Previous Page Next Page 
మారణహోమం పేజి 51

 

    కానీ-
    అక్కడ పంచాయితీ ఎందుకు జరుగుతోందో! నిర్మలకు ఏం కీడు మూడిందో తెలియదు?
    రెండూ ముఖ్యమే!
    కానీ ఏది ముందు? ఏది వెనుక?
    అతను తటపటాయిస్తూ ఉండగానే ఒక పెద్ద ట్రక్కు అతని కారుకి కొంచెం దూరంలో ఆగింది.
    అందులో నుంచి కిందకు దిగాడు డ్రైవర్. గతుకుల తారు రోడ్డులాగా ఉంది అతని మొహం.
    అంతదూరం నుంచే చేతులు రెండూ జోడించి నమస్కరించి వస్తున్నాడు అతను.
    అతనెవరో నిఖిల్ కి గుర్తురాలేదు. ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు.
    దగ్గరగా వచ్చేశాడు లారీడ్రైవర్. అతని నల్లటి మోహంలో తెల్లటి చిరునవ్వు కనబడుతోంది.
    "నేను సార్! వీరాస్వామిని. తమ దయవల్ల ఇలా బతకగలుగుతున్నాను సార్!" అన్నాడు గొంతులో కృతజ్ఞత పలికిస్తూ.
     అతనెవరో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నిఖిల్. ఎప్పుడూ ఇతన్ని చూసినట్లు గుర్తు కూడా లేదే! తను ఇతనికి చేసిన సహాయం ఏమిటి?
    లారీ డ్రైవర్ నవ్వాడు.
    "గుర్తు రాలేదా సార్! నేను........"
    చటుక్కున గుర్తు వచ్చింది నిఖిల్ కి అతనెవరో!
    వీరాస్వామి కాదు!
    వినాయక్ రావు!
    వెంటనే రివాల్వర్ కోసం జేబులోకి చెయ్యి పోనిచ్చాడు నిఖిల్. అదే సెకెండ్ లో అతని కాలు యాక్సిలెటర్ ని నొక్కింది. కారు త్రుళ్ళిపడినట్లు ముందుకు కదిలింది. కానీ అప్పటికే ఆలస్యమయిపోయింది.
    వినాయకరావు చేతులు జోడించి ఉన్నాడు. జోడించిన ఆ చేతుల్లో ఉంది చిన్న కాలిబర్ రివాల్వర్ ఒకటి. దానితో కాల్చాడు నిఖిల్ ని.
    కానీ ఆ గుండు నిఖిల్ కి తగలలేదు. కారు అప్పటికే కదలడం వల్ల గుండు గురితప్పి వెనకసీట్లో ఉన్న రాధ తండ్రికి తగిలింది.
    సీట్లో నుంచి ఎగిరిపడ్డాడు అయన.
    ఆ పడడం పడడం మళ్ళీ లేవలేదు.
    వినాయకరావు మళ్ళీ కాల్చేలోగానే తన రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు నిఖిల్.
    గుండు గురితప్పకుండా వెళ్ళి వినాయకరావు కుడిచేతిని తాకింది.
    రివాల్వర్ కింద పడేసి బాధగా ఎడమచేత్తో కుడిచేతిని పట్టుకు ఉండిపోయాడు వినాయక రావు.
    కారుని ముందుకు ఉరికించి వందగజాలు ముందుకి పోనిచ్చి అక్కడ స్టీరింగ్ గిరగిర తిప్పి ఎడమవైపు మట్టిరోడ్డు మీదికి మళ్ళించాడు నిఖిల్. కొంతదూరం వెళ్ళాక అక్కడంతా సీతాఫలం చెట్లు తోపులాగా పెరిగి ఉన్నాయి. వాటిమధ్య ఆపాడు కారుని. అతను వెనక్కి తిరిగి చూడలేదు.
    కానీ అతని సిక్స్ సెన్స్ చెబుతోంది.
    రాధ తండ్రి ఇకలేడని!
    నెమ్మదిగా రాధ వైపు తిరిగాడు.
    రాధ సగం వెనక్కి తిరిగి , కుడిచెయ్యి మీద గెడ్డం ఆనించి అచేతనంగా ఉన్న తండ్రి శరీరాన్ని చూస్తోంది.
    తండ్రి తనకోసం పడిన ఆరాటం అంతా గుర్తువచ్చింది. ఆ అమ్మాయికి చిన్నప్పుడు అయన తనని సైకిలు మీద కూర్చోబెట్టుకుని స్కూలుకు తీసుకెళ్ళడం గుర్తొచ్చింది.    
    అయన బతికినన్నాళ్ళూ కాలరు చిరిగిపోయిన షర్టులే వేసుకు తిరిగినా , ఉన్నంతలో తనకు ఎప్పుడూ మంచి బట్టలే కుట్ట్టించడం గుర్తువచ్చింది.
    "నాలాంటి దరిద్రుడి కడుపున పుట్టకపోతే నా తల్లి ఏ ఐ.ఎ.ఎస్. అఫీసరో అయ్యేది, అని తన ప్రోగ్రెస్ రిపోర్టు చూసినప్పుడల్లా అయన బాధపడిపోవడం గుర్తొచ్చింది.
    వాళ్ళ ఆఫీసులో ఎప్పుడు ఏ పార్టీ జరిగినా ఇచ్చిన స్వీటు పాకెట్ విప్పకుండా భద్రంగా దాచి తనకోసం తేవడం గుర్తొచ్చింది. అందరూ కలిసి తనని ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటే అసమర్దుడిలా అయన వెక్కి  వెక్కి ఏడవడం గుర్తొచ్చింది.
    "నాన్నా! " అనుకుండు ఆర్తిగా. "నువ్వు నాకు ఇంత చేశావు! నేనే నీకు ఏమీ చెయ్యలేదు నాన్నా! ఏమన్నా చెయ్యగల సామర్ధ్యం నాకు వచ్చేలోపలే నువ్వు వెళ్ళిపోయావు నాన్నా! ఎక్కడికి నాన్నా? ఎందుకంత తొందర!"
     ఏడవడం లేదు రాధ.
    ట్రాన్స్ లో ఉన్నట్లు చూస్తోంది . బుసలా వస్తోంది ఆమె శ్వాస.
    ఈ పాడులోకం మీద పగబట్టిన తాచులా ఉంది తను.
    "రాదా!" అన్నాడు నిఖిల్ అనునయంగా.
    అతను కారుదిగి చుట్టుతిరిగి ఆమె కూర్చున్న వైపు వచ్చాడు.
    "ఏడుస్తున్నావా రాదా?"
    తల అడ్డంగా ఆడించింది రాధ.
    "ఏడవట్లేదు నిఖిల్! ఏడవను! ఇప్పుడే కాదు. ఇంకెప్పుడూ కూడా! కానీ ఏడిపిస్తాను వీళ్ళందరినీ! ఒక్కొక్కళ్ళనీ!" ఆమె రొప్పు ఎక్కువయింది.
    ఆమె భుజం మీద చెయ్యి వేశాడు నిఖిల్. ఆమె రొప్పు కొద్దిగా తగ్గిన తర్వాత
    కారు వెనక డోర్ తీసి రాధ తండ్రి దేహాన్ని తాకి చూశాడు. అతని ఉహా కరెక్టే అయింది.
    నిర్జీవంగా పడి ఉన్నాడు అయన!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS