కాసేపు వేచి చూసి మళ్ళీ తనే అంది "మనం కంప్రమైజ్ అయిపోదాం సర్. నో ఫర్ దర్ అన్ ప్లేజన్ ట్ నేస్ ఇట్ దిస్ రిగార్డ్"
"కాంప్రమైజా!"
"వెరీ సింపుల్ సర్. ప్లాప్ అయిన నా డైరెక్టు నవలని మీరు హిట్ చెయ్యాలి. దాన్ని మీ (మన) పత్రికలో సీరియలైజ్ చెయ్యండి. సీరియలైజ్ చేస్తారో, సీరియస్ గా అలోచించి మరో బ్రహ్మాండమైన జిమ్మిక్ ప్లే చేసి మరో విధంగా నా నవలని హిట్ చేయిస్తారో మీ యిష్టం.
దట్ ఈజ్ యువర్ హెడ్ ఏక్! నా నవల హిట్ కావాలి. అలా చెయ్యకపోతే దట్ విల్ బీ యువర్ ఒన్ ఫ్యునేరల్ అర్ధమయిందా సర్" అంది కూల్ గా.
విని మాట్లాడకుండా వుండిపోయాడు ఎడిటర్.
కాసేపటి తర్వాత మళ్ళీ అంది హరిణి.
"ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలు కావస్తోందండీ ఎనిమిది కావటానికి ఇంకా రెండు నిమిషాలు ఉంది.
ఈ హల్లో గంటలు కొట్టే గోడ గడియారం వుంది. ఇంకో రెండు నిమిషాలలో అది ఎనిమిది గంటలు కొడుతుంది. ఫోన్లో మీకు వినబడతాయి ఆ గంటలు. ఎనిమిదో గంట కొట్టగానే ఫోన్ పెట్టేస్తాను నేను. ఆ తరవాత మీరు ఇంక ప్రయత్నించినా....." అని వాక్యం సగంలో ఆపేసింది బెదిరింపుగా.
రష్..........రష్..........రష్........
సైకలాజికల్ వార్ ఫేర్ లో ఆరితేరిన ప్రంట్ లైన్ స్ట్రటిజిస్టూలా.........ఈ టీనేజర్ తనని.......
సెకండ్లు గడిచిపోతున్నాయి.
రష్ మాన్! రష్!
గడియారం మొదటిగంట కొట్టింది.
"హరిణీ" అన్నాడు ఎడిటరు చటుక్కున. తృప్తిగా నవ్వింది హరిణి.
"ఎస్సర్! అట్ యువర్ సర్వీస్"
"నువ్వు వెంటనే రా! నీతో మాట్లాడాలి. వివరంగా"
"యస్సర్"
"హరిణీ" అన్నాడు ఎడిటరు మళ్ళీ.
"చెప్పండి సర్"
"నువ్వు ఒంటరిగా రా!"
"మీరు ఆ మాట అనడమే నా అదృష్టం సర్" అంది హరిణి చాలా అర్ధవంతంగా.
ఫోన్ పెట్టేశాడు ఎడిటరు.
సరిగ్గా ఇరవై నిమిషాల తరవాత ఎడిటర్స్ కేబిన్ లోకి వచ్చిన హరిణి అక్కడ ఇంకో మనిషి వుండటం చూసి ఒక్కడుగు వెనక్కి వేసింది.
"కమ్" అన్నాడు ఎడిటరు ఆమెని చూసి సాదరంగా.
అక్కడే ఆగిపోయి ఆ రెండో మనిషిని విప్పారిన కళ్ళతో చూస్తోంది హరిణి.
చాలా దృడంగా, ఎత్తుగా ఉన్నాడతను. చామనచాయ, చూడగానే ఇతను పోలీసు ఆఫీసరు అని ఎవరూ చెప్పకుండానే తెలిసిపోయేట్లు ఉన్నాడు.
అతనెవరో హరిణికి తెలుసు.
అతని పోలీసు స్టేషన్ లోనే తను ఎడిటర్ మీద రిపోర్టు ఇచ్చింది.
అతను ఎందుకు ఉన్నాడు ఇక్కడ.
"ఇక్కడ కూచో" అన్నాడు పోలీస్ ఇన్ స్పెక్టర్ అధికారం ధ్వనిస్తోంది అతని గొంతులో.
భయంగా వచ్చి అక్కడ కూచుంది హరిణి.
"నో టాక్" అన్నాడు ఇన్ స్పెక్టర్ కంచు కంఠంతో.
"ఈ ఎడిటర్ నన్ను.........." అనబోయింది హరిణి.
"షటప్" అన్నాడు ఇన్స్ పెక్టర్ కటువుగా కట్ చేస్తూ.
"ఇన్స్ పెక్టర్" అని వారించాడు ఎడిటరు. "వద్దు చిన్నపిల్ల భయపడిపోతుంది. మెల్లిగా అడగండి. అన్నీ తనే చెప్పేస్తుంది. కదు హరిణి.'
అక్కడ ఏం జరుగుతున్నదో హరిణికి అంతుబట్టలేదు.
జేబులోనించి కొన్ని పేపర్సు బయటికి తీశాడు ఇన్స్ పెక్టర్.
అవి హరిణి ఇచ్చిన కంప్లయింట్ తాలూకా పేపర్సు.
"నిన్న రాత్రి ఎడిటరు గారు నిన్ను బలవంతం చేయ్యబోయారు అవునా?" అన్నాడు ఇన్స్ పెక్టర్.
"అవును" అంది హరిణి వినీ వినబడనట్లు.
"ఎన్ని గంటలకు?"
"రాత్రి ఎనిమిది గంటలకు."
"నువ్వు జర్నలిజం చదువుతున్నావా?"
"అవును"
"ఏ కాలేజీలో?"
ఫలాని నైట్ కాలేజ్ అని చెప్పింది హరిణి.
"నిన్న కాలేజ్ కి అటెండ్ అయ్యావా?"
ఆ ప్రశ్న వినగానే చటుక్కున అర్ధమైపోయింది హరిణికి తను ట్రాప్ లో పడిపోయినట్లు.
తడబడి "నేను......నేను...." అని నాన్చింది.
"నువ్వు నిన్న రాత్రి మీ కాలేజ్ లో అన్ని క్లాసులూ అటెండ్ అయినట్లు అక్కడ అటెండేన్స్ పడింది" అన్నాడు ఇన్స్ పెక్టర్.
