Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 50

    "కనలుచు భయమొందఁగా నా ప్రసూతి
    తన తనూభవలతోఁదానొక్క దిక్కు
    పతిచేసినటువంటి పాపంబునకును
    సుత దగ్ధయగుటకు శోకించెనటుల
    హా సతీదేవి! నీవభవునిఁబాసి
    యీసవనంబున కేలవచ్చితివి?
    కట్టిడినైన నా కనులముందఱను
    పుట్టినింటికి నీవు పొలియవచ్చితివె.
    నేటికీ సవనంబు నీదుపాలికిని
    పాటింపమృత్యురూపంబయ్యెనటవె
    వరపుత్రి నీవిందు వచ్చిన నేను
    పరఁగ సద్భూషణాంబరము లిచ్చితినొ
    పసమీఱనిచట నా భ్రమ దీరనీకు
    పసుపు గుంకుమలిచ్చి పారజూచితినొ
    పొలుచునా కడుపునఁబుట్టి నీవిచట
    నలఘు సుఖంబులే మనుభవించితివె.
    సరకుగాఁ గనని నీ జనకుపై నలిగి
    పరఁగనీరోషాగ్ని పాలైతివకట
    నాతల్లి! నెనరింతనామీద లేక
    నీతీరుగ తెగువేలచేసితివె?
    నీవణంగుటకును నీతండ్రిలోక
    పావనుఁడై నిందపాలైన గతికి
    నేమనివగతు నేనేమందు విధిని
    నీమీది జాలింక నేనెట్టు మఱతు
    నని వగచుచున్న యవసరంబునను
    మొనసి మహోత్పాతములు పుట్టెననుచు"
    వింటున్న వారందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. గుండెలుబరువెక్కాయి. ఎవ్వరికీ ఇంకేమీ మాటాడాలనిపించలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరూ నిష్క్రమించారు.
                                                           * * *
    ప్రతిరోజూ ఏకాంతసేవ సమయాన స్వామికి కర్పూర హారతి ఇవ్వటం వెంగమాంబ దినచర్యలో భాగం. హారతి వెలుగులో భోగశ్రీనివాసుని ముఖారవిందాన్ని చూసి, ఆ కన్నులలో ప్రతిఫలిస్తున్న కర్పూరపు కాంతులు సూర్య చంద్ర ప్రభలీనుతుంటే మురిసిపోతున్న వెంగమాంబకి, కమ్మని రాగాలాపనలో అపశ్రుతిలాగా కొన్ని మాటలు వినిపించాయి. అవి వినటం మొదటిసారి కాదు. తనను గురించే అని ఇవ్వాళ స్పష్టమయ్యింది.
    "ఎంతటి భక్తురాలైనా సంప్రదాయం పాటించవద్దా? దేవాలయంలో ముఖ్యమైన సేవలు చెయ్యటానికి అర్హత ఎలా ఉంటుంది? అసలు జుట్టున్న విధవరాలు దేవాలయంలో అడుగుపెట్టటానికి అర్హురాలేనా?"
    వారలా మాట్లాడుతున్నారంటే అది స్వామి అభిప్రాయమే అయి ఉంటుంది అనుకుంది. దేవాలయానికి వెళ్లటమే మానింది. హారతి ఇంటిలో ఉన్న శ్రీనివాసుని ప్రతిమకు ఇచ్చి సంతృప్తి పడుతోంది. సర్వవ్యాపి. 'ఇందుగలడందు లేడనే' సందేహం లేదు. తన ఇంట్లోని విగ్రహంతో ఉన్నదీ, గుడిలో మూలవిరాట్టులో ఉన్నది ఒక్కడే. 'సర్వంఖల్విదం బ్రహ్మ' అని తనకు అనుభవ పూర్వకంగా తెలియచెప్పటానికి ఇలా చేసి ఉంటాడనుకొని, కృతజ్ఞతలు తెలుపుకుంది.
    "మొత్తానికి వెంగమాంబ చేత హారతి ఇవ్వటం మానిపించి సంప్రదాయం నిలబెట్టామని కొందరనుకుంటే, తగినశాస్తి జరిగిందని సంతోషించినవారు కొందరు. వెక్కిరించి పైశాచికానందం పొందినవారు కొందరు.
                                   * * *
    స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతోంది. మేళతాళాలు, బాజా భజంత్రీలు, దివిటీలు, భజనలు, కోలాటాలు, బుట్టబొమ్మలు, కత్తిసాములు.
   తన ఇంటిలోనే ఉండి స్వామివారి రథోత్సవాన్ని మనోనేత్రంతో దర్శించి కీర్తిస్తోంది వెంగమాంబ.
    "ఘనతరోన్నతముగఁ గానకాద్రితుల్యమై
        రంగు నిగ్గులనొప్పు రథమునందు
    నెలవుగ శ్రీభూమి నీళలతోఁగూడి
        హరినుంచి బ్రహ్మాదు లలఘురధము
    సాగించుచుండగ సకల దిక్పాలకుల్
        గరుడగంధర్వ కిన్నర గణములు
    సిద్ధవిద్యాధరుల్ సేవింప, దేవదుం
        దుభులు మ్రోయఁగ మహాద్భుతముదనరఁ
    బారిజాత సుమంబులా బ్రహ్మరధము
    పైన రంభాదులటఁ జల్లిపాడియాడి
    కనుల పండువుగాఁ జూడగాధరిత్రి
    యందుగల మానవులు వేంకటాద్రిమీద
    పరమభాగవతులు భక్తిమైఁ బాడుచు
        నుప్పొంగి యాడుచునుండఁగాను
    గరములు ద్రిప్పి భోగస్త్రీలు ముందఱ
        జతముగ నృత్యముల్ సలుపఁగాను
    గరములు ద్రిప్పి భోగస్త్రీలు ముందఱ
        జతలుగ నృత్యముల్ సలుపఁగాను
    గ్రమముగ వందిమాగధ సూతబృందముల్
        పురుషోత్తముని కీర్తిఁ బొగడఁగాను
    శిరముల కలశముల్ జేర్చి కొందఱు భక్తు
        లొక్కెడఁ బ్రేంఖణల్ ద్రొక్కఁగాను
    మొనసి కొందఱు గోవిందయనుచు భక్తి
    పరవశత్వముచే మించి పలుకఁగాను
    రథముపైనక్షతల ననురాగ యుక్తి
    సతులు మేడలపై నుండి చల్లగాను"
    తిరువీధులలో తిరిగిన స్వామి రథం ఉత్తరమాడ వీధిలోని వెంగమాంబ గృహంవద్దకు వచ్చింది. అక్కడి నుండి కదలలేదు. ఎన్నిరకాలుగా ప్రయత్నం చేసినా రథం కొద్దిగా జరగనైనా లేదు. రాతి రథంలాగా, నేలకి అతికించినట్లుగా ఉండిపోయింది. అది వెంగమాంబ నివసించే గృహం అని అర్థం అయేసరికి కారణం బోధపడింది. అది వెంగమాంబ మాహాత్మ్యమే. తాము ఆమె పట్ల ఏదో అపరాధం చేసి ఉంటారు. అది తెలియపరచటానికి స్వామి ఈ మార్గం అనుసరించారు. వెళ్ళి ఆమెనే ప్రార్థిద్దాం అనుకుంటూ తర్జనభర్జనలు పడుతూ ఉండగా, హారతి విషయంలో ఈసడించటం, ఆమె హారతి ఇవ్వటం, గుడికి రావటం మానటం చర్చలోకి వచ్చాయి.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS