Previous Page Next Page 
మారణహోమం పేజి 50

 

    ఆతను అలాగే చేశాడు.
    "మోకాళ్ళ మీద వంగి కూర్చో!"
    మారుమాట్లాడకుండా కూర్చున్నాడు అతను.
    "ఇప్పుడు తల నేలకు అనించు! అనించావా? అలాగే పడుకో! కదిల్తే కాల్చేస్తాను. అర్ధమయిందా?"
    అతను నేలకు అనిమ్చిన తలను అటు ఇటూ ఊపాడు.
    నిఖిల్ రిసెప్షనిస్టు వైపు తిరిగాడు.
    "నువ్వు కూడా!"
    మరుక్షణంలో రిసెప్షనిస్టు నేలమీద ఉన్నాడు.
    తర్వాత ఒక్కొక్క సెల్ లోకి వెళ్లి వెదకడం మొదలెట్టాడు నిఖిల్.
    అలాంటి కేసులు ఇంకేమీ లేవు.
    "కారుదాకా నడవగలవా నాన్నా?" అంది రాధ రుద్దమయిన గొంతుతో.
    అయన వణకడం మొదలెట్టాడు.
    "కారా? కారేమిటి? ఆఫీసరు గారు అప్పుడే వచ్చేశారా? ఎట్లాగురా భగవంతుడా? నేనింకా ఫైలు పుటప్ చెయ్యలేదే? ఏదీ! నా కళ్ళజోడేదీ? కళ్ళజోడు లేకపోతే ఒక్క అక్షరం కనబడ్డంలేదు. ఇదెక్కడి ఖర్మో! కలంలో సిరా అయిపోయిందా? రాయదేం?"
    దుఖాన్ని ఆపుకుంటూ అంది రాధ "ఫైలు తర్వాత చూడొచ్చు. ముందు మీరు రండి నాన్నా!"
    "అయ్యో మీ కర్ధం కాదేమర్రా!" అన్నాడాయన ఆక్రోశంగా. "అమ్మాయిని అల్లరి వెధవ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆఫీసరుగారు రక్షించాలి అని మహజరు పెట్టుకున్న ఫైలది! అది ఆఫీసరు గారు సంతకం పెట్టకపోతే నా రాధ నెవరు విడిపిస్తారు. అమ్మా రాధ! రాదా! ఎక్కడున్నావు తల్లీ!" ఆయన గొంతులో ఏడుపు.
    "నేనిక్కడే ఉన్నాను నాన్నా!" అంది రాధ.
    "ఏదీ? ఎక్కడ? కనబడవెం? లైట్లు పోయాయా?" కట్ల వెనుక అయన కళ్ళు చిట్లించి చూస్తున్నట్లు నుదుటి మీద ముడతలు పడ్డాయి. గాయం రేగింది. వెంటనే బాధతో వికృతంగా మారింది మొహం. రక్తకన్నీరులా కుడికంటి నుంచి ధారగా కారడం మొదలెట్టింది రక్తం.
    "నాన్నా!" అంది రాధ వెంటనే తన పమిటతో ఆ రక్తాన్ని తుడుస్తూ.
    రక్తస్రావం కొద్దిగా ఆగాక బయటికి వచ్చారు ముగ్గురూ. రాధ తండ్రిని వెనక సీట్లో పడుకోబెట్టాడు నిఖిల్. తను డ్రయివింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కన కూర్చుంది రాధ. విండ్ స్క్రీన్ లో నుంచి నిర్నిమేషంగా ముందుకు చూస్తోంది ఆమె పెదిమలు బిగుసుకుని ఉన్నాయి.
    ఆమె మోహంలో బాధ కనబడుతున్నది.
    బాధ గడ్డకట్టి గుండె కరుడుగట్టి పోతూ ఉంటే కలిగే భావం అది!
    కసి!
    చెప్పలేనంత కసి కనబడుతోంది రాధ మోహంలో.
    అప్పటికి తెలతెలవారుతోంది. తూరపు తాలూకు అరుణవర్ణం రాధ కళ్ళలో ఎర్రెఎర్రగా ప్రతిఫలిస్తోంది.
    కారు కదిలింది.
    సిటీ సమీపించేముందు ఒక చిన్న గ్రామం మీదుగా వస్తుంది రోడ్డు.
    ఆ గ్రామంలోకి కారు ప్రవేశించగానే ఎదురుపడ్డాడు వెంకటేశం. అతనికి నలభై ఏళ్ళుంటాయి. ఎర్రగా, పొట్టిగా ఉంటాడు. చీకిరి కళ్ళు, మేదకుడు అతను. చదువు అబ్బలేదు. ఊరికే ఊరి మీద పడి తిరుగుతుంటాడు. అతన్ని పెద్దవాడిలాగా చూడరెవ్వరూ. ఎప్పుడూ ఖాకీ నిక్కరూ, షర్టు మాత్రమే కుట్టిస్తారు అతనికి. మాపుకి బాగా ఆగుతాయి అవి. బట్టలని చిన్నపిల్లాడిలాగా త్వరగా మాపెసుకుంటాడు వెంకటేశం.
    కారుని చూడగానే , గారపట్టిన పళ్ళు ఇకలిస్తూ నవ్వాడు.
    పరుగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు.
    "నమస్తే అన్నా!" అన్నాడు నిఖిల్ తో.
    "నమస్తే! నమస్తే! బాగున్నావా వెంకటేశం!"
    "బాగున్నా అన్నా! బొరుగుల ఉండ కొనియ్యవా?"
    చిరునవ్వుతో జేబులో చెయ్యిపెట్టి పదిరూపాయల నోటు తీశాడు నిఖిల్.
    ఆ చెయ్యి తుపాకులు కాల్చే చెయ్యి! కన్నీటినీ తుడిచే చెయ్యీ అదే!
    కర్ణుడిలా దానాలు చేసే చెయ్యీ అదే.
    ఆ చేతిలో ఇచ్చిన నోటుని ఆనందంగా అందుకుని వెనక్కి తిరగాబోతూ ఆగాడు వెంకటేశం.
    "ఇవాళ ఊళ్ళో పంచాయితీ ఉందన్నా!"
    "పంచాయితీనా? ఏం పంచాయితీ?"
    " మా నిర్మలను నరేంద్రవాళ్ళు కలిసి పాడుచేసిండ్రుకదా! అందుకని పంచాయితీ! నేను కూడా వెళ్ళాలి!"
    "ఎందుకు?"
    "సాచ్చం చెప్పొద్దా మరి. నేనంతా చూసినా గదా! వస్తా అన్నా!"
    "నిర్మల ఎవరు?" అంది రాధ మెల్లగా.
    కలలోనుంచి బయటపడ్డవాడిలా చూశాడు నిఖిల్. "నిర్మలా! నిర్మల వెంకటేశం చెల్లెలు."
    "ఏమిటి అతను చెబుతోంది?"
    "అదే అర్ధం కావడంలేదు" అని ఒకసారి వెనక్కి తిరిగి వెనక సీట్లో పడుకున్న రాధ తండ్రి వైపు చూశాడు నిఖిల్. అయన కుడి కంట్లో నుంచి సన్నగా కారుతున్న రక్తం సీటు మీద చిన్న మడుగులా ఏర్పడుతోంది. అయన కేసు ఎమర్జెన్సీ! వెంటనే నమ్మకమైన డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS