Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 50

 

    "సర్! జ్యోతి గురించీ జయకృష్ణ గురించీ తెలుసుకోవాలని వచ్చాను" ఉపోద్ఘాతం లేకుండా నేరుగా ప్రశ్నించింది శ్రద్దాదేవి.
    శ్రీ బృందావన్ గోయెల్ నింపాదిగా చిరునవ్వు నవ్వారు.
    "ఆ ఇద్దరి గురించీ మీరు కంగారు పడవలసినది రవ్వంతయినా లేదు. క్షేమంగా వచ్చారు ఈరోజే!" అన్నాడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి కుర్చీలో ముందుకు జరిగి కూర్చుంది. అయన వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారు. వారి ముందు తాను మరింతగా కంగారు పడిపోయి కన్పించటం బాగుండదు. అందు నించి మనసులో ప్రేలిపోతున్న మందు పాతరని అదిమి వుంచాలని విఫలయత్నం చేస్తోంది!
    "సర్! ఆ యింటికి వెళ్ళి వచ్చాను. తలుపులు బార్లా తెరిచి వున్నాయి. యింటిలో జ్యోతి కాని జయకృష్ణ కాని లేరు. ఇల్లంతా రక్తపు మరకలు కన్పించాయి. వారికేమయింది?" అని అడిగిందామె కంపితమవుతున్న కంఠస్వరాన.
    "ఏమిటి?" అంటూ కళ్ళు విశాలం చేసి చూశారు క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్. అయన చూపులు శూన్యంలోకి పరుగెట్టినాయి. రెండు క్షణాల మౌనంలో పైపు నిండా పొగాకు దట్టించారు. దాన్ని వెలిగించి ఒకే గ్రుక్కలో లాగేసి మేఘంలా పొగను గుప్పుమనిపించారు. వారి మాటల కోసం ఎదురు చూస్తోంది శ్రద్దాదేవి.
    "ప్రొఫెసర్! మీరు నాతొ రండి" అంటూ లేచి బయలుదేరాడాయన. శ్రద్దాదేవి వారిని అనుసరించి నడుస్తోంది. వాచ్ మన్ క్యూరేటర్ శ్రీ బృందావన్ గోయెల్ ఉంటున్నాయి. యి. క్వార్టర్ ని అనుకుని వున్న అర్కేలాజికల్ వారి బి టైపు క్వార్టర్స్ లోని ఉద్యోగుల్ని నిద్రలేపి ఈ విషయాన్ని వివరించాడు.
    వారంతా లేచి జయకృష్ణ యింటి వైపుగా వచ్చారు.
    అప్పటికే ప్రొఫెసర్ శ్రద్దాదేవి -- శ్రీ బృందావన్ గోయెల్ కలిసి సంయుక్తంగా జయకృష్ణ యింటిని పరిశీలించారు. అక్కడి దృశ్యాలు భయానికి, అనుమానానికి తావిచ్చేలా ఉన్నాయి.
    దీపకాంతుల వల్ల అంతా స్పష్టంగా కన్పిస్తోంది.
    బెడ్ రూం , డ్రాయింగ్ రూముల్లో ఎక్కడ చూచినా రక్తపు మరకలు పగిలిపోయిన గాజు ముక్కలు, ఆడవాళ్ళ మీద జులుం సాగుతుంటే వాళ్ళు ఎదిరించినట్లు అన్పిస్తోంది.
    జయకృష్ణ తాను తీసుకు వచ్చానని చెప్పిన రాకాసి గుహలలోని అవశేషాలయిన క్రేనియం వగైరా ఎక్కడా కనిపించలేదు. వస్తువులన్నీ చిందరవందరగా పడి వున్నాయి.
    జయకృష్ణ యింటికి వచ్చేసరికి జ్యోతి మీద దాడి జరిగి ఉంటుందని, వారి కోసం వచ్చిన జయకృష్ణ కూడా ప్రమాదంలో చిక్కుపోయి ఉంటాడనీ ఊహించాడు శ్రీ బృందావన్ గోయెల్.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవికి మనసంతా వికలమయింది. జ్యోతిని తానుగా ప్రోత్సహించి ఈ ప్రయత్నంలోకి దింపింది. చిన్నవయసులోనే మంచి ఉద్యోగం సంపాదించి మంచి భవితవ్యం వైపుగా పురోగమిస్తున్న  జయకృష్ణ ఈ ఆపదలో చిక్కుకోవటానికి కారణం తాను.
    కొద్దిసేపటి క్రితమే ఏదో జరిగింది. అందు గురించి వెంటనే ప్రయత్నించి తెలుసుకోవాలి. లేకపోతే మరింత ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. జరిగిందేమిటో తెలుసుకునెందుకు రవంత అయినా ఆధారాలు కన్పించేలేదు.
    మహత్వపూర్ణమయిన మాతృత్వం తాలూకు ఆకాంక్షలను సైతం కర్తవ్యానికి బలియిచ్చి మ్రోడులా, ఎడారి ప్రయాణంలా కొనసాగిస్తున్న బ్రతుకులో శీతల పవనంలా ప్రవేశించింది జ్యోతి.
    అమ్మా అని పిలిచి అణగారిపోతున్న ఆశలను నిద్రలేపింది. కృష్ణమ్మ కౌగిలి లో ఆదమరిచి ఆడుకునే శిశువు లాంటి జీవితాన్ని వదలి తన కోసం పరుగు తీసింది జ్యోతి. ఏటి మీద నీటి బుడగలా కొనసాగే బ్రతుకును వదలి తన నీడన చేరి భవితవ్యాన్ని వెతుక్కోవాలని ప్రయత్నించింది.
    ఆ ప్రయత్నంలో తన ప్రోద్భలంతో సాహసోపేతమయిన గవేషణకు పూనుకుంది. తనవల్ల జ్యోతి బ్రతుకులో సంప్రాప్తమయిన పరిణామాలు ప్రొఫెసర్ శ్రద్దాదేవి గుండెల్ని పిండుతున్నాయి.
    బ్రతుకులో తాను పూర్తిగా చేజార్చుకున్న మాతృత్వం తాలుకూ మమతా బంధాల్ని అయాచితంగా అందించిన జ్యోతిని రక్షించలేకపోతే తన మనుగడకు అర్ధమే లేదని భావించిండామే.
    తనకున్న మేధస్సు , సాహసము వినియోగం కావలసిన కీలకమయిన క్షణాలు ఆసన్నమయినాయని తెలుసుకుంది. ఆమెలోని జీవితానుభవం తాలుకూ మేధస్సు ఆవులించి నిద్ర లేచి జూలు విదిల్చింది.
    ఆకలి గొన్న అడ బెబ్బులి తన లక్ష్యం వైపుగా ఉరికినట్లు ఆమె ఆలోచనలు పరుగులు తీయటం ప్రారంభించినాయి.
    గతమంతా ఒకసారి జాగ్రత్తగా త్రవ్విపోసుకుంది. ప్రతి క్షణాన్ని ప్రతి కదలికనూ జ్ఞాపకం తెచ్చుకుంది. కారు దిగిన తరువాత టీ కొట్టు ఆసామిని జయకృష్ణ గురింఛి అడిగితే అతని చేతిలోని గ్లాసు క్రిందపడి భళ్ళున బ్రద్దలు కావటం వరకూ వచ్చి ఆలోచనలు అంచేకు దిగినాయి. ఆమె మనోపటలం మీద శంపాలతలు తళుకుమన్నాయి. చీకటి నిండిన ఆలోచనలలో ఆశాకిరణం తరళించింది.
    "క్యూరేటర్ సర్! ఈ గొడవలో పోలీసులు కల్పించుకోవటం అవుసరమే అయినా అది తెల్లారేదాకా వాయిదా వేద్దాం. మీ కారుతో నాకు పని పడింది. మీరు కూడా నాకు తోడుగా వస్తే సంతోషం. ఇంటిని మీ ఉద్యోగులకు అప్పగించి తక్షణమే మన మిక్కడి నుంచి బయలుదేరాలి. ప్లీజ్!" అన్నదామె. శ్రీ బృందావన్ గోయెల్ అరక్షణం పాటు ఆశ్చర్యంగా ఆమె వంక చూచినాడు -- వెంటనే "విత్ ప్లజర్" అన్నాడు.
    శ్రీ బృందావన్ గోయెల్ ఉంటున్న యి.యి టైపు క్వార్టర్ ముందుకు వచ్చేందుకు వారికి ఒక్క నిముషం పట్టలేదు. క్యూరేటర్ సర్ ప్రక్కన కూర్చున్నారు. శ్రద్దాదేవి స్టీరింగ్ తీసుకుంది. కారు ఎర్త్ డాం దగ్గరకు వచ్చి టీ కొట్టు దగ్గర ఆగింది.
    నైట్ వాచ్ మన్ లు వెళ్ళిపోయారు. టీ కొట్టు ఆసామీ ఒంటరిగా జోగుతూ మధ్య మధ్య ఆవులించి చిటిక వేసి "మురుఘా" అంటున్నాడు. కారు హరన్ వినిపించేసరికి ఉలికిపడి చూశాడు.
    ఎవరో గొప్పవాళ్ళు కారులో పోతూ టీ త్రాగేందుకు మరెందుకో అక్కడ ఆపి వుంటారని భావించాడు అతడు.
    "ఇలా రా" అని పిలిచింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. అతడు పరుగున వచ్చి కారులో క్యూరేటర్ గారు కుర్చుని ఉండటం చూచి నిర్విన్నుడయినాడు.
    "వణక్కం సామీ!" అన్నాడు శ్రీ బృందావన్ గోయెల్ తల పంకించాడు. కాని ఆమె అతన్ని ఎందుకు పిలిచిందో వారికీ అర్ధం కాలేదు.
    "లోపల కూర్చో !" అన్నది శ్రద్దాదేవి అధికార ధ్వనితో. అతడికి గతం జ్ఞాపకం వచ్చింది. ఆమె జయకృష్ణ గురించి ప్రశ్నించింది.
    అతడు తిరిగి వోణికి పోవడం మొదలెట్టాడు.
    "టీ కొట్టు" అన్నాడు తిరిగి చూచుకుంటూ.
    "ముందు కూర్చో" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి కఠినంగా " అయినా అతడు అనుమానం చావక క్యూరేటర్ వంక చూచాడు. శ్రీ బృందావన్ గోయెల్ చిరునవ్వు నవ్వి వారు చెప్పినట్లు చేస్తే మంచిది" అన్నారు నింపాది అయిన కంఠస్వరంతో.
    ఇంక తప్పించుకోలేక కారులో ఎక్కి కూర్చున్నాడు టీ కొట్టు ఆసామి.
    "మురఘా, మురఘా" అని మూలగడం ప్రారంభించాడు . అనువులకు వెళ్ళే రోడ్డులోకి కారుని పోనిచ్చి ఫిల్టర్ హవుస్ దాటాక కారు ఆపి ముందు తాను కారు దిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "దిగు" అంటూ గర్జించింది. "కడవళ్ కాపాడు" అంటూ కారు దిగి బిక్కుబిక్కుమంటూ చూశాడు టీ కొట్టు ఆసామీ! ఒక తమాషా చూచేందుకు నిర్లిప్తుడయిన ప్రేక్షకునిలా వుండిపోయాడు క్యూరేటర్ సర్.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS