుధ.

    "ఏభై మందికి తనొక్కతి వడ్డన చేస్తుందని, గెలిస్తే వంద రూపాయలు  వాళ్లివ్వాలని, ఓడితే వంద రూపాయలు నేనిస్తానని పందెం"

    "గెలిచారా పందెం?"

    "వినండి! నన్ను  పందెం గెలిపించాలన్న ఉత్సాహంతో సుగుణ చకచకా వడ్డన చేసేసింది. అందరూ చివర పెరుగు వరకూ వచ్చేశారు. గెలుపు నాదేనని సంబర పడిపోతూన్నాను. సుగుణకూడా తన అలసటను వెనక్కునెట్టి ఉత్సాహంగా వడ్డిస్తూంది. కాని ఊహించని ఘోరం జరిగిపోయింది."

    "ఏం ఘోరం?"

    "అందరూ కంగారుగా లేచి నిలబడ్డారు. విస్తళ్లక్రిందా అక్కడా వెదకడం మొదలుపెట్టారు. "ఎక్కడ జెర్రి? కనిపించదే?" ఎక్కడ చూసావు? అనడిగాడు ఒకతను.

     "జెర్రా? జెర్రిని నేను చూడలేదే?" బెదిరిపోయి అంది సుగుణ. వాళ్లందరూ విస్తళ్లమీదినుండి లేవడంచూసి.
 

     "ఇందాకా అన్నావుకదా జెర్రి జెర్రి అని."

    "జెర్రి అనలేదండీ. జెర్రి అన్నం పెట్టుకోండి" అన్నాను.

    "అన్నం పెట్టుకోండి అని వినిపించటంలేదు. జెర్రి..... జెర్రి అని మాత్రం అనడం వినిపించింది" అన్నాడు అతడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS