Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 51


    "ఆడదని చాలా తేలికగా కొట్టిపారేస్తారు మగ సన్నాసులు. నేను మగాడి 'పొగరు' ఆడదాని చేతికి చిక్కక తప్పదని తెలీదు. ఆనందానికైనా, ప్రాణం మీదకి తెచ్చుకోడానికైనా మగాడికి ఆ ఒక్క క్షణం చాలు. ఆడదానిదే పైచేయి. నువ్వు ఓడిపోయినట్టు అంగీకరించకపోతే నీకు నక్షత్రమండలం కనిపిస్తుంది."

    ఆమెకి నవ్వాగడం లేదు. అతని పరిస్థితి అయోమయంలో పడిపోయింది.

    ఆమె పట్టు.... కొంచెం.... కొంచెం బిగుస్తోంది. (ఎడిట్)

    పరుశురాం కదలబోయాడు. రెండో చేత్తో అతనికి చక్కిలిగింతలు పెట్టడం మొదలు పెట్టింది రాణి.

    అతని పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారయిందిప్పుడు.

    గట్టిగా నవ్వితే జనం లేస్తారు. తిరగపడ్డానికి అవకాశం ఆమె యివ్వదు. బంది ఆమె దగ్గరుంది. యిప్పుడు రభస జరగకుండా తప్పించుకోడానికి ఆమెని విడిచిపెట్టడం ఒక్కటే మార్గం. ఆ తర్వాత తన చేతికి ఎలాగూ చిక్కక మానదు.

    "విడిచి పెడుతున్నావా లేదా?"

    "వెళ్ళిపో తల్లీ!" అన్నాడు తన పట్టు వదిలేసి పరుశురాం.

    "ఏయ్ తల్లీ పిల్లీ అని పిలిచావంటే జాతర చేస్తాను. చూడు మళ్ళీ అప్పు, సొమ్ము అంటే మర్యాద దక్కదు" అంటూ కిందకి దుమికి పరుగుదీసింది రాణి.

    పరుశురాం ఊపిరి పీల్చుకుంటూ లేచి కూర్చుని!

    "ప్రాణం తీసింది రాక్షసీ!" అనుకొన్నాడు.

    "నేను అందుకే చెప్పాను. అది చాలా ముదురు కేసు."

    ఆ మాటలకి పరుశురాం ఉలిక్కిపడ్డాడు పక్కకి తిరిగి చూశాడు.

    కన్నయ్య! వాడెప్పుడు లేచి కూర్చున్నాడో!

    "నువ్వెప్పుడు లేచావురా!" అడిగాడు పరుశురాం.

    "అది నా దెబ్బ, ఇది నీ దెబ్బ అనుకొంటున్నారే... అప్పుడు" అన్నాడు కన్నయ్య, పరుశురాం సిగ్గుపడ్డాడు.

    చిన్న కుర్రాడు అంతగా గమనించాడని గిల్టీగా వుందతనికి.

    టిట్ ఫర్ టాట్ అనుకున్నాడే గానీ రాణితో సరస సల్లాపాల్లో మునిగిపోవాలనే కోరిక అతనికిలేదు.

    సిగరెట్ వెలిగించాడు పరుశురాం.

    "దానికి బాగా బుద్ధి చెప్పాల్సింది. ఆ మస్తాన్ గాడితో తిరిగి చెడి పోతోంది" అన్నాడు కన్నయ్య.

    "ఆడెవడు?"

    "ఆడు! ఓ ఆడ రౌడీ! నలుగుర్ని పోగేసి హంగుగా నిలబడి దీనితో మూడుముక్కల ఆట ఆడిస్తాడు. మోసం చేసి ఇది గెలిచే సొమ్ముతో వాడు మూడొంతులు దోచేసి నాలుగోవంతు ఈ క్రాక్ ముండకి పడేస్తాడు" చెప్పాడు కన్నయ్య.

    గళ్ళ లుంగీ, బనీను, మెడలో స్కార్ఫ్, కోరమీసం, జిబిరి జుట్టు, నడుంపైన బెల్టు.... వాడి రూపాన్ని గుర్తుచేసుకొన్నాడు పరుశురాం.

