"బాధపడకండి. అలాంటి మాటలు అసలు మీరు పట్టించుకోకూడదు."
"ఎలా పట్టించుకోకుండా వుండను? చెవులు శుభ్రంగా వింటున్నాయి. మనసు శుభ్రంగా ఆలోచిస్తూంది. ఎలా పట్టనట్టుగా వుండగలను?" నిస్సహాయంగా చూసింది.
సుధ కల్పించుకొని "కందకులేని దురద కత్తిపీటకెందుకు మామ్మగారూ? మీరూ స్త్రీయేకదా? సుగుణ స్థానంలో మీరో మీ కూతురో వుంటే మీరిలాగే అనగలరా?" అడిగింది.
"నేనే వుంటే యింత విషంమింగి చచ్చేదాన్ని, అంతేకాని చచ్చిన పాములా వాడిమెడకుపడి ఏడ్చే దాన్ని కాదు" ఆవిడ కటువుగా, అంతనిర్దాక్షిణ్యంగా అంటుంటే సుధకు మనస్సు చివుక్కుమన్నట్టుగా అయింది. నోట మాట రానట్టుగా నిశ్చేష్టురాలైపోయింది.
"బతుకు బండలైన ఒక కొడుకు తల్లిగా మాట్లాడుతున్నాను. పిల్లల జీవితాలు పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో కళకళలాడుతుండాలని ఏ తల్లయినా కోరుకుంటుంది. ముప్పైయేళ్లకే నా కొడుకు నాతిగల బ్రాహ్మచారి అయ్యాడు. నాకిది గుండెకోత కాదా?
"ఇది మీకోడలు కావాలని చేసిన అన్యాయం కాదుకదా? ఏక్సిడెంట్ అయి ఇలా జరిగినదానికి ఆమేం చేయగలదో చెప్పండి?"
"చేయాలనుకొంటే చేస్తుందమ్మా!"
"ఏం చేయగలదు? తను ఆత్మహత్య చేసుకోవడమా?"
"నా కడుపున ఇద్దరాడపిల్లలున్నారు. అంతమాట నేనెలా అంటాను? తనుండికూడా పెద్దమనసుతో వాడికి మళ్లీ పెళ్లిచేయొచ్చు వాడికి పిల్లా పాప పుడితే వాళ్లని చూసి తనపిల్లలుగా ఆనందించవచ్చు. నిజంగా భర్తసుఖం కోరుకొనే ఇల్లాలయితే ఆ పని ఎప్పుడో చేయాల్సింది. తను సంసారానికి పనికిరానని తెలుసుకొన్న మరుక్షణం యీ నిర్ణయం తీసుకోవాల్సింది."
"చేతులారా సవతిని తెచ్చిపెట్టుకొంటే తప్ప ఆమె ఉత్తమ ఇల్లాలు కాదంటారా మామ్మగారూ? జీవితాంతం ఆమె సంసారానికి పనికిరాదని చెప్పలేదుగా డాక్టర్లు? కొంతకాలం తాము చెప్పినట్టుగా జాగ్రత్తగా వుండి మందులు వాడితే తరువాత దాంపత్య జీవితం గడపొచ్చునని చెప్పారుగా డాక్టర్లు. ఆమె జీవిస్తున్నదే ఆ కొంతకాలం తరువాత గడపబోయే జీవితం మీద ఆశతోనే! అదే నాసనం చేసుకొంటే ఆమె జీవించేందుకు ఆధారమేమిటి?"
"ఆఁ డాక్టర్లకేం? ఎప్పుడూ ఆశగానే చెబుతారు! మరుక్షణంలో చచ్చేవాళ్లకయినా "ఫర్వాలేదు. మీరు కోలుకుంటారు" అని చెప్పి ఆశతో వూపిరిపోయడానికే ప్రయత్నిస్తారు. అది వాళ్ల ధర్మంకాబట్టి! కాని నా కోడలు మామూలుగా తిరుగుతుందంటే నేను నమ్మను. ఏడాదినుండి నడుం విరిగి పడివున్న ఆమెలో ఏ మార్పూ నాకు కనిపించలేదు."
చంద్రకాంత్ ఎప్పుడవచ్చి నిలబడ్డాడో గుమ్మంలో - "అమ్మా!" అని పిలిచాడు కఠినంగా. "సామాన్లు సర్దుకో. బస్సు ఎక్కించి వస్తాను."
"ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని నన్ను ఇంట్లోంచి గెంటినంత పని చేస్తావురా?"
"నవ్వుతూ, తుళ్లుతూ గడపాల్సిన సమయంలో ఏక్సిడెంట్ అయ్యి అవిటిదైపోయి జీవన్మృతురాలిలా రోజులు నెడుతూందే!ఆమెనింకా చచ్చిన పామును చంపుతున్నట్లుగా మాట్లాడుతున్నావే! నా సుఖం సంగతి నాకు తెలియదా? ఆమె పిల్లను తెచ్చి నాకు పెళ్ళిచేయాలా? ఏం సలహా ఇస్తున్నావమ్మా? ఆమె స్థానంలో నీ కూతురే వుంటే యింత నిర్దాక్షిణ్యంగా మాట్లాడే దానివా?"
"నేను మాట్లాడుతున్నది బ్రతుకు అన్యాయమైన ఒక కొడుకు తల్లిగా! నేనేం తప్పుమాట్లాడలేదురా" సుబ్బలక్ష్మి ఉక్రోషంగా అంది.
"ఈ ప్రపంచంలో చాలామంది తల్లులు తన పిల్లలకి తల్లిగా మాత్రమే గిరిగీసుకొని ఆలోచించడంవల్ల అత్తింటికిరాతకానికి చాలామంది స్త్రీలు ఆహుతై పోతున్నారమ్మా! నీ కొడుకు గురించి ఆలోచించినదానివి మరో అమ్మ కన్నబిడ్డను గురించి ఎందుకాలోచించలేవు?"
