తల వంచుకుని కాసేపు నిలబడ్డాడు నిఖిల్. కానీ అతనికి తెలుసు. తను విచారిస్తూ నిలబదిపోతే లాభం లేదని! అక్కడి నుంచి కదిలి, మరో చోట జరుగుతున్న మరో అన్యాయాన్ని నిరోధించాలని!
తను కూడా కార్లో నుంచి దిగింది రాధ. కర్చీఫు తీసి తండ్రి కన్నీరు తుడుస్తున్నట్లుగా అయన కంటినుంచి కారిన చివరి రక్తపు బిందువును తుడిచింది.
తర్వాత నిటారుగా నిలబడింది.
"పదండి నిఖిల్!"
ఇద్దరూ నడవడం మొదలెట్టారు.
సీతాఫలం చెట్ల గుబురు దాటగానే పెద్ద మర్రిచెట్టు ఉంది.
దాని చుట్టుతా అరుగులా కట్టి ఉంది. దాని మీద కుర్చుని ఉన్నారు ఊరి మోతుబరులు కొంతమంది.
వాళ్ళకి ఎదురుగా నిలబడి ఉంది నిర్మల. శోకదేవతలా ఉంది తను. మోహంలో బాధా, భయం, సిగ్గు, లజ్జా అన్నీ పెనవేసుకుని కనబడుతున్నాయి.
"చెప్పు!" అన్నాడు బుగ్గమీసాలతో ఉన్న ఒక పెద్ద మనిషి, అతని పేరు దేవేందర్.
తల ఎత్తి భయంగా చూసి, తర్వాత నెమ్మదిగా అంది నిర్మల "నరేందర్ దొర నన్ను చెడగొట్టిండు."
"ఏమన్నవూ?" అన్నాడు దేవేందర్, రచ్చబండలో న్యాయం చెప్పడానికి కూర్చున్న పెద్ద మనిషి - "మళ్ళీ అను! నీ పని పడతా!" అన్నట్లు గొంతు పెట్టి.
మళ్ళీ చెప్పింది నిర్మల.
"నరేందర్ , నేను కూలికి వెళ్తున్నప్పుడు వెంటబడి పాకలోనికి లాక్కుబోయి బలవంతం చేసిండు."
"ఏ నరేందర్?"
"మీ తమ్ముని కొడుకు నరేందర్!"
"హోష్ లో (స్పృహలో) ఉన్నావా నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు ఏరిక అవుతున్నదా?" అన్నాడు దేవేందర్ గద్దిస్తూ.
"నిజమే చెబుతుంటిని దొరా! నేను అబద్దాలేందుకు చెబుతా?"
"పాకలోకి తెసుకెళ్ళడా నరేందర్? తీసుకెళ్ళి ఏం చేశాడు?"
"అదే........."అని ఆగిపోయింది ఆ అడకూతురు. జరుగుతున్న తతంగం అంతా చాలా చీదరగా ఉంది ఆమెకు. కానీ తప్పదు. తనని చెడగొట్టాడు నరేందర్. తను చెడిపోయింది. తను చెడిపోయినా తన బ్రతుకు చెడిపోకుండా ఉండాలంటే నరేందర్ తనని పెళ్ళి చేసుకోవాలి. అదొక్కటే మార్గం.
అందుకే ఈ పంచాయితీకి వచ్చింది తను.
"చెప్పవే! ఏం చేసిండు?"
"భర్త భార్యని ఏం చెస్తాడు దొరా? అదే చేసిండు!"
పెద్దమనుషులందరూ నవ్వారు. వాళ్ళతోనే కూర్చున్న ముద్దాయి నరేందర్ కూడా నవ్వు మొహం పెట్టాడు.
సీతాఫలం చెట్ల మాటున నిలబడి చూస్తున్న నిఖిల్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి రాధ మొహం జేవురించింది.
దేవేందర్ నిర్మాలని అడుగుతున్నాడు.
"నువ్వు వచ్చి నలుగురి ముందు నిలబడి నా తమ్ముని కొడుకు నిన్ను పాడుచేశాడని (ఈ భావాన్ని అతను పరమ నీచమయిన పదాలతో చెప్పాడు) ఏడ్చినంతమాత్రాన నమ్మేదెవరు? నీకు సాక్ష్యం ఎవరన్నా ఉన్నారా?"
"ఉన్నారు" అంది నిర్మల అవమానంతో కందిపోయిన మొహంతో. ఈసారి ఆమె "దొరా" అన్న గౌరవవాచకం జోడించలేదు తన మాటలకి.
"ఎవరే?"
"నా అన్న! వెంకటేశం!"
దున్నపోతు నవ్వు నేర్చుకున్నట్లు నవ్వాడు దేవేందర్.
"ఆ ఎర్రోడా? ఎర్రినాయాలి మాటలని సాచ్చంగా ఎవరోప్పుకుంటారే?"
"ఎర్రోడే గానీ నా అన్న అబద్దాలు చెప్పడం ఎరగడు దొరా! అది ఈ ఉళ్ళో అందరికీ తెలుసు!"
ఊళ్ళో అందరికీ ఆ సంగతి తెలుసన్న సంగతి దేవేందర్ కి తెలుసు. అందుకని కొంచెం తగ్గాడు.
వెంకటేశాన్ని పిలిపించారు.
బొరుగుల ఉండ తింటూ వచ్చాడు నలబై ఏళ్ళ వెంకటేశం. ఇంకో ఉండ అతని షర్టు జేబులో ఎత్తుగా కనబడుతోంది. జరుగుతున్న దారుణం , విషాదం అతనికి బొత్తిగా అర్ధమయినట్లు లేదు.
"ఏమిరా బాడఖోష్! ఏమి చూసినావో సత్యం చెప్పు! ఎక్కువ తక్కువ చెప్పినా వంటే నాలుక పెరికి పారేస్తా! చెప్పు" అన్నాడు దేవేందర్ అతన్ని ముందే హడలగొట్టేసే ప్రయత్నం చేస్తూ.
బెదిరిపులు, బుజ్జగింపులు, మాయలు, కుట్రలూ వీటన్నిటికీ అతీతమయిన మానసిక స్థితిలో ఉన్న వెంకటేశం తల వంకరగా పెట్టి నవ్వాడు.
నేను అబద్దాలేందుకు చెబుతా దొరా! సత్యమే చెబుత! నిర్మలక్కని నరేందర్ సాబ్ గొడ్లపాకలోన్కి ఈడ్చుకెళ్ళిండు."
దేవేందర్ మొహంలో కళ తగ్గింది.
"ఈడ్చుకెళ్ళి?"
ఆ తర్వాత అమాయకంగా గ్రామీణబాషలో జరిగినది అంతా వివరంగా చెప్పాడు వెంకటేశం.
"ఇంక నువ్వు ఊక ఉండు!" అని అతన్ని కసిరి మీసాలు దువ్వుకుంటూ ఆలోచించడం మొదలెట్టాడు దేవేందర్.
నిందితుడు తన సొంత తమ్ముని కొడుకు. నేరం ఆరోపిస్తోంది ఒక అడ కూలి. దానికి వెర్రిబాగుల అన్న తప్ప వేరే దిక్కు ఇంకెవరూ లేరు.
