Previous Page Next Page 
యువత నవత పేజి 50

   
    కూతురికి ఓ నీతి, కోడలికోనీతి!

     అసలు ఈ ప్రపంచంలో మనిషి మనిషికోనీతి!

     శాలిని విరక్తిగా నవ్వుకొంది.


        *    *    *    *    *

   
    "అమ్మగారు పిలుస్తున్నారు" అంటూ వచ్చింది సుగుణ పనిపిల్ల సుధ వెళ్లేసరికి సుగుణ ఏడుస్తూంది.

    "ఎందుకేడుస్తున్నారు?" ఏం జరిగింది?" ఆత్రుతగా అడిగింది సుధ.

    ఆఫీసు ప్యూన్ అక్కడే వున్నాడు. "అయ్యగారు మహబూబ్ నగర్ మీటింగ్ కి వెళ్ళి వస్తూంటే కొత్తకోట దగ్గర లారీతో గుద్దుకుంది. డ్రైవరికి దెబ్బలు తగిలాయి.అయ్యగారికి కొద్దిగా దెబ్బలు తగిలాయి. డ్రైవరు, అయ్యగారు ఆస్పత్రిలో వున్నారు.

    "కొంచెం దెబ్బలంటున్నాడుగాని, అసలాయన సజీవంగా వున్నారో లేదో!నేను ఏమయినా అవుతానని అలా చెబుతున్నాడో ఏమో సుధా! నాకు భయంగావుంది నీ ద్వారా తప్ప నాకు ఉన్నదున్నట్టుగా చెప్పాలి. నువ్వు యేం చెప్పినా నేను నమ్ముతాను" దుఃఖస్వరంతో ప్రాధేయ పూర్వకంగా అంది సుగుణ.

    "మీరు ఏదేదో  ఊహించుకొని  మనసు పాడుచేసుకోకండి. వెళ్లి చూసి వస్తాను"

    సుధ ప్యూన్ తో వెళ్లి చంద్రకాంత్ ని చూసింది. సుగుణ బెంబేలు పడ్డట్టుగా  అతడికి ప్రమాదకరమైన దెబ్బలేం తగల్లేదు. ముఖానికి ఒకటి రెండు గాయాలయ్యాయి.  ప్లాస్టర్ వేయబడింది గాయాలమీద. చేతికి మాత్రం పెద్దదెబ్బే తగిలింది. బాండేజీ వేశారు.

     డ్రైవరుకు  దెబ్బలు   బాగానే తగిలాయి కాని, ప్రమాదం యేంలేదని  చెప్పాడు డాక్టరు."

    సుధ తిరిగివచ్చి చెప్పింది "మీరు అనవసరంగా కంగారుపడ్డారు.  నిజంగా కూడా పెద్ద దెబ్బలేం తగల్లేదు. రెండుగంటల రెస్ట్ తరువాత డిశ్చార్జి చేస్తానన్నాడు డాక్టరు."

    "అంతేనా? ఎంత భయపడ్డానో ఏక్సిడెంట్ అంటే నాకొక పీడకల.య నన్ను జీవన్మృతురాలిని చేసింది ఏక్సిడెంటేకదా?"గుడ్లనిండా నీళ్లతో అంది సుగుణ.

                 9

    చంద్రకాంత్ మోచేతికి బాండేజీ వుండడంవల్ల ఆఫీసుకి సెలవు పెట్టక తప్పిందికాదు. డాక్టరుకూడా ఓ వారం రోజులపాటు రెస్టుతీసుకొమ్మని చెప్పాడు.

     ఏక్సిడెంట్ సంగతి తెలుపడంవల్ల తలిదండ్రులు వచ్చారు. తండ్రి ఒకరోజు మాత్రం వుండి వెళ్లిపోతే, తల్లి యిక్కడే వుండిపోయింది. ఇంట్లో వంటా వార్పుకు మరో దిక్కులేకపోవడంవల్ల.

    కట్నం కానుకలు లేకుండా ఉత్తచేతులతో తమింట అడుగుపెట్టిన కోడలంటే  ఆమెకు మొదటినుండీ యిష్టంలేదు. ఏక్సిడెంట్ అయ్యి కొడుకు మెడకు ఓ గుదిబండలా తయారయిందని  ఆవిడ అక్కసు! ఆ అక్కసుని సమయం వచ్చినప్పుడల్లా వ్రెళ్లగక్కుతూనే వుంటుంది సుగుణనుశూలాల వంటి మాటలతో గాయపరుస్తూనే వుంటుంది.

     దానికే భయపడతాడు చంద్రకాంత్. సుగుణని బాదపెడతారనే తల్లినిగాని, అక్కలనిగాని ఎవరినీ పిలువడు! సుగుణకు జడవేయడం దగ్గరినుండి  వంటచేయడం వరకు ఆడపనీ, మగపనీ అన్నీ అతడే చూచుకోవడం నేర్చుకొన్నాడు. ఇప్పుడు చేతికి బాండేజీపడి తన పనులకే ఒకరి చేతిలో చిక్కినట్టుగా అయ్యాడు. సుగుణకేం చేస్తాడు! అక్కడికీ ఒక్క చేత్తో చేయగల పనులు చేయడానికే ప్రయత్నిస్తున్నాడు. సుగుణే వారిస్తూంది - "ఈ నాలుగురోజులు మీరు రెస్టు తీసుకోండి!" అని.

     ఒకరోజు సుధ వచ్చేసరికి మంచంమీద కూర్చుని, తలదువ్వుకొని జడవేసుకొంటూంది సుగుణ.

     "చిక్కులన్నీ అలాగే పెట్టేసి జడ అల్లుతున్నారేమిటి?" అడిగింది సుధ.

    "నేను బాగా వున్న రోజుల్లోనే  చిక్కులుతీసే ఓపిక వుండేదికదు. అలాగే అల్లేసుకొనేదాన్ని. అమ్మ కోప్పడి, జడవిప్పి మళ్లీ వేసేది. అప్పుడింకా ఎక్కువ తలకట్టుండేది."

    "ఇప్పటికికూడా మీ అందం జడలోనే వుందనిపిస్తుంది. దువ్వెన ఇటివ్వండి నేను చిక్కులు తీస్తాను" సుగుణ చేతిలోంచి దువ్వెన తీసుకొంది సుద.

    "ఏ అందంవుండి ఎవడికేం ఒరగబెట్టింది?  వాడి నిండు నూరేళ్ల జీవితం నాశనమైపోయింది. చచ్చిన చావుకాదు, బ్రతికిన బ్రతుకుకాదు" అంది అత్త సుబ్బలక్ష్మి.

    "స్త్రీకి స్త్రీయే శత్రువంటారు, ఎందుకో తెలుసా?" అప్పటికే కళ్ల నీళ్లు తిరుగగా పేలవమైన స్వరంతో అంది సుగుణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS