"నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. నువ్వు ఒకే ఒక మాటలో సమాధానం చెప్పాలి. ఇందుకు విరుద్దంగా జరిగితే నిన్ను బాలమురఘన్ కూడా కాపాడలేడు. మంచిగా మసలుకుంటే నీకు రక్షణ ఇస్తాను. తెలిసిందా?" అని అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
ఎరక్కపోయి ఈ వుచ్చులో తగులుకున్నందుకు ఎంతో వంతపడిపోయినాడు తమిళ సోదరుడు. అలాగే అన్నట్టు తల ఊగించాడు దిగులుగా.
"జయకృష్ణ ఎమయినాడు? ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి- తప్పించుకోవాలని ప్రయత్నించినావంటే మద్రాసు చూడలేవు" అని బెదిరించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
ఆమె ఊహశక్తికి చొరవకూ అబ్బురపడిపోయినాడు గోయెల్. వాళ్ళూ జయకృష్ణ ఇంటి గురించి అడిగారు. చెప్పాను. రెండు కార్లూ యిటే వెళ్ళాయి. ఇంకా తీరింబి రాలేదు" అని బదులిచ్చాడు మద్రాసీ. ప్రొఫెసర్ శ్రద్దాదేవి "ఇక్కడి నించి తిరిగి చూడకుండా నీ టీ కొట్టుదాకా పరుగెత్తాలి. మళ్ళీ నేను కన్పించేదాకా ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్తే ఏమవుతుందో తెలుసు కదా!" కనులు విశాలం చేసి అరిచింది.
"మరుంబుడి మద్రాసు చూడనేరం" అన్నాడు అతడు వినయంగా.
"వెళ్ళు" అందామె. అతడు తిరిగి చూడకుండా పరుగుతీయటం ప్రారంభించాడు.
"క్యూరేటర్ సర్! ఈ రోడ్డు ఎంత దూరం వెడుతుంది? ప్రొఫెసర్ శ్రద్దాదేవి ముందుకు చూస్తూ అడిగింది. ఆమె ప్రారంభించిన పనిలో కొంత పురోగతిని సాధించినందుకు సంతసించాడు శ్రీ బృందావన్ గోయెల్.
"ఈ రోడ్డు అనువుల దాకా పోతుంది. ఆపైన అంతా నీరు, కొండలు" అని బదులిచ్చాడు. ఆమె తల పంకించింది.
"అణువుల దగ్గర ఏముంటాయి?"
"కార్తికేయ , నాదణీశ్వర ఆలయాలు, ఇంకా రేలేక్స్ కొన్ని ప్రాచీన విశ్వవిద్యాలయం , బౌద్ద సంగీతులు జరిగే వేదిక. దాని కేంద్ర బిందువులో చిటిక వేస్తె ఫర్లాంగుల దూరం విన్పిస్తుంది. దాని సౌండ్ సిష్టం అలాంటిది. అలాంటివే మరికొన్ని బొద్దశిధిలాలు ఉన్నాయి" అని బదులు చెప్పాడాయన.
"అయితే గార్డ్స్ వుంటారనుకుంటాను."
"వుంటారు"
"ఇంక ముందుకు పోనక్కర్లేదు.
మనం వెదికే మనుషులు మనకు ఇక్కడే కన్పిస్తారు" అంటూ కారును రోడ్డు దింపి నట్టడివిలా వున్న చోట గుబుర్ల మధ్యకు పోనిచ్చి తారు రోడ్డు మీదికి లైట్లు వుండే పొజిషన్ లో వుంచిందామె.
మరేమీ తమాషా ఎదురవుతోందో చూడాలని ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు శ్రీ బృందావన్ గోయెల్. ఆమె సాహసోపేతమైన కార్యనిర్వాహకశక్తికి అచ్చెరువు పడుతున్నారు మనసులోనే. జయకృష్ణ శ్రద్దాదేవి గురించి చెప్పినదంతా యదార్ధమే అనిపించసాగింది. ఇంతటి వ్యక్తిత్వం కలిగిన మహోపాధ్యాయుని కావటం నించే జ్యోతి లాంటి యువతుల్ని తీర్చిదిద్దకలుగుతోందని సంభావించినాడాయన.
దూరంగా గుబ్లగూబలు రోదిచటం విన్పిస్తోంది. తలక్రిందులు చెట్లకు వ్రేలాడుతున్న బెగ్గురు పక్షుల కళ్ళు కొరివి దెయ్యాల్లా మండుతున్నాయి. నక్కల అరుపులు గుబులెత్తిస్తున్నాయి.
కిర్రుమని కీచురాళ్ళ రోద గుండె ఝల్లు మనిపిస్తోంది. క్షణాలు లేక్కిస్తోంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
* * *
కనులు తెరచినా మూసినా ఒకే అంధకారం చిందుతున్న చిమ్మచీకటి అది. జ్యోతి నెమ్మదిగా కనులు విప్పింది. ఏమీ కంపించలేదు. ఇది కలా యదార్ధమా అర్ధం కాని దుస్థితి అది.
ఏదయినా భ్రాంతి కలుగుతున్నదా అన్న సంశయం కూడా కలగకపోలేదు. ఒకటికి రెండు సార్లు అలా కనులు మూస్తూ తెరుస్తూ గడిపాక తనచుట్టూ కన్ను పొడుచుకున్నా కనుపించని కారుచీకటి అలముకుని ఉన్నదని తెలుసుకుందామె. క్రమంగా గతం జ్ఞాపకానికి వస్తోంది.
