Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 51


    "పరిమళ వాళ్ళింటికి ఎలా చేరావు" అడిగాడు సాగర్.
    "అదా బాబు! నా బిడ్డను వాళ్ళకిచ్చేసిం తర్వాత నాకు జబల్ పూరులో ఉండటానికి మనసొప్పలేదు. ఒంటరిదాన్ని ఎక్కడికి పోయినా ఏ అయ్య ఇంట్లో చాకిరీ చేసుకున్నా బ్రతకొచ్చనిపించింది. నన్ను కాపాడిన అయ్యగారి అంగీకారంతోనే తిరిగి మన ప్రాంతానికి వచ్చేశాను. అప్పుడు పరిమళమ్మ తండ్రిగారు తాసిల్దారుగా తెనాలిలో పనిచేస్తున్నారు. వారిదగ్గర బంట్రోతు పనిచేస్తున్న చలమయ్య నాకు దూరపు బంధువు. వాడి ద్వారా బాబు గారింట్లో పనికి కుదిరాను. ఆ బాబుగారితోపాటే వారికి బదిలీ అయినప్పుడల్లా ఊరూరూ తిరిగాను. పాతికేళ్ళుగా వారింట్లో మనిషిగానే ఉన్నాను. నన్ను వారు తమలో ఒకరిగానే చూసుకొన్నారు. బాబుగారు రిటైరు అయ్యాక ఇదిగో ఈ పరిమళమ్మను కనిపెట్టుకొని ఉంటున్నాను!" అని చెప్పి నిట్టూర్పు విడిచింది ఆయమ్మ.
    సాగరు హుషారుగా లేచి నిలబడ్డాడు. పరిమళ అయోమయంగా సాగరు కేసిచూసింది.
    "ఆయమ్మ కథకూ డాక్టర్ మూర్తికీ సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు!" అన్నది పరిమళ.
    "వెరీ సింపుల్! డాక్టర్ మూర్తే నాగేంద్రం ఆయమ్మ భర్త!"    
    "సాగర్! నీకు మతిపోయింది!"
    "కాదు. అందరికి పిచ్చి పట్టిస్తున్న నాగేంద్రం వురఫ్ డాక్టరు మూర్తి రహస్యం బయటపడింది!"
    "నాగేంద్రం డాక్టర్ ఎలా అయ్యాడంటావు?"
    "అదే రియల్ ప్రాబ్లం! మనం సాల్వ్ చేయాల్సింది!"
    "ఏడ్చినట్టే ఉంది! పిచ్చి కుదిరింది. రోకలి తలకు చుట్టమన్నట్టుంది నీ ధోరణి!" పరిమళ విసుక్కున్నది.
    "ఆయమ్మా! నాగేంద్రం మిలటరీలో ఉన్నప్పుడు ఏం పనిచేస్తుండేవాడూ?" సాగర్ అడిగాడు.
    "మిలటరీ హాస్పిటల్లో కొంతకాలం వంటపని చేశాడు."
    "వంటవాడా?" సాగర్ బుర్ర దిమ్మెక్కి పోయింది. వంటవాడు_ ప్రెషర్ కుక్కర్ _ మాధవీ!
    "ఆయమ్మా! కొంతకాలం వంటవాడన్నావ్! ఇంకా ఏమన్నా చేశాడా?"
    "అవును బాబు! ఆసుపత్రిలో వార్డుబాయ్. తర్వాత ఆపరేషన్ గదిలో బాయ్ గాను పనిచేశాడట!"
    "మార్వెలస్!" సాగర్ ఎగిరిగంతేశాడు. పరిమళ విస్మయంగా చూసింది.
    "ఆయమ్మా! నాగేంద్రం ఎడమచేతికి ఆరేళ్ళు కదూ!" సాగర్ ఆయమ్మ కళ్ళల్లోకి చూశాడు.
    "అదొక్కటే నా అనుమానం!" ఆయమ్మ ఎక్కడో చూసింది.
    "ఆయమ్మా! గుర్తుచేసుకో! ప్లీజ్! బాగా గుర్తుచేసుకో!" సాగర్ గొంతు జీర పోయింది. తన ఆశలన్నీ ఆమె చెప్పబోయే సమాధానం మీదే ఉన్నట్టు ఊపిరి బిగబట్టి ఆయమ్మను చూశాడు.
    "ఇందులో గుర్తుచేసుకోడానికి కేముంది బాబు? నాగేంద్రాన్ని నిన్న పరీక్షగా చూసాను. కాని ఆరోవేలు లేదు. అదొక్కటే నా అనుమానం. అతడు నాగేంద్రం కాదేమో అని చెప్పడానికి?"
    "అంటే! అంటే! నాగేంద్రానికి మొదట్లో ఆరువేళ్ళు_ఎడమ చేతికి ఆరువేళ్ళు _ చిటికినవ్రేలు పక్కన మరో చిన్న వ్రేలు _ వ్రేలాడుతూ ఉండేదికదూ?" సాగరుకు ఊపిరి సలపడం లేదు.
    "అవును బాబు! మీరు చెప్పినట్టు సరిగ్గా అలాగే ఉండేది! కాని ఇప్పుడు..."
    "ఇప్పుడు లేదు, తెగిపోయింది. కాదు తెగ్గొట్టుకున్నాడు, కావాలనే నరుక్కున్నాడు. బెండకాయలు, సొరకాయలు కోస్తూ వంటగదిలో ఆ వేలు నరుక్కున్నాడు. కావాలనే నరుక్కున్నాడు. గచ్చుమీద ఎగురుతున్న చిటికినవ్రేలు చూసి మాధవి కెవ్వుమన్నది. భయంతో గదిలోకి పరుగెత్తింది. వణుకుతూ మంచంమీద వాలిపోయింది. తరువాత ఏం జరిగిందో మాధవికి తెలియదు. స్పృహ తెలిసేసరికి డాక్టర్ తనను పరీక్ష చేస్తున్నాడు. అప్పట్నుంచి ఆ వంటవాడంటే మాధవికి భయం. వాడ్ని చూస్తేనే పారిపోయేది. మాధవీ! యూ ఆర్ రైట్! పూర్ గర్ల్! ఎంత మానసిక సంక్షోభాన్ని అనుభవించావో అర్థమవుతున్నది. నీ సమస్యకు పరిష్కారం దొరికింది. నువ్వు త్వరలోనే మామూలు మనిషి అవుతావు. నిన్ను ఆవరించిన గ్రహణం తొలగిపోతుంది..."
    "సాగర్! సాగర్!" పరిమళ సాగర్ భుజం తట్టింది. సాగర్ ఠక్కున ఆగిపోయాడు. ఏదో లోకంలోనుండి అప్పుడే భూమ్మీద పడ్డవాడిలా పరిమళకేసి చూశాడు.
    "సారీ! డాక్టర్ పరిమళా! ఇన్నాళ్లుగా నాలో గడ్డకట్టుకుపోయిన ఆలోచనలన్నీ కరిగి ప్రవాహమయినట్టుగా అనిపించింది" అని సాగర్ ఆయమ్మను చూశాడు.
    "ఆయమ్మా! ఇది మాధవి అదృష్టం, నా అదృష్టం కూడా. నువ్వు మాకు ఇలా తటస్థపడటం నిజంగా మా అదృష్టం. నీ ఋణం తీర్చుకోలేం! ఒక నిండు జీవితాన్ని రక్షించావు. మోడువారిన బ్రతుక్కు మళ్ళీ వసంతాన్ని ప్రసాదించావు. సందేహం లేదు. డాక్టర్ మూర్తే నాగేంద్రం. ముమ్మాటికీ నాగేంద్రమే! మాధవి అంతరాంతరాల్లో భీభత్సాన్ని సృష్టిస్తున్న వంటవాడూ ఆ నాగేంద్రమే. ఇక ఆ నాగేంద్రం ఆట కట్టించవచ్చు."
    "ఎలా? ఎలా? నాగేంద్రమే డాక్టర్ మూర్తని ఎలా రుజువుచేస్తావు? ఆయమ్మ చెప్పినంత మాత్రాన డాక్టర్ మూర్తి నాగేంద్రమౌతాడా? డాక్టర్ మూర్తి మెడికల్ ఆఫీసరు. ఎన్నో ఏళ్ల సర్వీసుంది, డాక్టర్ గా అనుభవం ఉన్నది. నాగేంద్రం డాక్టర్ అవడం అసంభవం! అందువల్ల డాక్టర్ మూర్తి నాగేంద్రం అనడం అవివేకం" డాక్టర్ పరిమళ ప్రశ్నల వర్షం కురిపించింది.
    "ఆయమ్మా! కొంచెం కాఫీ పెట్టిస్తావా?" సాగర్ ఆయమ్మను అడిగాడు.
    "ఎందుకు బాబూ ఇప్పుడు కాఫీ! ఏకంగానే భోజనం చెయ్యొచ్చు! పొద్దుపోయిందిగా?"
    "లేదు! ఆయమ్మా! నేను త్వరగా వెళ్ళిపోవాలి. తొందరగా కాఫీ ఇవ్వగలిగితే చాలు?"
    "ఆయమ్మ వంటగదిలోకి వెళ్ళింది.
    "ఆయమ్మను వంటగదిలోకి పంపించడానికి కాఫీ అడిగావా?" లేక నిజంగా కాఫీ కావాల్ని అడిగావా?" పరిమళ కళ్ళు తిప్పింది.
    "రెండూనూ!" అన్నాడు సాగర్.
    "డాక్టర్ మూర్తి నాగేంద్రం అని ఎలా ఋజువు చేస్తావో చెప్పలేదు?" రెట్టించి అడిగింది పరిమళ.
    "అయితే విను! నాగేంద్రం మొదటినుంచి అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. ఇంటిదగ్గర్నుంచి పారిపోయి మిలటరీలో చేరాడు. అక్కడ వంటవాడిగా పనిచేశాడు. వార్డు బాయ్ గాను, ఆపరేషన్ థియేటర్ బాయ్ గాను పనిచేశాడు. అంటే వంటవాడిగా అనుభవం ఉన్నది. హాస్పిటల్లో వార్డు బాయ్ గా, థియేటర్ బాయ్ గా మెడికల్ ప్రొఫెషన్ లో కూడా అనుభవం గడించాడు!"
    "వా డూ యూ మీన్?" పరిమళ కనురెప్పలు టపటపలాడించింది.
    "మీరు ఆరేళ్ళు చదువుకుని నేర్చుకున్నది, నాగేంద్రం మూడేళ్ళ అనుభవంతో నేర్చుకున్నాడు.
    "అప్ సర్డు! అసంభవం!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS