Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 52


    "మీరు థియరీ అంతా తెలుసుకున్నా అనుభవం కోసం హౌస్ సర్జన్సీ చేస్తున్నారా లేదా?"
    "చేస్తున్నాం! అయితే?"
    "మీరు ఒక సంవత్సరం అనుభవం సంపాదిస్తారు. నాగేంద్రానికి థియరీ తెలియకపోవచ్చు. కాని స్వయంగా చూసి మూడేళ్ళు నేర్చుకున్నాడు. డాక్టరుగా చలామణి అవడానికి కావాల్సినదంతా నేర్చుకున్నాడు."
    "దెన్ హిమస్ట్ బీ ఏ జీనియస్!"
    "సందేహమెందుకు! ఏ గ్రెట్ యీవిల్ జీనియస్! నాగేంద్రం పెద్ద మేధావి. అతని తెలివితేటలు వక్రమార్గాన పడ్డాయి. అతని వెనక ఉన్న వాతావరణం, పరిస్థితులూ అలాంటివి."
    "అయితే డాక్టర్ మూర్తి పేరుతో ఫోర్జరీ సర్టిఫికెట్ సృష్టించాడంటారా!"
    "కావొచ్చు! లేకపోతే ఆ పేరుగల డాక్టర్ను హత్యచేసి అతని పేరుతో మరో ప్రాంతంలో సర్వీస్ లో చేరి ఉండొచ్చు."
    "సాగర్ నువ్వు కలగంటున్నావా?" నిజానికి డాక్టరు పరిమళే నిద్రలో పలవరించినట్లుగా అన్నది.
    "కలలన్నీ కరిగిపోయినై ఇప్పుడు వాస్తవాన్ని చూడగలుగుతున్నాను. నాగేంద్రం బ్రహ్మాండమైన పథకం వేశాడు. దుర్భేధ్యమయిన పద్మవ్యూహాన్ని పన్నాడు. భార్యనూ, పిల్లనూ జబల్ పూర్ లో వదిలేశాడు. ఉన్న ఊళ్లో ఇల్లు అమ్మివేశాడు. తనను గురించి ఏ రకమైన ఆచూకీ ఆ ప్రాంతంలో లేకుండా చేశాడు. ఆయమ్మ దేశంగాని దేశంలో దిక్కులేని చావుచావడమో, ఏ ఇంట్లోనో చాకిరి చేస్తూ జీవితం గడిపేస్తుందని ఊహించాడు. వాస్తవానికి అలాగే అజ్రిగింది కూడా. ఆ తర్వాత వంటవాడిగా డాక్టరు మూర్తి ఇంట్లో జేరాడు. తన భౌతిక చిహ్నమయిన ఆరో వ్రేలును నరుక్కున్నాడు. చిన్నపిల్లగా ఉన్న మాధవి అది చూసింది. అదను చూసుకొని తన పథకాన్ని అమలు జరిపాడు. ఒక రాత్రి డాక్టర్ మూర్తినీ, అతని భార్యనూ హత్య చేశాడు. మూడేళ్ళ మాధవి కోసం గాలించాడు. అదృష్టవశాత్తూ మాధవి తప్పుకొన్నది. ఎంత తెలివిగల నేరస్థుడు కూడా ఏదో ఒక ఆధారం వదిలి తీరుతాడు. దేరీజ్ నో పర్ఫెక్ట్ క్రైం! నాగేంద్రం విషయంలో కూడా అంతే జరిగింది. మూడేళ్ళ పిల్ల_ఊహ తెలియని పిల్ల కోసం శ్రమపడి వెదకలేదు. అక్కడికి మాధవి కోసం చూసాడు. కనిపిస్తే మాధవిని చంపి ఉండేవాడేమో! లేక అతనిలో మిగిలివున్న మానవత్వం అడ్డొచ్చేదేమో? చెప్పలేం! ఏమైనా అదే అతడి కంఠానికి ఉరిత్రాడై కూర్చున్నది. అదే అతని జీవితానికి శాపం అయింది. ముక్కుపచ్చలారని మాధవి మస్తిష్కంలో ఆ ధారుణ సంఘటన హత్తుకుపోయింది. ఆమెలో నిద్రాణమై నిగుప్తమై ఉన్న ఆ భయంకర భీభత్స దృశ్యం మీద కొన్ని సందర్బాలలో వెలుగు ప్రసరించగా మాధవి మానసిక అలజడికి గురి అవడం జరుగుతూ ఉన్నది. ఆ సంఘటనకు సంబంధించిన ఏ మనిషి అయినా వస్తువయినా తటస్థ పడగానే మాధవి మస్తిష్కంలో ఇనుప తెరలు తెగిపడేవి.
    "మొదటిసారిగా _ ప్రైజ్ తీసుకుంటూ డాక్టర్ మూర్తిని చూసింది. మాధవి మస్తిష్క అగాధాల్లో ఉన్న ఆమె స్మృతులు విహంగాల్లా లేచాయి. అతని చేతినించి ప్రైజ్ అందుకొన్నది. తెగినవ్రేలి మచ్చ_బాణంలా ఆమె స్మృతి పథంలో దూసుకువెళ్ళింది. ప్రైజ్ గా అందుకొన్న ప్రెజర్ కుక్కర్ ఆమెలో అగ్నిగుండాలను ప్రజ్వరిల్ల చేసింది. నాగేంద్రం, అతని తెగిన వ్రేలు_ ప్రెజర్ కుక్కర్_ ఇవన్నీ మాధవి సబ్ కాన్ షన్స్ తో దాగివున్న భీభత్స దృశ్యానికి ఇతివృత్తాలు."
