"పాతికేళ్ళు దాటింది. అదో పెద్ద కథ నాయనా! అసలు ఈ నాగేంద్రం తండ్రిది మా పక్కఊరు. వాళ్ళ తండ్రి కమ్మరం పని చేస్తూ వుండేవాడు. ఈ నాగేంద్రం బడి మానేసి అల్లరి చిల్లరిగా తిరుగుతూంటే వాళ్ళయ్య తన్ని కమ్మరం పనిలో పెట్టాడు. ఓ రోజున తండ్రికి చెప్పకుండా పారిపోయాడు. తర్వాత మిలటరీలో చేరినట్టు ఉత్తరము రాశాడు. నాగేంద్రం మిలటరీలో చేరిన సంవత్సరానికి తండ్రి చనిపోయాడు. తండ్రి పోయాక మరో రెండేళ్ళకు మిలటరీ నుంచి తిరిగొచ్చాడు. కొంత డబ్బు కూడా నిలవ చేసుకొని వచ్చాడు. అప్పుడు మా అయ్య చాలా కష్టాల్లో వున్నాడు. మా అయ్యకి రెండు వేలిచ్చి నన్ను పెళ్ళి చేసుకొన్నాడు. తర్వాత మిలటరీ నుంచి విడుదలయి వచ్చాడు. తర్వాత రెండేళ్ళుపాటు ఇంటిపట్టునే వున్నాడు."
"ఆయమ్మా! అప్పుడు ఏం పని చేస్తుండేవాడు?" సాగర్ అడిగాడు.
"ప్రత్యేకంగా ఫలానా అని అంటూ ఏమీ లేదు. ఏదో వ్యాపారం చేస్తున్నానని చెప్పేవాడు. నెలకు_వారం, పదిరోజులు బయట తిరిగి వస్తుండేవాడు. తిరిగొచ్చినప్పుడు చాలా డబ్బు తీసుకొని వచ్చేవాడు. ఎక్కడ్నుంచి వచ్చిందా డబ్బంటే వ్యాపారంలో లాభం వచ్చిందనేవాడు. నాకు ఏదో అనుమానంగా వుండేది. ఓసారి నిలదీసి అడిగాను. నన్ను చావబాది, రెండు నెలలు ఇంటికే రాలేదు. ఆ తర్వాత అతను ఏం చేసినా అడగటం మానేశాను. తిండి, బట్ట ఇచ్చేవాడు. దాంతో తృప్తిపడి కుక్కిన పేనులా ఇంట్లో పడివుండేదాన్ని." ఆయమ్మ కళ్ళు తుడుచుకున్నది.
"ఇంతకీ డాక్టరు మూర్తికి, ఆయమ్మ భర్త నాగేంద్రానికి సంబంధమేమిటీ?" పరిమళ సాగదీస్తూ అన్నది.
"మీరాగండి! ఊఁ! ఆయమ్మా తర్వాత ఏమయింది? మీరిద్దరూ ఎప్పుడు విడిపోయారు!" ఆయమ్మను చూస్తూ అడిగాడు సాగరు.
"జబల్ పూరు రైల్వే స్టేషన్ లో నన్ను వదిలేసిపోయాడు. అప్పుడు నా బిడ్డకు ఆరు నెలలు!"
"జబల్ పూరు స్టేషన్ లోనా" సాగరు ఆశ్చర్యంగా అడిగాడు.
"ఆయమ్మా నీకు ఓ కూతురుందా?" పరిమళ ఆతృతగా అడిగింది.
"వినండమ్మా! మరి! నా బిడ్డ ఆరు నెలల వయస్సులో ఉండగా నాగేంద్రం ఓ రోజు మూటా ముల్లే కట్టించి బయలుదేరమన్నాడు. ఉత్తరాదిని తనకు ఉద్యోగం దొరికిందని ఇహ అక్కడే ఉండిపోతామని చెప్పాడు. నాకూ ఒక రకంగా బాధగా ఉన్నా మరోరకంగా బాగానే అనిపించింది ఉద్యోగం దొరికింది. ఇహ నుంచి ఇంటి పట్టునే ఉంటాడు! వ్యాపారం పేరుతో ఊళ్ళు తిరగడం మానేస్తాడు. మోసాలు, దొంగతనాలు మానేసి మనిషి బాగుపడతాడని ఆశ పడ్డాను!"
"దొంగతనాలా?" సాగరు కనుబొమలు ఎగరేసాడు.
"చెప్పానుగా? అతను చేస్తున్న వ్యాపారం అదేనని నాకు గట్టి నమ్మకం కలిగింది. ఇహ యీ ప్రాంతంలో తన బ్రతుకు బండారం బయటపడుతూందనే భయంతో మకాం ఎత్తి వేయడానికి సిద్ధమయ్యాడు. అదీ మన మంచికే అనుకొన్నాను. దూర దేశంలో కొత్త జీవితం మొదలుపెట్టొచ్చని ఆశ పడ్డాను. అందుకే మన ప్రాంతం వదలి పెట్టడానికి సంతోషంగా సిద్ధమయ్యాను. నా వంటి మీదున్న నగలూ, ఇల్లు, సామాను అంతా అమ్మేశాడు. ఎందుకని అడిగితే ఇక్కడ తనకు చాలా అప్పులున్నాయనీ అవి తీర్చకుండా వెళ్ళడం సాధ్యం కాదనీ ఉద్యోగంలో చేరాక అన్నీ మళ్ళీ ఏర్పరుచుకోవచ్చన్నాడు. అతడి మాటలు నమ్మి ఆరునెలల పసిగుడ్డుతో ప్రయాణమయ్యాను. ఒక పగలూ ఒక రాత్రి ప్రయాణం చేశాక జబల్ పూర్ స్టేషన్ లో దిగాము. ఊళ్ళో కెళ్ళి సత్రమో లేక చిన్న హోటల్ గదో చూసి వస్తానని చెప్పి స్టేషన్ లో నన్ను వదిలి వెళ్ళాడు. ఇక అంతే! అదే ఆఖరిసారి చూడటం! మళ్ళీ యీరోజు యీ వేషంలో కన్పించాడు!" ఆయమ్మ కళ్ళు తుడుచుకొంది.
"తర్వాత నువ్వేం చేశావు?" పరిమళ అడిగింది.
"నా అవస్థ ఏం చెప్పమంటావు తల్లీ! ఆ భగవంతుడికే ఎరుక! మూడురోజులు ఆ స్టేషన్ లో అలా దిక్కూ మొక్కూ లేక పడి ఉన్నాను. నా దగ్గర డబ్బు కూడా ఏమీలేదు. పిల్ల ఆకలితో అలమటించిపోయింది. అయ్యల అమ్మలనూ ప్రాధేయపడి వాళ్ళిచ్చిన డబ్బులతో పాలు కొని పిల్లకు పట్టేదాన్ని. మన భాష తెలియని దేశం. ఆకలి, అసహాయతా. బిడ్డ పరిస్థితి చూస్తుంటే నాకు బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. బిడ్డను మూడోరోజు రాత్రి ప్లాట్ ఫారం మీద వదిలేసి, వస్తున్న రైలుకింద పడటానికి ప్రయత్నించాను! నా దురదృష్టం ఆ పనీ చేయడానికి వీలుపడలేదు. నా పక్కనే నిలబడ్డ ఒకాయన నా రెక్క పట్టుకొని గుంజి ప్లాట్ ఫారం మీద పడేశాడు. బాబూ నన్ను వదిలేయండి! నన్ను చావనియ్యండి బాబూ! అంటూ కేకలు పెట్టాను"
"ఏమిటమ్మా అదీ! నీకొచ్చిన కష్టమేమిటి అంటూ ఆ బాబు నాముందు కూర్చున్నాడు. ఆ బాబు మొఖం ఇప్పటికీ నా కళ్ళల్లో కదులుతుంది. భగవంతుడే ఆ బాబు రూపంలో నా ముందున్నాడనిపించింది."
"బాబూ" అంటూ అతని కళ్ళలోకి చూశాను.
"ఫరవాలేదు! నేనున్నాను"
"మీరు మా మాట మాట్లాడుతున్నారు?"
"అవును! నేను తెలుగువాడినే!"
"అమ్మో నా బిడ్డ" అంటూ వదిలేసిన నా బిడ్డ దగ్గరకు పరుగెత్తాను. ఏడుస్తున్న నా బిడ్డను గుండెలకు హత్తుకున్నాను. ఆ బాబు నన్నూ, నా బిడ్డ పద్మను ఇంటికి తీసుకెళ్ళాడు. నా కథంతా విన్నాడు. నాగేంద్రం కోసం వెతికించాడు. అతని జాడ తెలియలేదు? కావాలని ఇంతపనిచేసి వాడు మళ్ళీ మనకు కనిపిస్తాడా బాబు అన్నాను. ఒక నెలరోజులు ఆ బాబుగారింట్లో ఉన్నాను. అమ్మగారు కూడా నన్ను దయతో చూశారు. అలా ఎంతకాలం? బిడ్డను తీసుకొని తిరిగి మావూరు వెళ్ళాలనే ఆలోచన వచ్చింది, కాని అక్కడ ఇల్లు లేదు. ఆదుకునేవాళ్ళు అంతకన్నా లేరు. ఇలా ఉండగా ఓ రోజున బాబుగారు వారి స్నేహితుడిని వెంటబెట్టుకొచ్చారు. నా బిడ్డను ఆ అయ్య పెంచుకుంటారనీ నాకిష్టమయితే ఆరోజే బిడ్డను తీసుకెళ్తారని బాబుగారు చెప్పారు. అందుకు నేను వెంటనే ఒప్పుకున్నాను. అయితే ఆ బాబుగారు ఒక షరతు పెట్టారు. నా బిడ్డను మళ్ళీ చూడటానికి వీలులేదని, ఆ పెంచుకొనే బాబుగారి పేరు, ఊరు కూడా నేను తెలుసుకోకూడదన్నారు. ఆ క్షణాన నేను పడ్డ బాధ చెప్పుకుంటే తీరేది కాదు! రెండురోజులు కడుపుకోత అనుభవించాను. చివరకు నా బిడ్డను ఇవ్వటానికి ఒప్పుకొన్నాను. ఆ రాత్రికి రాత్రే నా పద్మను వాళ్ళు తీసుకెళ్ళారు. అదే కడసారిగా చూడటం! ఇప్పటికి పెళ్ళయి ఉంటుంది. పిల్లలు కూడా కలిగివుండొచ్చు. ఆ వయసు పిల్లల్ని చూసినప్పుడల్లా నా తల్లి ఇలాగే వుంటుందేమో అనుకుంటాను. "నిజం చెప్పాలంటే బాబు ఈ పరిమళమ్మలో నా కన్నకూతుర్ని చూసుకుంటూ బతుకుతున్నాను!" ఆయమ్మ కుమిలిపోతూ అన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది.
"ఆయమ్మా" పరిమళ ఆయమ్మను పట్టుకొని ఓదార్చింది.
"బాబు ఈ అమ్మను ఏడాది పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి నా చేతులమీదే పెంచాను బాబు!"