క్రేనియం లాంటి ప్రాచీన రాకాసి గుహల నించి సంపాదించిన శిధిలాలను తీసుకుని తిరిగి వచ్చాక ఈ విషయాన్ని శ్రీ బృందావన్ గోయెల్ కు మిగిలిన మిత్రులకూ చెప్పేందుకు వెళ్ళిపొయినాడు జయకృష్ణ. అతడు ఎంతసేపయినా తిరిగి రాలేదు.
పదిగంటలు దాటిపోయింది.
లచ్చిమి ఏదో చెప్తుంది. అదంతా వినాలనిపించలేదు. అలసట వల్ల బాగా నిద్రవస్తోంది. తన అనాసక్తతను గమనించి మాట్లాడడం ఆపివేసింది లచ్చిమి. తరువాత కొద్ది క్షణాలకే నిద్ర బట్టేసింది. ఎంత సేపయిందో తెలియదు.
దబ్బుమని ఏదో పడినట్లు శబ్దమయి ఉలికిపడి లేచింది. అప్పటికే లచ్చిమి శరీరమంతా రక్తసిక్తమయివుంది. తల మీద పెద్ద గాయమయింది. నేల అంతా తడిచిపోతోంది.
అయినా లచ్చిమి అతని రెండు కాళ్ళు పట్టుకుని విడిచి పెట్టలేదు." అతని భుజం మీద సమాధి గుహలోంచి సంపాదించి తెచ్చిన వస్తువులున్న సంచీ వ్రేలాడుతోంది.
అతడెవరో తెలియదు. అవతల యింకా ఇద్దరు వ్యక్తులున్నారు. లచ్చిమి అరిచేందుకు ప్రయత్నం చేసినప్పుడల్లా అతడు రాక్షసంగా ఆమె గొంతును బిగిస్తున్నాడు.
అప్పటికే శక్తికి మించి పోరాడి ఉన్నది లచ్చిమి. మరింక ఆమె స్పృహ కోల్పోయే దుస్థితిలో ఉంది. ఎన్నో కష్టాలకు ఓర్చి సమాధి గుహలను అన్వేషించి సంపాదించుకున్న సంపద!
అది పోయాక ప్రొఫెసర్ శ్రద్దాదేవి చూపిన మార్గంలో పయనించలేక తాను పతనమయిపోయినట్లే కాగలదు. ఎదిరించిన లచ్చిమి ఏ స్థితికి దిగజారిపోయిందో చూస్తున్నా మనసు వుండబట్టలేదు. తాను కూడా శయ్య దిగి అతన్ని నిరోధించింది.
ఒకరిద్దరు కావడంతో ఇంక జాగు చేస్తే తమ ప్రయత్నం ఫలించదన్నట్లుగా భావించాడా వ్యక్తీ. ఎదుటి వ్యక్తులకు చూపుల ద్వారానే ఏవో అర్ధాలను అందించాడు.
వాళ్ళు రంగంలోకి దిగారు. స్పృహ కోల్పోయిన లచ్చిమిని ఒకడు భుజం మీద ఎత్తుకుని తీసుకువెళ్ళి కార్లో పడేశాడు. రెండవ వ్యక్తీ తన దగ్గరగా వచ్చి అరచేత్తో మెడ మీద ఒక దెబ్బ అంటించాడు.
క్రమంగా కళ్ళు వాలిపోతున్నాయి. ఆ తరువాత ఏమయిందో తెలియదు. కళ్ళు విప్పి చూడటం ఇప్పుడే!
వాళ్ళే తీసుకువచ్చి ఇక్కడ ఈ చీకటిలో పడేసి వెళ్ళిపోయారు కాబోలు. జయకృష్ణ తిరిగి వచ్చి వుంటాడా? వచ్చి తామిద్దరూ లేకపోవటంతో ఎంత కంగారుపడిపోయి వుంటాడు?"
ఆ చిమ్మ చీకటిలో నీరవ నిశ్శబ్దంలో దీర్ఘతరమయిన ఉచ్చ్వాస విశ్వాసాలు విన్పిస్తున్నాయి. బహుశా లచ్చిమి కూడా దగ్గరలోనే వుండ వచ్చు అని ఊహించింది జ్యోతి.
తలకు అయిన గాయం నించి ఇంకా రక్తం కారుతున్నదేమో! అసలామే బ్రతుకుతుందా? చేతులతో పాకుతూ ఊర్పులు విన్పిస్తున్న దిక్కుగా కదలసాగింది. రెండు మూడడుగులు ముందుకు పోయిక లచ్చిమి శరీరం చేతికి మెత్తగా తగిలింది.
జ్యోతికి దైర్యం వచ్చింది . "అక్కా!" తడారిపోయిన కంఠంతో పిలిచిన పిలుపు వినిపించగానే తృప్తిగా నిట్టూర్చింది జ్యోతి.
ప్రక్కనే వున్న నీడ అక్కని తెలియగానే నెమ్మది స్వరాన రోదించటం ప్రారంభించింది లచ్చిమి.
'చెల్లీ! ఊరుకో! నేనున్నాను" అని క్లుప్తంగా ఓదార్చింది జ్యోతి" తమ మాటలు ఎవరైనా వింటున్నారేమో అని ఆమె అనుమానం. ఆ అనుమానం నిజమయింది. ఒక వ్యక్తీ నీడలా వారి దగ్గరకు వచ్చాడు.