    'ఓ మైగాడ్!" డాక్టర్ పరిమళ నుదుట పట్టిన చెమట బిందువులను తుడుచుకొన్నది.
    ఆయమ్మ కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది.
    "సాగర్ బాబూ! భోజనం చేసివెళ్ళు, వంట కూడా అయిపోతున్నది." అని చెప్పి ఆయమ్మ మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది.
    కాఫీ సిప్ చేస్తున్న డాక్టర్ పరిమళ హఠాత్తుగా కప్పు కిందపెట్టి సాగర్ కళ్ళల్లోకి చూసింది. ఆమె బుర్రలో ఏదో మెరుపు మెరిసిందనేది సాగర్ గ్రహించాడు.
    "అయితే మిస్టర్ సాగర్! మాధవి తల్లిదండ్రులను డాక్టర్ మూర్తి _ సారీ! అదే నాగేంద్రం హత్యచేశాడంటావ్?"
    "అవును!" కాఫీ సిప్ చేస్తూ తాపీగా అన్నాడు సాగర్!
    "అంటే రామనాధంగారూ నాగరత్నమ్మగారూ అలా నాగేంద్రం చేత హత్య చేయబడి_" సాగర్ కాఫీ అమాంతం గుటకవేసి కళ్ళు తేలేశాడు. డాక్టర్ పరిమళ మళ్ళీ అందుకొని "అంటే పూర్వజన్మలో మాధవి తల్లిదండ్రులు హత్య చేయబడి మళ్ళీ యీ జన్మలో రామనాధంగాను, నాగరత్నమ్మగానూ పుట్టి మళ్ళీ అదే మాధవికి తల్లిదండ్రులయ్యారన్నమాట. అంటే నీ సిద్దాంతం ప్రకారం మాధవి తల్లిదండ్రులది రెండు జన్మల కథలాగా మాధవిది మాత్రం ఒకే జన్మ కథన్నమాట." పరిమళ పెద్దగా నవ్వింది.
    "ఒక్కక్షణం నన్ను ఆలోచించుకోనియ్యండి"
    "ఇంకేం చించుతావ్? చించింది చాలు! పోనీ రెండు జన్మల కథ వదిలేసినా మాధవి మొదటి తండ్రి అంటే హత్యచేయబడిన తండ్రి డాక్టరు. కాని బ్రతుకున్న తండ్రేమో జడ్జీ! ఈ రెంటికినీ అన్వయం ఏమిటో? బోడిగుండుకూ, మోకాలుకూ ముడేస్తావా?"
    సాగర్ గొంతులో వున్న కాఫీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. కొల మారింది, కొద్ది క్షణాలు వూపిరాడకుండా దగ్గాడు. పరిమళ లేచి అతని నెత్తి నిమిరింది.
    "చంపేశావ్ పరిమళా! ఇంతవరకూ ఆ సంగతి నేను ఆలోచించలా! అయితే నీ ప్రశ్నలోనే నాకు సమాధానం స్ఫురించింది!"
    "ఆఁ హా అలాగా! డాక్టర్ మూర్తి అన్నట్టు నిన్ను నిజంగా మెంటల్ హాస్పటల్లో చేర్పించడమే మంచిదని నాకు తోస్తున్నది!"
    సాగరు అదిరిపడి డాక్టర్ పరిమళ కేసి చూశాడు.
    "ప్లీజ్! డోంట్ జోక్! నువ్వు మాధవి మొదటి తండ్రి, రెండవ తండ్రి అన్నావే అదే నిజం! అయివుండాలి. మాధవి జడ్జీ రామనాధం గారి సొంత బిడ్డ కాదు. పెంపుడు కూతురయి ఉండాలి!"
    పరిమళ విస్తుపోయి సాగర్ కళ్ళలోకి చూసింది.
    "ఎస్! దటీజ్ పాజిబుల్! ఇది గనక రుజువు చేయగలిగితే నా థియరీ అంతా కరక్టే అవుతుంది."
    "ఓ.కే.!" పరిమళ తల వూపింది.
    "మరో చిన్న సందేహం! మాధవి ఆయమ్మ కూతురేనేమో? అలా అయితే నీ కథకు మంచి ట్విస్ట్ ఏమంటావ్?"
    "అది నేను చెప్పలేను! మాధవి అసలు ఎవరి కూతురన్నది సమస్య కాదు. జడ్జీ రామనాథం గారి కూతురు కాదన్నదే నా వాదన! తల్లీ, తండ్రి హత్య చేయబడ్డాక మాధవిని రామనాథంగారు పెంచుకోవడం జరిగి ఉంటుంది. నీకు ఇదివరకే చెప్పాను. సైకియాట్రిస్ట్ మాధవిని ట్రాన్స్ లో ఉంచినప్పుడు అమ్మను నాన్నను వంటవాడు హత్య చేయడం తను కళ్ళారా చూసినట్టు చెప్పింది. అంతేగాదు _ అప్పుడు ఆమె పేరు కూడా వేరే చెప్పింది!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS