Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 52


    "ఇదిగో బుల్ బుల్ పిట్టా! నీ ఆటలు నా దగ్గర సాగవు. నీ చేతిలో తొమ్మిది జోకర్లున్నా ఆట తిప్పనివ్వను. అదే పరుశురాం ప్రత్యేకత."

    "సరే! అదీ చూస్తాను. ఎప్పుడు చూపిస్తానో చెప్పు నీ బోడి ప్రత్యేకత!" మూతి తిప్పింది రాణి. కింది పెదిమని మునిపంటితో కొరుకుతూ ఓరగా చూస్తూ నడుం తిప్పుతూ ఒయ్యారాలు పోతూ అంది.

    "రాత్రికి నే 'సై' పరుశురాం నవ్వాడు."

    "ఆ రోజులా దుప్పట్లో దూరు."

    "దూరి చూశేనులా.... ఏముంది! అంతకంటే సినిమాకిపోవడం మంచిది."

    "ఆట ఆడదామని.... సినిమా అంటావే!"

    "అసలాట సినిమా నించే మొదలవ్వలా! నువ్వు చిరంజీవి. నేను విజయశాంతి. మొహాన్ని చేతుల్లో దాచేసుకుంది రాణి."

    పరుశురాం ఆమె పిర్రలమీద ఒకటేశాడు.

    "ఓసి నీ యవ్వ! ఆశకి, కోరిక్కీ తమకం లేదు."

    జేబులోంచి సిగరెట్ పెట్టే తీశాడు. దానిలో సిగరెట్లు లేవు. చిరాగ్గా దాన్ని విసిరికొట్టాడు పరుశురాం. రాణి ఓరగా చూసింది.

    అతను చేతుల్ని దులుపుకొంటున్నాడు.

    "ఇప్పుడే వస్తా" అని తుర్రున పరుగు పెట్టింది రాణి.

    వున్నట్టుండి ఆమె ఎందుకెళ్ళిపోయిందో అర్దం కాక చుట్టూ చూశాడతను.

    యాదమ్మ లోపల నిద్రపోతోంది. రోడ్డుమీద ఎవరూలేరు. అయిదు నిమిషాల తర్వాత సిగరెట్ పెట్టె, అగ్గిపెట్టెతో వచ్చింది రాణి.

    తన అవసరాన్ని గమనించి ఆమె వాటిని తేవడం చూసిన అతనికి ఆమెపైన ఏదో ఆత్మీయతాభావం కలిగింది.

    "నువ్వు ఎందుకు తెచ్చావు? నేను అడగలేదుగా?" అన్నాడు.

    రాణి అల్లరిగా నవ్వింది.

    "బావ సంగతి నాకు తెలీదా?" అంది.

    "బావ? ఎవరే నీ బావ?" అన్నాడు పరుశురాం.

    "యాదమ్మ చెప్పిందిగా నువ్వే నా పెద బావవని."

    "అయితే?"

    "బావకి సిగరెట్లు తెచ్చివ్వడంలో గొప్పేముంది? నీ దగ్గర పైసల్లేవు. జేబులో సిగరెట్లు అయిపోయినాయి. సిగరెట్లు లేకపోతే నిమిషం బతకలేవు. అందుకని తెచ్చాను."

    "థాంక్యూ!" అన్నాడు పరుశురాం ఆమె కేసి అభిమానంగా చూస్తూ.

    థాంక్యూ అన్నమాటకి రాణి మనసు ఉప్పొంగిపోయింది. అదేదో చాలా గొప్పమాటన్న భావం కలిగింది రాణికి.

    సిగరెట్ వెలిగించి అడిగాడు.

    "మరి సినిమాకి డబ్బులు...." రాణి కిసుక్కున నవ్వింది.

    "పైసల్దేముంది బావా? ఆ ఏర్పాటు నేను చూసుకొంటాన్లే! సినిమా టికెట్లకి పది, రిక్షాకి పది, డ్రింకులకి పది. మొత్తం ముప్ఫయికావాలి. ఈలోగా చిన్న పట్టు పట్టానంటే సొమ్మే సొమ్ము!"

    "అసలింత కష్టపడి సినిమాకెందుకు. పైగా ముప్ఫైరూపాయల ఖర్చు చెబుతున్నాను" అన్నాడు పరుశురాం.

    రాణి మాట్లాడలేదు.

    "కన్నయ్య కష్టపడి తెచ్చే అయిదు రూపాయల్తో అమ్మనీ, నన్ను పోషిస్తున్నాడు రాణి! నువ్వు పెట్టబోతున్న సినిమా ప్రోగ్రాం ఖర్చుని మన కన్నయ్యగాడు వారం రోజులు కాయకష్టం చేస్తే సంపాదిస్తాడు. వాడి రెక్కల కష్టంపైన ఆధారపడిన నేను అంత సొమ్ము నీతో ఖర్చు చేయించలేను" అన్నాడు పరుశురాం.

    రాణి అతని మాటల్ని తేలికగా కొట్టిపారేసింది.

    "కన్నయ్యగాడు పిచ్చిసన్నాసి కాబట్టి రెక్కలు ముక్కలు చేసుకొంటున్నాడు. ఆడు నా అసిస్టెంటుగా చేరితే సొమ్మే సొమ్ము!"

    పరుశురాం సూటిగా రాణి కళ్ళలోకి చూశాడు.

    "తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని సామెత. అలా వుంది నీ ఆలోచన. వాడి బతుకు వాడిని బతకనివ్వు మహాతల్లీ నేను కూడా రెండ్రోజుల్లో ఏదన్నా పని చూసుకుంటాను" పేకముక్కల్ని కలుపుతూ అన్నాడు పరుశురాం.

    "కొత్త పేక తేనా!" అడిగింది రాణి.

    "వద్దు!" అన్నాడు. రాణి నీ మొహంలాగే వుందీ ఆ పేక కూడా! పోలీసు పేక" పడీ పడీ నవ్వడం మొదలుపెట్టింది. అతని కళ్ళు ఎర్రగా మారినాయి. ఆమె చేతిని గట్టిగా పట్టుకొన్నాడు పరుశురాం.

    "ఇది పాత పేక కాదు రాణీ! ఈ పేకలో వున్న ప్రతి ముక్క వెనుకా రాసి వున్న విషాదగాద నీకు తెలీదు. ఊహ తెలుస్తోన్న పసితనంలోనే నా గుండెలో చితిమంటల్ని రగిలించింది విధి. ఈ మంటలు రగిలి రగిలి.... నాలోని అగ్నిపర్వతం పేలి.... లావాలా.... నా శతృకూటమి అంతం కావాలి. ఈ పేక నా కర్తవ్యాన్ని నెరవేర్చుకోడానికి, అనుక్షణం నాలో పగని గుర్తుచేస్తుంది. అందుకే ఈ పేకముక్కలు ఎప్పుడూ నాతోనే వుంటాయి."

    రాణీ విస్మయంగా చూసిందతన్ని.

    "నేనేం అడిగాను. నువ్వేం చెప్పావు? నాకేం అర్ధం కాలేదు" అని బుర్రని గోక్కుంది.

    "సాయంత్రం తయారుగా వుండు. సినిమాకి పోదాం!" అంది తిరిగి.

    "సినిమాకెందుకే?" అన్నాడు పరుశురాం.

    "ట్రయిల్ పార్టీతో మన ప్రేమ మొదలవ్వాలని" అని దౌడు తీసింది రాణీ.

    పరుశురాం ఆమె మాటలకి ఉలిక్కిపడ్డాడు. ఏదో పెనుగాలి వీచినట్టు.... ఉరుము ఉరిమినట్టు.... కొండ శిఖరమేదో విరిగి మీద పడ్డట్టు.... అతని కళ్ళముందు అనూష రూపం మెరుపులా మెరిసింది.

    అనూష.... అనూష.... అనూష.... అనూష.... అనూష.... అనూష.... అనూష.... అనూష.... అనూష....

    రెండుచేతులతో చెవులని గట్టిగా మూసుకున్నాడు పరుశురాం. అతని కళ్ళనించి రెండు కన్నీటి బొట్లు రాలిపడినాయి. అనూషని తను కలుసుకొనే రోజెంత దూరంలో వుందీ? అరచేతుల్లో మొహాన్ని దాచేసుకొన్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS