"ఓకే ఓకే మిస్టర్. నా బుర్ర వేడెక్కిపోతున్నది." అంటూ పరిమళ లేచింది.
"ఆయమ్మా! వంట పూర్తయితే ఇద్దరికీ వడ్డించు" అన్నది.
"వ్యవధి లేదు! నేనిప్పుడే బయలుదేరాలి డాక్టర్ పరిమళా! మీరు యీ రాత్రి ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. నాగేంద్రం తప్పకుండా వస్తాడు. ఆయమ్మను బ్రతకనివ్వడు, సాక్ష్యం దొరక్కుండా నిన్ను కూడా మాయం చేస్తాడు!"
"సాగర్!" పరిమళ వణికింది. తెల్లముఖం వేసి నిస్సహాయంగా చూసింది.
"అవును! నామాట వినండి. ఆలస్యం అయితే ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్ళి డ్యూటీ రూంలో ఈ రాత్రికి గడపండి! తెల్లవారక ముందే మాధవిని తీసుకుని ఆయమ్మతో సహా మీరు విశాఖపట్నం వదలాలి. ఆరుగంటల కల్లా నేను మీ హాస్పటల్ గేటు ముందుంటాను. మీరు సిద్ధంగా ఉండండి!"
"సాగర్? నాకు భయమేస్తుంది. ఆయమ్మతో హాస్పిటల్ కు వెళ్ళలేను. నువ్వు కూడా త్వరగా భోజనం చేసి మా ఇద్దరినీ హాస్పిటల్లో వదిలేసి ఈ రాత్రికి నీ పని చూసుకో!" ప్రాధేయపడింది పరిమళ.
"అలాగే త్వరగా కానీయండి" అన్నాడు సాగర్.
26
టాక్సీ వచ్చి మెంటల్ హాస్పిటల్ గేటు ముందాగింది. సాగర్, పరిమళ, ఆయమ్మా టాక్సీ దిగారు. వాచ్ మెన్ ఎదురుగా పరుగెత్తుకొచ్చాడు.
"డాక్టరమ్మగారూ! పదమూడో నంబరు గదిలో మాధవమ్మ కనిపించడం లేదు!"
"ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది?" డాక్టర్ పరిమళ ఆదుర్దాగా అడిగింది.
"నేను డ్యూటీ మారేటప్పటికే లేదు! వార్డు బాయ్ అప్పలస్వామి వెతుకుతున్నాడు. డ్యూటీ మారిన సింహాద్రి మాధవమ్మ సాయంకాలం గేటు బైట తిరగడం చూశాడట.
"అసలు మాధవిని బయటకెందుకు పోనిచ్చారూ?" పరిమళ కోపంగా అడిగింది.
"మీరే చెప్పారుగా అమ్మా! మాధవమ్మను ఎప్పుడూ అడ్డుపెట్టొద్దని! అమ్మాయి రోజూ సాయంకాలం పొద్దుపోయేదాకా గేటు బయట తిరిగి ఆమెకిష్టమయినప్పుడు లోపల కొస్తుంది. ఈ రోజు ఇంతవరకూ రాలేదు. చుట్టుపక్కల అంతా వెతికొచ్చాము. ఎక్కడా కన్పించలేదు."
"ఇది ఆ నాగేంద్రం గాడిపనే! మాధవిని ఎత్తుకుపోయి ఉంటాడు" సాగర్ కంఠం వణికింది.
"సాగర్!" డాక్టర్ పరిమళకు చెమటలు పట్టాయి.
"పరిమళా! ఇక మీరిక్కడ వుండాల్సిన అవసరం లేదు. నాగేంద్రం మాధవిని కిడ్నాప్ చేసి దూరంగా తీసుకువెళ్ళుంటాడు! రండి! మిమ్మల్ని మీ ఇంట్లో వదిలేసి వెళ్తాను!" అన్నాడు సాగర్.
అందరూ టాక్సీ ఎక్కారు.
"మూర్తి మాధవిని ఎక్కడకు తీసుకెళ్లుంటాడు." త్రోవలో సాగరును అడిగింది.
"అదే తెలుసుకోవాలి!"
"ఎందుకు తీసుకెళ్ళినట్టు"
"అదే అర్థంకావడంలేదు! తన రహస్యం బయటపడిపోయిందనే భయంతో ఈ పనిచేసి వుండొచ్చు!"
"హి మస్ట్ బీ ఇన్ డెస్పరేట్ మూడ్!"
"బహుశా మాధవి తనంతటతానే వెళ్ళిపోయిందేమో?" పరిమళ ఆశగా అన్నది.
"ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావ్?" సాగర్ అడిగాడు.
"అప్పుడప్పుడూ నాదగ్గిరకొస్తుంటుంది."
"అలా అనుకుంటే మనం! ఇంటి దగ్గర ఉన్నప్పుడే వచ్చుండాలి. ఇప్పుడు పదిగంటలవుతుంది! ఆరు గంటలప్పుడు బయటికి వెళ్ళిన మాధవికి మీ ఇంటికి రావడానికి నాలుగ్గంటలు పడుతుందా? ఇది నాగేంద్రం పనే. అందుకు సందేహం లేదు!" సాగర్ అన్నాడు.
టాక్సీ పరిమళ ఇంటిముందాగింది. గేటు బార్లాగా తెరిచి వుంది. పరిమళా సాగరూ ఖంగారుగా లోపలకు వచ్చారు. గ్రిల్ డోర్ తెరచి ఉన్నది. ప్రక్కన విరిగిన తాళం పడి ఉన్నది.
"ఇదీ నాగేంద్రం పనే!" అంటూ సాగర్ డాక్టర్ పరిమళతో ఇంట్లో ప్రవేశించాడు.
"ఇంట్లో ఎవరూ లేరని తెలిసి తాళం పగల గొట్టి ఇంట్లో ప్రవేశించాల్సిన అవసరం ఏమొచ్చింది!"
"అదే ఆలోచించాల్సింది." అంటూ సాగర్ డ్రాయింగ్ రూం పరిశీలించి చూశాడు. సోఫా జరిగి వున్నది. సోఫా క్రిందకు వంగి చూశాడు. సోఫా కింద పట్టా జరిగి ఉన్నది.
"పరిమళా! ఈ సోఫా చూడు! దీన్లోనుంచి ఏదో తీసివేసినట్టుంది."
"అందులో ఏముంటుంది? దానికోసం నాగేంద్రం ఎందుకు వస్తాడూ?"
"జస్ట్ ఏ మినిట్! నాగేంద్రం సాయంకాలం వచ్చినప్పుడు ఇక్కడే టేప్ రికార్డరు వుంచి ఉండాలి! అది ఇప్పుడొచ్చి తీసుకువెళ్లుంటాడు. అంటే నేను ఇక్కడకొస్తానని అతనికి తెలుసు. ఆయమ్మ అతడ్ని గురించి ఏమి చెప్తుందో అతడికి కావాలి. నాగేంద్రాన్ని గురించి మనం మాట్లాడిందంతా ఇప్పుడతనికి తెలిసి పోతూంది. నాగేంద్రం ఇప్పుడు దేనికయినా తెగిస్తాడు!"
"మాధవిని...." పరిమళ గొంతు పూడిపోయింది.
"పరిమళా! ఇదిగో ఈ రెండు నంబర్లకూ డైరక్ట్ డయల్ యస్.టి.డి. చెయ్. జడ్జీ రామనాథంగారికి చెప్పు. వారి పెంపుడు కూతురు మాధవి ప్రమాదంలో ఉన్నదని చెప్పు. ఇదిగో ఈ రెండో నంబరు. యస్పీ సాంబశివరావుది. అతడికి చెప్పు తన స్నేహితుడు డాక్టర్ మూర్తి మోసం బయటపడిందని! డాక్టర్ మూర్తి పేరుతో వున్నవాడు ఒక హంతకుని _ నాగేంద్రమనీ చెప్పు!" సాగర్ టెలిఫోన్ నంబర్లు పరిమళ కిచ్చాడు.
"పరిమళా! నేను వెళ్తున్నా! నాగేంద్రం మాధవిని ఎక్కడికి తీసుకెళ్ళింది కనుక్కోవడం అంత కష్టం కాదు. అతడ్ని కనిపెట్టి ఉండమని ఒకడ్ని ఉంచాను. అతడివల్లే నాగేంద్రం ఎక్కడెక్కడ తిరుగుతున్నదీ నాకు తెలిసిపోతూ వున్నది. అతడు నాకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. వెళ్తాను!" అన్నాడు సాగర్.
"మొత్తంమీద పోలీసు కొడుకు వనిపించావ్ గుడ్ లక్ సాగర్!" పరిమళ సాగర్ను సాగనంపింది.
27
తెల తెలవారుతోంది. ఉదయభానుని అరుణ కిరణాలు డచ్ వాళ్ళు కట్టిన పోర్టు గోడలను తాకి, నేటి వాటి శిథిలావస్థను తెలియజేస్తున్నాయి. భీమునిపట్నం సముద్ర తీరపు ఇసుకలో అడుగులు భారంగా వేస్తూ తిరుగుతున్న మాధవిని దూరం నుంచి చూశాడు సాగర్!