    అవును ఆ రోజు 'మస్తాన్' అని రాణి గావుకేక పెట్టడం కూడా గుర్తుకొచ్చింది పరుశురాంకి.

    ఆ రోజు తను బుద్ధి చెప్పేలోగా పోలీసులు రావడంతో తప్పించుకుపోయారు. తనని మేడం తీసుకెళ్ళింది. తనని మొదటి దెబ్బ కొట్టాడువాడు. తన కళ్ళబడితే వాడికి మూడిందని పరుశురాంకి తెలుసు.

    రాణి ఆగడాలని అరికట్టాలంటే మస్తాన్ గాడి కీళ్ళను విరిచెయ్యాలి అనుకున్నాడు.

    రాణి ఎప్పుడెక్కడ వుంటుందో, ఏం చేస్తుందో కానీ, ఎక్కువ సమయాన్ని మాత్రం పరుశురాం పైన దృష్టిని సారిస్తోంది.

    ఏదో వంకతో ఇంటికి రావడం, కూరపట్టుకు వచ్చే నెపంతో మరోసారి, అతన్ని చూసి మూతి తిప్పడానికోసారి, కవ్వించడానికి, రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలన్నీ ఇన్నీ కాదు.

    పరుశురాం ఒంటరిగా కూర్చుని పేకముక్కల్ని పంచి ఆడుకొంటున్నాడు! రాణీ వచ్చి అరుగుమీద ఎదురుగా కూర్చుని వుంది.

    "పేకాట ఒకళ్ళే కూర్చుని ఆడితే అదేదో జాతి గుర్తుకొస్తుంది నాకు."

    "ఆడుకోకూడదని రూలుందా?" అడిగాడు కోపంగా.

    "ఉహు.... అలాకాదు. పేకాట ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కలిసి ఆడితే రంజుగా వుంటుంది. నేనొచ్చానుగా నాతో ఆడు."

    తల ఎగరేస్తూ నాలుకతో పెదిమని తడిచేసుకొంటూ అంది రాణి.

    "సమయం వచ్చినప్పుడు నిన్నెలా పేకాడిస్తానో చూద్దూగానీ! ఆ రోజు విడిచిపెట్టాలని పెద్ద వీరనారి ఫోజు నువ్వును. అద్దంలో చూసుకో.... చీమిడిముక్కు మొహం నువ్వును."

    "ఛీ...." చేత్తో ముక్కు తుడుచుకొని చూసింది.

    "అన్నీ అబద్ధాలే!" "అసలలాంటి మాటలు వినడమే చీదర నాకు. అసహ్యం...." మొహం చిట్లించింది రాణీ.

    "ఇదిగోపిల్లా! అనవసరంగా నా జోలికి వచ్చావంటే మర్యాదగా వుండదు. నిన్నే పట్టు పట్టాలో నాకు బాగా తెలుసు. నీ అబ్బి.... చేత గుర్తు రావాల నా దెబ్బకి" అన్నాడు పరుశురాం.

    రాణి అతని మాటలకి గుండెలమీద చేయేసుకొంది.

    "ఓయబ్బో! అయితే ఆ దెబ్బ రుచి చూడాల్సిందే! చూపించవూ?"

    "దెబ్బవేస్తారు. చూపించరు. చూసేది రుచిమాత్రమే!" అన్నాడు పరుశురాం ఒళ్ళు మండి. రాణి అతని క్కొంచెం దగ్గరగా జరిగింది.

    "ఏమో అన్నీ కబుర్లే! నువ్వు చూపించేవరకు నేను నమ్మను. నాకేం నీ సరుకు కనబడలేదు."

    రాణి మాటలకి లేచి నించున్నాడు పరుశురాం.

    "సరుకు లోపలుంది. బయట పెట్టాలంటే గోడౌన్ కావాలి. నీ గోడౌన్ సరిపోతుందేమో చూద్దామా?"

    "గోడౌన్ అంటే? .... కాస్త ఆలోచించి 'ఛీ....' అని పరుగుదీయబోయింది. ఆమె జబ్బ పట్టుకొని ఆపాడు పరుశురాం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS