Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 51

    మహంతు మందలించటంతో అర్చకులు వెంగమాంబ ఇంటిలోకి వెళ్ళి,
    "అమ్మా! మా తప్పులేవైనా ఉంటే క్షమించి రథం కదిలేలాగా అనుగ్రహించు. స్వామిని శాంతపరచు" అని ప్రార్థించారు.
    సాధారణంగా ఎవరి తప్పులనూ పట్టించుకొని కోపం తెచ్చుకునే స్వభావం కాదు వెంగమ్మది. అందులోనూ వారి ముఖాల్లో కనపడుతున్న పశ్చాత్తాపం చూసి కరిగిపోయి భక్తితో కర్పూర నీరాజనం ఇచ్చింది స్వామికి. స్వామిరథం ఏ మాత్రం శ్రమలేకుండా హాయిగా కదిలి ముందుకి సాగింది. మరెప్పుడూ శ్రీనివాసునికి కోపం వచ్చే అవకాశం ఇవ్వకూడదనుకుని ప్రతిరోజూ రాత్రి చివరి సేవగా వెంగమాంబ ముత్యాల హారతి ఇచ్చిన తర్వాతనే ఆనాటి పూజలు సమాప్తమైనట్లు ప్రకటించడం మొదలుపెట్టారు.
    తరిగొండవారి ముత్యాల హారతి తరతరాలు కొనసాగేట్లు నిర్ణయంకూడా చేశారు. తరిగొండ నృసింహస్వామి వారి వెండి ప్రతిమ ఉన్న పంచలోహపు పళ్ళెంలొ విష్ణువు దశావతారాలలో ఒక్కదానిని వెండి ముత్యాలతో తీర్చి, పసుపు కుంకుమలతోనూ, పిండితోనూ చుట్టూ అలంకరించి, మధ్యభాగంలో ఒక చిన్న గిన్నెలో కర్పూరముంచి ఏకాంతసేవ సమయానికి తీసుకుని వెడితే, అర్చకులు ఆ హారతిని ముందు మూలవిరాట్టుకు తర్వాత పాన్పుపై పవళించి ఉన్న భోగశ్రీనివాసమూర్తికి కనువిందుచేసి, స్వామి ఏకాంత సేవ పూర్తి చేస్తారు.
    "తాళ్ళపాకవారి లాలి, తరిగొండవారి హారతి" అనేది నానుడిగా మారింది. సహస్రచంద్ర దర్శనం తరవాత వెంగమాంబ మనసులో ఒక చిన్న ఉలికిపాటు కలిగింది.
    "తన తరవాత స్వామికి ఏకాంతసేవ తరువాత హారతి నెవరు ఇస్తారు? కాలక్రమానుగుణమైన మార్పులు శరీరానికి ప్రకృతి సహజం. ఈ శరీరం కాలధర్మం చెందితే...సంప్రదాయంగా మారిన ఈ అలవాటు కొనసాగేదెట్లా?...అందుకేనా వారసులు కావాలని అందరూ కోరుకునేది?...సంతతి ప్రయోజనం ధర్మం కొనసాగించటమేకదా!"
    క్షణమాత్రంలో తనని తాను సంబాళించుకుని యథాస్థితికి వచ్చింది వెంగమాంబ. "తన మిత్రుడున్నాడు. తరిగొండ నరసింహుడున్నాడు. తన ప్రాణేశ్వరుడు, తన సేవలంటే ముచ్చటపడే శేషకుధరనాధుడున్నాడు, తనకెందుకీ చింత" -అని బరువు స్వామిపై వదలి స్వామికి చేతులు జోడించి పూజామందిరం నుండి బయటికి వచ్చింది వెంగమాంబ.
    "పెద్దమ్మా!" అంటూ మంగమ్మ వెంగమాంబ పాదాలకి నమస్కరించింది.
    మంగమ్మ తల్లి వెంగమాంబకి వరుసకి చెల్లెలు. తనపేరే అవటంతో మంగమాంబ, తల్లిపేరని వెంగమాంబ బాగా ముద్దుచేసేవారు. వెంగమాంబ దగ్గర మంగమ్మకి చాలా మాలిమి. పెద్దయినాక భక్తిప్రపత్తులు. గరిడిమిట్ట వాస్తవ్యులు, ఆత్రేయస గోత్రులు అయిన చీనేపల్లివారామె అత్తింటివారు. వారికి కూడా వెంగమాంబ అంటే ఎంతో గౌరవం. మంగమ్మ తరచుగా తన పెదతల్లిని చూడటానికి కుటుంబసభ్యు లెవరో ఒకరితో కలిసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనుమడితో వచ్చింది. పదేళ్ళ నరసప్ప నాయనమ్మతో పాటు తానూ వెంకమాంబ పాదాలమీద పడ్డాడు.
    "లేమ్మా! లేనాయనా!" అంటూ ఇద్దరినీ చెరొక చేత్తో లేపి అక్కున చేర్చుకుంది వెంగమాంబ. నరసప్ప ముఖం చూస్తుంటే తరిగొండ నరసింహుడే దర్శనమిచ్చాడు వెంగమాంబకి.
    "తనకి సమాధానమా?..."
    నాలుగు రోజులుండి మంగమ్మ తిరుగు ప్రయాణానికి సిద్ధమై సెలవిప్పించమని కోరింది. ఎప్పుడు లేంది మరికొద్దిరోజులుండ మనాలనిపించింది వెంగమాంబకి. మనసుమాటవిని మమతాను బంధాలకి లోనుకాకూడదని తనని తాను హెచ్చరించుకుంది..
    నరసప్ప తాను వెళ్ళనని మొండికేశాడు. మంగమ్మ ఎంతో చెప్పిచూసింది. వెంగమాంబ శిష్యులుకూడ ప్రయత్నం చేశారు. ఎవరిని చూసినా వెంగమాంబ వెనకచేరి, రానని కరాఖండిగా చెప్పాడు. వెంగమాంబకి తన సమస్యకి పరిష్కారం లభించినట్లైంది. అంతా దైవేచ్ఛ.
    "మంగమ్మా! నరసప్పని ఉంచివెళ్ళు."
    "వాడికంతా కొత్త. నీకు కష్టం."
    "నీ చిన్నప్పుడు నువ్వూ మమ్మల్ని వదిలివెళ్ళటానికి ఇలాగే పేచీ పెట్టేదానివి గుర్తుందా?"
    ఆరోజులు గుర్తుకువచ్చి మంగమ్మకూడా మౌనం వహించింది. తాను తల్లితో పెదతాతగారింటికి రావటం, వాళ్ళు తనని ముద్దుచేయటం, తిరిగి వెళ్ళేప్పుడు తాను వెళ్ళనని మారాం చేయటం, కొన్నిసార్లు ఏడుస్తూ వెళ్ళటం, మరికొన్నిసార్లు ఉండిపోవటం ఎవరో వచ్చి తీసుకెళ్ళటం అన్నీ మనసులో గిర్రున తిరిగాయి.
    "వీడు నీ పోలికే పుణికి పుచ్చుకున్నట్టున్నాడు"
    "నాలుగురోజులు పోయాక వాళ్ళనాన్నని పంపనా?" అడిగింది మంగమ్మ.
    "సరేలే! అయినా వాడు మీ దగ్గరికొస్తానంటే నేనే పంపుతానులే ఎవరినన్నా తోడిచ్చి" అంది వెంగమాంబ.  
    మంగమాంబ వంటరిగా గరిడిమిట్ట చేరింది. నరసప్ప తిరుమల వదలలేదు. వెంగమాంబ కోరిక, తదనుగుణమైన పిల్లవాడి ప్రవర్తన చూచి భగవదాదేశంగా భావించి, మంగమ్మ కుమారుడు నరసప్పని వెంగమాంబకి దత్తత ఇవ్వటానికి అంగీకరించాడు. శాస్త్రోక్తంగా దత్తత కార్యక్రమం జరిగిపోయింది.
    ఇంజేటి నరసప్ప, భార్య చెంగమ్మ వారిసంతతి నిత్యహారతి కార్యక్రమాన్ని తరతరాలు నిరంతరం కొనసాగించేట్టు నిశ్చయమైంది.
                                   * * *
    నరసప్పదంపతికి వారసత్వంగా మరొక్క బాధ్యత కూడ అప్పచెప్పింది వెంగమాంబ. తిరుమల చేరిన నాటినుండి వెంగమాంబ తమ ఇలవేలుపైన తరిగొండ లక్ష్మీనృసింహస్వామి జయంతి ఉత్సవాలని ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఉంది. వైశాఖ శుద్ధ చతుర్దశి నుండి పదిరోజులు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయా వేడుకలు. అన్నదానాలు, పగటివేషాలు, వీధిభాగవతాలు, యక్షగానాలు, హరికథలు, పురాణకాలక్షేపాలు, కావ్యపఠానాలు - ఒకటేమిటి పండగే పండగ. సందడే సందడి.
    తొమ్మదిరోజులపాటు ఈ విధంగా సాగిన వేడుకలు పదవరోజు శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి వెంగమాంబ మఠానికి వచ్చి నైవేద్యాది కైంకర్యాలు స్వీకరించటంతో పూర్తి అయేవి.  
    కృష్ణయార్యుని తరువాత వారింట తరతరాలుగా పూజలందుతూ వచ్చిన నృసింహదేవతార్చన సంపుటి వెంగమాంబ మఠాన్ని చేరటంతో జయంతుత్సవాలకళ మరీ పెరిగింది. ఒక్కొక్క ఏడాదీ వేడుకలు, పూజలు, తంతులు, పెరుగుతూ వచ్చాయి. అవి పెరిగినకొద్దీ వ్యయం చేయటానికి ధనం రావటం ఎక్కువయ్యింది. దేశం నలుమూలలనుండి వచ్చే తైర్థికులు వెంగమాంబ మఠం దర్శించి, బోధనలు విని, కావ్యామృతపానం చేసి తన్మయులై భక్తిభావప్రబోధితులై ఇచ్చిన దానాలు అసంఖ్యాకం. అవన్నీ ఉత్సవాలకి, నిత్యమూ మఠం దర్శించుకునే భక్తుల సౌకర్యాలకి, గ్రంథ ప్రతులు తయారుచేసే "అష్టఘంటము" లనే పేరుపొందిన ఎనిమిదిమంది వ్రాయసకాండ్రకి వెచ్చించేది. కొంతమంది నృసింహ విలాసం, విష్ణుపారిజాతం, గోపీనాటకం మొదలైన వెంగమాంబకావ్యాలకి ప్రతులువ్రాయించుకొని తమతో తీసికొనివెళ్ళి, తమప్రాంతాలలో ప్రదర్శిస్తూ ఉండేవారు. భక్తులు భగవత్ కైంకర్యంగా దానమిచ్చిన అగ్రహారాలు, పొలాలు, ధనంతోపాటు నృసింహజయంతి దశదినోత్సవాలు ఆచంద్రార్కం కొనసాగించే బాధ్యత కూడా నరసప్ప దంపతికి వారసత్వంగా ఇచ్చింది వెంగమాంబ.

                                   * * *     

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS