"మాధవీ?" సముద్రపు హోరులో సాగరు గొంతు కలిసిపోయింది.
తళతళా మెరిసిపోతూన్న సముద్రపు కెరటాలు చూస్తూ నిశ్చలంగా నిలబడి వున్న మాధవి దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు సాగర్.
"మాధవీ"
మాధవి దృష్టి ఎటో వున్నది.
"మాధవీ!" సాగరు మాధవి చేతులు పట్టుకొన్నాడు. మాధవి ఉలకలేదు పలకలేదు.
"డాక్టరు మూర్తి ముసుగులో వున్న ఆ దుర్మార్గుడు నాగేంద్రాన్ని పోలీసులు పట్టుకొన్నారు. నీ తండ్రినీ, నీ తల్లినీ హత్య చేసిన హంతకుడు ఇప్పుడు శిక్ష అనుభవిస్తాడు."
మాధవి బిగ్గరగా నవ్వింది.
సాగరు గతుక్కుమన్నాడు!
మాధవీ! మనం ఎంతో హాయిగా బ్రతకొచ్చు! ఇక నీకే భయమూ లేదు!"
మాధవి బోరున ఏడ్చింది.
సాగర్ కలవర పడ్డాడు! మాధవి కేమయింది! రాక్షసుడు_నాగేంద్రం మాధవినేం చేశాడు?
"ఎవరు నువ్వూ? ఛీ ఛీ నా చెయ్యొదులు!" మాధవి సాగర్ చేతులు విదిలించుకొని సముద్ర పొడువ ఇసకలో పరుగెత్త సాగింది. అలా కొంత దూరం పరుగెత్తి ఇసుకలో కుప్పగా కూలిపోయింది. సాగర్ ఆమెను రెండు చేతులతో పొదివి పట్టుకొని రోడ్డుమీదున్న కారు దగ్గరకు తీసుకొచ్చాడు.
28
"అంతా అయిపోయింది. జరగవలసినదేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది" యస్పీ సాంబశివరావు జడ్జీ రామనాధంగారి భుజం తట్టుతూ అన్నాడు.
"ఈ ఘోరానికంతటికీ నేనే కారణం. నా స్వార్థంతో మాధవికి అన్యాయం చేశాను." రామనాథం కుమిలిపోతూ అన్నాడు.
"వైజాగ్ సర్కూట్ గెస్టు హౌస్ వరండాలో వాలు కుర్చీలో జారగిలబడిఉన్నాడు రామనాథం. ఆయనకెదురుగా సాంబశివరావు కూర్చున్నాడు. రామనాథంగారి భార్య నాగరత్నమ్మ ప్రక్కన నిలబడి ఉన్నది. అల్లంత దూరంలో లేచి విరిగి పడుతున్న సముద్రపు అలల్లా రామనాథం గుండెల్లో దుఃఖం పొంగిపొర్లుకొస్తున్నది.
"ఊరుకోండి. ఇందులో మీరు చేసిన దేమున్నది? మాధవిని సొంత కూతుర్లా చూసుకొన్నారు" సాంబశివరావు ఊరడింపుగా అన్నాడు.
"మాధవి సొంతకూతురు కాదనే విషయాన్ని దాచిపెట్టడమే నేను చేసిన నేరం! డాక్టర్ మూర్తి_ ఛచా_అదే నాగేంద్రాన్ని చూసినప్పుడు మాధవి మనస్సులో సంక్షోభం మొదలయింది. అప్పుడే మాధవి మా బిడ్డకాదని సాగర్ తో చెప్పివుంటే పరిస్థితి ఇంత క్లిష్టంగా తయారయి ఉండేదికాదు. మాధవి చెప్పినదంతా వాస్తవమే అన్నది. సాగారూ, సైకియాట్రిస్ట్ అర్థం చేసుకోవడానికి అవకాశముండేది. మాధవి మానసిక స్థితి అప్పుడే కుదుట పడి వుండేది. నాగేంద్రం పన్నిన ఉచ్చులో నుంచి మాధవిని సాగర్ రక్షించ గలిగి ఉండేవాడు" రామనాథంగారు నిట్టూర్చారు.
"అది సరే! నువ్వు పేరుమోసిన పోలీసాఫీసరవు గదా? దొంగముండా కొడుకు డాక్టర్ గా చెలామణి అవుతూంటే మీరేం చేస్తున్నట్టూ? పైగా వాడితో స్నేహం కట్టి ఎలా తిరిగారూ?" నాగరత్నమ్మ సాంబశివరావును నిలదీసింది.
"అతడ్ని అనుమానించడానికి ఏ ఆధారమూ దొరకలేదు. సాగర్ అతడ్ని అనుమానించడమూ, సాగర్ ను మాధవిని అతడు వెన్నాడటమూ చివరలో నేను గ్రహించాను. మొదట్లో సాగర్ చెప్పినదంతా అబ్ సర్డు అని కొట్టిపారేశాను. రాను రాను వాడు చెప్పేదాంట్లో ఏదో వాస్తవం ఉన్నదన్న నమ్మకం కుదిరింది. అప్పట్నుంచీ డాక్టర్ మూర్తి మీద _ అదే నాగేంద్రం మీద నిఘా వుంచాం. బహుశః నాగేంద్రం పసిగట్టి వుంటాడు. అందుకే తొందరపడ్డాడు. ఇంత దారుణానికి తలపడ్డాడు. నా తెలివితక్కువకు నేను సిగ్గు పడుతున్నాను. ఇప్పుడు విచారించి లాభం ఏముంది? ఆ దుర్మార్గుడ్ని _హంతకుడ్ని ఉరికంబం ఎక్కించాలి." సాంబశివరావు అన్నాడు.
"నా బిడ్డకు జరగకూడని అపకారం జరిగిపోయింది. మీరు ఆ నాగేంద్రాన్ని జైలుకు పంపినా, ఉరి వేయించినా, నా బిడ్డ ఆరోగ్యం బాగుపడుతుందా? మళ్ళీ మామూలు మనిషి అవుతుందా?" నాగరత్నమ్మ కళ్ళు తుడుచుకొన్నది.
"మాధవిని ఏ వయసులో ఉన్నప్పుడు తీసుకొచ్చారూ? ఎవరి ద్వారా ఆ బిడ్డ మీ దగ్గరకు చేరింది?" రామనాధాన్ని అడిగాడు సాంబశివరావు.
"మా పెత్తండ్రి జబల్ పూర్ లో సెటిల్ అయ్యారు. మన తెలుగువాళ్ళు ఎంతోమంది జబల్ పూర్ లో ఉన్నారు. ఆయన ద్వారా అనాధాశ్రమం నుంచి మాధవిని మూడేళ్ళు వయసులో వుండగా తెచ్చుకొన్నాను. ఆ బిడ్డ తల్లితండ్రులు హత్య చేయబడ్డారని దిక్కులేని ఆ బిడ్డను మా పెత్తండ్రి కొద్దికాలం తనదగ్గర పెట్టుకొని తర్వాత అనాధ ఆశ్రయంలో చేర్పించారు. ఎవరికీ తెలియని బిడ్డను పెంచుకుంటే పెద్దదయ్యాక కూడా ఆ బిడ్డకు అసలు తల్లితండ్రులెవరో తెలిసే అవకాశం ఉండదని అంతదూరం నుంచీ మాధవిని తెచ్చి పెంచుకొన్నాం."
"మీ పెదనాన్న గారి ద్వారా మాధవి అసలు తల్లితండ్రులెవరో, ఎప్పుడు ఎలా హత్య చేయబడ్డారో తెలుసుకోవచ్చనుకుంటాను. నాగేంద్రం కేసులో యీ సమాచారం చాలా ముఖ్యమైంది."
"ఆయన మీకు తప్పకుండా సహాయపడ్తాడు" జడ్జి రామనాథం అన్నాడు.
"కిడ్నాప్, ఫిజికల్ ఎసాల్ట్ మెంటల్ హీరాస్ మెంట్ నేరాలకు నాగేంద్రాన్ని అరెస్టు చేశాం. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక సరైన ఆధారాలు దొరికితే డాక్టర్ మూర్తినీ అతని భార్యను హత్య చేసిన నేరాలకు నాగేంద్రాన్ని విచారించవచ్చు" అన్నాడు సాంబశివరావు.
29
"మీరంతా పెళ్ళికి వచ్చిన పెద్దలేనా? అలా నిలబడ్డారెండుకు కూర్చోండి. ఏమిటర్రా అలా చూస్తారూ! వియ్యాలవారికి విందు చెయ్యొద్దూ?"
"అమ్మా మాధవీ," నాగరత్నమ్మ మాధవిని కౌగలించుకొని భోరుమన్నది.
జడ్జీ రామనాథంగారు కళ్ళు తుడుచుకొన్నారు. యస్పీ సాంబశివరావుగారు రామనాథంగారి భుజంమీద చెయ్యివేసి ఆయనను ఓదార్చడానికి ప్రయత్నించాడు.
"పెళ్ళికొడుకెక్కాడా? అయ్యో పెళ్ళికొడుకు లేకుండానే పెళ్ళి జరిగిపోయిందా ఏం? మాధవి గుండ్రంగా కళ్ళు త్రిప్పింది."
గోడకానుకొని కుమిలిపోతున్న సాగరును పరిమళ సమీపించింది.
"సాగర్ ఏమిటోయ్ అది, ఊరుకో! షి విల్ బి ఆల్ రైట్! త్వరలోనే నాగేంద్రం ఇచ్చిన షాక్ నుంచి బయట పడుతుంది!"
"డాక్టర్ పరిమళా!" సాగరు పరిమళ చేతులు పట్టుకొన్నాడు. "నా మాధవిని..." గొంతు పూడిపోయింది.
"నీ మాధవిని నీకు అప్పగిస్తాను. ఆ బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ! ఐదారు నెలల్లో మాధవి బాగుపడుతుంది!"
"అయ్యో! నా తెలివి మండిపోనూ ఇంతకీ పెళ్ళికూతురెక్కడా? అసలు పెళ్ళికూతురెవవరూ? నా మతిమరుపు పాడుగానూ! నేనేగా పెళ్ళికూతుర్ను. అలా చూడకండర్రా నాకు సిగ్గు ముంచుకొస్తుంది. మాధవి ముఖానికి చేతులడ్డం పెట్టుకొని కిల కిలా నవ్వింది. గలగలమని వినిపిస్తున్న నవ్వు అంతలోనే రోదన స్వరంగా మారిపోయింది. హృదయ విదారకంగా ఉన్న ఆమె రోదన ధ్వనికి సాగర్ గుండెలు అవిసిపోయినై.
డాక్టర్ పరిమళ మాధవి చుట్టూ చెయ్యివేసి మెల్లగా పదమూడవ నంబరు గదివైపు నడిపించుకు పోసాగింది. పిచ్చాసుపత్రి వరండాలో దిగాలుపడి నిలబడివున్న సాగరును తిరిగి చూడకుండానే పదమూడవ నంబరు గదిలోకి వెళ్ళింది! మాధవి.
* సమాప్తం *
