"ఇక్కడ దొరికే మొక్క ఏమిటో నీకు తెలుసు కదా?" అన్నాడు నవ్వుతూ.
"నవనిధి మొక్క దొరా?" అన్నాడు చెంచు అతను. వాళ్ళకి మొక్కలూ, మూలికలూ అన్నీ కంఠతా వచ్చు.
"అదిగో అక్కడుంది! నవనిధి!" అంటూ కాస్త పక్కకి నడిచి ఒక మొక్క ముందు నిలబడి చిన్నగా ఏదో ఉచ్చరించాడు బ్రహ్మచారి.
తర్వాత ఒడుపుగా ఆ మొక్కను పెకలించాడు.
దాని ఆకులూ తామరాకుల్లాగా ఉన్నాయి. దాని కాయలు గన్నేరు కాయల్లగా ఉన్నాయి.
దీని తాలుకూ ఆకూ, కాయా, బెరడూ, పువ్వూ, వేరూ అన్నీ కలిపి తింటే ఎనిమిది గంటల సేపూ ముర్చావస్తలో ఉంటారు. అప్పుడింక ఆ మనిషిని ఆరునెలలపాటు అగ్నిలో వేసినా కాలడు. దీన్నే అంటారు అగ్నిస్తంభవ అని.
ఆ తర్వాత అతను సర్వభక్షకుడవుతాడు . నిప్పూ,నీరు, కొయ్యా ఏదైనా సరే - అదీ ఇదని లేకుండా అన్నీ తినగలుగుతాడు" అన్నాడు బ్రహ్మచారి, ఉదయర్కర్ కి మాత్రమే వినబడెంత మెల్లిగా.
చెంచుమనిషికి బ్రహ్మచారి చెబుతున్నది వినబడకపోయినా, అతను చెబుతున్నదేమిటో అర్ధం అయింది.
అప్పుడు అతను హటాత్తుగా ఏదో గుర్తువచ్చినట్లు అన్నాడు.
"దొరా! ఒక గోత్తే మనిషి వచ్చి తిరుగుతున్నాడు ఈ ప్రాంతలో. మనుషులని తినే మనిషి! నాకంటే రెండు జానల ఎత్తున్నాడు బానపొట్టా! భయానకంగా ఉన్నాడు దొరా!"
అది వినగానే , చటుక్కున ఆగిపోయాడు బ్రహ్మచారి.
"గోత్తే మనిషా? గోత్తెలు భద్రాచలం అడవుల్లో ఉంటారు. ఇక్కడికెందు కొచ్చాడు అతను?" అన్నాడు.
"మనుషులను తినే మనిషా! ఈ రోజుల్లో కూడానా?" అన్నాడు ఉదయార్కర్ సంభ్రమంగా.
"అవును! కాన్నిబాల్స్. గోత్తెలలో కొంతమంది ఉన్నారు?" అన్నాడు బ్రహ్మచారి.
అతను అలా అంటుండగానే , భూమి అదిరేటట్లు చెట్లకొమ్మల మీదనుంచి నేలమీదికి దూకారు ఎవరో!
19
ఎడిటర్ దగ్గర ఫోన్ రింగ్ యింది.
రిసీవర్ ఎత్తాడు ఎడిటర్.
"హలో!" అని వినబడింది. హరిణి గొంతు అది. విజయగర్వం ధ్వనిస్తోంది ఆ గొంతులో.
"చెప్పు" అన్నాడు ఎడిటర్ ఉదాసీనంగా.
"మీ మీద పోలీసు కంప్లయింట్ ఇచ్చాను."
"ఊహించాను"
"లక్కీగా నేను మీ ఆఫీసులో నుంచి బయటికి వస్తుంటే అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు. అతని పేరు అభిషేకన్. చిత్రమైన కేరెక్టర్. గొప్ప పబ్లిసేటీ ఆర్టిస్టు అనుకోండి. హీ ఈజ్ మై స్టార్ విట్ నెస్ అంది హరిణి నవ్వుతూ.
అభిషేకన్ గురించి ఎడిటర్ కి ఇది వరకు ఒకసారి చెప్పాడు ఉదయార్కర్. అది గుర్తుంది అతనికి.
సో!
ఏం జరుగుతుంది ఇప్పుడు?
హరిణి మోడస్టేని తను చెడగొట్టడానికి ప్రయత్నించినట్లు కేసు అందుకు ఆ అభిషేకన్ అనే జోకర్ స్టార్ విట్ నెస్!
నుదురు చిట్లించాడు ఎడిటర్.
లైన్లో హరిణి నవ్వు వినబడుతోంది.
"దిసీజ్ ఏ ఓపెన్ అండ్ షట్ కేస్ సర్. యూ విల్ బీ డ్రాగ్గ్ డ్ టూ ఏ కోర్టు ఆఫ్ లా! యు విల్ బి సెంటెన్స్ డ్ విత్ మే బీ ఫైన్, మేబీ ఇంప్రిజన్ మెంట్ ఆర్ మేబీ బొత్! యూవిల్ గెట్ ఎనార్మాస్ నెగెటివ్ పబ్లిసిటీ! మీ మీద నెగెటివ్ ప్రచారం చెయ్యడానికి కాచుకుని ఉంటారు మీ ప్రత్యర్ధులు. ఈ విషయాలు అన్నీ వెయ్యింతలు మాగ్నిపై అయి పత్రికలలో ప్రముఖంగా ప్రచురించబడతాయి.
చివరగా దీనికి క్లయిమాక్స్ ఏమిటో తెలుసా అండీ?
ఈ ప్రోషేషన్ అంటే మీకు ప్రాణం. ఈ కేసు పూర్తీ అయ్యాక ఈ ప్రోషేషన్ లో మీరు ఉండరు, ఉండలేరు.
అప్పుడు ప్రాణాలన్నీ తోడేసిన జీవచ్చవంలాగా మీరు ...." పరిహాసంగా నవ్వింది హరిణి. "సర్! ఈ దీనస్థితి నుంచి బయటపడాలంటే నేనే దిక్కు మీకు" వింటూ వున్నాడు ఎడిటర్. ఏమీ మాట్లాడలేదు.
కొద్ది సేపు వేచి చూసి తర్వాత అన్నది హరిణి.
"కొన్నాళ్ళపాటు మీ సర్కిల్ లో చాలా క్లోజ్ గా మూవ్ అయాను నేను. ఆ అభిమానం ఇంకా చంపుకోలేక మీకు మరొక్క అవకాశం ఇస్తున్నాను! దిసీజ్ లాస్ట్ అండ్ ఫైనల్! టేకిట్ ఆర్ లీవిట్ ఆఫర్."
ఎడిటర్ మౌనంగానే వుండిపోయాడు.
"మాట్లాడరేం. మీకు ఇంట్రెస్టు లేదా?" అంది హరిణి.
